Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జిల్లాలో భారీగా కోడి పందాలు

$
0
0

మచిలీపట్నం, జనవరి 15: సంక్రాంతి పండగ సందర్భంగా మూడు రోజులుగా జిల్లాలో భారీ ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. కోట్లాది రూపాయలు చేతులు మారాయి. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ పందాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కైకలూరు శాసనసభ్యుడు జయమంగళ వెంకటరమణ, తెలుగుదేశం నాయకుడు మాగంటి బాబు లాంటి ముఖ్యులు కోడి పందాల బరులను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించటం విశేషం. ఊరి బయట పొలాల్లో నిర్వహించిన పందాల్లో వేలాదిమంది పాల్గొన్నారు. తిరునాళ్ళను తలపించే విధంగా కోలాహలంగా జరిగాయి. చాట్రాయి మండలం జనార్ధనవరంతో పాటు మరికొన్ని చోట్ల పేకాటలు ఒక మాదిరిగా జరిగాయి. కోడి పందాల శిబిరాల వద్ద మద్యం, ఇతర తినుబండారాల అమ్మకాలు జోరుగా సాగా యి. రూపాయి ఖరీదు చేసే వాటర్ ప్యాకెట్‌ను ఐదు రూపాయలు చొప్పున అమ్మకాలు చేసి జూదగాళ్ళ జేబుకు చిల్లుపెట్టారు. మద్యం ధరను వంద శాతం పెంచి బాహాటంగా అమ్మకాలు చేశారు. ఇక తినుబండారాలు కూడా విపరీతంగా గిరాకీ పలికాయి. కొన్నిచోట్ల లక్షల్లో బడా ఆసాములు పందాలకు దిగారు. పై నుంచి వచ్చిన ఒత్తిళ్ళ మేరకు పోలీసులు కోడి పందాల బరుల వైపు చూడలేదు. దీనితో నిర్వాహకులు యథేచ్ఛగా బరులు నిర్వహించారు. పందాలు తిలకించటానికి చుట్టుపక్కల గ్రామస్థులు భారీ సంఖ్యలో చేరటంతో తిరునాళ్ళ వాతావరణం కనిపించింది. రాత్రుళ్ళు జనరేటర్లు ఏర్పాటు చేసి పందెగాళ్ళకు అసౌకర్యం లేకుండా చేశారు. ఇక ఖరీదుగల వాహనాలు బరుల చుట్టూ గిరికీలు కొట్టాయి. కైకలూరు, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, పెనమలూరు, మైలవరం, నూజివీడు, తిరువూరు, నందిగామ, జగ్గయ్యపేట తదితర నియోజకవర్గాల్లో కోడి పందాల శిబిరాలు యథేచ్ఛగా జరిగాయి. పేకాటకు పోలీసులు ససేమిరా అంగీకరించకపోవటంతో కొంతమేర అదుపులోకి వచ్చింది. కొన్నిచోట్ల పేకాట శిబిరాలు కూడా ఒక మోస్తరుగా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీల నాయకులు కాయ్ రాజా కాయ్ అంటూ పందాల్లో పాల్గొన్నారు. మొత్తం మీద కోట్లాది రూపాయలు చేతులు మారినా, వేలాది మంది పందాల్లో పాల్గొన్నా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మంగళవారంతో కోడి పందాల బరులకు స్వస్తి పలికారు.

హైదరాబాద్‌కు నేడు ప్రత్యేక రైలు
మచిలీపట్నం (కోనేరుసెంటరు), జనవరి 15: సంక్రాంతి పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని మచిలీపట్నం నుండి హైదరాబాద్ (లింగంపల్లి) వరకు ప్రయాణీకుల సౌకర్యార్థం బుధవారం రాత్రి 11 గంటలకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ప్రయాణీకుల సంఘం అధ్యక్షుడు కూరాళ్ళ రామచంద్రరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని స్టేషన్ మేనేజర్ రమణరావు కోరారు.

