సింహాచలం, జనవరి 13: నెలరోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో చందన దీక్షలు ఆచరించిన దీక్షాపరులు భోగిపండుగ సందర్భంగా ఆదివారం దీక్షలు విరమించారు. ఈ సంవత్సరం ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన భక్తులు వందల సంఖ్యలో చందనమాలలు ధరించారు. వీరంతా ఉదయానే్న సింహగిరికి చేరుకుని మాలవిసర్జన చేశారు. ఈ సందర్భంగా చందనదీక్షాపరులకు, దేవస్థానం ఉద్యోగులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇఓ భ్రమరాంబ తమకు అంతరాలయ దర్శనం కల్పిస్తామని చెప్పారని వారు తెలిపారు. అయినప్పటికీ అక్కడి ఉద్యోగులు వారికి అనుమతి ఇవ్వకపోవడంతో వ్యవహారం చినికి చినికి గాలివానై తోపులాటకు దారితీసింది. దాంతో వారంతా ఆలయంలో బైఠాయించారు. కొంతమంది వెళ్ళి ఇఓకు ఈ విషయాన్ని తెలుపగా ఆమె వారందరికీ అంతరాలయ ప్రవేశం కల్పించి దర్శనం చేయించారు. ఈ సంఘటనపై ఆమె విచారం వ్యక్తం చేశారు.
పాక్ కవ్వింపులపై అనుమానాలు
మజ్లిస్ వ్యవహారాలపై విచారణ జరిపించాలి : దత్తాత్రేయ
తిరుపతి, జనవరి 13: ఎంఐఎం అక్బరుద్దీన్ అరెస్టు నేపధ్యంలో దేశ సరిహద్దుల్లో భారత సైనికులను హతమార్చిన ఘటనతో ఆ పార్టీ కార్యకలాపాలపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని బిజెపి సీనియర్ నేత,మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ , మజ్లిస్ పార్టీ వ్యవహార శైలిపై జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ) చేత ద్వారా దర్యాప్తు చెయ్యాలని విధ్వంసాలు సృష్టించడానికి ఉగ్రవాదులు హైదరాబాద్ కేంద్రంగా స్ధావరం ఏర్పాటు చేసుకున్నట్లు ఇప్పటికే జరిగిన అనేక సంఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. తాజాగా అక్బరుద్దీన్ అరెస్టుతో భారత జవాన్లను హతమార్చడం వెనుక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలకు మజ్లిస్ పార్టీకి వున్న సంబంధాలపై సర్వత్రా అనుమానాలు రెకెత్తుతున్నాయన్నారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలు యాదృచ్చికంగా చేసినవి కాదని స్పష్టం అవుతోందన్నారు. తన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసి చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి వున్నానని ఎంపి అసరుద్దీన్ ఓవైసి వ్యాఖ్యానించడం కూడా దేశద్రోహం కిందకు వస్తుందన్నారు.
చిరుతపులి దాడి
20 మేకలు, గొర్రెలు మృతి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 13: చిరుతపులి దాడితో 20 మేకలు మృత్యువాత పడగా, సుమారు వంద మేకలు వరకూ అదృశ్యమయ్యాయి. శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం మండలం కొరసవాడ గ్రామానికి చెందిన మేకలకాపర్లు ఎప్పటిలాగే నల్లబొంతు సమీపంలో పసుపుకొండకు ఆదివారం మేకలను మేతకు తీసుకువెళ్ళారు. సుమారు 300కు పైగా మేకలు, గొర్రెలు కొండపై మేస్తుండగా ఒకే ఉదుటన చిరుత దాడిచేయడంతో ఆకస్మాత్తుగా పరుగులు తీశాయి. పసిగట్టిన కాపర్లు ఘటనా స్థలానికి వెళ్ళి చూడగా 20కు పైగా మేకలు మృత్యువాతపడడంతో వారంతా నెత్తినోరు కొట్టుకుని రోదిస్తున్నారు. సమాచారాన్ని పాతపట్నం మండల కేంద్రానికి చేరవేయడంతో మరికొంతమంది కాపర్లు వాహనాలను తీసుకుని మృత్యువాతపడ్డ మేకలను కొరసవాడకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మృత్యువాత పడిన మేకలు గుర్రయ్య, ఎండోడుకు చెందిన తోటి కాపర్లవని గుర్తించారు. అయితే, మరో వంద మేకలు అదృశ్యమైనట్టు కాపర్లు చెప్పారు. అంధకారంగా కొండ ప్రాంతం ఉండడంతో మరింత ఆందోళనకు గురవుతున్నారు. గిరిజనులు మాత్రం ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్న విషయం యదార్థమేనని స్పష్టం చేయడంతో మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అటవీ శాఖాధికారులు అప్రమత్తమై చిరుత సంచరిస్తున్న ప్రాంతాలపై ఆరా తీస్తున్నారు. మండలంలో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. మునుపెన్నడూ ఇటువంటి సంఘటన చోటుచేసుకోకపోవడం భోగి పర్వదినం కావడంతో గొర్రెలు, మేకలు కాపర్లు కాకుండా రైతులు కూడా మరింత ఆందోళనకు గురవుతున్నారు.
రెండో రోజు అక్బర్‌ను
విచారించిన పోలీసులు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 13: పోలీసు కస్టడీలో విచారణ ఎదుర్కొంటున్న ఎంఐఎం నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని ఆదివారం ఆదిలాబాద్‌లోని పోలీసు ఎఆర్ హెడ్‌క్వార్టర్‌లో 7 గంటల పాటు విచారించారు. గత నెల 22న నిర్మల్ బహిరంగ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌లో వున్న అక్బర్‌ను శనివారం పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఉట్నూరు ఎఎస్పీ అంబర్ కిశోర్‌జా, బెల్లంపల్లి డిఎస్పీ ఎం రవీందర్‌రెడ్డి, నిర్మల్ సిఐ రఘు ఆదివారం ఉదయం 10.30 గంటల నుండి ఎఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విచారణ కొనసాగిస్తూ పలు ప్రశ్నలను సంధించి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. కొన్ని ప్రశ్నలకు అక్బరుద్దీన్ ఆచితూచి సమాధానాలు ఇస్తూనే పక్కనే వున్న తన న్యాయవాదితో చర్చిస్తూ పోలీసులకు వివరాలు అందించినట్లు తెలిసింది. తొలి రోజు విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన న్యాయవాదులు అక్బర్ హుస్సేన్, బాలరాజు రెండో రోజు ఆదివారం కారు నుండి దిగకుండానే మీడియాను దాటి వెళ్ళిపోయారు. విచారణ అంశాలను మాత్రం పోలీసులు అత్యంత గోప్యంగా వుంచుతున్నారు. ఆదివారం లంచ్, టీ బ్రేక్ ఇస్తూనే 7 గంటల పాటు పోలీసులు విచారించగా, సాయంత్రం 6.30 గంటలకు రిమ్స్ వైద్య బృందం ఎఆర్ హెడ్‌క్వార్టర్‌కు వెళ్ళి అక్బరుద్దీన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి వెనుదిరిగారు. ఈ నెల 16 వరకు పోలీసు కస్టడీలోనే అక్బర్‌ను విచారించి 17న తిరిగి నిర్మల్ మున్సిఫ్ కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇదిలా వుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆరు రోజులుగా 144 సెక్షన్ నిషేధాజ్ఞలు, భారీ బందోబస్తు మధ్య కొనసాగుతూనే వున్నాయి.