పాలకొండ, జనవరి 15: గత కొన్ని రోజుల నుండి చలి ఎన్నడూ లేని విధంగా తన విశ్వరూపాన్ని ప్రదర్శించడంతో జిల్లా వాసులు వణికిపోతున్నారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో చలితీవ్రత పెరగడంతో ప్రజలు చలి మంటలువేసుకోవాల్సి వస్తుంది. గత ఏడాది చివరి వరకు వర్షాలు కురియడంతో పెద్దగా చలి ప్రభావం చూపలేదు. అయితే ఇటీవల ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోవడంతో చలి ప్రతాపం చూపుతోంది. డిసెంబర్‌లో చలి అధికంగా ఉంటుందని భావించినా జిల్లా వాసులకు ఆ నెలలో చలి పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే జనవరి మొదటి వారం తరువాత చలి పంజా విసరడంతో జిల్లా వాసులు బయటకు రావడానికే గజగజలాడుతున్నారు. పట్టణాల్లో చలి మంటలు వేసుకునేందుకు కాగితాలు, అట్టలు, టైర్లు వినియోగిస్తుండగా గ్రామీణ ప్రాంతాల్లో కలప, వరిగడ్డి వంటి వాటితో మంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. ఇదిలా వుండగా, సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామాలకు చేరుకునేందుకు చలి తీవ్రత అధికంగా ఉండడంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. చలితీవ్రత తట్టుకోలేక పట్టణాల్లో ప్రధాన రహదారులు రాత్రి 8 గంటలకే నిర్మాణుష్యమవుతున్నాయి. మరోవైపు చలి నుండి రక్షణ కోసం ఉన్ని దుప్పట్లు, శాలువలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. మైదాన ప్రాంతాల్లో కంటే కొండ ప్రాంతాల్లో నివశించే మన్యం వాసులకు ఈ చలితీవ్రత మరి అధికంగా ఉంది. దీంతో వారు పలు అవస్థలకు గురవుతున్నారు. చలికి తోడు తెల్లవారుజామున పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుంది. అలాగే మార్నింగ్ వాక్‌కు వెళ్ళేవారి సంఖ్య కూడా తగ్గింది. జనవరి నెలాఖరువరకు చలి తీవ్రత ఈ విధంగా ఉంటుందని ఫిబ్రవరి నుండి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
.........
పేకాటరాయుళ్లు, మందుబాబులదే సంక్రాంతి సందడి
(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
సంక్రాంతి సందడే సందడి! సందడంతా పేకాటరాయుళ్ళు, మందుబాబులదే! తాగినంత తాగి ఊగినంత ఊగుతూ సంబరంచేసుకునేవారు కొందరైతే..దాచుకుందంతా 3‘షో’ కొట్టయాలన్న తపనతో చితె్తైన వారు మరికొందరు. వీరందరికీ ఈ ఏడాది వేదిక లేకుండాపోయింది. పాపం తప్పోఒప్పో చాటుమాటున కొన్నాళ్ళు, బహిరంగంగా సర్కార్ అనుమతులతో మరికొన్నాళ్ళు నడిచే జిల్లా కేంద్రంలో రిక్రియేషన్ క్లబ్‌కు తాళాలు పడ్డాయి. అంతే స్టార్4‘షో’2కు తెరలేచింది. స్టార్ హోటళ్ళలో ఉత్తరాంధ్ర జిల్లాల పేకాటరాయళ్ళు గదులన్నీ ఆక్యుపేషన్ చేసుకున్నారు. స్టార్ హోటళ్ల యాజమాన్యాలు అన్నీ పార్టీల నేతలతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు. అందుకే నేతల ఎత్తులకు యంత్రాంగం చిత్తుగా పడిపోయింది. సంక్రాంతి