బైక్‌తో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఇద్దరి మృతి
ఉయ్యూరు, జనవరి 15: బైక్‌పై వేగంగా ప్రయాణించి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన సోమవారం రాత్రి స్థానికంగా జరిగింది. స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో మచిలీపట్నం వైపునుండి విజయవాడ వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న కెదుర్గాప్రసాదు (22), కొడాలి వినీల్ (23) రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టారు. మెకానిక్‌లుగా పనిచేసుకొని జీవిస్తున్న ఈ ఇద్దరు యువకులు తలలు పగలడంతో మృతి చెందారు. దుర్గాప్రసాదు అక్కడికక్కడే మృతి చెందగా, వినీల్‌ను వైద్యశాలకు తరలిస్తుండగా మృతి చెందాడు. పట్టణ ఎస్‌ఐ శివప్రసాదు కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టంకు ఉయ్యూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

కరెంటు బిల్లులు కట్టం
మైలవరం, జనవరి 15: సర్ చార్జీల పేరుతో విపరీతంగా వచ్చిన విద్యుత్ బిల్లులను తాము చెల్లించేది లేదని పేర్కొంటూ మండలంలోని వెదురుబీడెం వాసులు విద్యుత్ సిబ్బందిని నిర్బంధించిన సంఘటన ఇది. గత రెండు మాసాలుగా సర్ చార్జీల పేరుతో విద్యుత్ బిల్లులో మోత పుట్టిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఆగ్రహించిన మండలంలోని వెదురుబీడెం గ్రామానికి చెందిన వినియోగదారులు మూకుమ్మడిగా బిల్లులు కట్టించుకునేందుకు గ్రామానికి వచ్చిన సిబ్బందిని అడ్డుకుని వారిని నిర్బంధించి రచ్చబండపైనే కూర్చోబెట్టారు. అంతటితో ఆగకుండా విపరీతంగా వచ్చిన విద్యుత్ బిల్లులను తాము కట్టలేమని, కట్టేప్రసక్తే లేదని, ఫీజులు పీకినా ఊరుకునేది లేదని అంటూ తమకు వచ్చిన బిల్లులను మూకుమ్మడిగా భోగి మంటల్లో వేసి తగలబెట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. తమకు సర్ చార్జీలను మినహాయించి తాము వాడుకున్న దానికే బిల్లులు వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి ఎస్వీ సారథిరావు, పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.

కమలానంద భారతి అరెస్టు వెనుక భారీ కుట్ర
జగ్గయ్యపేట, జనవరి 15: కమలానంద భారతి అరెస్ట్‌కు ప్రభుత్వం ముందు నుంచి భారీ ప్రణాళికతో సిద్ధమైందని చిల్లకల్లు ఆశ్రమ నిర్వాహకుడు గంభీరానంద భారతి అన్నారు. సోమవారం సాయంత్రం పట్టణంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కమలానంద భారతి మతాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టు చేయడం ఒక సాకు మాత్రమేనన్నారు. ఆలయాల పరిరక్షణకు వారు దశాబ్దాలుగా చేస్తున్న ఉద్యమ ఫలితంగానే వారిపై అణగదొక్కేందుకు కుట్ర జరిగిందని, వారి అరెస్టుకు వ్యాఖ్యలను సాకుగా చూపడమేనన్నారు. కమలానంద భారతి అరెస్టుపై త్వరలో తాము నిరాహర దీక్ష చేపట్టనున్నామని, త్వరలోనే పీఠాధిపతులు, మఠాధిపతులతో ఉద్యమ కార్యాచరణను కరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

ఏకగ్రీవ సంఘాలకు ప్రభుత్వం నజరానా
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, జనవరి 15: ఏకగ్రీవమైన సహకార సంఘాలకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. త్వరలో జరగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రోత్సాహకంగా 2 లక్షలు చొప్పున మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన్పట్టు జిల్లా సహకార శాఖాధికారి వి రమేష్‌బాబు మంగళవారం ఇక్కడ తెలిపారు. 2005 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవ సంఘాలకు ప్రోత్సాహకంగా కేవలం 5 వేలు మాత్రమే ప్రభుత్వం ప్రకటించగా ఈ విడత 2 లక్షలకు పెంచారు. ఈ సొమ్ముతో సొసైటీల్లో వౌలిక వసతులు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. భవనం, గోడౌన్, ప్రహరీ గోడ నిర్మాణం లేదా పరపతేతర వ్యాపారంలో మూలధనంగా కూడా వాడుకోవచ్చని ప్రభుత్వం ఆదేశించింది.

