Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

సమైక్యాంధ్ర కోసం మహాశాంతి యజ్ఞం

$
0
0

గుంటూరు, జనవరి 15: రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కాంక్షిస్తూ సమైక్యాంధ్ర ప్రదేశ్ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఈనెల 16వ తేదీ స్థానిక బృందావన గార్డెన్స్‌లోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో మహాశాంతి యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు జెఎసి రాష్ట్ర కోఆర్డినేటర్ మండూరి వెంకట రమణ తెలిపారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు విద్యార్థులు, యువత ఉద్యమాలను మాత్రమే చేశారని, ఈ యాగంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. జెఎసి గౌరవాధ్యక్షులు పి నరసింహారావు మాట్లాడుతూ తెలంగాణాపై వస్తున్న పలు ఊహాగానాల నేపథ్యంలో రాష్ట్రం సమైక్యంగా తప్ప మరే ఇతర ప్రతిపాదనలు ఒప్పుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. రాష్ట్రంలో అత్యధికశాతం ప్రజలు సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారన్నారు. వేర్పాటు వాదులు మాత్రమే ఇందుకు విరుద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో భారత ధార్మిక విజ్ఞాన పరిషత్ అధ్యక్షుడు బొల్లేపల్లి సత్యనారాయణ, బొద్దులూరి రంగారావు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి నాయకులు ఎండి హిదాయత్, కసుకుర్తి హనుమంతరావు, ఎస్ వెంకట చైతన్య, అడుసుపల్లి శ్రీనివాసరావు, షేక్ జిలాని తదితరులు పాల్గొన్నారు.

పండుగల రద్దీ దృష్ట్యా
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

గుంటూరు (కొత్తపేట), జనవరి 15: మూడు రోజుల సంక్రాంతి సంబరాలను జరుపుకునేందుకు తమ సొంత ప్రాంతాలకు వచ్చిన ప్రయాణికుల తిరుగు ప్రయాణం కోసం ఆర్టీసీ రాష్ట్రంలోని సుదూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. మంగళవారం నాడు కనుమ పండుగ కావడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ ఆ మేరకు ప్రయాణికుల సంఖ్య లేకపోయింది. హైదరాబాద్‌కు 20, చెన్నైకు 4, బెంగళూరుకు 4, వైజాగ్‌కు 2 బస్సులను కేటాయించగా హైదరాబాద్‌కు 14 మాత్రమే నడిచాయి. అదేవిధంగా బెంగళూరుకు 2, చెన్నైకు 2 మాత్రమే వెళ్లాయి. బుధవారం కూడా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా హైదరాబాద్‌కు 20, బెంగళూరు, చెన్నైకు 4, వైజాగ్‌కు 2 బస్సులను అందుబాటులో ఉంచినట్లు డిప్యూటీ సిటిఎం, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ ఆదం సాహెబ్, సిహెచ్ వెంకటేశ్వరరావు తెలిపారు.
భారీగా మద్యం సీసాలు స్వాధీనం