ముందు జిల్లాలో పోలీసులు ప్రతీ గళ్లీలో చిన్నపాటి లాడ్జీని సైతం సోదా చేసే తీరుకు ఈ ఏడాది ఫుల్‌స్టాప్ పెట్టేసారు. కొన్ని స్టార్ హోటళ్లలో రౌండ్ ది క్లాక్ జరిగే పేకాట ‘షో’కు అసలు దాడులే లేవు. ఇదంతటికీ నేతల ఒత్తిడే కారణమని పోలీసుబాసులే కొందరు పేర్కొనడం గమనార్హం! ఈ మధ్య కాలంలో పోలీసులపై వస్తున్న ఆరోపణలు రుజువు చేసుకుందుకు పెడతున్న ప్రెస్‌మీట్లతోనే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిణామాలు, విచ్చలవిడిగా నడస్తున్న సెక్స్‌వర్కర్ల డెన్‌లు, కుర్రకారను తప్పుతోవ పట్టిస్తున్న కిలాడీల పట్ల దృష్టి సారించాల్సిన పోలీసులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు సైతం రెండు రోజులుగా జిల్లాలో కొంతమంది పోలీసుఅధికారుల వివరణ కోరుతూ నోటీసులు కూడా జారీ చేసినట్లు బోగట్టా. ఇటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి సంబరాలంటూ కొన్ని స్టార్ హోటళ్లలో పేకాట, మందు ఆపై చిందులు వేస్తున్నా పట్టించుకోకపోవడాన్ని కూడా సిక్కోల్ ప్రజలు పోలీసుశాఖను విమర్శిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం చేరుకుంటున్న పేకాటరాయళ్ళు కొన్ని స్టార్ హోటళ్లే కాకుండా, సందుల్లో నడుస్తున్న చిన్నపాటి లాడ్జిల్లో కూడా ‘షో’ లంటూ ఉత్సాహం చూపిస్తున్నారు. పారిశ్రామిక వాడగా పేరుపొందిన రణస్థలం మండలంలో అనేక తోటల్లో ఈ ‘షో’లు నిరాటంకంగా సాగుతున్నాయి. దీనికి సాలూరు, బొబ్బిలి, విజయనగరం, విశాఖపట్నం, ఆమదాలవలస, శ్రీకాకుళం, నరసన్నపేట తదితర ప్రాంతాల నుంచి పేకాటరాయళ్ళు తమ వాహనాల్లో రాకపోకలు సాగించడం గమనార్హం. ఇదే తంతు చీపురుపల్లి నుంచి సుభద్రాపురం జంక్షన్ రోడ్డులో, రాజాం నుంచి చిలకపాలేం కూడలి, పాలకొండ నుంచి కళింగపట్నం రోడ్డు మార్గానికి ఆనుకుని ఉన్న పేకాటరాయళ్ల కేరాఫ్ తోటల్లో గత రెండు రోజులుగా లక్షలాది రూపాయల ‘షో’ ఆరంభమైంది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రానికి ఆనుకుని గోపీనగరం తోటలో రాత్రివేళల్లో విద్యుత్ దీపాల నడమ పేకాటరాయళ్లు లక్షలాది రూపాయలు గేమ్‌లు సాగిస్తున్నా పోలీసులు నిఘా నేత్రానికి మాత్రం పనిలేకుండా పోయింది. పోలీసులకు జూదర్ల వద్ద నగదు, సెల్‌ఫోన్లు, ద్విచక్రవాహనాలు దొరక్కుండా ముందస్తుగా ఒకరి ఇంటివద్ద ఇవన్నీ భద్రపరిచి రాత్రివేళల్లో ఆట సాగించి ఉదయం సరికి లెక్కలు చూసుకోవడం ఒక ఎత్తుగడగా సాగుతోంది. ఇంత జరుగుతున్నా పోలీసు యంత్రాంగం మాత్రందాడులు చేయడంగాని, ఈ షోలకు అడ్డుకట్టవేయడంలో వైఫల్యం చెందారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఏ పోలీసు సర్కిల్ పరిధిలో నడుస్తున్న ఇటువంటి ‘షో’లు ఆ సర్కిల్ సిబ్బంది చాలా చాకచక్యంగా నడిపించేందుకు సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా లేకపోలేదు.
పేకాట షోతో సీమ సరుకు..
