Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

33 లక్షల పైచిలుకు...

$
0
0

కాకినాడ, జనవరి 15: జిల్లాలో 33 లక్షలకు పైగా ఓటర్లు నమోదు అయ్యారు. ఓటర్లుగా నమోదైన వారి తుది జాబితాను జిల్లా కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ మంగళవారం రాత్రి విడుదల చేశారు. తుది జాబితాలో 33 లక్షల 75 వేల 189 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 16 లక్షల 83 వేల 963 మంది పురుషులు కాగా, 16 లక్షల 91 వేల 132 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గాల వారీగా ఓటర్ల వివరాల ప్రకారం తుని నియోజకవర్గంలో 81 వేల ఒకరు పురుష ఓటర్లు ఉండగా, 85 వేల 282 మహిళా ఓటర్లు ఉన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో 81 వేల 237 మంది పురుష అభ్యర్థులు ఓటర్లుగా నమోదు కాగా 82 వేల 498 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. పిఠాపురం నియోజకవర్గంలో 95 వేల 631 మంది పురుష ఓటర్లు ఉండగా, 92 వేల 979 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో 96 వేల 63 మంది పురుష ఓటర్లు ఉండగా 94 వేల 87 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదే విధంగా పెద్దాపురం నియోజకవర్గంలో 82 వేల 673 మంది పురుష ఓటర్లు నమోదు కాగా 83 వేల 709 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. అనపర్తి నియోజకవర్గంలో 92 వేల 914 మంది పురుష ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 93 వేల 727 మంది ఉన్నారు. కాకినాడ సిటీ నియోజకవర్గంలో 85 వేల 751మంది పురుష ఓటర్లు ఉండగా, 88 వేల 954 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రామచంద్రాపురం నియోజకవర్గంలో పురుష ఓటర్లు 91 వేల 97 మంది ఉండగా, మహిళా ఓటర్లు 89 వేల 767 మంది ఉన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గంలో 97 వేల 698 మంది పురుష ఓటర్లు, 94 వేల 932 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అమలాపురం నియోజకవర్గంలో 88 వేల 15 మంది పురుష ఓటర్లు ఉండగా, 85 వేల 332 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అదే విధంగా రాజోలు నియోజకవర్గంలో 82 వేల 71 మంది పురుష ఓటర్లు నమోదు కాగా, 80 వేల 984 మంది మహిళా ఓటర్లు నమోదయ్యారు. పి గన్నవరం నియోజకవర్గంలో 88 వేల 364 మంది పురుష ఓటర్లు ఉండగా 84 వేల 428 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కొత్తపేట నియోజకవర్గంలో లక్ష 2 వేల 172 మంది పురుష ఓటర్లు ఉండగా, లక్ష ఒక వెయ్యి 976 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండపేట నియోజకవర్గంలో 94 వేల 883 మంది పురుష ఓటర్లు ఉండగా 98 వేల 214 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాజానగరం నియోజకవర్గంలో 83 వేల 787 మంది పురుష ఓటర్లు నమోదై ఉండగా 84 వేల 855 మంది మహిళా ఓటర్లు నమోదై ఉన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో 87 వేల 398 మంది పురుష ఓటర్లు ఉండగా, 91 వేల 598 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 95 వేల 977 మంది పురుష ఓటర్లు ఉండగా 98 వేల 547 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో 88 వేల 247 మంది పురుష ఓటర్లు ఉండగా, 89 వేల 697 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో 64 వేల 984 మంది పురుష ఓటర్లు ఉండగా 69 వేల 566 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరితో పాటు మరో 94 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. వీరందరితో కలిపి మొత్తం జిల్లాలో 33 లక్షల 75 వేల 189 మంది ఓటర్లుగా నమోదైనట్లు కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్ వెల్లడించారు.

దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి బ్రాంచి మేనేజర్ రుద్రయ్య ఆకస్మిక మృతి
కాజులూరు, జనవరి 15: దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి రాజమండ్రి యూనిట్ బ్రాంచ్ మేనేజర్ కొండమూరి రుద్రయ్య (57) మంగళవారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తన స్వగ్రామమైన కాజులూరు మండలం తిప్పరాజుపాలెం వెళ్లిన ఆయన సోమవారం సాయంత్రం వరకు తన తల్లిదండ్రులు, బంధువులతో సంతోషంగా గడిపారు. మంగళవారం తెల్లవారుజామున ఆయనకు తీవ్ర గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వెంటనే కాకినాడ తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతిచెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఆయనకు తల్లిదండ్రులు, భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికా నుండి రావలసి ఉండటంతో భౌతికకాయాన్ని స్వగ్రామమైన తిప్పరాజుపాలెంలో ఉంచారు. 1984లో దక్కన్‌క్రానికల్ సంస్థలో సేల్స్ ఇన్‌స్పెక్టర్‌గా ప్రవేశించిన రుద్రయ్య పదోన్నతులు పొంది, ప్రస్తుతం రాజమండ్రి యూనిట్ బ్రాంచ్ మేనేజర్‌గా కొనసాగుతున్నారు. దక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి విశాఖపట్నం రీజనల్ మేనేజర్ సుధాకరబాబు, రాజమండ్రి బ్రాంచి ఎఒ పరందామయ్య, అడ్వర్టయిజ్‌మెంట్స్ మేనేజర్ ఉమారాజు, మార్కెటింగ్ ఇన్‌ఛార్జి సుధీర్, ఇతర సిబ్బంది, ఏజెంట్లు తిప్పరాజుపాలెం చేరుకుని భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.

కోడి పందాల సీమ!
చేతులు మారిన కోట్లు - అండగా నిలిచిన రాజకీయ బలం - ప్రభల తీర్థంలో అశ్లీల నృత్యాలు
ఆంధ్రభూమి బ్యూరో
అమలాపురం, జనవరి 15: సంక్రాంతి సంబరాలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను పాతరేసాయి. నాయకులు, అధికారులు, సామాన్యులు అన్న బేధం లేకుండా అసభ్యత, అశ్లీతకు పెద్దపీట వేస్తూ సంక్రాంతి ఉత్సవాలను నవ్వుల పాల్జేసారు. కోనసీమలో గత మూడు రోజులుగా కోడిపందాల సీమగా మారిపోయింది. కోడిపందాలకు తోడు భారీ పేకాటలు, గుండాట తదితర జూదాలు విచ్చలవిడిగా సాగాయి. మంత్రి పినిపే విశ్వరూప్ ప్రాతినిధ్యం వహిస్తున్న అమలాపురం నియోజకవర్గంలో కోడిపందాలు, గుండాట, పేకాటలు విచ్చలవిడిగా జరిగాయి. అల్లవరం మండలం గోడి, గోడిలంక, అమలాపురం మండలం ఇందుపల్లిలో భారీ షామియానాలు ఏర్పాటుచేసి మరీ కోడిపందాలు నిర్వహించారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐ పోలవరం మండలం ఎదుర్లంకలో జరిగిన కోడి పందాలు శాంతిభద్రతలను అవహేళన చేసినట్లు అక్కడ జరిగిన సంఘటనలు రుజువు చేశాయి. గుండాట, పేకాట శిబిరాలు ఏర్పాటుచేసుకునేందుకే వేలం పాటలు నిర్వహించి లక్షల్లో నిర్వాహకులు సొమ్ములు వసూలుచేసినట్లు పలువురు బాహాటంగా ఆరోపిస్తున్నారు. వందలాది కార్లు జిల్లా నలుమూలల నుండి తరలివచ్చి ఎదుర్లంక సమీపంలోని తోటల్లో ట్రాఫిక్ సమస్యను సృష్టించాయి. ఇంత జరిగినా పోలీసులెవ్వరూ ఆ చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చే సాహసమే చేయలేదంటే పొలిటికల్ పవర్ పనిచేసిన తీరును తేటతెల్లం చేస్తోంది. పేకాట, గుండాట, కోడిపందాలు వద్ద గొడవలు జరగకుండా కట్టడి చేసేందుకు ఎదుర్లంకకు చెందిన కొందరు బ్రోకర్లు ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి ఐదు నుండి పది శాతం వాటా ఇవ్వడంతో ఆ వర్గానికి చెందిన వారంతా గొడవలు జరగకుండా అన్నీ తామై వ్యవహరించి వ్యవహారాన్ని చక్కబెట్టారన్న విమర్శలు అనేకం. ఎదుర్లంకలో కొందరు బ్రోకర్లు కోడిపందాలను ఆసరాగా చేసుకుని అధికారులకు మామూళ్ళు ఇవ్వాలంటూ పందెగాళ్ళను నిలువుదోపిడీ చేశారన్న ఆరోపణలు లేకపోలేదు.