దుగ్గిరాల, జనవరి 15: మండలంలోని పలు గ్రామాల్లో మద్యం అనధికారికంగా విచ్చలవిడిగా విక్రయిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మండలంలోని కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో సమీప షాపుల నుండి మద్యం తీసుకునివచ్చి కొందరు యధేచ్ఛగా విక్రయిస్తున్నారు. కాగా మండల గ్రామం, శృంగారపురం దళితవాడలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారం అందుకున్న ఎస్‌ఐ విజయ్‌చరణ్ మంగళవారం తమ సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి మద్యం సీసాలను, బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 272 క్వార్టర్ బాటిల్స్ ఉన్నట్లు ఎస్‌ఐ విజయ్‌చరణ్ తెలిపారు. మద్యం విక్రయిస్తున్న గ్రామానికి చెందిన ఎం అమ్మయ్యను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఎక్సైజ్ ఎస్‌ఐని ఫోన్‌లో సంప్రదించాలని ప్రయత్నించినా అందుబాటులో లేరు.
కృష్ణానదిలో పడి ఇద్దరు విద్యార్థినుల మృతి
* నలుగురిని రక్షించిన జాలర్లు
విజయపురిసౌత్ 15: కృష్ణానదిలో స్నానానికి దిగి ఆరుగురు గల్లంతుకాగా, వారిలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందగా, నలుగురిని స్థానిక జాలర్లు రక్షించిన సంఘటన విజయపురిసౌత్‌లోని సాగర్‌మాత ఆలయం సమీపంలోని స్నానాల ఘట్టం వద్ద సోమవారం జరిగింది. వివరాలలోకి వెళ్తే మండల కేంద్రమైన ఫిరంగిపురంకు చెందిన కొప్పుల జోసఫ్ నూతనంగా గృహాన్ని నిర్మించుకుని మొక్కుబడులు తీర్చుకునేందుకు నాగార్జున సాగర్‌లోని కృష్ణానది తీరాన ఉన్న సాగరుమాత ఆలయానికి చేరుకున్నారు. స్నానాలు చేసేందుకు కృష్ణానదిలోకి కొప్పుల జోసఫ్, శారద, శ్రావణి, సాయితేజ, శీలం నాగేశ్వరరావు, నాగలక్ష్మి దిగారు. ప్రమాదవశాత్తు ఆరుగురు కృష్ణానదిలో మునిగి గల్లంతయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకుని నదిలో చేపలు వేటాడుతున్న జాలర్లు గొసుల సీమోన్స్, జగదీష్ గల్లంతైన వారి కోసం తీవ్రంగా గాలించారు. గల్లంతైన వారిని ఎట్టకేలకు ఒడ్డుకు చేర్చారు. అప్పటికే మాచర్లకు చెందిన శీలం నాగలక్ష్మి (14), ఫిరంగిపురంకు చెందిన కొప్పుల శ్రావణి (15) అనే ఇద్దరు విద్యార్థునులు మృతి చెందడంతో, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్గొండజిల్లా హిల్‌కాలనీలోని కమలా నెహ్రు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. సంఘటనా స్థలాన్ని మాచర్ల రూరల్ సిఐ ఆర్. ధర్మేంద్రబాబు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును మృతుల బంధువులను అడిగి తెలుసుకున్నారు. విజయపురిసౌత్ ఎస్‌ఐ సిహెచ్. సింగయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
సాగునీటి కోసం రాస్తారోకో

సత్తెనపల్లి/ పెదకూరపాడు, జనవరి 15: అమరావతి మేజర్ కాల్వకు నీరు అందించక పోవడానికి నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం గుంటూరు రోడ్డులోని సాగర్ కెనాల్ వద్ద భారీ రాస్తారోకో నిర్వహించారు. అమరావతి కాల్వ అనాథ కాల్వ అంటూ ప్లకార్డులు చేబూని పెద్దఎత్తున నినాదాలు చేశారు. సెలవల రోజు చివరిరోజు కావడంతో ప్రయాణికులు భారీ సంఖ్యలో ఆయా స్థలాలకు చేరేందుకు ప్రయాణమైనప్పటికీ గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. అంబులెన్సులు కూడా ఈ ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వచ్చింది. వివిధ గ్రామాలకు చెందిన రైతాంగం పెద్దసంఖ్యలో హాజరుకావడంతో 4 గంటలకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో మండలంలోని ధూళిపాళ్ల గ్రామం నుండి గుంటూరు రోడ్డులోని కొర్రపాడు వరకు పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపించడంతో ప్రయాణికులు అసహనానికి గురయ్యారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రయాణికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు గద్దె చలమయ్య, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, పెదకూరపాడు నియోజకవర్గ టిడిపి నాయకులు అర్తిమళ్ల రమేష్, దేశం నాయకులు పోపూరి కృష్ణారావు, కోయా లక్ష్మయ్య, పెద్దింటి వెంకటేశ్వరరావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఇలావుండగా పెదకూరపాడు మండలంలోని గ్రామాలకు చెందిన మిర్చిరైతులు సాగర్‌నీటి కోసం ఆందోళన చేపట్టి పలు వాహనాల్లో సత్తెనపల్లికి తరలివెళ్లారు. రాష్ట్ర తెలుగురైతు కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల అప్పారావు, మండల టిడిపి అధ్యక్షుడు అర్తిమళ్ల రమేష్, మాజీ ఎంపిపి గల్లా బాబురావు, జిల్లా టిడిపి నాయకులు భాష్యం ఆంజనేయులు తదితరుల ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు సత్తెనపల్లి తరలివెళ్లారు. ఈ సందర్భంగా నాదెండ్ల అప్పారావు మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టడం లేదని, కనీసం ఆరుతడులకు సకాలంలో నీరు అందించలేకపోయిందని, ఫలితంగా మిర్చిరైతులకు ఎకరాకు 80 నుంచి 90 వేల వరకు నష్టం వాటిల్లే ప్రమాదముందన్నారు. సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు రైతుల దుస్థితిపై దృష్టి సారించాలని కోరారు.