వైభవంగా గోదా శ్రీరంగనాథుల కల్యాణం
తోట్లవల్లూరు,జనవరి 15: స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో గోదాదేవి శ్రీరంగనాథుల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలు నెల రోజుల మహావ్రతాల అనంతరం ముగింపు రోజైన సోమవారం రాత్రి ప్రసిద్ధి గాంచిన శ్రీ రుక్మిణీ సత్యభామ వేణుగోపాలస్వామి దేవాలయంలో వేదపండితులైన సంపత్‌కుమారాచార్యులు, కలగ పూర్ణచంద్రశేఖర్, తట్టా పవన్‌కుమారాచార్యులు, పంచాంగం వేణుగోపాలచార్యులు పర్యవేక్షణలో గోదాదేవి శ్రీరంగనాథుల కల్యాణాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు చైర్మన్ మేకల రామాంజనీయులు స్వామివార్లకు దేవస్థానం తరఫున పట్టు వస్త్రాలు అందజేశారు. వేదపండితుల మాంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య దేవతామూర్తులకు మాంగల్యధారణ, తలంబ్రాలతో స్వామి కల్యాణం శాస్రోక్తంగా నిర్వహించారు. వేములపల్లి లక్ష్మీనరసింహరావు దంపతుల కుమార్తె లోనికారాణి జాప్ఞకార్థం అమ్మ స్వామివార్లకు చీరలు, పంచెలు సమర్పించారు. అనంతరం భక్తులకు చక్రపొంగలి, పూలిహార ప్రసాదాలు పంపిణీ చేశారు.

పేటలో చంద్రబాబు మీకోసం యాత్ర రూట్ మ్యాప్ ఖరారు
జగ్గయ్యపేట, జనవరి 15: జగ్గయ్యపేట నియోజకవర్గంలో చంద్రబాబు పాదయాత్ర రూట్ మ్యాప్‌ను మంగళవారం సాయంత్రం నేతలు ప్రకటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, మాజీ మంత్రి నెట్టెం రఘురాంలు మీకోసం యాత్ర రూట్ మ్యాప్‌ను వివరిస్తూ 21వ తేదీ ఉదయం 10గంటలకు గరికపాడు జిల్లా సరిహద్దు వద్ద లక్ష మందితో స్వాగతం పలికి జిల్లాలోకి ఆహ్వానిస్తామని, అక్కడి నుండి అనుమంచిపల్లి, షేర్‌మహమ్మద్‌పేట మీదుగా జగ్గయ్యపేట క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారని, అక్కడ నుండి జగ్గయ్యపేట పట్టణం మీదుగా చిల్లకల్లుకు పాదయాత్ర చేరుతుందని, రాత్రికి ఆర్‌సిఎం స్కూల్ ఆవరణలో బస చేస్తారని తెలిపారు. 22న చిల్లకల్లు నుండి బయలుదేరిన పాదయాత్ర మక్కపేట చేరి మధ్యాహ్నం భోజనం అనంతరం రాత్రికి పెనుగంచిప్రోలు చేరి సత్యసాయి గార్డెన్స్‌లో రాత్రి బస చేస్తారని తెలిపారు. 23 ఉదయం పెనుగంచిప్రోలు నుండి బయలుదేరిన పాదయాత్ర అనిగండ్లపాడు, గుమ్మడిదుర్రు, రామిరెడ్డిపల్లి, కొండూరు, మాగల్లు మీదుగా రాత్రికి పల్లగిరి చేరి చంద్రబాబు బసచేస్తారన్నారు. పాదయాత్ర సందర్భంగా వివిధ సంఘాలు, కుల వృత్తుల నుండి ఆయన్ను కలిసి సమస్యలు వివరించేందుకు అనుమతులు కోరుతూ అర్జీలు వచ్చాయని, అన్నింటినీ పరిశీలించి పాదయాత్ర సందర్భంగా ఆయా ప్రాంతాల్లో వారిని కలిసేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

నియోజకవర్గంలో లక్షా 51 వేల 24 మంది ఓటర్లు
పెడన, జనవరి 15: పెడన నియోజకవర్గంలో లక్షా 51 వేల 24 మంది ఓటర్లున్నట్లు అధికారులు మంగళవారం ప్రకటించారు. వీరిలో పురుషులు 75 వేల 85 మందిగా, స్ర్తిలు 75 వేల 939 మందిగా ప్రకటించారు. నియోజకవర్గంలోని 200 పోలింగ్ కేంద్రాల్లో లిస్టులు ఉంచినట్లు స్థానిక తహశీల్దార్ రత్నకుమారి తెలిపారు.

