Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పొలిట్‌బ్యూఠోలోకి అయ్యన్న

$
0
0

విశాఖపట్నం, జనవరి 15: గత మూడు నెలల నుంచి సంస్థాగతంగా ఇబ్బందులు పడుతున్న జిల్లా తెలుగుదేశం పార్టీని మళ్లీ గాడిలో పెట్టేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చర్యలు ప్రారంభించారు. అర్బన్ జిల్లా అధ్యక్షునిగా దక్షిణ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ వాసుపల్లి గణేష్‌కుమార్‌ను నియమించారు. రూరల్ జిల్లా అధ్యక్షునిగా దాడి వీరభద్రరావు కుమారుడు దాడి రత్నాకర్ బాబును నియమించారు. ఇప్పటి వరకూ జిల్లా అధ్యక్షునిగా కొనసాగిన మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడిని పాలిట్‌బ్యూరోలోకి తీసుకున్నారు. అలాగే నగర అధ్యక్షునిగా పనిచేసిన పీలా శ్రీనివాస్‌కు రాష్టప్రార్టీలో స్థానం కల్పించారు. ఆయను రాష్ట్ర పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా తిరిగి గణబాబునే నియమించారు. గాజువాక, పాడేరు నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లను ఇంకా ప్రకటించకపోవడం గమనార్హం. చంద్రబాబు ప్రకటనతో పార్టీలో అసంతృప్తి తీవ్రమైంది. బాబుది సాహసోపేతమైన నిర్ణయమని స్థానిక టిడిపి నాయకులు కొంతమంది అంటుంటే, ఆ నిర్ణయం పార్టీకి కీడు చేస్తుందని ఇంకొంతమంది అంటున్నారు.
జిల్లా మొత్తం ఒకటే కమిటీ ఉండాలన్నది స్థానిక నాయకుల వాదనైతే, అర్బన్, రూరల్ విడగొట్టాలన్నది పార్టీ విధానమని చంద్రబాబు నాయుడు చెప్పుకుంటూ వస్తున్నారు. జిల్లా అంతటికీ ఒకే కమిటీ ఉండాలన్నది అయ్యన్న పాత్రుడు, వెలగపూడి రామకృష్ణ బాబు, పీలా శ్రీను, కోన తాతారావు వంటి వారి వాదన. దీనికి అయ్యన్ననే తిరిగి అధ్యక్షునిగా నియమించాలని కోరుతూ వస్తున్నారు. అయ్యన్న నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వారు రెండు కమిటీలు ఉండాలని పట్టుపట్టారు. ఈమధ్య ఖమ్మం జిల్లాలో చంద్రబాబు నాయుడిని కలిసిన స్థానిక నాయకులు తమతమ వాదనను వినిపించారు.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడు తనకున్న సమాచారం ఆధారంగా అర్బన్, రూరల్ జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ తన నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు బాగానే చేపడుతున్నారు. పైగా బిసి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వలన ఆయనను అధ్యక్ష స్థానంలో నియమించారని తెలుస్తోంది. వాసుపల్లి నియామకాన్ని అయ్యన్నపాత్రుడు, వెలగపూడి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరిద్దరి అభిప్రాయాలను పక్కనపెట్టి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. మరోపక్క పశ్చిమ నియోజకవర్గానికి టిడిపి ఇన్‌చార్జ్‌గా గణబాబును నియమించారు. 2009 ఎన్నికల్లో గణబాబు అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత ఆయన పీఆర్పీలోకి వెళ్లి, అక్కడ ఇమడ లేక తిరిగి టిడిపిలోకి వచ్చేశారు. చంద్రబాబు తనకున్న లెక్క ప్రకారం గణబాబును తిరిగి నియమించారు. పార్టీ నుంచి వెళ్లిపోయి, తిరిగి వచ్చిన వారికి మళ్లీ పదవి కట్టబెట్టడం ఏంటని అసంతృప్తి వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక రూరల్ జిల్లాకు దాడి రత్నాకర బాబును అధ్యక్షునిగా చేశారు. దాడి వీరభద్రరావుకు రూరల్‌లో ఇప్పుడున్న టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారు. అదే సహకారం రత్నాకర్‌కు కూడా అందితే, ఆయన పార్టీని నెట్టుకు రాగలుగుతాడన్న విశ్వాసాన్ని పలువురు నాయకులు వ్యక్తం చేస్తున్నారు. ఇక పీలా శ్రీను విషయానికి వస్తే, ఆయన నగర అధ్యక్షునిగా పనిచేశారు. దీని తరువాత పశ్చిమ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలన్న ఆలోచనలో కూడా ఉన్నారు. అధ్యక్ష స్థానం నుంచి తొలగించడమే కాకుండా, పశ్చిమ నియోజకవర్గాన్ని కూడా ఆయనకు దక్కనీయకుండా చేయడంతో ఆయన తీవ్ర ఆవేదనతో ఉన్నారు. రాష్ట్ర పార్టీలో స్థానం కల్పించడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

