Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

తెలంగాణ సాధనకు కొత్త పార్టీ

$
0
0

తార్నాక, జనవరి 13: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్వరలో కొత్త పార్టీ పెడతానని తెలంగాణ విద్యార్థి జెఏసి చైర్మన్ పిడమర్తి రవి ప్రకటించారు. అస్సాం గణ సంగ్రామ పరిషత్ తరహాలో విద్యార్థి ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. విద్యార్థుల తరఫున శాసనసభలో అడుగుపెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడతానని అన్నారు. తెలంగాణా ఉద్యమాన్ని చివరివరకు కొనసాగించమే లక్ష్యంగా ముందుకు సాగుతాను తప్ప తాను ఏ పార్టీలో చేరే ప్రసక్తిలేదని రవి స్పష్టం చేశారు. ఆదివారం ఓయులో నిర్వహించిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని, తెలంగాణ విద్యార్థి ఉద్యమాన్ని ఉద్ధృతంగా ముందుకు నడిపించానని అన్నారు. విద్యార్థుల పోరాట ఫలితంగానే డిసెంబర్ 9 ప్రకటన వెలువడిందని గుర్తు చేశారు. తిరిగి అలాంటి పోరాటానికే సారథ్యం వహిస్తానని అన్నారు. 2014 తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేయడానికి ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాగా ఈ నెల 27న తలపెట్టిన ఛలో అసెంబ్లీని విజయవంతం చేయాలని పిడమర్తి పిలుపునిచ్చారు.