11 మంది జూదరులు అరెస్టు
కృత్తివెన్ను, జనవరి 15: మండల పరిధిలోని పశ్చాపురంలో సోమవారం అర్ధరాత్రి 1 గంట సమయంలో పేకాట శిబిరాలపై స్థానిక ఎస్‌ఐ శివరామకృష్ణ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 11 మందిని అదుపులోకి తీసుకుని 31 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మొవ్వ మండలంలో మహిళా ఓటర్లదే పైచేయి
కూచిపూడి, జనవరి 15: పామర్రు ఎస్‌సి రిజర్వడ్ నియోజకవర్గం పరిధిలోని మొవ్వ మండలంలో మంగళవారం తుది ఓటర్ల జాబితాను ప్రకటించినట్లు తహశీల్దార్ జి భద్రు పేర్కొన్నారు. మండలంలో గత ఏడాది అక్టోబరు 1వ తేదీన ప్రారంభమైన ఓటర్ల నమోదు కార్యక్రమం ముగిసిన అనంతరం మండలంలోని 43 పోలింగ్ కేంద్రాల పరిధిలో 37వేల 282 మంది ఓటర్లు ఉండగా వీరిలో 18వేల 704 మంది మహిళలు, 18వేల 578 మంది పురుషులు ఉన్నట్లు తెలిపారు. కాగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు రెండు పాస్‌ఫోట్ సైజు ఫొటోలతో పోలింగ్ కేంద్రాల వద్ద పిఓ, బిఎల్‌ఓలకు దరఖాస్తులు చేసుకోవాలని కోరారు.

హోరాహోరీగా కబడ్డీ ఫైనల్స్
అవనిగడ్డ, జనవరి 15: పరుచూరి గోపాలరావు స్మారక వాలీబాల్ పోటీల్లో ప్రథమ స్థానం విజయవాడకు చెందిన ద్రోణార్జున జట్టు, ద్వితీయ స్థానం అబ్దుల్ వహీద్ యూత్ టీమ్ (గుడివాడ), తృతీయ స్థానం పరుచూరి గోపాలరావు స్మారక టీమ్ (అవనిగడ్డ), నాల్గవ స్థానం మచిలీపట్నం జట్టు గెలుచుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. విజేతలకు బహుమతులు అందజేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు
చల్లపల్లి, జనవరి 15: అతిగా తాగి వివాహిత పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ యువకుడిని స్థానికులు పోలీసులకు అప్పచెప్పారు. సేకరించిన వివరాల ప్రకారం స్థానిక నారాయణరావునగర్‌కు చెందిన ఓ వివాహిత గౌడ బజారు వెళుతుండగా సంతబజారులోని మద్యం దుకాణం ఎదుట బాగా తాగిన ఓ యువకుడు ఆమెతో అనుచితంగా ప్రవర్తించటాన్ని గమనించిన స్థానికులు అతడ్ని పోలీసులకు అప్పగించారు. వివాహిత పిర్యాదు మేరకు యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరీక్షలు నిమిత్తం అతినిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