ప్రభుత్వ ఖజానాకు గండిపట్టే పక్క దేశాలు, రాష్ట్రాల లిక్కర్ జిల్లా కేంద్రానికి సంక్రాంతి కానుకగా చేరుకుంది. స్కాచ్ లిక్కర్ పేరిట సీమసరుకు స్టార్ 3షో2లో సేవిస్తున్న కొంతమంది పట్ల అబ్కారీశాఖ ఉదాసీనంగా వ్యవహరించడంతో డ్యూటీపెయిడ్ మద్యం అమ్మకాలు తగ్గాయి. స్టాటస్ట్‌క్ సింబల్‌గా మారి స్కాచ్ మద్యం విదేశాల నుంచి మిత్రులు, బంధువులు తీసుకువచ్చే కొత్త సంస్కృతి ఈ ఏడాది సిక్కోల్ బడామందుబాబులకు ఆవరించింది. దీంతో సిండికేట్‌కు దెబ్బ తగిలింది. గత వారం రోజుల్లో మద్యం అమ్మకాలు చూస్తే గడచిన ఏడాదికి సగానికి తక్కువగానే ఉందని మద్యం వ్యాపారులు చెబుతున్నారు. గత ఏడాది వరకూ ఇటువంటి సీమసరుకు ఉండేది కాదు. 2010లో స్థానిక ఒక రాజకీయ నాయకుడి స్టార్ హోటల్లో వైద్యులు, బడాబాబుల ‘షో’లో విదేశీ మద్యం తాగుతుంటే అప్పటి ఎక్సయిజ్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ దాడులు చేసి నాన్ - డ్యూటీపెయిడ్ లిక్కర్ కేసులు స్వాధీనం చేసుకుని కేసుపెట్టారు. కొంతమంది రాజకీయ నేతల ఒత్తిళ్ళకు అసలు యజమానిని తెరమీదకు తీసుకురాకుండా తప్పించగలిగిన సంగతి విదితమే. అటువంటి దాడులు ఇప్పుడు అబ్కారీశాఖ ఎందుకు చేయడంలేదో అంతుపట్టని ప్రశ్న. ఏజెన్సీలో సారా అమ్ముకునే పేద గిరిజనులపై ఉక్కుపాదం మోపే అబ్కారీశాఖ బడాబాబులు సీమ సరుకుపై ఎందుకు దాడులు చేయదన్నది వెయ్యి డాలర్ల ప్రశ్న?? జిల్లా అంతటా 50 కోట్ల సంక్రాంతి అమ్మకాలు చేయాలన్న అబ్కారీ లక్ష్యాన్ని మద్యం వ్యాపారులపై రుద్ది, పరోక్షంగా విదేశీమద్యాన్ని సేవించే వారిపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్ అధికారుల తీరుపై మద్యం వ్యాపారులు సైతం గుర్రుగా ఉన్నారు. లక్షలాది రూపాయల మద్యం నిల్వలు మూలుగుతుంటే, స్టార్ షో2లో విదేశీ మద్యం వినియోగం ఎక్కువవుతున్న నేపధ్యంలో అబ్కారీశాఖ, మద్యం వ్యాపారుల మధ్య మంగళవారం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం చిన్నపాటి వాగ్వివాదానికి దారితీయడం గమనార్హం.
కన్నులపండువగా
సంక్రాంతి సంబరాలు
ఎచ్చెర్ల, జనవరి 15: సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగను అన్నదాతలు అనాదిగా జరుపుకోవడం పరిపాటి. ఈ ఏడాది కూడా పంటలు కలిసిరావడంతో ఎంతో ఘనంగా నిర్వహించారు. పల్లెవాసులు కొత్తబట్టలు, పిండివంటలు, బంధుమిత్రులు ఆహ్వానాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ప్రతీ గ్రామంలో భోగి పర్వదినం నుంచి కనుమ పండుగ వరకు మూడురోజుల పాటు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా చిన్న, పెద్ద అన్న తారతమ్యం లేకుండా వర్గవైశామ్యాలు పక్కనపెట్టి సందడిగా గడిపారు. ఉద్యోగులు సెలవుపై, ప్రైవేట్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, సుధూర ప్రాంతాల్లో వలస జీవులుగా బతుకుబండి సాగించే కూలీలు సొంత గ్రామాలకు చేరుకుని ఆత్మీయత, అనురాగాలతో ఈ పండుగను జరుపుకోవడం కనిపించింది. వైష్ణవ సాంప్రదాయబద్ధంగా గోదాదేవి రంగనాధుని కల్యాణం, తిరువీధోత్సవం, జాతర వంటి కార్యక్రమాలను నిర్వహణ కమిటీలు కన్నులపండువగా చేపట్టాయి. తోబుట్టువులు, తోటికోడళ్లు, ఆడపడుచులు, చిన్నారులు, ఆటపాటలతో ఇళ్లముంగిటే సరదాగా..సంతోషంగా పండుగ చేసుకున్నారు. గ్రామాల్లో యువకులంతా క్రికెట్, వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించుకుని విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. దీనిని ఆసరాగా తీసుకుని మటన్, చికెన్ వ్యాపారులు ధరలు పెంచి వినియోగదారులకు వాతలు పెట్టారు. మునుపెన్నడూ లేని విధంగా మటన్ కిలో 500 రూపాయలు ధర పలుకగా చికెన్ 180 రూపాయలకు లభించింది. సందడిలో సడేమియా మాదిరిగా మందుబాబులు పూటుగా మద్యం సేవించి చిందులేయడం ఎక్కడికక్కడే దర్శనమిచ్చింది.
