Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

జోరుగా కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్‌లు

$
0
0

ఒంగోలు, జనవరి 15: సంక్రాంతి పర్వదినం సందర్భంగా జిల్లాలోని పలుప్రాంతాల్లో కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్‌లు భారీగా జరిగాయి. ప్రత్యేకించి కనుమ రోజైన మంగళవారం జిల్లాలోని అనేకప్రాంతాల్లో కోడిపందేలు జరగ్గా పోలీసుల లెక్కల్లో మాత్రం పరిమితంగానే రికార్డులకెక్కాయి. జిల్లాలోని లింగసముద్రం, సిఎస్ పురం, హనుమంతునిపాడు, ఉలవపాడు, కొత్తపట్నం మండలాల్లో జోరుగా కోడిపందేలు జరిగినట్లు పోలీసు అధికారుల సమాచారం. కోడిపందేలు ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. జిల్లాలో కోడిపందేలు ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఆ హెచ్చరికలను లెక్కచేయకుండా పందెపురాయుళ్ళు లక్షల రూపాయల్లో బెట్టింగ్‌లకు పాల్పడ్డారు. జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి మాత్రం ఎప్పటికప్పుడు కోడెపందెం నిర్వాహకులపై నిఘా పెట్టారు. దీంతో కిందిస్ధాయి అధికారులు ఆయా మండల కేంద్రాల్లో ప్రత్యేక దృష్టిసారించి పందెపురాయుళ్ళపై కొరడా ఝుళిపించారు. పందెపుకోడిని వేల రూపాయలకు కొనుగోలుచేసి మరీ పందేల్లో పందెపురాయుళ్ళు పాల్గొంటున్నారు. ఒక్కొక్క కోడిని నెలల తరబడి పెంచి కుటుంబాలను గుల్లచేసుకుంటున్న పరిస్థితులు జిల్లాలో చోటుచేసుకుంటున్నాయి. ఇదిలాఉండగా భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య మంగళవారం జరిగిన వనే్డ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీగా బెట్టింగులు జరిగాయి. జిల్లాలోని ఒంగోలు, పామూరు ప్రాంతాల్లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. జిల్లాలో క్రికెట్ బెట్టింగ్‌లపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా భారత్ గెలుస్తుందని కొంతమంది, కాదు ఇంగ్లాండ్ గెలుస్తుందని మరికొంతమంది కోట్ల రూపాయల్లో బెట్టింగులకు పాల్పడినట్లు సమాచారం. బెట్టింగ్‌ల్లో కొందరు సులువుగా లక్షల రూపాయలను సంపాదిస్తుండటంతో ఆవైపు మొగ్గుచూపుతున్నట్లు పోలీసుల నిఘాలో తెలిసింది. దీంతో పోలీసులు టెక్నికల్ బృందాన్ని కూడా ఏర్పాటుచేసి ఆ వైపుగా దృష్టిసారించారు. కాగా సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలో మద్యం ఏరులైపారింది.
ప్రతిరోజు జిల్లావ్యాప్తంగా సుమారు రెండు కోట్ల రూపాయల మేర మద్యం విక్రయాలు జరుగుతాయి. కాని ఈ మూడురోజుల్లో రోజుకు మూడు నుండి నాలుగు కోట్ల రూపాయల వరకు మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖాధికారుల లెక్కల సమాచారం. మిగతా రెండు రోజుల కంటే కనుమ పండగ రోజున భారీగా మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది. మొత్తంమీద జిల్లావ్యాప్తంగా కోడిపందేలు, క్రికెట్ బెట్టింగ్‌లు భారీగా జరిగాయి.