నేడు ‘అసంతృప్తి’ సమావేశం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 15: టిడిపి కొత్త అధ్యక్షుల ప్రకటన తరువాత పార్టీలో అసంతృప్తి పతాక స్థాయికి చేరుకుంది. పోలిట్‌బ్యూరోలో స్థానం లభించినప్పటికీ అయ్యన్నపాత్రుడు అసంతృప్తితో ఉన్నారు. జిల్లా పార్టీకి నాయకత్వం వహించిన తనను పొలిట్‌బ్యూరోలో నియమించడం వలన పెద్దగా ప్రయోజనం ఉండదని తన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు తన మాటకు ఏమాత్రం విలువ ఇవ్వలేదన్న అసంతృప్తి ఆయనలో కనిపిస్తున్నట్టు భోగట్టా. మరోపక్క పీలా శ్రీను కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మూడు సంవత్సరాల పాటు తాను పశ్చిమ నియోజకవర్గానికి టిడిపి ఇన్‌చార్జ్‌గా చేసి, బోలెడు డబ్బు ఖర్చు చేశానని, ఎవ్వరితోనూ విభేదించని తనకు సరైన పదవి ఇవ్వలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి తన కుటుంబం అందించిన సేవలను గుర్తించలేదని ఆయన అన్నారు. రాష్ట్ర కమిటిలో పదవి లభించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పదవిని తాను స్వీకరించడం లేదని, పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నానని పీలా అన్నారు. బుధవారం ఉదయం పార్టీ నాయకులతో సమావేశమై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని అన్నారు. తనతోపాటు కొంతమంది టిడిపి మాజీ కార్పొరేటర్లు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని పీలా అన్నారు.

ఫిబ్రవరి రెండవ వారంలో విశాఖ ఉత్సవ్
విశాలాక్షినగర్, జనవరి 15: వచ్చే నెల రెండవ వారంలో విశాఖ ఉత్సవ్ నిర్వహించాలని రాష్ట్ర పెట్టుబడులు, వౌళిక వసతులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సూచన ప్రాయంగా తెలిపారు. మంగవారం ప్రభుత్వ అతిథిగృహంలో జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి మంత్రి గంటా శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు. వచ్చే నెలలో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిని సంప్రదించి ఉత్సవ తేదీలు ఖరారు చేస్తామని వెల్లడించారు. అనేక కారణాల వలన విశాఖ ఉత్సవ్ చాలాసార్లు వాయిదాపడటంపై మంత్రి గంటా శ్రీనివాస్ ఆవేదన వ్యక్తపరిచారు. ఈసారి విశాఖ ఉత్సవ్ వినూత్నంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తామని స్పష్టం చేసారు. మూడు రోజులపాటు జరిగే విశాఖ ఉత్సవాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. కేంద్ర పర్యాటకశాఖా మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై తగిన సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ శేషాద్రికి సూచించారు. ముందుగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని అన్నారు. విశాఖ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందాలని మంత్రి గంటా శ్రీనివాస్ కోరారు.

కన్నుల పండువగా గజేంద్రమోక్షం
* గరుడవాహనంపై ఊరేగిన సింహాచలేశుడు

సింహాచలం, జనవరి 14: కనుమ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని కొండదిగువ పూలతోటలో గజేంద్రమోక్షం (మకరవేట) ఉత్సవం మంగళవారం కన్నులపండువుగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణ చేస్తుండగా వౌసలిబారినపడ్డ గజేంద్రుడ్ని రక్షించే పురాణఘట్టాన్ని దేవస్థాన పరివారం సాంప్రదాయంగా నిర్వహించారు. పూలతోటలో కొలనుగట్టుపై గజేంద్రుడ్ని, మొసలిని ఉంచారు. స్వామివారు కొలువై ఉన్న ఉత్సవ మండపం నుండి మొసలికి ఇనుపతీగను కట్టారు. స్వామివారిని మయటకు తీసుకువచ్చి స్వామివారి ప్రతినిధులుగా సిబ్బంది తీగపై తారాజువ్వలు వదిలారు. తారాజువ్వలు వెళ్ళి మొసలిని తాకడంతో మొసలి సంసాచరం జరిగి గేంద్రుడికి మోక్షం లభించింది. మొసలి బారినుండి రక్షించినందుకుగాను అనంతరం సింహాచలేశుడ్ని గరుడవాహనంపై పురవీథులలో ఊరేగించారు. వీథులలో ఊరేగింపుగా వస్తున్న స్వామికి భక్తులు దారిపొడవునా రంగవల్లులు మంగళహారతులతో స్వాగతం పలికారు. అంతకు ముందు మధ్యాహ్నం కొండపై దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. స్వామిని శ్రీ మహావిష్వుగా అలంకరించి పల్లకీలో కొండదిగువకు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
చర్చనీయాంశమైన తిరువీధి: కనుమ పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి జరిగిన సింహాచలేశుని తిరువీధి చర్చనీయాంశంగా మారింది. ప్రతిడా గజేంద్రుడిపై నిర్వహించే సింహాద్రినాధుని తిరువీథి ఈ ఏడాది గరుడవాహనంపై నిర్వహించారు. ఈ నేపథ్యంలో గజవాహనానికి బదులు గరుడ వాహనంపై ఊరేగించడంపై పలు విమర్శలు వినిపించాయి.

సాగరతీరంలో పతంగుల పండుగ
విశాలాక్షినగర్, జనవరి 15: పతంగుల పండుగ చిన్నా పెద్దా తేడా లేకుండా పతంగులను తయారుచేసుకుని ఎగురవేయడం మన ఊర్వికుల నుంచి వస్తున్న ఆచారం. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం అయ్యే సరికి అందరూ సాగరతీరానికి చేరుకుని పతంగులు ఎగరవేశారు. రంగురంగుల ఆకర్షణీయమైన వర్ణాలతో వివిధ ఆకృతులతో తయారైన పతంగులను ఎగరవేయటానికి అందరూ ఉత్సాహం చూపించారు. చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా సంప్రదాయ నృత్యాలు చేశారు. మార్వారీ యువ మంచ్ ఆధ్వర్యంలో యువత పతంగుల పండుగను మంగళవారం ఆర్‌కె బీచ్‌లో నిర్వహించారు. పతంగులను ఎగరవేయడంలో మెళకువలను నేర్పించారు. భారతీయ సంస్కృతిలో భాగమైన పతంగుల పండగును మన భావి తరాలకు అందించేందుకు ఇటువంటి కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేపట్టామని మార్వారీ యువ మంచ్ అధ్యక్షుడు నరేష్ అగర్వాల్ వెల్లడించారు. పతంగుల పండుగలో భాగంగా పతంగుల పోటీ, ప్రదర్శన, ఎత్తు ఎగరవేయడం, వివిధ ఆకృతుల పతంగుల పోటీల ద్వారా బహుమతులు అందజేశారు.

సందర్శకులతో కళకళలాడిన సాగరతీరం

భీమునిపట్నం, జనవరి 15: సంక్రాంతి పండుగ సందర్భంగా భీమునిపట్నం బీచ్ సోమ, మంగళవారం సందర్శకులతో కళకళలాడింది. తగరపువలస, భీమునిపట్నం సంక్రాంతి పండుగకి వచ్చిన బంధువులు చిన్నా, పెద్ద బీచ్‌కి తరలివచ్చారు. అలాగే ఎర్రమట్టి దిబ్బల అందాలను చూసి ఆనందించారు. రెండు రోజుల పాటు చిన్నా, పెద్దలతో కిటకిటలాడింది. గ్రామాల నుండి కూడా అనేక మంది బీచ్‌కి తరలివచ్చారు.
ఘనంగా అనంతుని గిరి ప్రదక్షిణ

పద్మనాభం, జనవరి 15: పద్మనాభంలో వేంచేసి ఉన్న శ్రీ అనంతపద్మనాభస్వామిని పూర్వం నుంచి వస్తున్న సాంప్రదాయం ప్రకారం మంగళవారం ఆలయ అర్చకులు, భక్తులు అనంతుని గిరి ప్రదక్షిణ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. గతంలో మరుగునపడిపోయిన గిరి ప్రదక్షిణను మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ చివరి రోజు కనుమ రోజున నిర్వహిస్తున్నారు. పూలమాలలతో అలంకరించిన పల్లకీలో శ్రీదేవి, భూదేవి సమేతుడైన అనంతుని ఇసుకులపాలెం, అర్చకునిపాలెం, పద్మనాభంల మీదుగా మంగళవాయిద్యాలు, స్వామి నామాలతో సుమారు 8 కిమీ గిరి ప్రదక్షిణ చేసారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.