సిక్కోలు తిరుగు పయనం
శ్రీకాకుళం (టౌన్), జనవరి 15: జిల్లాకు సంక్రాంతి సందర్భంగా విచ్చేసిన దూరప్రాంత సిక్కోలు వాసులు తిరుగుపయనమవడంతో ఆర్టీసీ బస్సులు కిటకిటలాడాయి. ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర కార్మికులకు, పిల్లలకు సంక్రాంతి సెలవులు మంగళవారంతో ముగియడంతో సాయంత్రమే ప్రయాణానికి సిద్ధం అయ్యారు. జిల్లా వాసులంతా వలస ఉద్యోగులే కావడం సంక్రాంతి ముఖ్యమైన పండుగ కావడంతో అంతా సంక్రాంతికి సొంతూరుకు రావడం సంక్రాంతి వెళ్లిన వెంటనే తిరుగుపయనం కావడం తెలిసిందే. అయితే బోగి, సంక్రాంతితో పాటు కనుమను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ అయినప్పటికీ కనుమ మరుసటిరోజు కిక్కిరిసిన జనంతో బస్సులు కిటకిటలాడుతాయని భావించి ముందుగానే పయనం కట్టారు. మద్యాహ్నం వరకు ఖాళీగా ఉన్న ఆర్టీసీ కాంప్లెక్సు సాయంత్రం అయ్యేటప్పటికి ఒక్కసారిగా ప్రయాణీకులతో కిటకిటలాడటంతో ఆర్టీసీ అధికారులు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల నుండి ఎనిమిది సర్వీసులు వేసి ప్రయాణీకులను ఎప్పటికప్పుడు ఖాళీ చేయించారు. ఇదిలా ఉండగా ఎక్స్‌ప్రెస్, డీలక్స్ సర్వీసులు ఖాళీ లేనందున పల్లెవెలుగు సర్వీసులను వేయడంతో కొంతమేర ప్రజల్లో నిరసన వ్యక్తమయింది. పల్లెవెలుగు బస్సులు దూరప్రాంత సర్వీసులుగా వేస్తే అంత సమయం కూర్చోవడానికి ఇబ్బందిగా ఉంటుందని కొంతమంది గుసగుసలాడుకోవడం వినిపించింది. ఏదేమైనప్పటికీ ప్రయాణీకులకు ఎప్పటికపుడు బస్సు సర్వీసులు వేసి వారిని చేరవేయడమే లక్ష్యంగా చూస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
ఇరు వర్గాల ఘర్షణ
రేగిడి, జనవరి 15: మండలంలోని అప్పాపురం గ్రామంలో సోమవారం రాత్రి రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరగడంతో స్థానికంగా భయానక వాతావరణం చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం మారణాయుధాలతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో వంకాయల మణమ్మ, వెంకటరమణ, బావిశెట్టి రాజేశ్వరి తీవ్రంగా గాయలపాలయ్యారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. వంకాయల వెంకటరమణ, బావిశెట్టి గోవింద్‌లకు గత ఏడు నెలలుగా కుటుంబ కలహాలు ఉన్నాయి. సంక్రాంతి రోజున ఇరు కుటుంబాలు పాత కక్షలతో ఘర్షణ పడ్డారు. సంఘటనా స్థలంలో గొడ్డలి, రాళ్లు ఉండటంతో దాడులకు వీటిని ఉపయోగించినట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనలో వంకాయల మణిమ్మ, వెంకటరమణ, బావిశెట్టి రాజేశ్వరుల తలకు తీవ్రగాయాలు కాగా రక్తస్రావం అధికం కావడంతో వీరిని హుటాహుటిన స్థానికులు 108కు సమాచారం అందించారు. క్షతగాత్రులను పాలకొండ ఏరియా ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యానికై విశాఖ కెజిహెచ్‌కు రిఫర్‌చేసారు.