డి గన్నవరం మండలం మానేపల్లిలో మంగళవారం ప్రభల తీర్థం సందర్భంగా ఏర్పాటుచేసిన రికార్డింగ్ డ్యాన్స్‌లు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేశాయన్న ఆరోపణలున్నాయి. పట్టపగలే నడిరోడ్డుపై డ్యాన్సర్లు విచ్ఛలవిడిగా వ్యవహరించి జుగుప్సాకరంగా డ్యాన్స్‌లు చేసిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. డ్యాన్స్‌లు జరిగిన ప్రదేశంలో రాజకీయ నాయకులు దగ్గరుండి ఆ డ్యాన్స్‌లకు చప్పట్లు కొట్టడం వారితో కలిసి డ్యాన్స్‌లు వేసిన తీరు నవ్వుల పాల్జేసింది. సమీపంలోనే పోలీసులున్నప్పటికీ ప్రేక్షకపాత్ర వహించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామ గ్రామాన కోడిపందాలు విచ్ఛలవిడిగా జరిగినా కనీసం ఒక్క కోడిపుంజును కూడా స్వాధీనం చేసుకున్న పాపాన పోలీసులు పోలేదని పలువురు పోలీసుల తీరును దుయ్యబడుతున్నారు. గతంలో ఎన్నడూలేనంతగా అసభ్యత, అశ్లీతకు పెద్దపీట వేసిన కోనసీమ సంక్రాంతి సంబరాలు రానున్న కాలంలో మరింత దిగజారే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆందోళన చెందుతున్నారు.

వేదాలు ఘోషించిన
గోదావరి తీరం
రాజమండ్రి, జనవరి 15: పవిత్ర గోదావరితీరంలో మంగళవారం వేదఘోష మార్మోగింది. టిటిడి ఆధ్వర్యంలో మంగళవారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో శ్రీనివాస వేదశాస్త్ర విద్వత్ సదస్సు జరిగింది. ఈకార్యక్రమానికి విష్ణుబొట్ల అధ్యక్షత వహించారు. యజుర్వేద, ఋగ్వేదం, అధర్వణవేద, సామవేదంపై సుమారు 1500 మంది పండితులు చర్చించారు. చతుర్వేద పారాయణం చేశారు. ఈసందర్భంగా సదస్సుకు అధ్యక్షత వహించిన విష్ణుబొట్ల సుబ్రహ్మణ్య సలక్షణ ఘనపాఠీ మాట్లాడుతూ వేద పారాయణం ద్వారా కామ, క్రోధాలను జయించవచ్చన్నారు. వేదానుసారం పాలించిన రాముడు, పాండవులు ఆదర్శనీయులన్నారు. టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గోదావరితీరంలో వేదఘోష జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అంతరించిపోతున్న వేదాలను భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇందుకోసం టిటిడి దేశవ్యాప్తంగా వేదపారాయణ పథకాన్ని అమలు చేస్తోందన్నారు. వేదపండితుల భుక్తికి లోటులేని విధంగా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈకార్యక్రమంలో టిటిడి వేదపాఠశాల ప్రిన్సిపాల్ కెఎస్‌ఎస్ అవధాని, వేదపారాయణ స్కీమ్ ప్రాజెక్టు ఆఫీసర్ విభీషణశర్మ, వేద విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కాగా, ఉదయం వేదపండితులు టిటిడి కళ్యాణమండపం నుంచి ప్రదర్శనగా ఆర్ట్స్ కళాశాలకు చేరుకున్నారు. తిరుమల శ్రీనివాసుని నమూనా విగ్రహాలను ఈసందర్భంగా ఆర్ట్స్ కళాశాలలో ప్రతిష్ఠించి, టిటిడి అర్చకులు పూజలు చేశారు. ఉదయం శ్రీవారి పూజ, గోపూజ జరిపారు. ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తదితరులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేదవిద్వత్ సదస్సుకు హాజరయ్యారు.