సంక్రాంతి శోభతో అలరారిన వైకుంఠపురవాసుడు

తెనాలి, జనవరి 15: తెలుగు వారి అతిపెద్ద పండువైన సంక్రాంతి శోభ వైకుంఠపురంలో కన్నుల పండువ చేసింది. మఖర సంక్రాంతి వేళ శ్రీలక్ష్మీ పద్మావతి సమేతుడైన శ్రీ వేంకటేశ్వర స్వామివారి తెప్పోత్సవ ఆధ్యాత్మిక వేడుక సోమవారం సాయంత్రం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మకర సంక్రాంతి వేళ స్వామి దర్శనానికి విచ్చేసిన విశేష భక్త జన సందోహం స్వామి తెప్పోత్సవంలో తరించారు. శాసన సభాపతి నాదెండ్ల మనోహర్ దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.తొలుత ఆలయ మర్యాదలతో స్పీకర్ దంపతులకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. మూలవిరాట్ చెంత ప్రత్యేక పూజలు నిర్వహించిన స్పీకర్ దంపతులు తెప్పోత్సవ శోభకు ముస్తాబైన స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. విశేష భక్త జన సందోహం నడుమ, ప్రత్యేకంగా పూలతో, విద్యుత్ దీపాలతో అలంకరించిన పడవలో స్వామి వారు భక్తుల నీరాజనాలు అందుకున్నారు. ఆలయ సహాయ కమిషనర్ బిఎల్‌వి ప్రసాద్ పర్యవేక్షణలో తెప్పోత్సవ వేడుక పడవల కాలువతో విఎస్‌ఆర్ అండ్ ఎన్‌విఆర్ కళాశాల వరకు కొనసాగింది. స్వామి తెప్పోత్సవ శోభలో ప్రత్యేకంగా పలు సాంస్కృతికి కార్యక్రమాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. శ్రీలాస్య కూచిపూడి నృత్యాలయం నాట్యాచార్యులు జంధ్యాల రామచంద్రమూర్తి ఆద్వర్యంలో వర్ధమాన నర్తకీమణులు జంధ్యాల సిస్టర్స్‌తో పలువురు బాల నర్తకీమణులు చక్కని హావభావాలతో నృత్యప్రదర్శనతో భక్తుల నలరించారు. స్పీకర్ నాదెండ్ల మనోహర్ దంపతులతో పాటు, పలువురు అధికారులు, పార్టీలోని ముఖ్యులు తెప్పోత్సవ శోభలో స్వామిని దర్శించుకున్నారు.
ఆలయ అర్చకులు తమిరిశ రంగాచార్యులు, అళహరి రవికుమార్, ఆర్‌ఎస్ గౌతమ్, ఆలయ వేద పండితులు విష్ణ్భుట్ల సత్యన్నారాయణ ఘనాపాటి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
వైభవంగా నృసింహుని గిరి ప్రదక్షిణ ఉత్సవం

మంగళగిరి, జనవరి 15: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో నెలరోజుల పాటు జరిగిన ధనుర్మాస మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. ఉత్సవాల ముగింపు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారి గిరి ప్రదక్షిణ ఉత్సవం వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని నేత్రపర్వంగా దర్శించుకుని పూజలు జరిపారు. పలుచోట్ల హారుతులు పట్టి స్వామివారికి పండ్లు, పూలు, టెంకాయలు సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఉత్సవ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
సంప్రదాయానికి అద్దంపట్టిన సంక్రాంతి వేడుకలు

గుంటూరు (కల్చరల్), జనవరి 15: తరతరాల నుండి తెలుగుజాతి ఔన్నత్యానికి ప్రతీకగా నిలుస్తున్న సంక్రాంతి వేడుకలను నగర ప్రజానీకం మూడు రోజుల పాటు అత్యంత ఉత్సాహ భరిత వాతావరణంలో సంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. 13వ తేదీ ఆదివారం భోగిపండుగతో ప్రారంభమైన ఈ వేడుకలు మంగళవారం నాటి కనుమతో ముగిశాయి. ఈ సందర్భంగా నగరంలోని 52 డివిజన్లలో గల ఆలయాలకు భారీగా ప్రజలు తరలివెళ్లారు. అన్ని ఆలయాలను శోభాయమానంగా తీర్చిదిద్దారు. రంగవల్లుల పోటీల్లో మహిళలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులను అందుకున్నారు. బంధుమిత్రులతో గృహాలన్నీ కళకళలాడాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని అన్ని ఆలయాల్లో మూలమూర్తులను పలు రకాల పుష్పాలతో నేత్రపర్వంగా అలంకరించారు. గోరంట్లలోని శ్రీ పద్మావతీ ఆండాళ్ సమేత వెంకటేశ్వరస్వామివారిని 40 కిలోల శ్రీ గంధంతో అలంకరించి వేలాదిగా తరలివచ్చిన భక్తులకు నయనానందకరం చేశారు. సంక్రాంతి ఉత్సవాల సందర్భంగా శ్రీ దేవి భూదేవి సమేతుడైన గోరంట్ల వెంకటేశ్వరస్వామివారి శ్రీ గంధం అలంకారం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. అదే ప్రాంతంలోని మరో వెంకటేశ్వరస్వామిని కూడా పుష్పాలతో అందంగా అలంకరించారు.
అభివృద్ధికి మారుపేరు ’కన్నా‘