ఎస్సై విచారణ
ఈ సంఘటన తెలుసుకున్న ఎస్సై లక్ష్మణరావు ఆధ్వర్యంలో ఆప్పాపురం గ్రామాన్ని సందర్శించారు. ఘర్షణ పడిన సంఘటనలో మారణాయుధాలు గొడ్డలి, రాళ్లు, రక్తస్రావం వంటివి పరిశీలించారు. గ్రామంలో దాడి విషయమై వీధుల్లో పలుకుటుంబాల వద్ద విచారణ చేపట్టారు. ఈ మేరకు ఘర్షణకు పాల్పడిన బావిశెట్టిసూర్యనారాయణ, గోవింద, పవన్, నరసింహులు, అప్పలరాజు తదితరులను అదుపులో తీసుకున్నారు.
క్వారీల్లో అక్రమ పేలుళ్లు
కొత్తూరు, జనవరి 15: మండలంలో ఉన్న కొన్ని రాళ్ల క్వారీలో అక్రమ పేలుళ్లు విచ్చలవిడిగా జరుగుతున్నాయని పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిని నిరోధించాల్సిన అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలో సోభనాపురం కొండ, దిమిలికొండ, వెంకటాపురం కొండలపై రాళ్లు తవ్వేందుకు క్వారీల నిర్వాహకులు పేల్చుతున్న బాంబుమోత దద్దరిల్లుతుండటమే ఇందుకు నిదర్శనమని ఆయా గ్రామస్థులు చెబుతున్నారు. క్వారీల యజమానులు తమ స్టోను క్రషర్లకు కావలసిన వివిధ సైజులలో రాళ్ల కోసం కొండలపై ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లను పేల్చుతున్నారని దిమిలి, రాయల, ఆకులతంపర, సోభనాపురం, వసప, వెంకటాపురం గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్వారీ పేల్చుతున్న సందర్భంగా రాళ్లు ముక్కలు ఎగసి పడి రాకపోకలు సాగించే రహదారులపై పడుతున్నాయి. ఈ పేలుళ్ల్ల వలన రాళ్లు తగిలి ఎవరి ప్రాణాలకు ముప్పు తెస్తాయని భయపడుతున్నారు. సోభనాపురం కొండపై క్వారీ నిర్వహించేందుకు ఎటువంటి అనుమతులు లేవని ఇటీవల అధికారులు నిర్వహించిన విచారణలో వెల్లడైంది. బినామీ పేరుతో అనుమతులుంటే పేలుళ్లకు అనుమతించేది లేదని అధికారులు హెచ్చరికలు కూడా చేసారు.
అలాగే దిమిలి-వెంకటాపురం క్వారీలకు కూడా అధికారుల అనుమతులు లేకపోయిన రాళ్లు పేల్చుతున్నారని పరిసర గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ క్వారీ పేలుళ్లు లేకుండా నిరోధానికి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
తహశీల్దార్ వివరణ
అక్రమ క్వారీల నిర్వహణపై స్థానిక తహశీల్దారు వై.సూర్యనారాయణను వివరణ కోరగా ప్రజల నుండి ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ఫిర్యాదులు అందినట్లైతే విచారణ జరిపి అక్రమ క్వారీల నిరోధానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
హలాలేశ్వరస్వామి
జాతరకు ఏర్పాట్లు
నరసన్నపేట, జనవరి 15: మండలంలో కరగాం పంచాయతీ పరిధి అంపలాం గ్రామంలో వెలసియున్న హలాలేశ్వరస్వామి ఉత్సవాలను నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాటు చేస్తున్నామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మంగళవారం నిర్వాహకులు విలేఖరులతో మాట్లాడుతూ ప్రతీ ఏడాది ఈ జాతరను నిర్వహిస్తున్నామన్నారు. అతి పురాతన శివాలయంగా పేరుగాంచిన దీనికి మరమ్మతులు పనులు చేసేందుకు ఇటీవలి పలువురు భక్తులు విరాళాలను ప్రకటించడంతో పనులను చేపట్టామన్నారు. జాతరలో భాగంగా అంపలాం గ్రామం నుండి తప్పిటగుళ్లతో యువకులు అతివేగంగా పరుగులు తీస్తూ ఆలయానికి చేరుకోవడం తిరిగి అదే వేగంతో గ్రామానికి చేరుకోవడం ఆనవాయితీ. దీనిని చూసేందుకు జిల్లా నలుమూలల నుండి భక్తులు విరివిరిగా పాల్గొంటారన్నారు.
