జనగామ, జనవరి 13: వరంగల్ జిల్లా జనగామ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం లాకప్‌డెత్ జరిగిందా? అంటే ఔనని కొందరు... వ్యాపారులే కొట్టి చంపారని మరికొందరు ప్రచారం చేస్తుండడంతో పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రంగంలోకి దిగింది. అన్ని కోణాల నుండి కేసు దర్యాప్తు ప్రారంభించారు. ముందుగా లాకప్‌డెత్‌తో ప్రచారం జరిగి క్రమేణా అనేక మలుపులు తిరిగిన ఈ కేసు చివరకు వ్యాపారులే హత్య చేశారని నిర్థారణకు వచ్చారు. జనగామ నడిబొడ్డులోని డిఎస్పీ కార్యాలయం ఎదురుగానే ఈ సంఘటన జరిగింది. మెదక్ జిల్లా కొండపాక మండలం బొబ్బాయిపల్లికి చెందిన పెరుమళ్ల బాలరాజు (45) గత కొన్ని సంవత్సరాలుగా భార్యాపిల్లలను వదిలి బతుకు దెరువు కోసం జనగామకు వచ్చాడు. ఇక్కడ తాపీమేస్ర్తి పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే బాలరాజు తన బావ ఇంటి నుండి తాపీమేస్ర్తి పని కోసమని బయటకు వచ్చి డిఎస్పీ కార్యాలయం ఎదురుగా ఉన్న బట్టల షాపులోకి దొడ్డిదారిన వెళ్లి గోడ దూకి బట్టల షాపులోకి ప్రవేశించాడు. అయితే, షాపులో శబ్దాలు వినిపించడంతో ఈ విషయం షాపులో యజమానికి తెలిసింది. వారు వెంటనే అక్కడికి చేరుకోగా బాలరాజు ఆ షాపులోనే ఉన్నాడు. పట్టపగలే తమ షాపులోకి దొంగతనానికి వచ్చాడనుకొని భావించిన బట్టల షాపు యజమానులు భాను, సురేందర్, ప్రవీణ్‌లు కలిసి బాలరాజును కొట్టి పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అపస్మారక స్థితిలో షాపు ముందే పడి ఉన్న బాలరాజును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే, బాలరాజు పరిస్థితి బాగోలేదని భావించిన పోలీసులు ఈ విషయాన్ని సిఐ నరేందర్‌కు చెప్పడంతో బాలరాజును వెంటనే ఏరియా ఆసుపత్రికి తరలించమని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. సిఐ ఆదేశాల మేరకు బాలరాజును పోలీసులు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తుండగానే బాలరాజు మృతిచెందాడు. అయితే, ఈ మృతిపై మరో కథనం కూడా వినిపిస్తుంది. దొంగతనం కోసమే బాలరాజు బట్టల షాపులోకి రాగా అతన్ని షాపు యజమానులు కొట్టి పోలీసులకు అప్పగించగా పోలీసులు కూడా స్టేషన్‌కు తీసుకెళ్లి బాలరాజును ఇంటనాగేషన్ చేస్తుండగానే బాలరాజు పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా మృతిచెందాడని, ఇందుకు పోలీసులే బాధ్యులని మరో కథనం వినిపిస్తోంది. అయితే, మృతుని బావ నెమిళ్ల ఎల్లయ్య మాత్రం తన బావమరిది బాలరాజును ఉప్పరి పని కోసమని పిలిచి బట్టల వ్యాపారులే కొట్టి చంపారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై సిఐ నరేందర్ మాట్లాడుతూ మృతుని బావ ఫిర్యాదు మేరకు కేసును అన్ని కోణాల నుండి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఏది ఏమైనా బాలరాజు మృతిపై అనుమానాలు పోస్టుమార్టం రిపోర్టు తర్వాతే బయటపడనుంది.