ఉచిత విద్యుత్‌పై సమీక్షకు వెనకాడుతున్న సర్కారు

గత పదేళ్లలో విద్యుత్ సబ్సిడీ రూ.40 వేల కోట్లు
ఉచిత విద్యుత్ సబ్సిడీ వాటా రూ.15 వేల కోట్లు
ఇలాగైతే సంక్షోభాన్ని నివారించలేమన్న విద్యుత్ సంస్థలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: విద్యుత్ రంగంలో తలెత్తిన సంక్షోభాన్ని నివారించాలంటే కేంద్ర ప్రణాళిక సంఘంతో పాటు విద్యుత్ నిపుణులు కోరుతున్న ఉచిత విద్యుత్ విధానాన్ని రాష్ట్రప్రభుత్వం పునస్సమీక్షించడం మినహా మరే ఇతర మార్గం కనపడడం లేదు. రాష్ట్రప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను 2004 సంవత్సరం నుంచి ప్రారంభించినప్పటి నుంచి రకరకాల సబ్సిడీలపై ఇంతవరకు 40 వేల కోట్ల రూపాయలను ఖర్చుపెట్టింది. ఈ సబ్సిడీలో ప్రధానభాగం ఉచిత విద్యుత్‌కు వెళుతోంది. ఉచిత విద్యుత్‌కు రాష్ట్రంలో ఉత్పత్తవుతున్న విద్యుత్‌లో 30 శాతం వరకు ఉచిత విద్యుత్‌గా వ్యవసాయానికి సరఫరా చేస్తున్నారు. 2013-14 ఆర్ధిక సంవత్సరంలో 1.06లక్షల మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడనుంది. ఇందులో దాదాపు 30 వేల ఎంయు విద్యుత్ ఉచిత విద్యుత్ కింద సరఫరా చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది డిస్కాంలకు కత్తిమీద సాము లాంటిది. ఖరీఫ్ సీజన్‌లో కంటే, రబీ సీజన్‌లో ఉచిత విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 31 లక్షల వరకు వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. కాని ప్రామాణికత లేని వ్యవసాయ పంపుసెట్ల వల్ల విద్యుత్ నష్టాలు పెరుగుతున్నాయి. విపరీతమైన విద్యుత్‌ను వ్యవసాయ పంపుసెట్లు వినిమయం చేస్తున్నాయి. వ్యవసాయపంపుసెట్లు వినిమయం చేసే విద్యుత్‌పై నిఘా లేదు. ఉచిత విద్యుత్ ముసుగులో విద్యుత్ చోరీని పట్టించుకునేంత వ్యవస్ధ డిస్కాంలకు లేదు. ఉచిత విద్యుత్‌కు మీటర్లు ఉండవు. డిమాండ్ సైడ్ మేనేజిమెంట్ విధానాలను రైతులు పాటించడంలేదు. రబీ సీజన్‌లో సగటున ప్రతి రోజూ 60 నుంచి 70 ఎంయు వరకు విద్యుత్ లోటు ఏర్పడుతుంది. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామన్న హామీకి కట్టుబడి రాష్ట్రప్రభుత్వం 2004 నుంచి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా, ఇందులోని సాధకబాధకాలపై నిపుణుల కమిటీని నియమించలేదు. రాష్ట్రప్రభుత్వం కేటాయిస్తున్న సబ్సిడీల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోటా కింద ఇంతవరకు 15 వేల కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఉచిత విద్యుత్‌కు 2004-05లో 614 కోట్లు, 2005-06లో 878 కోట్లు, 2006-07లో 912 కోట్లు, 2007-08లో 736 కోట్లు, 2008-09లో 734 కోట్లు, 2009-10లో 2146 కోట్లు, 2010-11లో 2066 కోట్లు, 2011-12లో 2200 కోట్లు, 2012-13లో 3622 కోట్ల రూపాయలను కేటాయించారు. కాగా 2013-14లో ఆరు వేల కోట్ల రూపాయలతో దాదాపు సగం వరకు ఉచిత విద్యుత్ కింద వ్యవసాయానికి కేటాయించనున్నారు.
రాష్ట్రంలో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నందున ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల రైతులు పంటలు పండించుకుని అప్పులు పాలుకాకుండా ఉంటారని, ఆత్మహత్యలు తగ్గుతాయనే లక్ష్యంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఈ స్కీంను ప్రవేశపెట్టింది. కాని ఈ పథకం దేశ వ్యాప్తంగా వ్యవసాయ శాస్తవ్రేత్తల ప్రశంసలు పొందుతున్నా, ప్రణాళిక, ఆర్ధిక, పారిశ్రామిక రంగ నిపుణులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విద్యుత్‌ను ఉచితంగా కాకుండా ఎంతో కొంత రేటును నిర్ణయించి వసూలు చేయాలని, దీని వల్ల జవాబుదారీతనం పెరుగుతుందనే వాదనలున్నాయి. అలాగేరాష్ట్రంలో విద్యుత్ కొరత వల్ల జిడిపిలో కీలకపాత్ర వహించే తయారీ రంగం పరిశ్రమలు కుదేలవుతున్నాయి. కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికి జంకుతున్నాయి. రాష్ట్రప్రభుత్వం మంచి వౌలిక సదుపాయాలు కల్పిస్తున్నా, విద్యుత్ రంగం పరిస్ధితి మాత్రం ఆశాజనకంగా లేదు. సబ్సిడీలను ఎత్తివేయడమే పరిష్కారమని పరిశ్రమల వర్గాలు కోరుతున్నాయి. 2004లో సాలీనా 9 వేల మిలియన్ యూనిట్లు మాత్రమే ఉచిత విద్యుత్ ఖర్చయింది. ప్రస్తుతం 2013-14 ఆర్ధిక సంవత్సరానికి పదేళ్ల తర్వాత పరిశీలిస్తే దాదాపు మూడున్నర రెట్లు విద్యుత్ వినిమయం ఉచిత విద్యుత్ కోటాలో ఖర్చవుతోంది. భారీ వర్షాలు కురిసి జల విద్యుత్ ప్రాజెక్టుల నుంచి ఉత్పాదన బాగుండి, రిలయన్స్ గ్యాస్ నుంచి పుష్కలంగా గ్యాస్ సరఫరా జరిగి విద్యుత్ లభ్యమైన పక్షంలోనే ఈ స్కీంకు ఎటువంటి అవరోధాలు ఉండవు. కాని దేశ వ్యాప్తంగా విద్యుత్ రంగం యావత్తు సంక్షోభం ఎదుర్కొంటున్న తరుణంలో, ప్రతి రాష్ట్రంలో విద్యుత్ కొరత నెలకొన్న సమయంలో, విద్యుత్ కొందామనుకున్నా లభించడం లేదు. ఈ పరిస్ధితుల్లో రాష్ట్రప్రభుత్వం మొత్తం విద్యుత్ విధానాన్ని సమీక్షిస్తే తప్ప ఈ సంక్షోభం నుంచి గట్టెక్కె అవకాశాలు కనపడడంలేదని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు.
ఇటీవల రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఫ్యాప్సీ ఉత్సవాల సమావేశాలకు వచ్చినప్పుడు కూడా పారిశ్రామికవేత్తలు మాట్లాడుతూ ఉచిత విద్యుత్ సబ్సిడీలు వద్దని, పరిశ్రమలను ప్రోత్సహించాలంటే పుష్కలమైన విద్యుత్ ఇవ్వాలని కోరడం విశేషం. ఉచితవిద్యుత్‌ను క్రమబద్ధీకరించేందుకు కొత్త మార్గదర్శకాలను రూపొందించి ఖరారు చేసేందుకు కూడా ప్రభుత్వం వెనకాడుతోంది. ఐఎస్‌ఐ మార్కు ఉన్న పంపుసెట్లను వాడకుండా విద్యుత్‌ను దుబారా చేస్తున్న రైతులను పట్టించుకోవడం లేదు. కాగా కొన్ని జిల్లాల్లో ఆశించినట్లుగా ఉచిత విద్యుత్ సరఫరా కావడం లేదని నిరసిస్తూ రైతులు జిల్లా బంద్‌లను కూడా నిర్వహిస్తున్నారు.
ఉచిత విద్యుత్‌ను వెనకబడినప్రాంతాలకు పరిమితం చేయాలన్న ప్రతిపాదనలు కూడా వచ్చాయి. కాని ప్రభుత్వ స్ధాయిలో ఉచిత విద్యుత్ విధానాన్ని పునస్సమీక్షించే నిర్ణయం తీసుకుంటే విద్యుత్ రంగంలో తలెత్తుతున్న సమస్యలు కొలిక్కివచ్చే అవకాశాలున్నాయి.