గుంటూరు (కార్పొరేషన్), జనవరి 15: అభివృద్ధికి మారుపేరు మంత్రి కన్నా లక్ష్మీనారాయణ డిసిసి అధికార ప్రతినిధి క్రోసూరి వెంకట్ కొనియాడారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్‌గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో వెంకట్ మాట్లాడారు. నగరంతో పాటు విలీనగ్రామాల్లో కూడా మంచినీటి సౌకర్యం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి వాటి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని తెలిపారు. అందులో భాగంగా గుంటూరుకు రూ. 450 కోట్ల వరల్డ్‌బ్యాంకు నిధులు విడుదల చేయించి గుంటూరు సమగ్ర నీటి అభివృద్ధి పథకాన్ని అమలు చేయడంలో సఫలీకృతులయ్యారన్నారు. ఏ శాఖ మంత్రిగా పనిచేసినా ఆ శాఖ అభివృద్ధికి కన్నా నిరంతరం కృషి చేస్తున్నారని, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో పయనింపజేశారన్నారు. చంద్రబాబు నాయుడు వస్తున్నా మీకోసం అని తన తనయుడి కోసం పాదయాత్ర చేస్తున్నారని, జగన్మోహనరెడ్డి అక్రమాస్తుల కేసులో జైలులో ఉంటే ఆయన విడుదల కోసం వైఎస్‌ఆర్ సిపి నాయకులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారని విమర్శించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు అడపా కాశీవిశ్వనాధం, ఇంకొల్లు శ్రీనివాసరావు, ఏల్చూరి వెంకటేశ్వర్లు, మాదా వెంకట ముత్యాలరావు, లింగంశెట్టి వెంకటేశ్వర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు సవరం రోహిత్, దాసరి కిరణ్ పాల్గొన్నారు.