సహకార సంఘ ఎన్నికలకు పార్టీల కసరత్తు
జలుమూరు, జనవరి 15: సహకార సంఘాల ఎన్నికలు దగ్గరపడుతున్నందున అధికార కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలు విజయం కోసం ముమ్మర కసరత్తు ప్రారంభించాయి. ఇక తెలుగుదేశం పార్టీ విషయానికొస్తే ఇప్పటివరకు మండలంలో పోటీతత్వజాడ కనిపించడం లేదు. 2005లో జరిగిన చల్లవానిపేట, అల్లాడ సహకార సంఘాల పరిధిలో 26 మంది డైరెక్టర్ల పదవులను 16 కాంగ్రెస్, 10 దేశం మద్ధతుదారులు దక్కించుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి దేశం పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచి గట్టిపోటీ ఇచ్చింది. ఆ పరిస్థితులు ఇప్పుడు కానరావడం లేదు. అధికార కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గట్టిపోటీ ఇచ్చేందుకు వైఎస్సార్ సీపీ ముమ్మర కసరత్తు ప్రారంభించింది. పల్లెల్లో తమ పార్టీ బలాన్ని బేరీజు వేసుకోవడానికి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ సూచనల మేరకు వైఎస్సార్ సీపీ మండల స్థాయి నాయకులు కొయ్యాన సూర్యారావు, మెండ రాంబాబు, మొజ్జాడ శ్యామలరావు, కనుసు సీతారాం, పైడి విఠల్‌రావు, మూకళ్ల సత్యం, మరికొందరు పట్టుదలతో పావులు కదుపుతున్నారు. ఇక కాంగ్రెస్ విషయానికొస్తే రెండు పర్యాయములు మండల అధ్యక్షులుగా పదవులు చేపట్టిన వెలమల కృష్ణారావు, మరో రెండుసార్లు ఎంపిపిగా బాధ్యతలు నిర్వహించిన బొగ్గు శాంతి, రామకృష్ణలు దేశం పార్టీని వీడి కొన్ని నెలల కిందట కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. ఈయన పాత మిత్రులు, తెలుగుతమ్ముళ్ల సహకారంతో చల్లవానిపేట, అల్లాడ సహకార సంఘాలను కాంగ్రెస్ ఖాతాలో చేర్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక దేశం పార్టీ పరిస్థితిని ఆ పార్టీ సీనియర్ నాయకులు బొగ్గు లక్ష్మణరావే స్వయంగా పరిశీలించాలి. కనుక ఆ పార్టీ మండల స్థాయి నాయకులు మాత్రం ఎన్నికల విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం ఇక్కడ విశేషం.
మరో కొద్దిరోజుల్లో ప్రభుత్వ పరంగా నోటిఫికేషన్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో పరిస్థితులు వేడెక్కవచ్చని పలు పార్టీల అభిమానులు బాహాటంగా చెబుతున్నారు.
అన్నవస్త్ర సమారాధనలో పాల్గొన్న జిఎంఅర్
రాజాం, జనవరి 15: ప్రతీ ఏటా సంక్రాంతి పూట ప్రముఖ పారిశ్రామిక వేత్త గ్రంధి మల్లిఖార్జునరావు కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించే అన్నవస్త్ర సమారాధన కార్యక్రమం ఈ ఏడాది కూడా నిర్వహించారు. సంక్రాంతి రోజైన సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15వేల మంది సాధువులు, నిరుపేదలు హాజరయ్యారు. పురుషులకు దుప్పటి, ధోవతి, మహిళలకు చీర, దుప్పటితో పాటు పులిహోర ప్యాకెట్లు జిఎంఅర్ స్వయంగా అందజేసారు. దీనికి సంబంధించి స్థానిక జిఎంఅర్ ఐటిలో విస్తృతంగా ఏర్పాట్లు చేసారు. వలంటీర్లు, స్వచ్చంద సంస్థ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమం సజావుగా సాగేందుకు సహకరించారు. ఈ కార్యక్రమంలో జిఎంఅర్‌తో పాటు ఆయన సతీమణి వరలక్ష్మి, కుమారులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఆర్ అండ్ బి రహదారుల్లో అవినీతి గోతులు
ఆమదాలవలస, జనవరి 15: స్థానిక రహదారులు, భవనాల శాఖ కార్యాలయ పరిధిలో వివిధ గ్రామీణ, పట్టణ రహదారుల్లో అవినీతి గోతులు దర్శనమిస్తున్నాయి.
ప్రతీ ఏటా మరమ్మతులు పేరుతో లక్షలాది రూపాయలు నిధులను ప్రభుత్వం ఖర్చు చేస్తున్నప్పటికీ కొన్ని పనులు కాగితాలకే పరిమితం కాగా మరికొన్నింటిని పైపైన చేసి బిల్లులు డ్రా చేసుకుంటున్నట్టు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. మండలంలో దూసిరోడ్డు జంక్షన్ నుండి ముద్దాడపేట, పీరుసాహెబ్‌పేట, కలివరం, తొగరాం, చీమలవలస, కొర్లకోట మీదుగా ఉండే రింగ్‌రోడ్డులో నిత్యం మరమ్మతులు జరుగుతున్నా గోతులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రోడ్లు మరమ్మతుల్లో పనులు ఎవరు చేయిస్తున్నారో తెలియడంలేదు.
ఇక్కడ కూలీలే ఇంజనీర్లుగా ఉంటున్నారు. సంబంధిత అధికారి, కాంట్రాక్టర్ పనుల వద్ద ఉండకపోవడం గమనార్హం. మరమ్మతులు చేసిన మరుసటిరోజే గోతుల్లో కంకర చెదిరిపోయి గోతులు యధాతథంగా దర్శనమిస్తున్నాయి. ఈ రహదారుల్లో వాహనచోదకులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ రహదారికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులు పూర్తిస్థాయిలో వినియోగమవ్వక సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై దోచుకుతింటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా మండలంలో శ్రీహరిపురం నుండి జొన్నవలస, మునగవలస, రొట్టవలస రోడ్లు, కొరపాం, జి.కె.వలస, నెల్లిపర్తి, చింతలపేట, వెదుళ్లవలస, రామచంద్రాపురం, సైలాడ, ఆమదాలవలస పట్టణం నుండి పాలకొండ రోడ్, కొత్తరోడ్డు తదితర రోడ్లలో గత రెండేళ్లుగా ప్రభుత్వం మరమ్మతులు పేరుతో సుమారు తొమ్మిది కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు అధికారుల అంచనా. ఈ పనులు జరుగుతున్న సమయంలో ఇంజనీరు పర్యవేక్షణ లేకుండా పి.సి.ల మత్తులో బిల్లులు చెల్లిస్తున్నారే తప్ప నాణ్యతా ప్రమాణాలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు లేకపోలేదు. ప్రస్తుతం మండలంలో తుఫాన్ పునరావాస పనుల పేరుతో రోడ్డు మరమ్మతులు జరుగుతున్నాయి.
నాణ్యతా ఎలా ఉన్నా..
మండలంలో ఆర్.అండ్.బి రహదారుల మరమ్మత్తుల్లో చిన్న, చిన్న లోపాలు, పొరపాట్లు వాస్తవమేనని జె.ఇ. నారాయణరావు స్పష్టం చేశారు. మరమ్మతుల పేరుతో టెండర్ పాడిన కాంట్రాక్టర్ పనులు చేసేందుకై దృష్టి పెట్టకపోవడం వల్ల నాణ్యతా ఎలా ఉన్నా..పనులు చేయిస్తున్నామన్నారు. రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వ్యక్తి అనుమానాస్పద మృతి
పొందూరు, జనవరి 15: మండల కేంద్రానికి సమీపంలో రాపాక జంక్షన్‌లో క్వారీమెట్టచెరువులో మంగళవారం బయటపడిన వెంపటాపు శ్రీనివాసరావు(40) మృతదేహం తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈయన మృతదేహంతో పాటు ఆ చెరువులోని చేపలు మొత్తం నిర్జీవంగా పైకితేలాయి. ఆదివారం మధ్యాహ్నం శ్రీనివాసరావు మృతదేహాన్ని కనుగొని స్థానిక ఎస్సై మధుసూధనరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావు పురుగుమందు తీసుకుని చెరువులో దూకాడా, లేకుంటే ఎవరైనా హత్యచేసి చెరువులో పడివేశారా అన్న సందేహాలు తొంగిచూస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆదిత్యునికి క్షీరాభిషేకం
శ్రీకాకుళం(కల్చరల్), జనవరి 15: పుష్యశుద్ధతదియ పర్వదినం పురస్కరించుకుని సోమవారం వేకువజామున అరసవల్లి ఆదిత్యుని నారాయణునికి క్షీరాభిషేక పూజలు జరిగాయి. రవి ధనుర్మాసం అనంతరం మకరంలో ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలంను అనుసరించి స్వామివారికి ప్రభాతసేవ, ఉషాంకాల అర్చన, మంత్రపుష్పం, క్షీరాభిషేకంలు నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ నేతృత్వంలో సాయంత్రం తిరువీధి ఉత్సవం, హారతి సేవలు అలంకారసేవలు, సర్వదర్శనాలు జరిగాయి. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది, స్థానిక భక్తులు పాల్గొన్నారు.
