ఖమ్మం, జనవరి 13: సమస్యలతో పాటు కష్టాల నడుమ జరుపుకుంటున్న సంక్రాంతి మరోసారి పునరావృతం కాకుండా ఆనందంగా, ఘనంగా జరుపుకునే సంక్రాంతి ఏటా రావాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఖమ్మం నగరంలో ఆయన ఆదివారం సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. స్థానిక సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జరిగిన ఉత్సవాల్లో ఆయన హరిదాసు వేషధారణతో ఉన్న వ్యక్తితో ముచ్చటించారు. తాను సైతం కాసేపు హరిదాసుగా మారారు. గంగిరెద్దుల వారితో కాసేపు ముచ్చటించి బహుమతులు అందించారు. అనంతరం అక్కడ ముగ్గులు వేసిన మహిళలతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలన వల్ల అన్నిరకాల నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగటం వల్ల కనీసం పండగ పూటా కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంతంగా పట్టెడన్నం తినే పరిస్థితి లేకుండాపోయిందని విచారం వ్యక్తం చేశారు. ధరలను ప్రభుత్వం నియంత్రించలేకపోవటంతో పాటు అనేక రకాలుగా అన్ని వర్గాల ప్రజలపై ఆర్థిక భారాలను మోపి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు. గతంలో సంక్రాంతి పండుగ పర్వదినానికి వారం రోజుల ముందే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొనేదన్నారు. కాంగ్రెస్ పాలనలో నాటి సందడి వాతావరణం కనుమరుగైందన్నారు. టిడిపి హయంలో ప్రశాంత వాతావరణంలో ప్రజలు పండుగలు జరుపుకున్నారని గుర్తు చేశారు. తిరిగి అలనాటి రోజులు రావాలంటే టిడిపి అధికారంలోకి రావాలని, అందుకు ప్రజలు కంకణబద్ధులై ప్రస్తుత ప్రభుత్వానికి తిలోదకాలు ఇవ్వాలని కోరారు. మూడు గంటలకుపైగా చంద్రబాబు సెయింట్‌జోసెఫ్ స్కూల్ ఆవరణలో జరిగిన పలు రకాల కార్యక్రమాలను తిలకించి సంతృప్తి వ్యక్తం చేశారు. సంక్రాంతి పర్వదినాన్ని ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధవర్గాల ప్రజలతో జరుపుకున్న తీరుపట్ల బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. మీ అందరితో పండుగ జరుపుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
హరిదాసు వేషధారణలో చంద్రబాబు