వైభవంగా బొజ్జన్నకొండ జాతర
* అనూహ్యంగా తరలివచ్చిన సందర్శకులు
* కిక్కిరిసిన ప్రధాన రహదారులు
* స్తంభించిన రాకపోకలు
అనకాపల్లి టౌన్, జనవరి 15: ప్రముఖ పురావస్తు బౌద్ధక్షేత్రం జొజ్జన్నకొండ జాతర మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. ప్రతియేటా కనుమ పండుగ పర్వదినాన విధిగా జరిగే జాతరకు ఎప్పటి మాదిరిగానే ఈ ఏడాది కూడా అనకాపల్లి పరిసర ప్రాంతాల నుండే కాకుండా జిల్లా నలుమూలల నుండి అనూహ్య రీతిలో సందర్శకులు తరలివచ్చారు. జాతరకు తరలివచ్చే సందర్శకులతో కొండ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఉదయం పది గంటల నుండి కొండ ప్రాంతంలో జాతర వాతావరణం కనిపించింది. మధ్యాహ్నం మూడు నుండి సాయంత్రం ఏడు గంటల వరకు అనూహ్య రీతిలో తరలివచ్చే జనవాహినితో కొండ ప్రాంగణంలో పెద్ద రద్దీ వాతావరణం ఏర్పడింది. కొండపైన గల బౌద్ధ స్తూపాలను, శివలింగాలను పోలిన స్తూపాలను బౌద్ధుల ప్రార్ధనా మందిరాలను, ఇతర ప్రముఖ కట్టడాలను, శిల్పాలను సందర్శకులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. జాతరలో భాగంగా కొండ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వివిధ స్టాల్స్ సందర్శకులను బాగా ఆకర్షించాయి. విశాఖపట్నం నుండి వచ్చిన బౌద్ధ బిక్షువులు కొండ గుహల్లోని బౌద్ధ స్తూపాలకు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. జాతరకు వచ్చే సందర్శకులతో రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ స్తంభించి పోయింది. జాతర సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును నిర్వహించారు.

అంబరాన్ని తాకిన మకరజ్యోతి ఉత్సవాలు
నర్సీపట్నం, జనవరి 15: నర్సీపట్నంలో స్వామి అయ్యప్ప దేవాలయంలో మకరజ్యోతి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను సోమవారం రాత్రి నిర్వహించారు. సినీ, టి.వి. కళాకారులను ఘనంగా సన్మానించారు. సంక్రాంతి రోజు సోమవారం ఉదయం నుండి అయ్యప్పస్వామి వారికి నెయ్యాభిషేకం, పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు వేదపండితుల మత్రోచ్ఛారణలు, ఆధ్యాత్మిక భావంతో భక్తుల శరణుఘోషతో ఆలయం మారుమ్రోగింది. మాజీమంత్రి, ఆలయ ధర్మకర్త చింతకాయల అయ్యన్నపాత్రుడు దంపతులు అయ్యప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపించారు. పలు ఆధ్యాత్మిక సంస్థల ఆధ్వర్యంలో సంకీర్తనలు, భజనలు జరిగాయి. సాయంత్రం నగర ప్రముఖుల ఆధ్వర్యంలో స్వామివారి తిరువీధి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. అయ్యన్నపాత్రుడు స్వగృహం నుండి పురప్రముఖులు, భక్తులు, పురవీధుల గుండా ఆలయానికి చేరుకుని పడిపూజలు చేశారు. రాత్రి ఎనిమిది గంటలకు స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో సినీ, టి.వి. ఆరిస్టులను ఘనంగా సన్మానించి గౌరవ పురస్కారాలు అందజేశారు. సినీ హాస్యనటులు గొల్లపూడి మారుతీరావు, రావికొండలరావు తదితరులను అయ్యన్నపాత్రుడు, ప్రముఖులు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ గత 30 ఏళ్ళుగా అయ్యప్పస్వామి మకరజ్యోతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతీ ఏడాది సినీ, టి.వి. కళాకారులను ఆహ్వానించి ఉచిత రీతిన సన్మానిస్తున్నామన్నారు. భక్తితో పాటు ప్రజలను వినోదపరిచే కార్యక్రమాలు రూపకల్పన చేస్తున్నామన్నారు. సన్మాన గ్రహీతలు గొల్లపూడి మారుతీరావు, రావికొండలరావు మాట్లాడుతూ అన్ని రకాల సమ్మేళనాలతో ఆధ్యాత్మిక సభ నిర్వహించడం అబినందనీయమన్నారు. అన్నివర్గాల వారిని అలరించే విధంగా ఉత్సవాలు జరిగాయన్నారు. అనంతరం టి.వి, సినీ ఆర్టిస్టులు మహేశ్వరి, శే్వత, సారిక, పద్మిని, లక్ష్మీశ్రీ, పొట్టిరాంబాబు, జోగినాయుడు ప్రదర్శించిన హాస్య సన్నివేశాలు ఆహుతులను కడుపుబ్బా నవ్వించాయి. హైదరాబాద్‌కు చెందిన సారిక బొమ్మలా నవ్విస్తూ చేసిన పపెట్ షో అలరించింది. అనంతరం అయ్యప్పస్వామి సేవా సంఘం ప్రతినిధులు అయ్యన్నపాత్రుడు, సన్యాసిపాత్రుడును సత్కరించారు.