పార్టీ జిల్లా ఇన్‌చార్జీల నియామకంపై
చంద్రబాబు కసరత్తు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, జనవరి 13: రానున్న ఎన్నికల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని వివిధ జిల్లాలకు పార్టీ ఇన్‌చార్జిల నియామకంపై టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఆయా జిల్లాల నాయకులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఖమ్మంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో మహబూబ్‌నగర్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల ప్రతినిధులు, సీనియర్ నాయకులతో ఆయన చర్చలు జరిపారు. త్వరలో జరగనున్న సహకార ఎన్నికలు, తర్వాత జరిగే స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లా ఇన్‌చార్జిలతో పాటు ఇప్పటికే నియమించిన నియోజకవర్గ ఇన్‌చార్జిల నియామక ప్రక్రియను త్వరగా పూర్తి చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై వారితో చర్చించారు. అలాగే సహకార సంఘాల ఎన్నికలకు అభ్యర్థుల విషయంపై కూడా అర్ధ గంటకుపైగా చర్చ జరిగింది. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపి నామ నాగేశ్వరరావు, వరంగల్ జిల్లాకు చెందిన కడియం శ్రీహరి, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
బాబుకు ప్రశ్నల వర్షం
సమీక్షకు హాజరైన మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ నాయకులు తెలంగాణ అంశంపై చంద్రబాబుపై ప్రశ్నల వర్షం కురిపించారు. తమ నియోజకవర్గానికి బాధ్యులుగా ఉన్న నాయకులు కార్యాలయానికి కూడా రావటం లేదని, ప్రజల సమస్యలతో పాటు పార్టీ నిర్ణయాలను ముందుకు తీసుకెళ్ళే నాయకుడు లేడని ఆరోపించగా, ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకోవాలని చంద్రబాబు అన్నారు.
చర్ల సరిహద్దుల్లో ఎదురుకాల్పులు
జవానుకు గాయాలు
తప్పించుకున్న మావో అగ్రనేతలు
చర్ల, జనవరి 13: ఖమ్మం జిల్లా చర్ల మండలం సరిహద్దులోని నిమ్మలగూడెం-కుర్నపల్లి గ్రామ సమీపంలో శనివారం రాత్రి మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టు అగ్రనేతలు తప్పించుకోగా ఒక సిఆర్‌ఎఫ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. అతనిని హుటాహుటిన భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించినట్టు ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాల వద్ద కొద్ది రోజుల క్రితం ఓ హోంగార్డును మావోయిస్టులు ఇన్‌ఫార్మర్ నెపంతో కాల్చి చంపారు. దీంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్ల, దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడు మండల సరిహద్దుల్లో సిఆర్‌పిఎఫ్, గ్రేహౌండ్స్ బలగాలతో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో నిమ్మలగూడెం అటవీ ప్రాంతంలో వంద మంది మావోయిస్టులు సమావేశమయ్యారని, అందులో మావోయిస్టు అగ్రనేతలు కూడా వున్నారని, వారు భారీ విధ్వంసానికి వ్యూహరచన చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. మావోలకు కూంబింగ్ జరుపుతున్న పోలీసులు తారసపడడంతో కాల్పులు జరిపడంతో పోలీసులూ ఎదురుకాల్పులు జరిపారు. ఈ నేపధ్యంలో అక్కడి నుండి చాకచక్యంగా మావో అగ్రనేతలు కొంతమంది తప్పించుకున్నట్టు తెలిసింది. ఈ కాల్పుల్లో ఒక సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కాగా అతనిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాల్పుల అనంతరం సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించగా అక్కడ విప్లవ సాహిత్యంతోపాటు విధ్వంసకర మందుగుండు సామగ్రి లభించింది. ఇదిలా వుండగా తప్పించుకున్న మావోయిస్టుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు. అటు ఛత్తీస్‌గడ్‌లోని గొల్లపల్లి, కృష్టారం పోలీసు స్టేషన్ల నుంచి భారీ పోలీసు బలగాలను ఘటన స్థలానికి రప్పిస్తున్నట్లు తెలిసింది. అటు ఛత్తీస్‌గడ్‌లోని బీజాపూర్ నుంచి ఓ హెలికాప్టర్‌తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు.