Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

‘మన బియ్యం’పై కాంగ్రెస్‌లో ఆశలు..

$
0
0

కర్నూలు, జనవరి 15: నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుదలతో ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలకు ‘మన బియ్యం’ పథకం ఊరటనిస్తుందా అనే విషయమై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. సంక్రాంత్రి పండుగ కానుకగా ప్రకటించిన పథకాన్ని బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ప్రస్తుతం ఇస్తున్న కిలో ఒక్క రూపాయి పథకంలో నాణ్యత లేని బియ్యం స్థానంలో నాణ్యమైన మేలు రకం బియ్యాన్ని పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంత కాలం ఒక్క కిలో బియ్యం పథకాన్ని గుర్తించిన ప్రజలు నాణ్యమైన బియ్యం అందుకుని ప్రభుత్వానికి అండగా ఉంటారని కొందరు నేతలు ఆశిస్తుండగా, మునిగిపోయే సమయంలో ఈ పథకం వల్ల ఒరిగేదేమీ ఉండదని మరి కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ పథకం ప్రారంభానికి ముందు ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యార్థులకు బోధనా రుసుము, ఉపకార వేతనాలకు రూ. 1950కోట్లు విడుదల చేయాలని నిర్ణయించడంతో కొంత మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పేద కుటుంబాల వారికి ఇస్తున్న నాణ్యత లేని బియ్యం స్థానంలో నాణ్యమైన, మేలు రకం బియ్యం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి నిర్ణయంపై ప్రధానంగా పార్టీలో చర్చ జరుగుతోంది. జిల్లాలో సుమారు 8,37,830 తెల్లకార్డులు ఉండగా వీటికి ప్రతి నెలా సుమారు 1.26 లక్షల క్వింటాళ్ల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ఒక్కో కార్డుకు సగటున నెలకు 15 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారు. ధర తగ్గించినా నాణ్యమైన బియ్యం పంపిణీ చేయకపోవడంతో రూపాయికే కిలో బియ్యం పథకం ఆశించిన ప్రయోజనం తీసుకురాలేదని కాంగ్రెస్ నాయకులు వెల్లడిస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రకటించిన నాటి నుంచి నేటి వరకూ ఎన్ని విధాలుగా ప్రచారం చేసినా ప్రజలను మెప్పించలేకపోయిందంటున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు పార్టీ సమావేశాల్లో, ముఖ్యమంత్రితో చర్చించిన సందర్భాల్లో పథకాన్ని మరింత విస్తరించి నాణ్యమైన బియ్యం ఇస్తే ప్రయోజనం ఉంటుందని చెప్పామని, దీనిపై ఆలోచించిన సీ ఎం చివరకు ‘మన బియ్యం’ పథకాన్ని ప్రకటించారని వెల్లడిస్తున్నారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవడంలో తీవ్ర జాప్యం కావడం, ఈ మధ్యకాలంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, విద్యుత్ సర్‌చార్జీల వసూలు, గ్యాస్ సబ్సిడీ సిలిండర్లను కుదించడం, రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని నిర్ణయించడం, మరో మారు విద్యుత్ చార్జీల పెంపుదలపై ప్రభుత్వం ఆలోచించడం వంటి అనేక కారణాలతో ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని కాంగ్రెస్ నేతలే పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం బియ్యం పథకంలో మార్పు తీసుకురావడం, విద్యార్థులకు ఉపకార వేతనాలు, బోధనా రుసుము చెల్లించడానికి నిధుల విడుదల వంటి నిర్ణయాలతో ప్రజలు శాంతిస్తారని మరి కొందరు నేతలు వెల్లడిస్తున్నారు. డిస్కం ప్రతిపాదనలను ప్రభుత్వం వెనక్కి పంపి విద్యుత్ చార్జీల పెంపును తిరస్కరిస్తే ఇంకొంత మేలు జరుగుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రకటించిన ‘మన బియ్యం’ పథకం ద్వారా ఖజానాపై పెనుభారం పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం ఇస్తున్న బియ్యంపై ఒక్కో కిలోకు సుమారు రూ. 5 వరకూ ప్రభుత్వం భారం మోస్తుండగా నాణ్యమైన బియ్యం ఇస్తే ఒక్కో కిలోపై రూ. 15 వరకూ భారం పడుతుందని అనధికారికంగా లెక్కలు వేస్తున్నారు. బియ్యం పథకంపై పూర్తి వివరాలు, ఆదేశాలు ఇంకా అందలేదని వారంటున్నారు. ‘మన బియ్యం’ పథకం పట్ల ప్రజల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి స్పందన వచ్చినా ఆర్థిక పరిస్థితిపై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని, ఈ భారాన్ని మోయడానికి మరో రకంగా ప్రభుత్వం ఆదాయం సమకూర్చుకుంటూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రజలపై భారం వేస్తుందని రాజకీయ విశే్లషకులు వెల్లడిస్తున్నారు.
నెలాఖరు వరకూ కెసికి సాగునీరు
* ఎంపి ఎస్పీవై రెడ్డి
ఆళ్లగడ్డ, జనవరి 15: కెసి కాలువ ద్వారా ఈ నెలాఖరు వరకూ సాగు నీరు అందించి రైతులను ఆదుకుంటామని ఎంపి ఎస్పీవై రెడ్డి హామీ ఇచ్చారు. మండల పరిధిలోపి నల్లగట్ల, గూబగుండం గ్రామాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్లను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుద్ధి జలం తాగడం వల్ల రోగాలు దూరంగా వుంటాయని ప్రజల ఆరోగ్య సంక్షేమార్థం ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కెసి ద్వారా నెలాఖరు వరకే కాక ఫిబ్రవరి 10వ తేదీలోపు అదనంగా ఒక తడి సాగు నీరు అందించేందుకు ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశామని, ఆయన పరిశీలనలో వుందని, ఇక్కడి సమస్యలు వివరించి తప్పని సరిగా రైతులకు సాగునీరు అందేలా కృషి చేస్తామన్నారు. అనంతరం గ్రామంలో ఎంపి నిధులు రూ. 5.5 లక్షలతో నిర్మించిన సిసి రోడ్డును ఆయన పరిశీలించారు. దళిత కాలనీలో సిసి రోడ్లు నిర్మించాలని కోరగా తన నిధుల్లో నుంచి రూ. 2.5 లక్షలు మంజూరు చేశారు. ఆయన వెంట మార్కెట్ యార్డు చైర్మన్ పలుచాని బాలిరెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, సిఐ సుధాకర్‌రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కైలాశ వాహనాధీశులైన పార్వతీపరమేశ్వరులు
శ్రీశైలం, జనవరి 15 : మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలంలో మంగళవారం సాయంత్రం పార్వతీపరమేశ్వరులు కైలాశ వాహనాధీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆల య దక్షిణ ద్వారం వద్ద స్వామి అమ్మవార్లను కొలువుదీర్చి ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. మకర సంక్రమణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయ ముఖ మండపం వద్ద ఛండీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 7.30 గంటలకు శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి అమ్మవార్లను నంది వాహనంపై ఉంచి ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రదక్షిణలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. అలాగే రాత్రి పార్వతీమల్లికార్జున స్వామి కల్యాణోత్సవం ఎంతో వైభవంగా నిర్వహించారు. శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహిస్తుండగా మకర సంక్రాంతి రోజున మాత్రం పార్వతీ కల్యాణం జరగడం విశేషం. కార్యక్రమంలో ఆలయ ఎఇఓ రాజేశేఖర్, ఇఇ రమేష్, అర్చకులు, వేదపండితులు, భక్తులు పాల్గొన్నారు.
నేడు పూర్ణాహుతి
శ్రీశైలంలో ఏడు రోజుల పాటు నిర్వహిస్తున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తారు. అనంతరం 9.15 గంటలకు శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామి ఆలయ మండపంలో రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలతో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రాత్రి 7 గంటలకు ధ్వజారోహణ ఉంటుందని ఈఓ సాగర్‌బాబు తెలిపారు.
బాల సాయి జన్మదిన
వేడుకల్లో సినీవినోదం!
* సినీ పాటలకు నృత్యం చేసిన విదేశీ భక్తులు
* నివ్వెరబోయిన ప్రముఖులు
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జనవరి 15: సంక్రాంతి రోజు కర్నూలులో జరిగిన బాలసాయి బాబా జన్మదిన వేడుకల్లో ఆధ్యాత్మిక ఏ మాత్రం కనిపించక లేదు. పైగా సినీ గీతాలతో హోరెత్తించారు. సినిమా పాటలకు విదేశీ భక్తులు మైమరచిపోయి నృత్యాలు చేయడం సభికులను, భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది చూసి వేదికపై ఉన్న ప్రముఖులు సైతం నివ్వెరబోయారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. సంక్రాంతి రోజు కర్నూలు నగరంలోని మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానంలో బాలసాయి బాబా 53వ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బలరాం నాయక్, మంత్రి టిజి వెంకటేష్, క్రీడాకారిని జ్వాలా గుప్తా, సినీ కథానాయిక కామ్న జెఠ్మలాని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయని చిత్ర ఆలపించిన భక్తిగీతాలు అందరినీ అలరించారు. అయితే అనంతరం సినీగీతాలు ఆలపించగా విదేశీ భక్తులు మైమరచిపోయి నృత్యం చేశారు. ఈ తతంగం సభికులను, వేదికపై ఉన్న ప్రముఖులను నివ్వెర పరచింది. సారొచ్చారా.. అంటూ సాగే తెలుగు సినిమా పాట, మరియా...మరియా.. అంటూ సాగే హిందీ సినీ గీతానికి విదేశీ భక్తులు నృత్యం చేశారు. వేదికపై కేంద్ర, రాష్ట్ర మంత్రులు, సినీ ప్రముఖులు చూస్తుండగానే భగవంతుని ప్రతి రూపంగా చెప్పుకుంటున్న బాల సాయి జన్మదిన వేడుకల్లో సినిమా పాటలకు విదేశీ భక్తులు నృత్యం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా ఇదంతా బాల సాయి అనుమతితోనే జరిగిందా అన్న సందేహం తలెత్తుతోంది. ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న బాలసాయి సేద తీరడం కోసమే ఇలా సంగీత విభావరి నిర్వహించారా అన్న చర్చ సైతం సాగుతోంది.
నృసింహ దీక్షలు ప్రారంభం
ఆళ్లగడ్డ, జనవరి 15: అహోబిలంలో మంగళవారం నృసింహ దీక్షలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవమూర్తులైన శ్రీ ప్రహ్లాద వరదస్వామి, శ్రీ జ్వాలా నరసింహస్వామి, సుదర్శన మూర్తులను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం సుదర్శన కంకణాలను ఉత్సవమూర్తులకు అలంకరించి, పసుపు బట్టలు ధరించిన భక్తులకు ఆలయ మేనేజర్ బివి నరసయ్య ఆధ్వర్యంలో ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ మాల వేసి దీక్షలను ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో నృసింహ దీక్షలు స్వీకరించిన మాలధారుల సమక్షంలో సుదర్శన హోమం నిర్వహించారు. అలాగే నెల రోజుల పాటు ధనుర్మాస పూజలందుకున్న గోదాదేవి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. నమో నారసింహ.. గోవింద నామస్మరణలతో అహోబిల గిరులు మారుమోగాయి.

మాలధారులకు అన్నదానం
నరసింహ మాల ధరించిన మాలధారులకు నేటి నుంచి ఆళ్ళగడ్డ రామాలయంలో 41 రోజుల పాటు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు ప్రజ్ఞా నరసింహారెడ్డి తెలిపారు.