సిఎంగారూ.. మీరు మారలేదు!
దత్తాత్రేయ లేఖాస్త్రం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: రెండేళ్ల పాలన పూర్తి చేసుకొని మూడవ ఏడాదిలోకి అడుగుపెడుతున్నా మీ తీరు మారలేదని బిజెపి కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. అన్ని విషయాల్లో ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్నారని, మంత్రివర్గ సహచరులను సైతం విశ్వాసంలోకి తీసుకోవడం లేదని ఆదివారం ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆయన విమర్శించారు. ఇక పార్టీ నాయకులను, విపక్షాలను పరిగణనలోకి తీసుకోడమేలేదని , ఇది రాష్ట్ర అభివృద్ధికి ఏ మాత్రం క్షేమ కరం కాదని అన్నారు. మీ ప్రభుత్వం చుక్కాని లేని నావలా పయనిస్తోందని, ఒక దిశ దశ లేకుండా పోయిందని మండిపడ్డారు. రైతులకు గిట్టుబాటు ధర లభించేట్టు చేయడంలో, విద్యుత్ సమస్యను తీర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. విద్యుత్‌కు సంబంధించి ప్రభుత్వానికి సరైన ప్రణాళిక అంటూ లేకుండా పోయిందని అన్నారు. వ్యవసాయానికి కనీసం నాలుగు గంటల పాటు కూడా విద్యుత్ సరఫరా చేయలేమని అధికారులు చేతులెత్తేశారని అన్నారు. తెలంగాణ అంశంలో సైతం మీ వైఖరి అభ్యంతరకరంగా, అవమాన కరంగా ఉందని విమర్శించారు. అఖిలపక్ష సమావేశాన్ని వాయిదా వేయించేందుకు ప్రయత్నించారని, తెలంగాణకు వ్యతిరేకంగా నర్మగర్భ ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల మనసులో ఉన్న వ్యతిరేకత చాటుకుంటున్నారని మీ పదవి ఎప్పుడు ఊడిపోతుందో తెలియని పరిస్థితుల్లోనూ తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరించి ఒక విలన్‌గా మిగిలే బదులు అనుకూలంగా వ్యవహరిస్తే, మీ స్థాయి గౌరవం పెరుగుతుందన్నారు. తెలంగాణ ఏర్పాటుపై అనిశ్చితికి స్వస్తి పలకాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను అర్ధం చేసుకొని ఇప్పటికైనా ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించాలని దత్తాత్రేయ ముఖ్యమంత్రిని కోరారు.

