హైదరాబాద్, జనవరి 13: మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 94వ జయంతిని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఇందిరా పార్కు వద్ద చెన్నారెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, శాసనమండలి (కౌన్సిల్) చైర్మన్ డాక్టర్ ఎ చక్రపాణి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, చెన్నారెడ్డి తనయుడు జాతీయ విపత్తుల నివారణ అథారిటీ వైస్-చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తదితరులు పూల దండలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా చెన్నారెడ్డి స్మృతివనం ప్రాంగణంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి.
పోలీసుల అదుపులో జమ్మూ హాకీ అసోసియేషన్ కార్యదర్శి
రైల్లో పారిపోతుండగా పట్టుకున్న పోలీసులు
రామగుండం, జనవరి 13: జమ్మూ రాష్ట్ర హాకీ అసోసియేషన్ కార్యదర్శి అంగత్ సింగ్‌ను ఆదివారం కరీంనగర్ జిల్లా రామగుండం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ నుండి ఎపి ఎక్స్‌ప్రెస్‌లో పారిపోతుండగా సదరు హాకీ అసోసియేషన్ కార్యదర్శి అంగత్‌సింగ్‌ను వెంటనే పట్టుకోవాలని హైదరాబాద్ నుండి పోలీసుల ఉన్నతాధికారులు రామగుండం ఎస్సై శ్రీనుకు, రైల్వే పోలీసులకు సమాచారం చేరవేయడంతో అప్రమత్తమైన పోలీసులు ఎపి ఎక్స్‌ప్రెస్‌ను రామగుండం రైల్వే స్టేషన్‌లో అరగంట పాటు నిలిపివేసి బోగీల్లో సోదాలు నిర్వహించి ఎట్టకేలకు పట్టుకున్నారు. ఈ నెల 9నుండి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అండర్ 20 మహిళా హాకీ టోర్నమెంట్లు జరుగుతుండగా జమ్మూ నుండి టీంతో హైదరాబాద్‌కు చరుకోగా అక్కడ క్రీడా పోటీల్లో ఏం జరిగిందో తెలియదుకాని అంగత్ సింగ్ మాత్రం టోర్నమెంట్‌ల నుండి ఉడాయించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మహిళా క్రీడాకారిణి పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో అక్కడ జరిగిన తతంగం బయటికి పొక్కడంతో అంగత్ సింగ్ ఎపి ఎక్స్‌ప్రెస్‌లో పారిపోయేందుకు సిద్దం కాగా, మహిళా క్రీడాకారిణి ఫిర్యాదుతో పోలీసు ఉన్నతాధికారులు క్రింది స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి పట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా అదులోకి తీసుకున్న అంగత్ సింగ్‌ను రామగుండం ఎస్సై శ్రీను పోలీసు బందోబస్తుతో తిరిగి హైదరాబాద్‌కు పంపించారు. ఈ విషయమై పోలీసుల అధికారిని వివరణ కోరగా రాష్ట్ర పోలీసుల ఉన్నతాధికారుల సమాచారంతోనే జమ్మూ హాకీ కార్యదర్శి అంగత్ సింగ్‌ను అదుపులోకి తీసుకొని హైదరాబాద్‌కు తరలిస్తున్నామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అధికారం కోసం బాబు దుష్ప్రచారం: పొంగులేటి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎంఎస్‌లతో ప్రచారం చేయాలంటూ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు పిలుపునిచే స్థాయికి దిగజారిపోయారని ఎఐసిసి కార్యదర్శి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు. పాదయాత్ర చేపట్టినా ప్రజలు తనను విశ్వసించడం లేదని చంద్రబాబు భావిస్తున్నారని పొంగులేటి ఆదివారం మీడియాతో మాట్లాడుతూ అన్నారు. తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, తొమ్మిది సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు విఫలమయ్యారని ఆయన ధ్వజమెత్తారు. అధికారం కోసం బాబు కాంగ్రెస్‌పై ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని ఆయన తెలిపారు.
భోగి మంటల్లో సిఎం దిష్టిబొమ్మ
ఎఐవైఎఫ్ నాయకుల వినూత్న నిరసన
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై వివిధ రకాలుగా నిరసన తెలిపే, ఆందోళనలు చేపట్టే ఎఐవైఎఫ్ నాయకులు, కార్యకర్తలు ఆదివారం వెరైటీగా భోగి మంటల్లో సిఎం దిష్టి బొమ్మ దగ్దం చేసి తమ నిరసన తెలిపారు. ప్రజా సమస్యలను గాలి కొదిలేశారని, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయకుండా రాజీవ్ యువ కిరణాల పేరిట కార్పొరేట్, ప్రైవేటు సెక్టార్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చినందుకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దగ్దం చేసినట్లు ఎఐవైఎఫ్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి రాములు యాదవ్ తెలిపారు. ఎఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె కుమారస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 4.50 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు. ఎపిపిఎస్‌సిలో అవినీతి పెరిగిపోయిందని, డిఎస్‌సి-2012 నియామకాల్లో రిజర్వేషన్ల ప్రాథమిక హక్కును ప్రభుత్వం కాలరాసి 3 వేల మంది మహిళా, వికలాంగ, ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయేలా చేసిందని ఆయన దుయ్యబట్టారు. మహిళలపై జరుగుతున్న దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పబ్‌లు, క్లబ్‌లు, విష సంస్కృతిని రెచ్చగొడుతున్నాయని, మద్యం, గంజాయి, హెరాయిన్, మత్తుపదార్థాలు, టీవీల్లో సీరియల్స్, రీయాల్టిషోలు, అర్థరాత్రి మసాలా ప్రసారాలను కట్టడి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి 94వ జయంతిని కాంగ్రెస్
english title:
M
Date:
Monday, January 14, 2013