ఉత్సాహంగా.. ఉల్లాసంగా..
సంక్రాంతి సంబరాలు
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 15: జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకున్నారు. కొత్తఅల్లుళ్ళు, బంధువులు, కుటుంబ సభ్యులతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని లోగిళ్ళు కళకళలాడాయి. సంక్రాంతి పండుగలో తొలిరోజైన భోగి పండుగ సందర్భంగా జిల్లావ్యాప్తంగా ప్రజలు భోగిమంటలు వేశారు. చిన్నారులకు భోగిపండ్లు పోశారు. రెండో రోజు సంక్రాంతి పండగ సందర్భంగా పితృదేవతలను గుర్తుచేసుకుని వారికి నూతన వస్త్రాలు, పొంగళ్ళు పెట్టుకుని స్మరించుకున్నారు. మూడో రోజైన మంగళవారం కనుమ పండగను జిల్లాప్రజలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో కోడిపందేలు జోరుగా జరిగాయి. ఎండ్లపందేలు, ముగ్గుల పోటీలు, స్కిప్పింగ్, మ్యూజికల్‌చైర్స్, టగాప్ ఆఫ్ వార్, స్లోసైక్లింగ్ పోటీలను నిర్వహకులు నిర్వహించారు. ఈపోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు. కాగా జిల్లాలోని పలుప్రాంతాల్లో పారువేట కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఒంగోలులోని గంటాపాలెం ప్రాంతంలో ఏర్పాటుచేసిన పారువేట కార్యక్రమానికి నగరప్రజలు వేలాది సంఖ్యలో తరలివెళ్ళారు. ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ పారువేట కార్యక్రమానికి తరలించారు. ఈసందర్భంగా భక్తులు ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. పండగ సందర్భంగా హైదరాబాద్ నుండి జిల్లాకేంద్రమైన ఒంగోలుకు మూడువందల ఆర్‌టిసి బస్సులను అధికారులు నడిపారు. దీంతో ఆయా ప్రాంతాల నుండి బస్సుల ద్వారా ప్రయాణీకులు జిల్లాకు భారీగా చేరుకున్నారు. వారు తిరుగు ప్రయాణం అయ్యేందుకు ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేశారు. ఇదిలాఉండగా సంక్రాంతి పండగ సందర్భంగా జిల్లాలోని ప్రముఖ ఆలయాలను ముస్తాబు చేశారు. రంగు రంగుల విద్యుత్ కాంతులతో దేవాలయాలు వెలిగిపోయాయి. వేలాది సంఖ్యలో భక్తులు దేవాలయాలకు తరలివచ్చి తమ కోర్కెలను తీర్చుకున్నారు. కాగా పండుగ సందర్భంగా కోట్ల రూపాయల్లో చిల్లర వ్యాపారం జరిగింది. అయితే వస్త్ర దుకాణాల్లో మాత్రం వ్యాపారులు అనుకున్న స్థాయిలో వ్యాపారం జరగలేదు. జిల్లావ్యాప్తంగా సంక్రాంతి పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకున్నారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్‌పి కొల్లి రఘురామిరెడ్డి పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