ఫ్యాక్షన్ వీడి ప్రశాంతంగా జీవించండి:ఎస్పీ
క్రిష్ణగిరి, జనవరి 15: ముఠా కక్షలు, ఫ్యాక్షన్ వీడి ప్రశాంతంగా జీవించాలని ఎరుకల చెరువు గ్రామస్థులకు ఎస్పీ చంద్రశేఖరరెడ్డి హితవు పలికారు. మండల పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన ఎరుకల చెరువులో సోమవారం రాత్రి ఎస్పీ రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు జీవితాలను నాశనం చేస్తాయన్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతుంటారని కుటుంబ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించి మసలుకోవాలన్నారు. ఫ్యాక్షన్ ఉచ్చులో చిక్కుకున్న కటుంబ సభ్యుల పిల్లల విద్యాభివృద్ధికి తమ వంతు సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. ఎస్సీ వెంట డోన్ సిఐ డేగల ప్రభాకర్, ఎస్‌ఐ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో
కాన్పుల సంఖ్య పెంచండి
* కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి
కర్నూలు ఓల్డ్‌సిటీ, జనవరి 15: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పు అయ్యేలా చూడాలని అంగన్ వాడీ సూపర్‌వైజర్లకు, ఏరియా కో-ఆర్డినేటర్లకు కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో మంగళవారం ‘అమృత హస్తం’ పథకం అమలుపై కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆదోని డివిజన్‌లో వంద మందిలో కేవలం 30 మంది మాత్రమే ఆసుపత్రి కాన్పులకు వస్తున్నారని, ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు సురక్షితమని గర్భిణులకు సిడిపిఓలు తప్పని సరిగా వివరించాలన్నారు. ఇందిరమ్మ అమృత హస్తంలో భాగంగా రోజుకు ఒక పూట గర్భిణులకు పాలు, గుడు, పప్పుదినుసులు, బియ్యం, తాజా ఆకుకూరలను అన్ని అంగన్‌వాడీ సెంటర్లలో ఇస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. సమావేశంలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, కో-ఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
జిల్లాలో 33 మోడల్ స్కూళ్లు ఏర్పాటు
ఎమ్మిగనూరు, జనవరి 15: జిల్లాలో 33మోడల్ స్కూళ్ల నిర్మాణం చురుకుగా జరుగుతోందని, జూన్ 15న స్కూళ్ల నిర్మాణం పూర్తవుతాయని జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కడివెళ్లలలో రూ. 3కోట్లతో నిర్మితమవుతున్న మోడల్ స్కూళ్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంఇఓ నాగభూషణం, నాగరాజు, డిఇఓ బుచ్చన్న, డిఇ మురళీకృష్ణ, డిప్యూటీ తహశీల్దార్‌లు పాల్గొన్నారు.
కమలానంద స్వామి
అరెస్టుకు నిరసనగా ధర్నా
కోవెలకుంట్ల, జనవరి 15: కమలానంద స్వామి అరెస్టుకు నిరసనగా పట్టణంలోని పోలీసు స్టేషన్ సెంటర్‌లో మంగళవారం పలు ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలంలో స్వామి కమలానంద స్వామిని అరెస్టు చేయడం అన్యాయమని, హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు ఉంటున్నాయన్నారు. పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న అక్బరుద్దీన్ ఓవైసీని అరెస్టు చేసేందుకు వారం రోజులు వ్యవధి తీసుకున్న ప్రభుత్వం, ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండా కమలానంద స్వామిని అరెస్టు చేయడం అన్యాయమని విమర్శించారు. వారు పట్టణంలో ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రధాన కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. కార్యక్రమంలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
వైభవంగా అహోబిలేశుని
పార్వేట ఉత్సవాలు
* జనసంద్రమైన ఆలయ ప్రాంగణం
