మంత్రాలయం, జనవరి 13: రాష్ట్రంలో 234 మండలాలను కరవుప్రాంతాలుగా గుర్తించినట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. శ్రీ రాఘవేంద్రస్వామి దర్శనార్థమై మంత్రాలయం వచ్చిన ఆయన మఠం అతిథి గృహంలో ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయా జిల్లాల కలెక్టర్ల ద్వారా వచ్చే నివేదికల ఆధారంగా చర్చించి మరిన్ని కరవు మండలాలను ప్రకటిస్తామన్నారు. కరవు మండలాల్లోని రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. గత సంవత్సరం ఆన్‌లైన్ ద్వారా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ రూ. 1800 కోట్లు విడుదల చేశామన్నారు. అందులో రూ. 300 కోట్లు మిగిలిందన్నారు. ఆన్‌లైన్ ద్వారా పంపిణీ చేయడం వల్లే ఇంత మొత్తం మిగిలిందని అన్నారు.
రాష్ట్రంలో కొత్తగా 25 అర్బన్ మండలాలు, 10 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 10 రోజుల్లో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. మీసేవ ద్వారా ఇప్పటికే రూ. 1,26,72,000 మంది సర్ట్ఫికెట్లు పొందారన్నారు. విద్యుత్ చార్జీల పెంపుపై మంత్రివర్గ సమావేశాల్లో చర్చిస్తామని, సామాన్య ప్రజలపై భారం పడకుండా చూస్తామన్నారు. రాష్ట్రంలో రూ. 2.25 కోట్ల తెల్లకార్డులున్నాయన్నారు. ఉగాది పండుగ సందర్భంగా నిత్యావసర సరుకులకు మరో 9 రకాలు చేర్చి సామాన్య, పేద, మధ్య తరగతి కుటుంబాలకు అందజేస్తామన్నారు.
రాష్ట్రంలో మండలాలు ఏర్పడి 27 సంవత్సరాలైనా ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయలేని పరిస్థితి ఉండేదన్నారు. అయితే గత సంవత్సరం 8 వేల పోస్టులు భర్తీ చేశామని, ఆ ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 4.23 కోట్ల ఎకరాల భూముల రికార్డులను కంప్యూటరైజ్ చేశామన్నారు. వరద నిధుల కింద మంత్రాలయంలో రక్షణ గోడ నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. అవసరమైతే ఇందుకోసం ప్రత్యేక నిధులు తెస్తామన్నారు. అనంతరం రాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఎకే సుయమీంద్రచార్, ఎఎఓ మాధవశెట్టి, ఐపి నరసింహమూర్తి పాల్గొన్నారు.
రాఘవేంద్రస్వామి బృందావనాన్ని దర్శించుకున్న మంత్రి రఘువీరా దంపతులు