వేద పారాయణంతో సుభిక్షం: చాగంటి
వేదం భగవత్ స్వరూపమని, వేద పారాయణం ద్వారా ఆప్రాంతంలో సుభిక్షం నెలకొంటుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం ఆర్ట్స్ కళాశాలలో వేద విద్వత్‌సదస్సును పురస్కరించుకుని చాగంటి ప్రవచనం చేశారు. వేదపారాయణం ద్వారా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. భగవంతుడు ఎప్పుడు అవతరించాడో అప్పుడే వేదాలు ఏర్పడ్డాయన్నారు. గోవులు, బ్రాహ్మణులు, వేదాలను గౌరవించిన వారికి ఎలాంటి లోటు ఉండదన్నారు. రామాయణం కూడా వేదమేనన్నారు. వేదమంత్రాల ద్వారానే దేవతానుగ్రహం కలుగుతుందన్నారు. యజ్ఞం జరిగే ప్రదేశానికి దేవతలు చేరుకుంటారని పేర్కొన్నారు. సనాతన ధర్మం అగ్ని, వేదంలోనే ఉన్నాయన్నారు. వేద, ధర్మానుసారం నడుచుకుంటే ఎలాంటి కష్టాలు ఉండవని పేర్కొన్నారు. ధర్మంతో ముడిపడిన అర్థ,కామాలతో మోక్షం లభిస్తుందని ముక్తాయింపునిచ్చారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రౌతు ఆయనను ఘనంగా సత్కరించారు.

ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు
రావులపాలెం, జనవరి 15: క్రీడలతోనే దేశానికి ఎనలేని ఖ్యాతి లభిస్తుందని మాజీ మంత్రి, టిడిపి నేత గొల్లపల్లి సూర్యారావు అన్నారు. రావులపాలెం సిఆర్‌సిలోని తాడి తాతారావు ఇండోర్ స్టేడియంలో సంక్రాంతిని పురస్కరించుకుని గత మూడు రోజులుగా సిఆర్‌సి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉభయ గోదావరి జిల్లాల స్థాయి పురుషుల నాన్ మెడలిస్ట్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు మంగళవారం సాయంత్రం ముగిసాయి. మూడు రోజులుగా ఈ పోటీల్లో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన 120 జట్లు పాల్గొనగా హోరాహోరీగా సాగిన ఈ పోటీల్లో కాకినాడకు చెందిన ఎస్‌వి కృష్ణారెడ్డి, పివివి కిరణ్‌లు విజేతలుగా నిలవగా రావులపాలెంకు చెందిన మల్లిడి వీర్రెడ్డి, బివిఎస్ సుబ్రహ్మణ్యంలు ద్వితీయ స్థానం సాధించారు. వీరిలో మల్లిడి వీర్రెడ్డి సిఆర్‌సి స్పోర్ట్స్ డైరెక్టర్ కావడం విశేషం. అలాగే పిఠాపురంనకు చెందిన డిజి ప్రతాప్ (హెటేరో), ఎస్ రామ్మోహనరావు (కెఎంఓసి)లు తృతీయ స్థానాన్ని, రాజమండ్రికి చెందిన కె రామకృష్ణ, ఎస్ రాజులు నాల్గవ స్థానాన్ని సాధించారు. అలాగే ఎన్‌వి రాఘవరెడ్డి బెస్ట్ ఫ్లేయర్‌గా ఎంపికయ్యారు. మంగళవారం రాత్రి సిఆర్‌సి కార్యదర్శి కర్రి నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహుమతి ప్రధానోత్సవ సభలో విజేతలకు మాజీ మంత్రి గొల్లపల్లి, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి తదితరులు చేతుల మీదుగా బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా గొల్లపల్లి మాట్లాడుతూ రావులపాలెం పేరు చెబితే గతంలో మాజీ సర్పంచ్ సఖినేటి వాకులరాజు పేరును రాష్ట్రంలో ప్రతీచోటా ప్రస్తావించే వారని, నేడు సిఆర్‌సిని గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఆ విధంగా ఈ సంస్థ క్రీడ, సాంస్కృతిక, సేవారంగాల్లో విశేష కృషిచేస్తుందని ఆయన అభినందించారు.
మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ మనదేశం క్రీడల్లో ఏ స్థాయిలో ఉందో ఇటీవల జరిగిన ఒలింపిక్స్ నిరూపించాయని, వచ్చే ఒలింపిక్స్ అయినా మనదేశం మెరుగైన స్థితికి రావాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడాపోటీలు ప్రతిభగల క్రీడాకారులను వెలికితీస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ఆకుల రామకృష్ణ, సిఆర్‌సి అధ్యక్షుడు మల్లిడి కనికిరెడ్డి, కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సిఆర్‌సి ఉపాధ్యక్షుడు నందం సత్యనారాయణ, స్పోర్ట్స్ డైరెక్టర్ కర్రి వీర్రెడ్డి, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిహెచ్ గోవిందరాజు, ఎన్‌ఎఫ్‌సిఎల్ జనరల్ మేనేజర్ ఎస్‌ఎం దాసు, మాజీ సర్పంచ్ గొలుగూరి వెంకటరెడ్డి, టిఎస్‌ఎన్‌వి రాష్ట్ర కార్యదర్శి గొల్లపల్లి శ్రీ్ధర్, స్పోర్ట్స్ కమిటీ సభ్యులు తాడి శ్రీనివాసరెడ్డి, కర్రి అశోక్‌రెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, చిన్నం చంద్రారెడ్డి, కోట హరినాధ్ కృష్ణమూర్తి, పడాల తాతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎంపి హర్షకుమార్ ఆట
ఇదిలావుండగా సి ఆర్‌సిలో జరుగుతున్న బ్యాడ్మింటన్ పోటీలను అమలాపురం ఎంపి జివి హర్షకుమార్ సందర్శించారు. పోటీలను తిలకించిన ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. అంతేకాకుండా కాసేపు సిఆర్‌సి సభ్యులు, మాజీ సర్పంచ్ గొలుగూరి వెంకటరెడ్డితో కలిసి షటిల్ ఆడి అలరించారు.

బ్రహ్మజ్ఞానమే ముక్తికి మార్గం
శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి
రాజమండ్రి, జనవరి 15: బ్రహ్మజ్ఞానమే ముక్తికి మార్గమని శృంగేరీ పీఠాధిపతి జగద్గురు భారతీతీర్థ మహాస్వామి ప్రవచించారు. వేద అధ్యయనాల ద్వారా బ్రహ్మజ్ఞానం పొందవచ్చన్నారు. టిటిడి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక ఆర్ట్స్ కళాశాలలో జరిగిన శాస్తగ్రోష్ఠి అనంతరం పండిత సత్కారం చేసి, భక్తులను ఉద్దేశించి ఆయన అభిభాషణ చేశారు. వేదాలు సనాతన ధర్మాలకు మూలస్తంభాల వంటివన్నారు. సనాతన ధర్మాలను తెలుసుకోవాలంటే వేదాలను అధ్యయనం చేయాలన్నారు. వేదాలు భగవంతుని నిశ్వాసాల వంటివని అభివర్ణించారు. దుఃఖ నివారణకు వేదాలు దోహదం చేస్తాయన్నారు. నేటి సమాజంలో దుఃఖాలులేని వారు లేరని, అయితే దుఃఖాల శాశ్వత నివారణకు జ్ఞానం ఒక్కటే మార్గమన్నారు. జ్ఞానులను నిందించరాదని హితవు పలికారు. జ్ఞానం ఒక్కటే కర్మఫలాలను విముక్తిని కల్పిస్తాయన్నారు. పరులను నిందించడం ద్వారా వారి ఫలాలు దఖలు పడతాయన్నారు. అనేక జన్మల తరువాత లభించేదే పుణ్యఫలమని, ఇందుకు ఎంతో చిత్తశుద్ధి, కార్యసిద్ధి అవసరమని పేర్కొన్నారు. వేదాలు, బ్రహ్మజ్ఞానాన్ని పఠించేందుకు తగిన యోగ్యత కావాలన్నారు. తగిన ప్రయత్నం కూడా చేయాల్సి ఉంటుందన్నారు. ఈసందర్భంగా ఆయన టిటిడి వేదవిద్వత్ సదస్సును జయప్రదం చేసేందుకు కృషిచేసిన టిటిడి ఉద్యోగులను, ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యంలను ఆశీర్వదించారు.