తిరువూరు చేరిన చైతన్య జ్యోతి
తిరువూరు, జనవరి 15: ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో గుంటూరు శాతవాహన నగర్‌లో ఈ నెల 18, 19, 20 తేదీల్లో జరుగనున్న హిందు చైతన్య సదస్సు విజయవంతం కోరుతూ భద్రాచలంలో బయలుదేరిన చైతన్య జ్యోతి తిరువూరు చేరుకుంది. జ్యోతికి స్థానిక ముత్తగూడెం వద్ద బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు ఎదురేగి స్వాగతం పలికారు. మండల బిజెపి అధ్యక్షుడు దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి నేతృత్వంలో ఆయన నివాసం వద్ద జ్యోతికి పూజలు నిర్వహించారు. భద్రాచలం నుంచి పాదయాత్రగా వచ్చిన యలకం బాలకృష్ణ, ఘణపురం కృష్ణ, సాముదాల బుచ్చిరెడ్డిలతో కూడిన బృందం భద్రాచలం నుంచి కొమరంభీమ్ టీమ్ పేరిట చైతన్య జ్యోతిని గుంటూరు తీసుకెళుతోంది. స్థానిక బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పాదయాత్రికులతో కలిసి పట్టణంలో జ్యోతికి ఊరేగింపు జరిపారు. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు దేవిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, కె తిరుపతయ్య, నొముల వెంకటరమణ, గుండ రామప్రసాద్, సాంబారు రమేష్, అన్నపురెడ్డి వెంకటేశ్వరరావు, వడ్లపూడి సింహాచలం, డి శ్రీనివాసరావు, శ్రీనివాసాచారి పాల్గొన్నారు.

నగరంలో ఫుట్‌పాత్‌లపై నిద్రించేవారికి ప్రత్యేక బస
* బస్ ప్రమాద ఘటనలో మృతుల కుటుంబాలను ఆదుకుంటాం
* కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 15: బెంజి సర్కిల్ వద్ద ప్రైవేట్ బస్ ప్రమాద సంఘటనలో మృతి చెందినవారి కుటుంబాలను నిబంధనలకు అనుగుణంగా ఆదుకోవడంతోపాటు, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా బుద్ధప్రకాష్ ఎం జ్యోతి తెలిపారు. సోమవారం రాత్రి బెంజిసర్కిల్ వద్ద బస్సు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, నగర పోలీసు కమిషనర్ ఎన్ మధుసూదనరెడ్డిలు పరామర్శించారు. అనంతరం కలెక్టర్‌ను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ ఎస్‌విఆర్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు ప్రయాణికులను తీసుకొని శ్రీకాకుళం వెళుతోందన్నారు. బస్సు బెంజిసర్కిల్ చేరుకునే సమయంలో ప్రమాదవశాత్తు బోల్తాపడటం జరిగిందన్నారు. ఈ దుర్ఘటనలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. ఈ సంఘటనలో 14 మందికి గాయాలుకావడం జరిగిందని, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వ ఆసుపత్రి, నాగార్జున ఆసుపత్రి నందు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నామని తెలిపారు. నగరంలో ఫుట్‌పాత్‌లు, పేవ్‌మెంట్లు, తదితర ప్రదేశాల్లో నిద్రించే అనాథలు, నిరాశ్రయులను గుర్తించి వారికి రాత్రి బస సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. బెంజి సర్కిల్ వద్ద ప్రమాదాలను నివారించేందుకు ఫ్లైఓవర్ నిర్మాణం త్వరలో చేపట్టడం జరుగుతుందని, ఇందుకు సంబంధించి విజయవాడ - మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభించామని, త్వరలో ఫ్లైఓవర్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. క్షతగాత్రుల పరామర్శలో కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ యం డా జగన్‌మోహన్‌రావు, అర్బన్ తహశీల్దార్ ఆర్ శివరావు, ఆసుపత్రి వైద్యులు వున్నారు.