కిటకిటలాడిన సంగమయ్యకొండ
* బారులు తీరిన భక్తులు
ఆమదాలవలస, జనవరి 15: సంక్రాంతి, కనుమరోజుల్లో సంగమయ్యకొండపై జరిగే జాతరకు జనం పోటెత్తారు. సోమ, మంగళవారాల్లో భక్తులు స్వామిని దర్శించుకునేందుకు బారులు తీరారు. పరిసర గ్రామాల నుంచే కాకుండా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్దసంఖ్యలో భక్తులు రావడంతో సంగమయ్యకొండ పోటెత్తింది. వేలాది మంది భక్తులు తరలివచ్చినట్లు నిర్వాహకులు పేర్కొంటున్నారు. మండలంలో గాజులకొల్లివలస పంచాయతీ పరిధిలో ఉన్న ఈ కొండపైకి వెళ్లేందుకు రహదారి సౌకర్యం అంతంతమాత్రంగానే ఉండడంతో భక్తులు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొండ సమీపంలో విద్యుత్‌లైన్లు లేకపోవడంతో సాయంత్రం అయ్యేసరికే అంధకారం అలముకోవడం భక్తులతో పాటు చిల్లర వర్తకులు అవస్థలుపడ్డారు. అంతేకాకుండా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న సంగమయ్యకొండ పరిసరాల్లో కల్లుదుకాణాలు, బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వ్యాపించడంతో మందుబాబులు చిందులేసి భక్తులకు అసౌకర్యం కలిగించారు. ఎప్పటినుంచో రోడ్డును నిర్మించాలని, వీధిలైట్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించాలని భక్తుల ఆవేదనను పట్టించుకునే నాధుడే కరువయ్యాడు.
సహకార ఓటర్ల తుది జాబితా
జలుమూరు, జనవరి 15: మండల పరిధి 60 పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల తుదిజాబితాను మంగళవారం ప్రచురించామని తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్ తెలిపారు. మండలం మొత్తం 44,025 మంది ఓటర్లు ఉండగా పురుషులు 21,722 మంది, స్ర్తిలు 22,298 మంది ఉన్నారు. పురుషుల కంటే అదనంగా 571 మంది స్ర్తిలు ఉన్నారు. ఈ వివరాలు కోసం ప్రతీ బూత్‌లెవల్ పోలింగ్ అధికారులు, తహశీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారులను సంప్రదించాలన్నారు. మార్పులు, చేర్పులు అవసరమైన వారు ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవం నాడు సంప్రదించవచ్చునని సూచించారు.
పల్లెల్లో కనుమ పండుగ ఉత్సవాలు
జలుమూరు, జనవరి 15: కనుము పర్వదినం మంగళవారం కావడంతో పల్లెల్లో ఇంటింటా ఈ పండుగ ఘనంగా జరిగింది. చికెన్, మటన్ ధరలు ఆకాశన్నంటాయి. వీటికి డిమాండ్ పెరగడంతో దుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. ఎన్నడూ లేని విధంగా మటన్‌ను 500 రూపాయలు, చికెన్ 300 రూపాయలు, బ్రాయిలర్ 200 రూపాయల వరకు ధర పెరిగింది. మాంసం కోసం ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అందరికీ ఆదాయం అనుకూలంగా ఉన్నందున అన్నివిధాలుగా సంక్రాంతి, కనుమ పండుగలు ఆనందోత్సవాల మధ్య జరుపుకొన్నారు. ఏ ఇంట చూసినా కోళ్ల వేటలు వేయడం కనిపించింది. మద్యం దుకాణాల వద్ద మందుబాబుల రద్దీ కనిపించింది. కిక్కెక్కిన మందుబాబులు రోడ్లపై విన్యాసాలు చేశారు. పేరుకే ధరలు పెరిగాయనడమే కాని కొనేందుకు కూడా మద్యం దొరకకపోవడం విశేషం.