రాష్ట్రాన్ని విభజిస్తే ప్రజలు సహించరు
-పిసిసి క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కంతేటి
మలికిపురం, జనవరి 15: ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణను విభజిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ క్రమశిక్షణ సంఘం ఛైర్మన్, మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణరాజు అన్నారు. మంగళవారం లక్కవరంలోని రుద్రరాజు గోపాలకృష్ణంరాజు ఇంటికి వచ్చిన ఆయన తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి శైలాజానాధ్ నేతృత్వంలోని బృందం ఢిల్లీలోని పెద్దలకు సమైక్యతావాదాన్ని బలంగా వినిపించామని, తెలంగాణను ప్రత్యేకంగా రాష్ట్రంగా విభజిస్తే భావితరాలు వారు క్షమించరని ఆయన అన్నారు. సమైక్యవాదానికి మద్ధతుగా ప్రస్తుతం వున్న ఆంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రత్యేక తెలంగాణాతోనే కాంగ్రెస్‌కు మనుగడ ఉంటుందని అనుకోవడం సరికాదన్నారు. కేంద్రంలోని చిదంబరంకు సమైక్యవాదంపై గట్టిగా చెప్పగల నాయకుడు కరువయ్యాడన్నారు. సమైక్యత ద్వారానే రాష్ట్భ్రావృద్ధి సాధ్యపడుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారాన్ని నిర్వహించిందని, కొంతమేర అసంతృప్తి ఉండటం సహజమేనని ఆయన అన్నారు. ఈ విలేఖర్ల సమావేశంలో రుద్రరాజు గోపాలకృష్ణంరాజు, లక్కవరం పార్టీ శాఖ అధ్యక్షుడు బోనం సాయిరామ్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు బోనం దొరబాబు, బి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఎదుర్లంకలో జూద జాతర
ఐ పోలవరం, జనవరి 15: సంక్రాంతిని పురస్కరించుకుని ఐ పోలవరం మండలం ఎదుర్లంకలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కోడి పందాలు నిర్వహించారు. పాతయింజరం పోలీస్టేషన్‌కు కూతవేటు దూరంలో నిర్వహించిన ఈ కోడి పందాల్లో సుమారు 300 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. నిర్వాహకులు పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన సుమారు వెయ్యి మందికి ఏర్పాటుచేసిన మెనూకే రోజువారీ లక్షా 50 వేల రూపాయలు ఖర్చయినట్లు తెలుస్తోంది. భోగి రోజైన ఆదివారం రాత్రి 27 మందితో ఏర్పాటుచేసిన ఫూల్ గేమ్ పేకాటలో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ 11 లక్షలు విలువచేసే హోండా వెర్నా కార్ మొదటి బహుమతిగాను, రెండవ బహుమతిగా రూ 6 లక్షలు నగదు బహుమతి అందజేసారంటే ఇక్కడ జూదం ఏ తరహాలో నిర్వహించారో తేటతెల్లమవుతోంది. వరుసగా మూడు రోజులుగా ఇదే విధంగా పేకాటలు, కోడిపందాలు, గుండాటలు సాగుతున్నా పోలీసులు పట్టుకునేందుకు సాహసం చేయలేకపోయారంటే రాజకీయ నాయకులు ఒత్తిడి ఏ మేరకు ఉందో అర్ధమవుతుందని పలువురు విమర్శిస్తున్నారు. గుండాట జూదం నిర్వహించిన వారు రోజుకు రూ 15 లక్షలు చొప్పున కోడి పందాల నిర్వాహకులకు ముట్టజెప్పారు. కోడిపందాలు ద్వారా రోజుకు మరో రూ 5 లక్షలు సమకూరినట్లు సమాచారం. కోడి పందాలు నిర్వహించిన ప్రాంతంలో మంచినీళ్ళ ప్యాకెట్లు అమ్మే వారి నుండి బిర్యానీ ప్యాకెట్లు అమ్ముకునే వారి వరకు ఒక్కొక్కరి నుండి రూ 500లు నుండి 15 వేల వరకు రోజువారీగా వసూళ్ళు చేసారు. మంచినీళ్ళ ప్యాకెట్ రూపాయి నుండి రూ 2 కు, బిర్యానీ ప్యాకెట్ 100 నుండి రూ 200లు ధర పలకడంతో జూదరులు నిలువుదోపిడీకి గురయ్యారు. భోజన ప్రియులు కోస మాంసం కోసం ఎగబడటంతో రూ 300లు కూడా విలువచేయని కోడిపుంజులకు కత్తితో గాట్లు పెట్టి కోసలుగా చెప్పి వేలాది రూపాయలుగా విక్రయించి కొంతమంది దళారులు సొమ్ము చేసుకున్నారు. ఇక కేశనకుర్రు, పెదమడి, గుత్తెనదీవి గ్రామాల్లో కూడా కోడిపందాలు, గుండాటలకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండటంతో ఐ పోలవరం మండలంలో పందెంరాయుళ్ళు బరితెగించి నిస్సిగ్గుగా వ్యవహరించారనే చెప్పవచ్చు.