మరణశయ్యగా మారిన ఫుట్‌పాత్!
* ప్రైవేటు బస్సు అతి వేగానికి ఐదుగురి బలి
* అధికార్ల నిర్లక్ష్యం.. వారిపాలిట శాపం
విజయవాడ (క్రైం), జనవరి 15: రెక్కాడితే గాని డొక్కాడని బడుగు జీవుల బతుకులను విధి ఎప్పుడూ వెక్కిరిస్తూనే ఉంటుంది. వారంటే దానికి అంత అలుసు. అందుకే మృత్యుదేవత రూపంలో వచ్చి మరీ అమాంతం ఐదుగురు అభాగ్యులను మింగేసింది. మరికొందరిని గాయాలపాలు చేసింది. ఊరంతా సంక్రాంతి వేడుకల్లో మునిగితేలి సేదదీరుతున్న తరుణమది. అందరిలాగే వారు కూడా ఫుత్‌మీద నిద్రకు ఉపక్రమించారు. వారికి తెలీదు ఈ రాత్రే తమకు చివరి రాత్రని, తాము పడుకున్నది మృత్యుకౌగిలిలోనని, కాసేపట్లో జారుకుంటోంది చావులోగిలిలోకని! ఇంకేముంది.. ఆ సమయం అర్థరాత్రి 12.30 గంటలకు వచ్చేసింది. జాతీయ రహదారిపై అతివేగంగా వస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి బెంజి సర్కిల్ వద్ద ప్లాట్‌ఫారంపై నిద్రిస్తున్న బడుగుల మీదుకు దూసుకొచ్చి బోల్తాకొట్టింది. అంతే ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రయాణికులు, స్థానికులు క్షతగాత్రులయ్యారు. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. హాహాకారాలు, అరుపులతో అర్థరాత్రి ఈప్రాంతం దద్దరిల్లింది. స్థానికులు ఉలిక్కిపడ్డారు. నిర్లక్ష్యం, మితిమీరిన వేగం ఐదుగురిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించినంత వరకు బస్సు డ్రైవర్‌ను బాధ్యుడిని చేసినా.. జాతీయ రహదారి వెంబడి ఉన్న ఫుత్‌పాత్‌లపై ఎందరో వలస జీవులు, బడుగులు నిత్యం నిద్రకు ఉపక్రమిస్తున్నా అధికార గణం కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోవడం వారి పాలిట శాపంగా పరిణమిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఆటోనగర్ గేటు సిగ్నల్ సెంటర్‌లో రోడ్డు మధ్య డివైడర్‌పై నిద్రిస్తున్న ఓ వ్యక్తి జారిపడగా అతని మీద నుంచి లారీ వెళ్లిపోవడంతో అక్కడికక్కడే నుజ్జునుజ్జయి దుర్మరణం పాలయ్యాడు. ఇలాంటి ఘటనలు మరెన్నో. ఎస్‌విఆర్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వెళుతూ సోమవారం రాత్రి 8.30 గంటలకు ఎల్‌బినగర్ నుంచి బయలుదేరి 12.30కి బెంజి సర్కిల్ వద్దకు చేరుకుందంటే ఎంత మితిమీరిన వేగమో ఇట్టే అర్ధమవుతుంది. బెంజి సర్కిల్ వద్దకు వచ్చేసరికి రామవరప్పాడు వైపు వెళ్ళేందుకు సర్కిల్‌లో బాగా నిదానంగా వెళ్ళాల్సి ఉంది. అది పాటించనందున ప్రమాదవశాత్తూ అదుపుతప్పిన బస్సు పక్కనే ఉన్న ప్లాట్‌ఫారమ్‌పై దూసుకెళ్లి బోల్తాపడి ఐదుగురిని బలిగొంది. సమాచారం అందుకున్న కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, నగర పోలీసు కమిషనర్ ఎన్ మధుసూదనరెడ్డి, డిసిపి రవిప్రకాష్, ఏసిపి సత్యనారాయణ, సిఐలు సత్యానందం, సత్యనారాయణ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు యలమంచిలి రవి, మల్లాది విష్ణు వచ్చి పరిశీలించారు. రిజర్వు పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్‌ల సాయంతో బస్సును తొలగించారు. కొన్నిగంటల పాటు సాగిన సహాయక కార్యక్రమంలో మృతులను, క్షతగాత్రులను గుర్తించడం కష్టమైంది. బస్సులో ఉన్న 40మంది ప్రయాణికులతో కలిపి నిద్రిస్తున్న వారిలో మొత్తం 14మంది గాయపడ్డారు. ఇక మృతుల శరీర భాగాలు నుజ్జునుజ్జు కావడంతో మృతులను మంగళవారం కూడా గుర్తించలేకపోయారు. అయితే హనుమాన్ జంక్షన్‌కు చెందిన నాగరాజుగా ఒకరిని గుర్తించగా పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. ఇంకా నలుగురిని గుర్తించాల్సి ఉంది. క్షతగాత్రులు చికిత్స అనంతరం వెళ్లిపోగా ప్రస్తుతానికి ముగ్గురు నాగార్జున ఆస్పత్రి, మరో ముగ్గురు మరో ప్రైవేటు ఆస్పత్రి, ఒకరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులను ఖమ్మం జిల్లా తండాలకు చెందినవారిగా భావిస్తున్నారు. బస్సు డ్రైవర్ తంగం నాగరాజు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ముగ్గురు వ్యక్తులు మోటారు సైకిల్‌పై అడ్డురాగా తప్పించే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ చెబుతున్నాడు. మృతదేహాలను మార్చురీకి తరలించి మాచవరం పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలావుండగా ప్రభుత్వాస్పత్రిలో బాధితులను సిపిఎం నాయకుడు సిహెచ్ బాబూరావు పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 10లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని, ఎస్‌విఆర్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని బాబూరావు, సిపిఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితరులు డిమాండ్ చేశారు.