పేద ముస్లిం యువకులపై తీవ్రవాద ముద్ర

ఎస్సీ ఎస్టీలకూ రక్షణ లేదు మణిశంకర్ అయ్యర్, బర్దన్ ఆవేదన

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: పేద ముస్లిం యువకులను, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని తీవ్రవాదులుగా ముద్ర వేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడాన్ని ఎదుర్కొని, న్యాయం కోసం పోరాటం చేయాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్, సిపిఐ జాతీయ నాయకుడు ఎబి బర్దన్ పిలుపునిచ్చారు. తీవ్రవాద రాజకీయం, ముస్లిం యువకులే లక్ష్యం..అనే అంశంపై పిసిపిటి అనే సంస్ధ ఆదివారం మూడవ జాతీయ సదస్సును నగరంలో నిర్వహించింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన బర్దన్ ప్రసంగిస్తూ దేశంలో మైనారిటీలకే కాదు ఎస్‌సి, ఎస్‌టిలకు రక్షణ కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల పట్ల అన్యాయం జరుగుతున్నదని అన్నారు. ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. జరుగుతున్న అన్యాయాలు, వేధింపులపై గళం విప్పాలని ఆయన సూచించారు. వీటిపై చేసే పోరాటాలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు.
మణిశంకర్ అయ్యర్ ప్రసంగిస్తూ మన దేశంలో సెక్యులరిజం ఉందని అన్నారు. దేశంలోని ముస్లింలు పాక్ వెళ్ళరని, వారి పూర్వీకులు ఇక్కడే స్థిరపడ్డారని ఆయన తెలిపారు. పాకిస్తాన్‌లో ఉన్న ముస్లింలే భారత్‌ను అనవసరంగా విడిచి వచ్చామని బాధ పడుతున్నారని ఆయన చెప్పారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 4 లక్షల మందికి వీసాలు ఇచ్చానని అన్నారు. తీవ్రవాది కసబ్ వీసా తీసుకున్నాడా?, తీవ్రవాదులు వీసా తీసుకుని రారు కదా అని ఆయన తెలిపారు. సెక్యులర్ దేశమైన భారత్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్‌లో అల్లర్లు జరుగుతున్నాయని, దీంతో ముస్లింలనే లక్ష్యంగా చేసుకుని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారని ఆయన విమర్శించారు. జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత వారికి ఉద్యోగాలు ఎవరు ఇస్తారు?, వారికి జీవనం ఎలా గడుస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. అమాయకులైన పేద ముస్లిం యువకులను, నిరక్ష్యరాసులను తీవ్రవాదుల పేరిట అరెస్టు చేస్తున్నారని, అటువంటి వారు న్యాయం కోసం పోరాటం చేయలేరని అన్నారు. అటువంటి వారికి అండగా నిలవాలని, న్యాయం జరిగేలా పోరాటం చేద్దామని మణిశంకర్ పిలుపునిచ్చారు.
సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి డాక్టర్ కె నారాయణ ప్రసంగిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసినా కేసు పెట్టడం లేదని, ఇతరులపై మాత్రం వెంటనే కేసులు నమోదు చేస్తున్నారని విమర్శించారు.
సిపిఐ నాయకుడు, మాజీ ఎంపి అజీజ్ పాషా మాట్లాడుతూ బాబ్రీ మసీదును కూల్చినా బిజెపికి ఓట్లు రాలేదని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయం సింగ్ అధికారంలోకి వచ్చారని ఆయన తెలిపారు. సియాసత్ సంపాదకుడు జాహెద్ అలీ ఖాన్ ప్రసంగిస్తూ ఎస్‌సి, ఎస్‌టిలను దూషిస్తే చర్యలు తీసుకోవడానికి కఠినమైన చట్టం ఉన్నట్లు మైనారిటీలను దూషించినా అదేవిధమైన చట్టం అమలులో ఉండాలని కోరారు.
ఈ సదస్సుకు హాజరుకాలేకపోయిన ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ముస్లింలకు మద్దతునిస్తూ సందేశాన్ని పంపించారు. ఇంకా ఈ సమావేశంలో నామినేటెడ్ ఎమ్మెల్యే క్రిస్టియన్ లాజరస్, ప్రజా గాయకుడు గద్దర్, ఢిల్లీ నుంచి వచ్చిన మహ్మద్ అజీజ్, మనీషా షేర్ తదితరులు ప్రసంగించారు. ఛాదర్‌ఘాట్ వద్ద జరిగిన ఈ సదస్సుకు పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