మూడు రోజుల పాటు అత్యంత రసకందాయంగా ఐలాండ్‌లో భారీ స్థాయిలో నిర్వహించిన కోడిపందాలు ముగింపు రోజైన మంగళవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య అర్ధాంతరంగా ముగిసాయి. ఎదుర్లంకలో గుండాట జూదం వద్ద ఏర్పడిన స్వల్ప వివాదం ఘర్షణకు దారితీయడంతో నిర్వాహకులకు, జూదరులకు మధ్య ఆటలో తేడా రావడంతో ఇరువర్గాలుగా విడిపోయి కొట్లాటకు దిగారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయానక పరిస్థితులు నెలకొనడంతో కోడిపందాల నిర్వాహకులు తలలు పట్టుకున్నారు. జూదాలు నిర్వహించిన ప్రాంగణంలో పరిస్థితి అర్ధంకాక కోడిపందాలు, గుండాటలు మూసివేయాలని, పోలీసులు వస్తున్నారంటూ కోడిపందాల నిర్వాహకులు మైక్‌లో అనౌన్స్ చేయడంతో జూదరులు ఎటు వెళ్ళాలో అర్ధంకాని పరిస్థితి నెలకొంది. వేలాదిగా తరలివచ్చిన జూదరులు వరిచేలు, రొయ్యల చెరువులు, బురద కాలువల వెంట పరుగులంఖించుకున్నారు. వందల సంఖ్యలో వచ్చిన కార్లు, బైక్‌లు వదిలి సైతం పరారయ్యారు. కొద్దిసేపటికి తేరుకున్న నిర్వాహకులు గుండాట జూదగాళ్ళను ఒక షెడ్‌లోకి తీసుకెళ్ళి దాచి పెట్టడంతో ఘర్షణపడ్డ యువకులు వెళ్ళిన తరువాత వీరిని బయటకు తెచ్చి ఏవిధమైన కొట్లాట జరగకుండా ఏర్పాట్లు గావించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉండటంతో మఫ్టీలో వున్న పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

రావులపాలెం, జనవరి 15: సంక్రాంతి సందర్భంగా గత మూడు రోజులుగా మండలంలోని లంకల్లో కోడిపందాలు జోరుగా సాగాయి. ఒక్క కోడి పందాలే కాకుండా గుండాట, పేకాటలను అడ్డూ అదుపూ లేకుండా సాగించడంతో లక్షలాది రూపాయలు చేతులు మారాయి. ఇంత జరిగినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించడం పలు అనుమానాలకు తావిచ్చింది. మండల పరిధిలోని లక్ష్మీపోలవరం శివారు వశిష్ట గోదావరి లంకలో దర్జాగా ఫ్లెక్సీలు కట్టి మరీ కోడిపందాలు నిర్వహించడం అధికారులు తీరుపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఒక మాఫియాగా కొంతమంది వ్యక్తులు ఏర్పడి ఈ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల ఇదే మాఫియా కోడిపందాలను జోరుగా సాగించినట్లు తెలియవచ్చింది. పోలీసులు ఈ పందాలవైపు కనె్నత్తి చూడకపోవడం వెనుక మర్మమేమిటన్నది బహిరంగ రహస్యమే. సాక్షాత్తూ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వచ్చి వెళ్ళిన తరువాతే ఇంత దర్జాగా పందాలు సాగడం చూస్తే అనధికారికంగా ప్రభుత్వమే ఈ పందాలకు లోపాయికారిగా అనుమతినిచ్చిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష్మీపోలవరం లంకలో మొదటి రోజు కోడిపందాల సమయంలో పలు ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీంతో రాత్రి వరకు పందాలు జరిపిన నిర్వాహకులు మరుసటి రోజుకు భిచాన ఎత్తేసారు. అయితే ప్రక్కనే వున్న పొడగట్లపల్లిలోని ఒక రహస్య ప్రదేశంలో ఈ పందాలు సాగించినట్లు తెలియవచ్చింది. ఏదేమైనప్పటికీ గతంలో ఎన్నడూ లేని విధంగా రావులపాలెం మండలంలో కోడిపందాలు ఈ సంక్రాంతికి జోరుగా సాగాయి.