మాదిగ రాజకీయ చైతన్య సదస్సును జయప్రదం చేయండి
పెదకాకాని, జనవరి 15: గుంటూరులోని విజ్ఞాన మందిరంలో ఈనెల 19న జరిగే మాదిగల రాజకీయ చైతన్య సదస్సును జయప్రదం చేయాలని జిల్లా తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మానుకొండ శివప్రసాద్ కోరారు. మంగళవారం పెదకాకానిలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మాదిగలను చైతన్యవంతులను చేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సదస్సుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యులు కడియం శ్రీహరి, తదితర ప్రముఖులు హాజరుకానున్నారని, మాదిగలందరూ ఈ సదస్సును విజయవంతం చేయాలని మానుకొండ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు జగదీష్‌బాబు, టిఎన్‌టియుసి నాయకులు కె కనకరాజు, ఎస్సీ సెల్ నాయకులు నంబూరు సాంబయ్య, టిడిపి నాయకులు మన్నవ సత్యనారాయణ, బోయపాటి వెంకటరమణ, ఉప్పాల రాములు తదితరులు పాల్గొన్నారు.
‘అధికార పార్టీకి తొత్తులుగా మారిన ప్రభుత్వాధికారులు’
పెదకాకాని, జనవరి 15: సహకార సంఘ ఓట్ల నమోదులో అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా శివనాగిరెడ్డి ఆరోపించారు. మంగళవారం మండల కేంద్రమైన పెదకాకానిలోని సహకార సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నంబూరు గ్రామం నుండి ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు 100 మంది ఎస్సీలు ఉదయం కార్యాలయానికి వస్తే సొసైటీ కార్యదర్శి ఓట్లు నమోదు చేసుకోకుండా పని ఉందంటూ గుంటూరు వెళ్లి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చారని, దీని వల్ల చాలా మంది ఇబ్బందులు పడ్డారని, ఇది కేవలం అధికార పార్టీ నుండి వచ్చిన ఒత్తిళ్ళ ప్రభావమేనన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ సిపి కన్వీనర్ ఎస్ వెంకట సాంబశివరావు, శివాలయం మాజీ చైర్మన్ కొండా సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వేలాడుతున్న విద్యుత్ వైర్లతో పొంచి ఉన్న ప్రమాదం!
నూజెండ్ల, జనవరి 15: మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ వైర్లు వేలాడాడుతూ ప్రమాదభరితంగా మారాయి. ప్రధానంగా రవ్వారం సమీపంలో రైతులు సాగుచేస్తున్న కందిపైరుకు అందే ఎత్తులో విద్యుత్ వైర్లు వేలాడుతున్నాయి. సాగుచేస్తున్న రైతు ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ఆందోళన చెందుతున్నాడు. పలు మార్లు విద్యుత్ శాఖా అధికారులు దృష్టికి తెచ్చినా పట్టించు కోలేదని ఆరోపణలు ఉన్నాయి. అలాగే ముక్కెళ్లపాడులో కిందికి వేలాడుతున్న కరెంట్ తీగలతో గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవల నిర్వహించిన గ్రామపదర్శిని కార్యాక్రమంలో విద్యుత్ వైర్లు కిందికి వేలాడుతున్నాయని అధికారుల దృష్టికి తెచ్చారు. అధికారులు నేటికి పట్టించు కోలేదని గ్రామస్థులు చెప్తున్నారు. అలాగే ఉప్పలపాడు, రాముడుపాలెం గ్రామాల్లో కూడా విద్యుత్ వైర్లు వేలాడుతూ ప్రమాదభరితంగా మారాయి. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి ప్రమాదాలను నివారించాలని ఆయా గ్రామస్థులు కోరుతున్నారు.
విద్యుత్ ఎఈ వివరణ
ఈ విషయమై విద్యుత్ ఎఇ పూర్ణచంద్రరావుని వివరణ కోరగా ముక్కెళ్లపాడులో కరెంట్ స్థంబాల కొరతతో సమస్యను పరిష్కరించలేక పోయామని చెప్పారు. స్తంభాలు వచ్చిన వెంటనే వేలాడుతున్న ప్రాంతంలో స్తంభాన్ని ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.
కమలానంద భారతీస్వామి అరెస్ట్ అమానుషం
* బిజెపి నాయకుల ఖండన
తెనాలి, జనవరి 15: హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఓవైసీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా కమలానంద భారతీతీర్థస్వామి వాస్తవ పరిస్థితిని వివరించారని దీన్ని సాకుగా చూపి ఆయనను అరెస్ట్ చేయడం అమానుషమని ఆయనను వెంటనే విడుదల చేయాలని పట్టణ బిజెపి నాయకులు డిమాండ్ చేశారు.మంగళవారం పట్టణ బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో శ్రీశైల క్షేత్రంలో పుణ్యనదీ స్నానం ఆచరించేందుకు వెళ్ళిన స్వామిని మకర సంక్రాతి వేళ అరెస్ట్ చేయడంపై బిజెపి నాయకులు తీవ్రంగా స్పందించారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు అడుసుమల్లి సుధాకర్ మాట్లాడుతూ కమలానంద భారతీస్వామి ఏ మతాన్నీ కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలేదని, గతంలో అక్బరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై వాస్తవ పరిస్థితిని వివరించారన్నారు. హిందువులకు పనమత సహనం అధికమనే విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాల్సిన అంశమన్నారు. బిజెపి ధార్మిక పరిషత్ రాష్ట్ర కన్వీనర్ టి అనంతాచార్యులు మాట్లాడుతూ భారతీ తీర్థస్వామి అరెస్ట్ తీరు గమనిస్తే, ప్రభుత్వ కుహనా లౌకికవాదం వ్యక్తమవుతుందన్నారు. సంక్రాంతి పుణ్యతిధి వేళ నదీస్నానం చేస్తున్న స్వామి అరెస్ట్‌తో , హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. జిల్లా బిజెపి మాజీ ప్రధాన కార్యదర్శి సిహెచ్.విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ మతోన్మాద పార్టీ అంటూ కొంతమంది కుహనా లౌకికవాదులు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారని, బిజెపి మతాలకు అతీతంగా మంచి అంశాలకు ప్రాధాన్యత నిచ్చే పార్టీ అన్నారు. హిందువులు మనోభావాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీ హిందువుపైన ఉందనే భావన మాత్రమే అన్నారు. కమ్యూనిస్ట్ నాయకులైన రాఘవులు, నారాయణ బిజెపిపై బురద జల్లే వ్యాఖ్యలు మానుకోవాలన్నారు. వారి విధానాలు చైనా, రష్యా వంటి దేశాలలో సముచితంగా ఉంటాయనే భావన వ్యక్తం చేశారు. కమలానంద భారతీస్వామి హిందుధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్నందునే ఉద్దేశ్య పూర్వకంగా అరెస్ట్ చేశారని, ఆయనపై మోపిన కేసులు నిలబడేవి కావన్నారు. స్వామీజీని విడుదల చేసి హిందువుల మనోభావాలు కాపాడాలన్నారు. విలేఖర్ల సమావేశంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అన్నవరపు వేణు, పార్టీ గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ కఠారి వాసుదేవనాయుడు, రాష్ట్ర బిజెవైఎం ఉపాధ్యక్షుడు గాజుల వెంకయ్య నాయుడు, దారా సాయిగుప్త, అడపా సంపత్ రాయుడు తదితరులు పాల్గొన్నారు.
18నుండి జిల్లాస్థాయి పౌరాణిక పద్యాల పోటీలు
అమృతలూరు, జనవరి 15:ఈనెల 18న అమృతేశ్వర కళాపరిషత్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పౌరాణిక పద్యాల పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాపరిషత్ అధ్యక్షుడు మొవ్వా సుబ్బారావు తెలిపారు. మధ్యాహ్నం 2గంటలకు అమృతలూరులోని పింఛనర్ల భవనంలో పోటీలు ప్రారంభమైతాయన్నారు. పోటీల్లో ప్రధమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి నగదు బహుమతులు, ప్రసంశాపత్రాలు, కన్సొలేషన్ బహుమతులు ఇవ్వనున్నామని చెప్పారు.
కర్పూర జ్యోతిని ప్రారంభించిన మక్కెన
వినుకొండ, జనవరి 15: స్థానిక మార్కాపురం రోడ్డులోని అయ్యప్పస్వామి దేవాలయంలో అయ్యప్ప భక్తులు ఏర్పాటు చేసిన 25కేజీల కర్పూర జ్యోతి సోమవారం రాత్రి డిసిసి అధ్యక్షుడు మక్కెన మల్లిఖార్జునరావుచేతుల మీదుగా ఫ్రారంభించారు. అయ్యప్ప భక్తులతో దేవాలయం కిటికిటలాడింది. ఈ కార్యక్రమంలో దేవాలయం కమిటీ అధ్యక్షుడు గుడివాడ సుబ్బారావు, మాజీ ఎంపిపి ములకా రామతులశీరెడ్డి, సిహెచ్ కోటిరెడ్డి, చంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా గోదారంగనాథుల కల్యాణ మహోత్సవం
తెనాలి, జనవరి 15: ధనుర్మాస వ్రత మహోత్సవాల్లో ముగింపుగా మఖర సంక్రాంతి వేళ స్థానిక నాజరుపేటలోని కోదండ రామాలయంలో సోమవారం గోదారంగనాధుల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. వికాస తరంగిణి,శ్రీరామ సేవాతరంగిణి సంయుక్త ఆధ్వర్యంలో శ్రీమాన్ గురిమెళ్ళ బదరీనాద్‌స్వామి పర్యవేక్షణలో ఆరాధనలు, అర్చనలు, తిరుప్పావై సేవాకాలం అనంతరం గోదారంగనాధులకు కల్యాణం వైభవంగా నిర్వహించారు.
ఆలయ అభివృద్ధికి కొత్తమాసు
5లక్షల రూపాయలు వితరణ
సహకార శిరోమణి కొత్తమాసు తులసీదాస్ గోదా రంగనాధుల కల్యాణ వేడుకల్లో పాల్గొన్న క్రమంలో, ఆలయం అభివృద్దిలో భాగంగా ఆలయ మొదటి అంతస్తునిర్మాణానికి రు.5లక్షలు వితరణగా ప్రకటించారు. ఈక్రమంలో దేవాలయ అభివృద్దికి అర్ధికంగా సహరించేందుకు ముందుకు వచ్చిన కొత్తమాసు తులసీదాస్‌కు ఆలయ పాలక మండిలి ధన్యవాదాలు తెలిపింది. కార్యక్రమంలో ఆలయ కమిటి అద్యక్షుడు రాయపూడి మురళీమోహనరావు, వికాసతరంగిణి ప్రముఖులు రావిపాటి శ్రీరామచంద్రమూర్తి, తులశమ్మ, జంధ్యం రామారావు, విష్ణ్భుట్ల లక్ష్మిపతి సోమయాజులు, ఈదర కోటేశ్వర్రావు, కఠారి వెంకటేశ్వర్రావు, కె.హరీష్ , కొత్తమాసు మలిఖార్జునరావు, ఐనంపూడి జానకీదేవి వికాస తరంగిణి భక్తులు పాల్గొన్నారు.
అక్బరుద్దీన్ ఒవైసీని తప్పించేందుకే...
కమలానందభారతీస్వామి అరెస్ట్
* శ్రీ దండిస్వామి
తెనాలి, జనవరి 15: ప్రపంచంలో ఏదేశంలో లేని విధంగా భారత దేశంలో మత స్వేచ్ఛ ఉందని ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ అక్బరుద్దీన్ ఒవైసీ హిందువుల మనోభావాలను కించపరిస్తే... జరిగిన తప్పిదాన్ని ప్రశ్నించిన కమలానంద భారతీస్వామిపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారని ఇది కేవలం అక్బరుద్దీన్‌ను తప్పించేటందుకేనని అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపకులు శ్రీ దండిస్వామి అవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం పట్టణ విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో దండిస్వామి మాట్లాడుతూ హిందూ దేవుళ్లను, దేవతామూర్తులను కించపరుస్తూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ దేశాలన్నిటికీ తెలిసేలా ఇంటర్‌నెట్ వీక్షణ జరిగిందని, ఇంతటి దారుణానికి పాల్పడిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని భారతదేశంలోని హిందువులంతా కోరుతున్న తరుణంలో, వారి పక్షాన కమలానంద భారతీ స్వామి వాస్తవ పరిస్థితిని వివరించారేగాని మరోవిధానం కాదన్నారు. అయితే అక్బరుద్దీన్ ఒవైసీని కేసుల నుండి తప్పించేందుకు కమలానంద భారతీ స్వామిపై వివిధ కేసులు నమోదు చేసి, హిందువులకు పవిత్రమైన మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల వేళ, నదీ స్నానానికి వెళ్ళిన కమలానంద స్వామిని అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. ఇది హిందువుల పక్షాన మాట్లాడే స్వామిజీలపై కక్షసాదింపు చర్యగా ఉందన్నారు. హిందువులకు సహనంగా ఉంటారేగాని, చేతగాని వారు మాత్రం కారన్నారు. విశ్వహిందుపరిషత్ తెనాలి శాఖ అధ్యక్షుడు చెన్నపాయి వెంకటేశ్వర్రాజు మాట్లాడుతూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలైనా, సిపిఎం నాయకులు చేసిన వ్యాఖ్యలైనా ఓటు బ్యాంకు రాజకీయాలే అన్నారు.