తెలంగాణ ఉద్యమాన్ని
కెసిఆర్ నిర్వీర్యం చేశారు
గోనె విమర్శ
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ ఉద్యమాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసిన కెసిఆరే తరువాత దాన్ని నిర్వీర్యం చేశారని ఆర్టీసి మాజీ చైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గోనె ప్రకాశరావు విమర్శించారు. ఈ మేరకు ఆయన కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. అదివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆ లేఖను మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్‌తో, టిఆర్‌ఎస్ మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకొని ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్, టిఆర్‌ఎస్ రెండు పార్టీల వల్లనే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందన్నారు. తెలంగాణపై కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందని, కెసిఆర్ సోనియాను ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ వాదులందరినీ కలుపుకొని తెలంగాణ సాధన కోసం కెసిఆర్ ఉద్యమించాలని సూచించారు.

వివాహితపై అత్యాచారం: నిందితుల అరెస్టు

హైదరాబాద్, జనవరి 13: ఇద్దరు యువకులు ఓ వివాహితను వివస్తన్రు చేసి సెల్ ఫోన్‌లో చిత్రీకరించి ఆపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఆదివారం అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలోని దుర్గానగర్‌లో జరిగింది. సంఘటనకు సంబంధించి వివరాలిలావున్నాయి. బీదర్‌కు చెందిన దేవానంద్ గోల్నాక డివిజన్ దుర్గానగర్‌లో నివాసముంటూ సెట్విన్ బస్సులో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ముగ్గురు సంతానం కలిగివున్న ఇతను ఇద్దరు పిల్లలను వారి సొంతూరికి పంపించగా నాలుగేళ్ల కుమారుడితో భార్య (26) ఇంట్లోనే ఉంది. కాగా ఇంటి ఎదురుగావున్న ఇలియాస్ (25) మూసారాంబాగ్‌కు చెందిన అష్ఫాక్ (24) కలసి శనివారం రాత్రి ఒంటి గంట ప్రాంతంలో బహిర్భూమికి వెళ్లిన ఆమె ఇంట్లోకి వెళుతుండగా ఆమెను వెంబడించి ఆ యువకులు ఇంట్లోకి జొరబడ్డారు. ఆమెను వివస్తన్రు చేసి సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు విషయాన్ని ఆదివారం తెల్లవారు జామున అంబర్‌పేట పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేసును అంబర్‌పేట ఇన్స్‌పెక్టర్ ఆకుల శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్‌ఐ మురళీకృష్ణ దర్యాప్తు జరుపుతున్నారు. కాగా సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితురాలిని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