8 నుండి ఒంగోలులో రచయితల మహాసభలు
ఒంగోలు అర్బన్, జనవరి 15: తెలుగుభాష, సంస్కృతి వికాస సంవత్సరంలో వచ్చే నెల 8, 9, 10 తేదీలలో ఒంగోలులోని తిరుమల తిరుపతి దేవస్థానం కల్యాణ మండపంలో 7వ రాష్టస్థ్రాయి రచయితల మహాసభలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి, కార్యదర్శి పొన్నూరు వేంకట శ్రీనివాసులు, కోశాధికారి కె బాలకృష్ణారెడ్డిలు తెలిపారు. మంగళవారం రచయితల మహాసభలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి వారు మాట్లాడారు. వచ్చే నెల 8వ తేదీ శుక్రవారం పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ ఎల్లూరి శివారెడ్డి పతాకావిష్కరణ చేస్తారన్నారు. అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్దప్రసాద్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. ముఖ్యఅతిధిగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డాక్టర్ దగ్గుబాటి పురంధ్రీశ్వరి పాల్గొంటారన్నారు. ఆత్మీయ అతిధులుగా శాసనమండలి సభ్యుడు శిద్ధా రాఘవరావు, పర్చూరు శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డి, ఆనంద్ గ్రానైట్స్ అధినేత పర్వతరెడ్డి ఆనంద్, రామ్‌కీ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ఆళ్ళ దాక్షాయణీరెడ్డి పాల్గొంటారన్నారు. ఈ సభలో ప్రకాశంజిల్లా నేటి కవులు, ఎర్రన జనజీవన చిత్రాల పుస్తకావిష్కరణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే సాహితీ సంస్థల నిర్వాహకులకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం 6 గంటలకు గిన్నీస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు గ్రహీత, కళారత్న డాక్టర్ గజల్ శ్రీనివాస్‌చే విభావరి ఉంటుందన్నారు. భోజన అనంతరం కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 9వ తేది శనివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మొదటి సాహిత్య సభ జరుగుతుందన్నారు. ఈ సభకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ అధ్యక్షత వహిస్తారన్నారు. ప్రముఖ కథా విశే్లషకులు వాసిరెడ్డి నవీన్, కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావులు ముఖ్యఅతిధులుగా పాల్గొంటారన్నారు. సాంప్రదాయ సాహిత్యంలో స్ర్తి అనే అంశంపై పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మృణాళిని మాట్లాడతారన్నారు. తెలుగు సాహిత్యంపై వివిధ వాదాల ప్రభావం అనే అంశంపై ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎస్‌వి సత్యనారాయణ మాట్లాడతారని, తెలుగు సాహిత్యం, మార్క్స్ ప్రభావం అనే అంశంపై వీక్షణం పత్రికా సంపాదకులు ఎస్ వేణుగోపాల్ మాట్లాడతారన్నారు. భోజన అనంతరం కవి సమ్మేళనం జరుగుతుందన్నారు. శనివారం సాయంత్రం 3 గంటల నుండి 6 గంటల వరకు రెండవ సాహిత్య సభ జరుగుతుందన్నారు. ఈ సభకు ప్రముఖ రచయిత్రి ఓల్గా అధ్యక్షత వహిస్తారన్నారు. అతిధులుగా ఆ.ర.సం రాష్ట్ర అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీనారాయణ, నెల్లూరు రచయితల సంఘం అధ్యక్షులు ఎ జయప్రకాష్ పాల్గొంటారన్నారు. శ్రీశ్రీ సాహిత్యం అనే అంశంపై ప్రముఖ సాహితీ విశే్లషకులు తెలకపల్లి రవి, గురజాడ సాహిత్యం అనే అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే, ఇరుగు - పొరుగు తెలుగు అనే అంశంపై తెలుగు భాషోద్యమ కార్యకర్త రమేష్ మాట్లాడతారన్నారు. 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మూడవ సాహిత్య సభ జరుగుతుందన్నారు. ఈ సభకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె శివారెడ్డి అధ్యక్షత వహిస్తారన్నారు. అతిధులుగా ప్రముఖ కవి దేవీప్రియ, గుంటూరు జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు సోమేపల్లి వెంకటసుబ్బయ్య పాల్గొంటారన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటల నుండి 7 గంటల వరకు ముగింపు సభ జరుగుతుందన్నారు. ఈ సభకు ముఖ్యఅతిధులుగా లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ, విశిష్ట అతిధిగా ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొంటారన్నారు. మహా సహస్రావధాని, ధారణా బ్రహ్మరాక్షసుడు డాక్టర్ గరికపాటి నర్సింహారావు ప్రధాన ఉపన్యాసకులుగా పాల్గొంటారన్నారు. అనంతరం ప్రతినిధులను ప్రశంసా పత్రం, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించనున్నట్లు వారు తెలిపారు.

కాంగ్రెస్‌కు కాలం చెల్లింది
దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి విమర్శ
చీమకుర్తి, జనవరి 15: కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, రాబోవు అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని పడగొడతామని దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం రాత్రి చీమకుర్తిలో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హాజరైన శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ను ముఖ్యమంత్రి చేసి తీరుతామన్నారు. కాంగ్రెస్ కల్లబొల్లి మాటలతో ప్రజలను మోసం చేస్తోందని ధ్వజమెత్తారు. పన్నులు, కరెంట్ సర్‌చార్జీలు విధించి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. మాజీ ఎమ్మెలే బూచేపల్లి సుబ్బారెడ్డి మాట్లాడుతూ చీమకుర్తి సొసైటీని వైఎస్‌ఆర్‌సిపి తప్పకుండా దక్కించుకుంటుందని స్పష్టం చేశారు. బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖరరెడ్డి అని, వారికెప్పుడు రుణపడి ఉంటామన్నారు. తామెప్పుడు పార్టీని వీడలేదని, జిల్లాలో మొదటి సభ్యత్వం తమదేనన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు ఫ్లెక్సీలలో తమ ఫొటోలను వాడుకోవడంపై హెచ్చరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిష్టపాటి వెంకటేశ్వరరెడ్డి, పత్తి బాలకోటయ్య, రావులపల్లి కోటేశ్వరరావు, దుడ్డు మార్కు, మేకల రాజశేఖరరెడ్డి, దశరధరామిరెడ్డి, అంబటి వెంకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్వగ్రామంలోనే ఎంతో ఆనందం
సినీనటుడు గిరిబాబు స్పష్టం
మేదరమెట్ల, జనవరి 15: స్వగ్రామంలో కొద్దిరోజులు కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో గడిపితే రీచార్జ్ అవుతానని సినీనటుడు గిరిబాబు తెలిపారు. సోమవారం బొడ్డువానిపాలెంలో రామాలయం వద్ద జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలోని వారికి తన స్వగ్రామం రావినూతలని, ఎన్‌టిఆర్‌ది నిమ్మకూరు, కృష్ణది బుర్రిపాలెం అని తెలుసని, మిగతా నటుల స్వగ్రామాలు పెద్దగా ఎవరికీ తెలియవన్నారు. తాము పుట్టిన ఊరికి తరచు పండుగలకు రావడంతో తమ గ్రామాల గురించి వారందరికీ తెలిశాయన్నారు. తాము కూడా ఆత్మీయులతో గ్రామంలో కొంతకాలం గడిపినందువల్ల ఉత్సాహంగా తిరిగి తమ కార్యకాలపాల్లో పాల్గొంటామన్నారు. అనంతరం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా మోటార్‌సైకిల్ పోటీలను ప్రారంభించారు. ముగ్గుల పోటీలలో ప్రథమ, ద్వితీయ బహుమతులు పొందిన చింత విజయలక్ష్మి, నేరెళ్ళ కవితలకు ఆయన బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మనుమడు నాగరత్నబాబు, గ్రామస్థులు, నేరెళ్ళ సుబ్బయ్య, పెద్దబ్బి, ఇమ్మడిశెట్టి ఆంజనేయులు, పేరిరెడ్డి, సిద్దంశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