ఆళ్లగడ్డ, జనవరి 15: అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పార్వేట ఉత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నియోకవర్గంలోని మూడు మండలాల్లో 46 రోజులు పాటు 33 గ్రామాల్లో పూజలందుకోవడానికి సాక్షాత్తు ఎగువ అహోబిలంలో స్వయంభువుగా వెలసిన శ్రీ జ్వాలా నరసింహస్వామి, దిగువన వెలసిన శ్రీ ప్రహ్లాద వరదస్వామి పార్వేటకు సిద్ధమై పూజలందుకునేందుకు భక్తుల చెంతకు తరళివెళ్లారు. ఈ సందర్భంగా సోమవారం ఎగువలో కొలువుదీరిన జ్వాలా నరసింహస్వామి కొండ దిగి దిగువకు చేరుకున్నారు. సాయంత్రం ఉత్సవమూర్తులను చూడముచ్చటగా అలంకరించి ప్రత్యేకంగా తయారుచేసిన ఉత్సవ పల్లకిలో శ్రీ జ్వాలా నరసింహస్వామిని, శ్రీ ప్రహ్లాద వరద స్వామి వార్లను ఆశీనులను చేసి మండపం వద్ద వుంచి స్వామి వారి ఎదుట అన్నం కుప్పగా పోసి సంప్రదాయం ప్రకారం స్వామి వారికి ఆలయ ప్రధానార్చకులు కిడాంబి వేణుగోపాలన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుంభ హారతి ఇచ్చి భక్తులకు ప్రసాదం అందజేసి పార్వేట ఉత్సవాలను ప్రారంభించారు. చెంచులక్ష్మి అమ్మవారిని తోబుట్టువుగా భావించే చెంచులు తరలి వచ్చి డప్పు మోగిస్తూ చేసిన నాట్యాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విల్లంబులు చేతబట్టి పారువేట ఉత్సవ పల్లకికి నమస్కార బాణాలు ఎక్కుపెట్టి సంధించారు. అనంతరం పారువేట ఉత్సవ పల్లకి బాచేపల్లే గ్రామం వైపు పరుగులు తీసింది. కార్యక్రమంలో ఎంపి ఎస్పీవై రెడ్డి, గంగుల సుదర్శన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, డీఎస్పీ బిఆర్ శ్రీనివాసులు, సిఐ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఐ రమేష్‌బాబు, తాలూకా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గంగుల బిజేంద్రారెడ్డి, తహశీల్దార్ దామోదర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.
పరోపకారమే భగవంతుని స్వరూపం
* జన్మదిన వేడుకల్లో బాలసాయి బాబా
కల్లూరు, జనవరి 15: ఇతరులకు చేతనైన సహాయం చేస్తూ ఆపదలో ఆదుకోవడం మానవుని లక్ష్యమని బాలసాయి బాబా పేర్కొన్నారు. సోమవారం బాలసాయి బాబా 53వ జన్మదిన వేడుకలను కర్నూలులో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మున్సిపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రపంచ శాంతి సదస్సు, దీన జన సేవా కార్యక్రమంలో బాలసాయి బాబా మాట్లాడుతూ పుట్టిన ప్రతి మనిషి గిట్టక తప్పదని, మానవ రూపంలో జన్మించిన ప్రతి ఒక్కరూ సృష్టిలోకి అడుగిడినప్పుడు ఏమీ తీసుకురామని తనువు చాలించి మరణించినప్పుడు తన వెంట ఏమీ తీసుకుపోమని ఈ సత్యం తెలుసుకున్న మనిషి స్వార్థం నుంచి బయటపడేందుకు తన తోటి వారికి సహాయ సహకారాలు అందిస్తే జన్మ సార్థకం అవుతుందన్నారు. అభివృద్ధి బాటలో నడవాల్సిన దేశంలో యుద్ధాల పేరిట మారణ హోమం సృష్టిస్తున్నాయని ఇలాంటి సందర్భంలో శాంతి సందేశం పాటిస్తూ భారతీయులందరూ ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా వుండాలని పిలుపునిచ్చారు. అనంతరం కేంద్ర మంత్రి బాలరాం నాయక్, రాష్ట్ర మంత్రి టిజి.వెంకటేష్, భారత ఏస్ షట్లర్ గుత్తాజ్వాలా ప్రసంగించారు. ప్రముఖ సంగీత గాయని చిత్ర ఆలపించిన భక్తీ గీతాలు ఆహూతులను అలరించాయి. అనంతరం జరిగిన కార్యక్రమంలో ప్రపంచ శాంతి, దీన జన సేవా ఆధ్వర్యంలో వికలాంగులకు ట్రై సైకిళ్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, మాజీ మేయర్ రఘురామిరెడ్డి, చిత్ర రంగ ప్రముఖులు, కథానాయకులు, విదేశీ భక్తులు పాల్గొన్నారు.

* నేటి నుంచి కొత్త పథకం.. * భారీ ప్రచారానికి వ్యూహం * బోధన రుసుం, ఉపకార వేతనాలు విడుదల
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>