ఇలాంటి వ్యాఖ్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతీయడం ఇకనైనా మానుకోవాలన్నారు. హిందువుల మనోభావాలను కించపరిచిన వారి పట్ల చట్టం, న్యాయం ఎవరికి చుట్టాలవలే కాక, వాస్తవాన్ని గమనించి కోట్లాది హిందువుల మనోభావాలను కాపాడలన్నారు. సమావేశంలో రామరాజు, అవ్వారు శ్రీనివాసరావు, అఖిలేష్, వేముల శ్రీహరి, రామ్‌కుమార్, మల్లేశ్వరశర్మ తదితరులుపాల్గొన్నారు.
మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే
స్వచ్ఛమైన తాగునీరు అవసరం
* ఎమ్మెల్యే జీవీ
శావల్యాపురం, జనవరి 15: మానవుడు ఆరోగ్యంగా ఉండాలంటే స్వచ్ఛమైన తాగునీరు అవసరమని స్థానిక శాసన సభ్యుడు జీవీ ఆంజనేయులు అన్నారు. బొందిలపాలెంలో అడలిపేరంటాలమ్మ సేవాసమితి, గ్రామ యూత్ ఆధ్వర్యంలో 3.5లక్షల రూపాయలతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ ప్లాంటు నిర్మాణానికి గ్రామంతో చదువుకొని దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువకులు, గ్రామస్థుల సహకారంతో జన్మభూమి స్ఫూర్తితో పలు సేవా కార్యాక్రమాలు కొనసాగిస్తున్న యువతను జీవీ అభినందించారు. సంవత్సరాల తరబడి ఫ్లోరైడ్ నీటిని తాగుతున్న గ్రామస్థులకు నేడు సంక్రాంతి వచ్చిందన్నారు. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని నియోజక వర్గంలోని ప్రజలు గ్రామాభివృద్ధికి పాల్పడాలని సూచించారు. గ్రామాల్లో బెల్ట షాపుల ద్వారా మద్యం అమ్మకాలను నిషేదించాలన్నారు. మనం మన గ్రామం బాగున్ననాడే రాష్ట్రం అభివృద్ధిలో పయనిస్తుందన్నారు. ఈ ప్లాంటు నిర్మాణానికి స్థలాన్ని ఉచితంగా అందించిన బోడాల చిన చెన్నయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విఆర్‌వో సిహెచ్ వెంకటేశర్వు, నిషార్‌భాష, కాట్రగడ్డ పౌండేషన్ అధినేత సత్యనారాయణ, మాజీ సర్పంచ్ ఎం వెంకటేశ్వర్లు, కె రామకిషన్ సింగ్, ప్లాంట్ మేనేజర్ ఎ హనుమంతరావు, సిహెచ్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మాచర్ల, జనవరి 15: మాచర్ల నుండి కొప్పునూరు వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న సంఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలపాలైన సంఘటన సోమవారం రాత్రి పట్టణ శివారులోని కందిపప్పు మిల్లు వద్ద జరిగింది. వివరాల్లోకి వెళ్తే మాచర్ల నుండి 10 మంది ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. పట్టణ పొలిమేర సమీపంలోకి రాగానే గుర్తుతెలియని వాహనం ఆటోను ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాద విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పినె్నల్లి రామకృష్ణారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 సహాయంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో కొప్పునూరుకు చెందిన సాధు హనిమిరెడ్డి, బుడిగపోగు జ్యోతి, మేకల లక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సాధు హనిమిరెడ్డి (20) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మిగిలిన వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. అర్బన్ సిఐ కండే శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. పట్టణ మరియు సరిహద్దు ప్రాంతంలోని అన్ని చెక్ పోస్టులను అప్రమత్తం చేశారు.
సమైక్యాంధ్రపై చర్చించేందుకు ఢిల్లీకి పయనమైన మంత్రి కాసు
నరసరావుపేట, జనవరి 15: ఆంధ్ర రాష్ట్ర విభజనపై అధిష్టానంతో చర్చించించేందుకు మంగళవారం రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి హుటాహుటిన నరసరావుపేట నుండి ఢిల్లీకి పయనమయ్యారు. మంత్రులు విశ్వరూప్, ఏరాసు ప్రతాపరెడ్డి, టిజి వెంకటేష్, గంటా శ్రీనివాసరావు తదితరులు ఢిల్లీకి వస్తున్నట్లు మంత్రి కాసు తెలిపారు. మంత్రి శైలజానాథ్ పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీ ఉదయం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల క్లబ్‌లో జరిగే సమైక్యాంధ్ర సమావేశానికి మంత్రి కాసుతో పాటు జిల్లాలో ఉన్న మంత్రులందరికీ ఫోన్‌లో శైలజానాథ్ తెలియజేశారు. మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపిలు, పలువురు ప్రతినిధులకు ఫోన్‌చేసి హైదరాబాద్‌లో జరిగే సమావేశానికి హాజరు కావాలని కోరారు.
కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి, ఎంపి రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీలు రాయపాటి శ్రీనివాసరావు, టిజివి కృష్ణారెడ్డి, సింగం బసవపున్నయ్య, డిసిసి అధ్యక్షులు మక్కెన మల్లిఖార్జునరావు, మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, వరప్రసాద్, జెడి శీలం, ఎమ్మెల్యేలు మస్తాన్‌వలీ, వెంకటేశ్వరరెడ్డి, కాండ్రు కమల తదితరులతో ఫోన్ ద్వారా సమైక్యాంధ్రపై మాట్లాడారు.