పండుగనాడు కూరగాయల వ్యాపారుల నిలువుదోపిడి
మార్కాపురం, జనవరి 15: సంక్రాంతి పర్వదినాన్ని దృష్టిలో పెట్టుకున్న కూరగాయల వ్యాపారులు మార్కెట్‌లో వేలంపాట ఏర్పాటు చేసి కేవలం మూడు దుకాణాలకే అనుమతి ఇవ్వడంతో వారు ధరలను భారీగా పెంచి వినియోగదారులను దోచుకున్నారు. మార్కెట్‌లో వ్యాపారం చేసేవారు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు వేలంపాటలు నిర్వహించి వాటి ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కుటుంబానికి అందించడం మార్కాపురం కూరగాయలమార్కెట్‌లో ఆనవాయితీ. అయితే ఈఏడాది సంక్రాంతి పండుగ మూడురోజులపాటు కూరగాయల మార్కెట్‌లో పూర్తిస్థాయి దుకాణాలు తెరవకుండా పాట నిర్వహించి మూడు దుకాణాలు మాత్రమే ఉండేవిధంగా చర్యలు తీసుకోవడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. ఎప్పుడూ 20రూపాయలకు మించని బంగాళదుంప 30 నుంచి 35రూపాయల వరకు విక్రయించారు. ఇక దొండ, బెండ, వంగ, పొట్ల, కాకరకాయలు 50 నుంచి 60రూపాయలకు విక్రయించడంతో వినియోగదారులు కొనలేక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈవిషయంపై వ్యాపారులను ప్రశ్నిస్తే సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు మార్కాపురం వచ్చే అవకాశం లేదని, దీనితో వ్యాపారాలు ఉండవని తాము వేలంపాటలు నిర్వహించామని, అందువలన కూరగాయల ధరలు పెరిగిన మాట వాస్తవమేనని అంగీకరించారు.

రహదారుల అభివృద్ధికే పెద్దపీట : ఎమ్మెల్యే సుఠేష్
యర్రగొండపాలెంరూరల్, జనవరి 15: నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికే పెద్దమొత్తంలో నిధులు కేటాయించినట్లు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొర్రపోలు నుంచి వైచెర్లోపల్లి వరకు 1.9కోట్లు, కుంట నుంచి త్రిపురాంతకం వరకు 1.8కోట్లు, త్రిపురాంతకం నుంచి మిరియంపల్లి వరకు 1.10కోట్లు, కెజి రోడ్డు నుంచి సంఘంతాండ వరకు 1.30కోట్లతో రోడ్ల అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే తాము నియోజకవర్గ పరిధిలో పలుప్రాంతాల్లో 15కోట్లతో రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశామని తెలిపారు. త్వరలో జాతీయ రహదారి మాచర్ల నుంచి వైపాలెం, తోకపల్లి, మార్కాపురం, బేస్తవారపేట వరకు నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈసందర్భంగా తెలంగాణపై ఎమ్మెల్యే అభిప్రాయం అడుగగా కాంగ్రెస్ అధిష్ఠాన నిర్ణయం అందరికీ శిరోధార్యమని, తెలంగాణను ఏర్పాటు చేస్తే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఇప్పటికే సమైక్యవాదానే్న సమర్థిస్తున్నానని తెలిపారు. ఈసమావేశంలో మాజీఎంపిపి ఎంసిహెచ్ మంత్రునాయక్ పాల్గొన్నారు.