అధిష్ఠానంపై ఒత్తిడికి కార్యాచరణ

ఇష్టాగోష్ఠి చర్చల్లో సీమాంధ్ర మంత్రులు, మాజీ మంత్రుల నిర్ణయం

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 13: తెలంగాణ అంశంపై అధిష్ఠానం కసరత్తును తీవ్రం చేసిన నేపథ్యంలో తమ వాదనకు అనుకూలంగా అధిష్ఠానంపై వత్తిడి తెచ్చేందుకు కార్యాచరణను రూపొందించే పనిలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పడ్డారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు ఎస్ శైలజానాథ్, వట్టి వసంతకుమార్, మాజీ మంత్రులు గాదె వెంకటరెడ్డి, జెసి దివాకర్‌రెడ్డి తదితరులు ఆదివారం సిఎల్‌పి కార్యాలయంలో ఇష్టాగోష్టిగా సమావేశమయ్యారు. సమైక్యాంధ్రనే కొనసాగించాలంటూ సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్, మంత్రి శైలజానాథ్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళి కేంద్రమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి గులాం నబీ ఆజాద్‌ను కలిసి వినతిపత్రం అందజేసిన విషయం తెలిసిందే. ఆదివారం నాటి సిఎల్‌పి భేటీలో మంత్రి శైలజానాథ్ తన ఢిల్లీ పర్యటన విశేషాలను వివరించారు. అధిష్ఠానం ఆలోచన ఏ విధంగా ఉంది, ఎవరి వాదనకు అనుకూలంగా ఉందంటూ మంత్రి శైలజానాధ్‌ను వారు ప్రశ్నించారు. అధిష్ఠానం నిర్ణయం ఎలా ఉంటుందన్నది మాత్రం కచ్చితంగా ఎవరూ చెప్పలేక పోతున్నారని, తాను అయితే సీమాంధ్ర ప్రజలు, నాయకుల వాదనను ఆజాద్‌కు గట్టిగా వినిపించానని శైలజానాథ్ వివరించారు. సమైక్యాంధ్రనే కొనసాగించాలన్న ధోరణితో అధిష్ఠానం ఉన్నట్లు తోస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు. ప్రస్తుతం ఇది చాలా కీలక సమయమని, ఇప్పుడే అధిష్ఠానంపై వత్తిడి పెంచాల్సిన అవసరం ఉందని సమావేశంలో అనుకున్నారు.
మరోసారి అందరం ఢిల్లీకి వెళ్ళాల్సి రావచ్చునని మంత్రి శైలజానాథ్ వారికి చెప్పారు. దీనిపై చర్చించేందుకు సంక్రాంత్రి పండుగ హడావుడి ముగిసిన తర్వాత సీమాంథ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. జైపూర్‌లో మూడు రోజుల పాటు జరిగే చింతన్ బైఠక్‌కు చాలామంది వెళ్ళనున్నామని, అవకాశం దొరికితే ఆ సమయంలో అధిష్ఠానం పెద్దల్ని కలసి తమ వాదనను వినిపిద్దామని వారనుకున్నారు. ఇంకా అవసరమైతే జైపూర్ సమావేశాలకు ముందే అందరం ఢిల్లీకి వెళ్ళి అధిష్ఠానం ప్రముఖుల్ని అందరిని కలుసుకోవచ్చునని వారనుకున్నారు. ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది సీమాంథ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల భేటీలో చర్చించి నిర్ణయించవచ్చునని వారు అభిప్రాయపడ్డారు.