గీత కార్మిక నేతలకు సన్మానం
భట్టిప్రోలు, జనవరి 15: గీత కార్మికులంతా ఐక్యంగా ఉండాలని ధూళిపూడి గీత కార్మిక సంఘం అధ్యక్షుడు వి నాగేశ్వరావు అన్నారు. మండలంలోని పల్లెకోన గ్రామంలో గత 30సంవత్సరాలుగా గీత కార్మిక సంఘ అద్యక్ష, ఉపాధ్యక్షులుగా పనిచేసిన రాఘవులు, సూర్యనారాయణకు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘన సన్మానం చేశారు. నాగేశ్వరావు మాట్లాడుతూ గీత కార్మికులు నిరంతరం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ జీవనం కొనసాగిస్తున్నారని, వారి మనుగడ కోసం ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. సంఘం అభివృద్ధికి, కార్మికుల శ్రేయస్సుకు ఎంతగానో కృషిజేసిన అధ్యక్ష, ఉపాధ్యక్షులను సత్కరించుకోవటం అభినందనీయం అన్నారు. అలాగే నూతన సంఘ అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎంపికైనా పడమటి రాంబాబు, మురాల వెంకటేశ్వరావులను కూడా సత్కరించారు. సంఘం పటిష్టతకు కృషిచేసి కార్మికుల శ్రేయస్సుకు అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని నాగేశ్వరావు సూచించారు. ఈకార్యక్రమంలో కార్మికులు పడమటి వెంకటేశ్వరావు, రాయని ప్రసాద్, ఎం శ్రీనివాసరావు, పి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

రాష్ట్రం
english title: 
g

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>