యువకుడి అనుమానాస్పద మృతి
చీరాల, జనవరి 15: అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన పేరాల జక్కావారివీధిలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మృతుడి తల్లి దీనమ్మ వివరాల మేరకు తన ఇద్దరు కుమారులు ఆదివారం రాత్రి మద్యం సేవిస్తూ గొడవ పడుతుండగా తాను గొడవ పడవద్దని పడుకోమని సర్దిచెప్పానని తెలిపింది. ముందు నీవు పడుకో అని చెప్పి వారు తనను అక్కడి నుంచి పంపించివేశారని పేర్కొంది. కాగా సోమవారం ఉదయం నిద్రలేచి చూసేసరికి తన చిన్న కుమారుడు విజయ్‌కుమార్ మృతి చెంది ఉన్నాడని పోలీసులకు తెలిపింది. మృతుడు విజయ్‌కుమార్ ఓ చిట్‌ఫండ్స్ సంస్థలో పనిచేస్తున్నాడు. పెద్ద కుమారుడు అమృతబాబు సోమవారం ఉదయం ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఈమేరకు సోమవారం సాయంత్రం టూ టౌన్ పోలీసుస్టేషన్‌లో దీనమ్మ ఫిర్యాదుచేసింది. డిఎస్‌పి డి నరహర, టూటౌన్ సిఐ జి రవికుమార్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.

విరిగిన రైలు పట్టా
చినగంజాం, జనవరి 15: స్థానిక బస్టాండ్ సమీపంలోని రైల్వేగేటు వద్ద అప్‌లైన్‌లో మంగళవారం రైలు పట్టా విరిగింది. దీంతో పలు రైళ్ళు నెమ్మదిగా నడిచాయి. రైల్వే సిబ్బంది మరమ్మతు పనులను పూర్తిచేసి రైళ్ళను యథావిధిగా నడిపారు.

చోరీ గురైన బంగారం పట్టివేత
కనిగిరి రూరల్, జనవరి 15: పట్టణంలో గత ఏడాది సెప్టెంబర్‌లో స్థానిక ఆంధ్రాబ్యాంకు రోడ్డులో నివశిస్తున్న చెన్న అనంతసుబ్రహ్మణ్యం ఇంట్లో చోరీకి గురైన బంగారం, వెండి, చోరీ చేసిన వ్యక్తి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక సిఐ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్న సుల్తాన్‌వలి అనే వ్యక్తి పట్టణంలోని ఆంధ్రాబ్యాంకు రోడ్డులోగల చెన్న అనంత సుబ్రహ్మణ్యం ఇంటిలో చోరీకి పాల్పడ్డాడని ఆయన చెప్పారు. చోరీ ఘటనలో సుమారు 60సవర్ల బంగారం, మూడు కేజిల వెండి చోరీకి గురైనట్లు బాధితులు ఫిర్యాదు చేశారని తెలిపారు. నింధితుడు సుల్తాన్‌వలిని నెల్లూరు పోలీసులు ఒక కేసుకు సంబంధించి అదుపులోకి తీసుకోని విచారించగా కనిగిరిలో జరిగిన చోరీ విషయం బయట పడడంతో కనిగిరి సిఐ కరుణాకర్ నేతృత్వంలో చోరీ ఘటనపై పూర్తి విచారణ చేపట్టగా నింధితుడు సుల్తాన్‌వలి నుంచి యాభై ఏడున్నర సవర్ల బంగారం, ఒక కేజి వెండిని స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ 14.50లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. నింధితుడు సుల్తాన్‌వలిని పిటి వారెంట్‌పై కనిగిరికి తీసుకువచ్చి కేసు నమోదుచేసి కోర్టులో హాజరు పరుచగా నింధితుడికి రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. సమావేశంలో సిఐ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంక్రాంతికి ఏరులై పారిన మద్యం
english title: 
p

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>