జిల్లాలో బాబు పాదయాత్రకు...
సమైక్యవాదం సెగ తప్పదా?
* టిడిపి, కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, జనవరి 15: రాష్ట్రం రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో గడచిన 100 రోజులుగా సాఫీగా విజయవంతంగా సాగుతున్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర రాజకీయ చైతన్యవంతమైన కృష్ణాజిల్లాలో సాఫీగా జరిగేలా కన్పించడంలేదు. బాబు యాత్ర ఈ నెల 21వ తేదీ తెలంగాణా ప్రాంతం నుంచి కృష్ణాజిల్లా జగ్గయ్యపేటకు చేరుకోనుంది. తొలి దేశలో వారం రోజులుపాటు జరిగేలా జిల్లా అధ్యక్షుడు, శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు నేతృత్వంలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని ఘన స్వాగతం పలుకటానికి భారీ ఎత్తున జన సమీకరణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే వేర్పాటు వాదానికి బాబు ఊతం ఇస్తున్నారంటూ ఏదో రీతిలో అప్రతిష్ఠ పాలు చేసేలా సమైక్యవాదులు సన్నిద్ధమవుతున్నారు. సమైక్యవాదంలో బాబుయాత్రను అడ్డుకునేందుకు ఎంపి లగడపాటి రాజగోపాల్ స్వయంగా బరిలోకి దిగుతున్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌తోనే అభివృద్ధి సాధ్యం అంటూ 2005 ఫిబ్రవరి 21 శాసనసభలో ప్రసంగం చేసిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనకు ఊతం ఇస్తూ ఎలా లేఖ ఇచ్చారంటూ సమైక్యాంధ్ర ఉద్యమనేత, మాజీ శాసనసభ్యుడు అడుసుమిల్లి జయప్రకాష్ ప్రశ్నిస్తున్నారు. అలాగే సమైక్యాంధ్ర కోసం ప్రాణాలిస్తాం అంటూ గతంలో నిరవధిక దీక్షకు కూర్చొన్న దేవినేని ఉమమహేశ్వరరావు ఇప్పుడు నోరు మెదపకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఈ రెండు అంశాలతో అటు బాబు, ఇటు ఉమామహేశ్వరరావు ప్రజల్లో నిలదీసేందుకుగాను లగడపాటి బాబుయాత్రకు పోటీగా కనువిప్పుయాత్ర సాగించబోతున్నారు. కార్యకర్తలు, సమైక్యవాదులతో బాబుయాత్ర విజయవాడ పార్లమెంటనీ నియోజకవర్గంలో సాగినంత కాలంలో ఈ కనువిప్పు యాత్ర సాగబోతున్నది. ఇటివలే దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ కోసం చంద్రబాబు దీక్షకు కూర్చొడానికి పోటీగా లగడపాటి ధర్నా చేపట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. శాంతిభద్రతలను పరిరక్షించటం పోలీసులకు శిరోభారంగా మారింది. మళ్ళీ బాబుయాత్ర, లగడపాటి కనువిప్పుయాత్రల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుందోనని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. పోలీసుల అనుమతిలేకపోయినా లగడపాటి కనువిప్పుయాత్ర సాగి తీరుతుందని సమైక్యవాదులు గట్టిగా చెబుతున్నారు. ఏదిఏమైనా అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