ఉప్పలగుప్తం మండలంలో...
ఉప్పలగుప్తం, జనవరి 15: సంక్రాంతి సందర్భంగా మండలంలో కోడిపందాలు, గుండాటలు విచ్చలవిడిగా కొనసాగాయి. మండలంలోని చినగాడవిల్లి, గొల్లవిల్లి, గోపవరం, ఎన్ కొత్తపల్లి గ్రామాలలో భారీ స్థాయిలో పందాలు నిర్వహించగా పోలీసులు అటువైపు కనె్నత్తయినా చూడలేదు. స్పెషల్ పోలీసుల బృందం ఇటువైపుగా హారన్ కొడుతూ వెళ్ళడంతో మారుమూల గ్రామాలలో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే పోలీసులు జీపులో రోడ్ మార్గం గుండా హడావుడి చేసారే తప్ప జీపుదిగి మారుమూల గ్రామాలకు ముఖ్యంగా పందాలు నిర్వహించే చోటుకు వెళ్ళకపోవడం గమనార్హం. ఈవిషయమై స్థానిక ఎస్‌ఐ ను సంప్రదించగా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఏమిచేయలేక పోతున్నట్టు వివరించారు. ఇదిలా వుండగా మద్యం అమ్మకాలు కూడా విచ్చలవిడిగా జరిగాయి. పందాలు నిర్వహించే చోటునే బారులు పెట్టారు. మండలంలో ఎన్నడూ లేనివిధంగా మద్యం అమ్మకాలు జరిగాయి. గొల్లవిల్లిలో స్మశానం వద్ద కోడిపందాలతో పాటు గుండాటలు నిర్వహించడంతో మద్యం అమ్మకం విచ్చలవిడిగా సాగింది. మద్యంప్రియులు మద్యం సేవించి రోడ్‌పైనే పడి దొర్లడం పచ్చని పొలాల్లో పడి మత్తుదిగే వరకు వంటిపై బట్టలు కూడా కానకుండా జల్సా చేసారు. ఏదిఏమైనా రాజకీయ నాయకుల వత్తిళ్ళతో స్వేచ్చగా జరిగిన గుండాటలు, కోడిపందాలు మాత్రం కొందరి జేబులు నింపగా కొంతమందికి అప్పులు మిగిల్చాయి.

భార్యను వేధిస్తున్న కేసులో కొవ్వూరు ఎమ్మెల్యే అల్లుడు అరెస్టు
రాజమండ్రి, జనవరి 15: కొవ్వూరు ఎమ్మెల్యే టివి రామారావు అల్లుడు, రాజమండ్రిలో ఫిజియోథెరిపిస్టుగా పనిచేస్తున్న ఎం సునీల్‌కుమార్‌ను సోమవారం ప్రకాష్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. తన భర్త సునీల్‌కుమార్ వేధింపులకు గురిచేస్తున్నాడని రామారావు కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. అయితే రిమాండ్ ఖైదీగా జైలుకు వెళ్లిన సునీల్‌కుమార్ వద్ద సెల్‌ఫోన్ లభించినట్లు డిఐజి నరసింహం తెలిపారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతుండగా గమనించి దాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. సునీల్‌కుమార్‌ను జైలులోని క్రమశిక్షణా(కోరంటైల్) సెల్‌కు పంపినట్లు డిఐజి తెలిపారు.

జిల్లాలో ఓటర్ల సంఖ్య - తుది జాబితా విడుదల చేసిన కలెక్టర్ నీతూకుమారి ప్రసాద్
english title: 
eg

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>