అమానుషం!

గిరిజనాన్ని చితకబాదిన పోలీసులు
ఆచూకీ లభించని గిరిజన మహిళలు

చర్ల, జనవరి 13: ఖమ్మం జిల్లా చర్ల మండల సరిహద్దులోని నిమ్మలగూడెంలో పోలీసులు అతి కిరాతకంగా వ్యవహరించారు. చిన్నా పెద్దలతో పాటు బాలింత అని కూడా చూడకుండా చిత్రహింసలకు గురి చేశారు. కారణం మావోయిస్టులకు సహకరిస్తున్నారనే ఒకే ఒక్క ఆరోపణ. సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు ఆదివారం అక్కడికి వెళ్లడంతో అమానుషమైన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే... నిమ్మలగూడెం గ్రామంపై శనివారం దాడి చేసిన పోలీసులు అక్కడికి చేరుకుని గిరిజనులను చితకబాదారు. అనంతరం మడివి పార్వతి, ఇమిడి సోమిడి అనే గిరిజన మహిళలను పోలీసు డ్రస్ వేయించి సమీప అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లారు. అంతకు ముందు ఇంట్లో మగవాళ్లంతా ఎక్కడికి వెళ్లార్రా అంటూ ఓ గిరిజన బాలుడిని గొడ్డును బాదినట్లు బాదారు. చివరకు బాలింత అని కూడా చూడకుండా కడుపుపై బూటు కాలితో తన్ని తుపాకీ మడమతో కుళ్లబొడిచారు. ఈ దాడిలో ఓ బాలుడికి తీవ్రగాయమై ముందు మూడు పళ్లు ఊడిపోయి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనను చూసిన పలువురు అక్కడికి నుంచి భయంతో పరుగులు తీశారు. ఇక మరి కొంతమంది అయితే ఆ గ్రామానే్న విడిచి పారిపోయారు. ఆదివారం మీడియా అక్కడికి చేరుకుందని తెలుసుకుని వారి గోడును వెళ్లగక్కారు. రక్షణ కల్పించాల్సిన రక్షకులే భక్షకులుగా మారారంటూ రోదిస్తూ తెలిపారు. పోలీసుల కన్నా మావోయిస్టులే నయమని పలువురు వాపోయారు. తాము మావోయిస్టులకు సహకరించకపోయినప్పటికీ సహకరిస్తున్నారని ఆరోపిస్తూ చేయని తప్పుకు తమను చిత్రహింసలు పెడుతున్నారని ఆవేదనతో తెలిపారు. పోలీసులు తీసుకెళ్లిన తమవారి పరిస్థితి ఇంతవరకు తెలియలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల క్రితం ఓ ఇద్దరిని ఇలాగే తీసుకెళ్లారని, వారి ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదని గిరిజనులు కన్నీటితో తెలిపారు. ఇప్పుడు తీసుకెళ్లిన తమ వారిని సైతం ఇలాగే చేస్తారేమోనని భయపడుతున్నామని పేర్కొన్నారు.
గిరిజన గ్రామాలపై
హెలికాప్టర్ చక్కర్లు
ఓవైపు పోలీసులు గిరిజనులను చితకబాదారు. మరోవైపు అక్కడే మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరగడం, ఇందులో మావోయిస్టులు తప్పించుకోవడంతో నిమ్మలగూడెం, సమీప గ్రామాలపై ఆదివారం హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఒకానొక సందర్భంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు. హెలికాప్టర్ వస్తోందంటే తమ గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం హెలికాప్టర్ చత్తీస్‌గఢ్ వైపు వెళ్లిపోయిందని తెలిపారు.

విద్యార్థి జెఏసి చైర్మన్ పిడమర్తి ప్రకటన * రాజకీయ వర్గాల్లో సంచలనం
english title: 
T

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>