వైభవంగా శ్రీ గంగానమ్మ తల్లి ఊరేగింపు
విజయవాడ (కల్చరల్), జనవరి 15: గ్రామదేవతగా ముత్యాలంపాడులో దాదాపు వంద సంవత్సరాల క్రితం వెలిసి తనను నమ్ముకున్న వారిచే పూజలందుకుంటూ వారిని ఎల్లవేళలా కాపాడుతునన శ్రీ గంగానమ్మ ఉత్సవాలు సందర్భంగా సోమవారం సాయంత్రం జరిగిన ఊరేగింపు వైభవంగా సాగింది. ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ సమీపాన గల శ్రీ గంగానమ్మ అమ్మవారి దేవస్థానం నుంచి అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రత్యేకంగా పూలతో అలంకరించిన వాహనంపై ఆశీనురాలిని చేసి కనులు మిరుమిట్లు గొలిపే విద్యుత్ దీప కాంతుల మధ్య కోలాట నృత్య గీతాలాపన చేస్తుండగా మంగళ వాయిద్యాలు మోగిస్తుండగా ఈ ఊరేగింపు ముత్యాలంపాడు పురవీధులలో సాగింది. ఈ ఊరేగింపుకు మధ్య నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. కార్యక్రమాన్ని అధ్యక్షులు గొట్టుముక్కల వెంకటేశ్వర రాజు, కార్యదర్శి కాకర్లపూడి కోటిలింగరాజు, కోశాధికారి టి.వెంకట్రామరాజులు పర్యవేక్షించగా నిర్వహణ ఎమ్.యుగంధర్ రాజు, అమ్ముల వివేకానంద తదితర సభ్యులు భక్త బృందం చేశారు.
కనులపండువగా శ్రీ అంకమ్మ తల్లి తెప్పోత్సవం
గ్రామ దేవతగా దుర్గా అగ్రహారంలోని నంబూరి వారి వీధిలో వెలిసిన శ్రీ అంకమ్మ తల్లి వారికి నిర్వహించు 46వ వార్షిక మహోత్సవాలలో మంగళవారం సాయంత్రం అమ్మవారికి తెప్పోత్సవం నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ మహిళామ తల్లుల కోలాట నృత్య గీతాలాపనలతో విద్యుద్దీప కాంతుల మధ్య దేదీప్యంగా వెలుగొందుతున్న అమ్మవారి తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. కార్యక్రమాన్ని దేవస్థానం అధ్యక్షులు అబ్బాబత్తుల నాగయ్య, కార్యదర్శి అన్నాబత్తుల శరాబందిరావులు పర్యవేక్షించగా నిర్వహణ సంయుక్త కార్యదర్శి పబ్బతి రామమోహనరావు, కోశాధికారి అబ్బాబత్తుల శివరామకృష్ణ ప్రసాద్ సభ్యులు చేశారు. విశేషంగా హాజరైన భక్తకోటికి ప్రసాద వితరణ చేశారు.

పండిట్ నెహ్రూ బస్టాండ్ ప్రయాణికులతో కిటకిట!
* హైదరాబాద్‌కి 79 ప్రత్యేక బస్సులు
పాతబస్తీ, జనవరి 15: దూర ప్రాంతాల నుండి సొంతూరులకు పయనమయ్యే వారి కోసం ఆర్టీసీ అధికారులు రాకపోకలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఈ ఏడాది మొత్తం పండిట్ నెహ్రూ బస్టాండ్ నుండి సంక్రాంతి పండుగకు 912 బస్సులు ఏర్పాటు చేయగా కనుమనాడు బస్ స్టేషన్ ప్రయాణీకులతో కిటకిటలాడింది. హైదరాబాద్‌కి 79 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని అలాగే బెంగుళూరుకి 2, చెన్నైకి 5 బస్సులు ఏర్పాటు చేశామని ఎడిఎం కె శేషగిరిరావు తెలిపారు. సంక్రాంతి పండుగ అనంతరం హైదరాబాద్‌కి వెళ్ళే ఉద్యోగులు, విద్యార్థులతో మంగళవారం బస్ స్టాండ్ కిటకిటలాడింది. ప్రయాణీకులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, బస్సుల వివరాలు ఎప్పటికప్పుడు మైకుల ద్వారా సమాచారం అందిస్తున్నామని ఎడిఎం తెలిపారు. కాగా, రైల్వే స్టేషన్ కూడా పండుగకు స్వస్థలాలకు వచ్చి మరలి వెళ్లే వారితో కిక్కిరిసిపోయంది.

సంక్రాంతి
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>