వచ్చేనెలలో విశాఖ ఉత్సవ్
* ప్రారంభోత్సవానికి సిఎం, పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి
విశాలాక్షినగర్, జనవరి 15: వచ్చేనెల రెండవ వారంలో విశాఖ ఉత్సవ్ నిర్వహించాలని రాష్ట్ర పెట్టుబడులు, వౌలిక వసతులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ప్రభుత్వ అతిథిగృహంలో జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి మంత్రి గంటా శ్రీనివాసరావుతో సమావేశమయ్యారు. వచ్చేనెలలో విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్ర గిరిజన శాఖా మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిని సంప్రదించి ఉత్సవ తేదీలు ఖరారు చేస్తామని వెల్లడించారు. అనేక కారణాల వలన విశాఖ ఉత్సవ్ చాలాసార్లు వాయిదాపడడంపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తపరిచారు. ఈసారి విశాఖ ఉత్సవ్ వినూత్నంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. విశాఖ ఉత్సవ్‌ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభిస్తారన్నారు. కేంద్ర పర్యాటకశాఖా మంత్రి చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. దీని ఏర్పాట్లపై తగిన సన్నాహాలు చేయాలని జిల్లా కలెక్టర్ శేషాద్రికి సూచించారు. ముందుగా ప్రచార కార్యక్రమాలను ప్రారంభించాలని అన్నారు. విశాఖ ఉత్సవ్‌ను విజయవంతం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందాలని మంత్రి గంటా శ్రీనివాసరావు కోరారు.

కుక్కల దాడిలో మేకలు మృతి
సీలేరు, జనవరి 15: కుక్కలు దాడి చేసి మూడు మేకలను చంపేశాయి. తరచూ సీలేరులో కుక్కల సంచారం ఎక్కువై మేకలను, వాటితోపాటు మనుష్యులపై కూడా దాడి చేస్తున్నాయి. తాజాగా మంగళవారం ఉదయం మూడు మేకలపై సుమారు 10 కుక్కలు దాడిచేసి తినేశాయి. వాటి కళేబరాలు మినహా మొత్తం కుక్కల తినేశాయి. దీంతో యజమాని మేకలు కోల్పోవడంతో గగ్గోలు పెట్టాడు. కుక్కలను నివారించాలని ఎన్నిసార్లు సీలేరు ప్రాంత ప్రజలు పంచాయతీ అధికారులకు విన్నవించినప్పటికీ నివారణ చర్యలు చేపట్టడం లేదని మేకల యజమాని రామ్మూర్తి వాపోయాడు. తాము మేకలను విక్రయించి జీవనోపాధి సాగిస్తున్నామని అన్నారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి కుక్కలను నివారించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

* నగర అధ్యక్షునిగా వాసుపల్లి * రూరల్ జిల్లా అధ్యక్షునిగా రత్నాకర్ * రాష్ట్ర పార్టీలో పీలాకు చోటు * పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జిగా గణబాబు * గాజువాక, పాడేరుపై నిర్ణయం వాయిదా
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>