నెల్లూరుఅర్బన్, జనవరి 15: నగరంలోని వేదాయపాళెం సెంటర్‌లో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్‌లో దొంగలు చోరీకియత్నించిన సంఘటన మంగళవారం అర్ధరాత్రి జరిగింది. సోమవారం అర్ధరాత్రి 11.40 గంటల ప్రాంతంలో వేదాయపాళెంలోని ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయం నుండి భారీగా పొగ రావడాన్ని గమనించిన స్థానికులు అగ్నిమాపక, ఐదవ నగర పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇదిలావుండగా ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయానికి ఉన్న కిటికి గ్రీల్స్‌ను తొలగించి ఉండటాన్ని చూస్తుంటే కంప్యూటర్లను దగ్ధం చేసింది దొంగల పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఫైనాన్స్ కార్యాలయంలో బంగారం కానీ, నగదు కానీ ఏమీ దొరకకపోవడంతో దొంగలు కంప్యూటర్లను, ఇతర సామగ్రికి నిప్పు అంటించి పారిపోయారని వినికిడి. ఈ సంఘటనపై మంగళవారం ఐదో నగర సిఐ రాజశేఖర్‌రెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
నవలాకుల తోటలో కొలువుదీరిన దేవతలు
నెల్లూరు కల్చరల్, జనవరి 15:కనుమ పండుగను పురస్కరించుకుని మంగళవారం స్థానిక నవలాకులతోటలో నగరానికి చెందిన దాదాపు 18 దేవాలయాలనుండి విచ్చేసిన దేవతామూర్తులు కొలువుదీరి భక్తులకు దర్శమిచ్చారు. ఈ వేడుకలను తిలకించేందుకు వచ్చిన వేలాది భక్తజనంతో నవలాకులతోట, స్టోన్‌హౌస్‌పేట, నవాబుపేట, పరిసరాలు సందడిగా కనిపించాయి. స్టోన్ హౌస్‌పేటలోని కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్ధానం నుండి నవాబుపేట నవలాకులతోట చివరివరకు నగరంలోని వివిధ ఆలయాల నుండి విచ్చేసిన దేవతలు దేవేరులతో కలిసి కొలువుదీరారు. కనుమపండుగ రోజు దేవతలు వన విహారానికి రావడం తరతరాలుగా ఆచారంగా వస్తోంది. నేడు దేవతలు కొలువైన నవలాకులతోట గతంలో పెద్దపెద్ద వృక్షాలతో, వేలాది పుష్పజాతుల చెట్లతో కన్నుల పండువగా ఉండేదని, కనుమ పండుగరోజు దేవతలందరినీ ఇక్కడకు తీసుకువచ్చి సంబరాలు జరుపుకునేవారని పెద్దలు చెపుతారు. కాలక్రమంలో నవలాకులతోట ప్రాంతంలో చెట్టు తరిగిపోయి జనావాసాలుగా మారినా దేవతలు కొలువుదీరే ఆచారం మాత్రం నేటికీ కొనుసాగుతుండడం విశేషం.
స్టోన్‌హౌస్‌పేటలోని కన్యకాపరమేశ్వరి ఆలయం, బివిఎస్ బాలికోన్నత పాఠశాల, నవాబుపేట పోలీస్‌స్టేషన్, మహాలక్ష్మి ఆలయం, రామాలయం, మసీదు సెంటర్, జాఫర్ కాలువ, నవలాకులతోట వరకు దేవతలు కొలువుదీరి భక్తులకు ఆశీస్సులందించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో రోడ్లపై షామ్యానాలు,చలువ పందిళ్లు ఏర్పాటుచేసి దేవతలను నిలిపి ప్రత్యేక అలంకారాలు, పూజలు నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు అందచేశారు. కన్యకాపరమేశ్వరి అమ్మవారు, మూలపేట వేణుగోపాలస్వామి, ఉస్మాన్ సాహెబ్‌పేట, నవాబుపేట, మూలపేట శివాలయాలు, వేదాయపాళెం అయ్యప్పస్వామి ఆలయం, డైకస్‌రోడ్డు ఉమామహేశ్వరాలయం, వెంకయ్యస్వామి, షిర్డిసాయిబాబా మందిరాలు, మహాలక్ష్మి అమ్మవారు, పప్పులవీధి వినాయకుడు, రంగనాధస్వామి, నరసింహస్వామి, ఉడయవర్లు స్వామి తదితర దేవతామూర్తులు ఈ ప్రాంతాల్లో కొలువుదీరి భక్తులకు కనువిందు చేశారు.
నగరంలోని వివిధ ప్రాంతాలనుండి చిన్నపెద్దా, మహిళలు, యువకులు తేడాలేకుండా అందరూ నవలాకులతోటలో కొలువైన దేవతలను దర్శించుకునేందుకు తరలిరావడంతో ఈ ప్రాంతాలు కిక్కిరిసాయి. ఈసందర్భంగా దారి పొడవునా ఆటబొమ్మలు, మిఠాయిలు, చెరకురసం, ఐస్‌క్రీంల దుకాణాలు వెలిసాయి. ఈసందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగుకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటుచేశారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు చర్యలు తీసుకున్నారు. పోకిరీల ఆటలు కట్టించేందుకు, అనుమానితులపై నిఘా ఉంచేందుకు మఫ్టీలో పోలీసులను నియమించారు. ఈకార్యక్రమాల్లో నగర శాసనసభ్యులు ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డితోపాటు పలువురు అధికారులు, అనధికారులు,పుర ప్రముఖులు, రాజకీయ నాయకులు, నగర ప్రజలు పాల్గొన్నారు.
జిల్లాలో కొత్తగా 25 మీసేవ కేంద్రాలు
పొదలకూరు, జనవరి 15: జిల్లాలో కొత్తగా 25 మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం పేర్కొన్నారు. పొదలకూరులోని మీసేవ కేంద్రాన్ని మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీసేవ ద్వారా ప్రస్తుతం 49 రకాల సేవలు అందుతున్నాయని, వీటిని త్వరలో వందకు పెంచుతామన్నారు. మీసేవలో కేటగిరి-ఎ,బిలు ఉన్నాయని, ఎ కేటగిరి సేవలను దరఖాస్తు చేసుకున్న 15 నిమిషాల్లో ఇవ్వాలని, బి కేటగిరిలో కాలపరిమితిని బట్టి మంజూరు చేయాలని సూచించారు. మీసేవ కేంద్రాలలో దరఖాస్తులు పెండింగ్‌లో లేకుండా సత్వర సేవలు అందించేలా ఆర్డీవో, తహశీల్దార్‌లు తరచుగా తనిఖీలు చేపట్టాలని కోరారు. ఆర్డీవో సేవలైన రేషన్ దుకాణాల రెన్యువల్స్, ఎన్‌ఎఫ్‌బిఎఫ్, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను కూడా మీసేవలో అనుసంధానం చేయనున్నట్టు చెప్పారు. పొదలకూరు డిప్యూటీ తహశీల్దార్ షఫీమాలిక్ ఆయన వెంట ఉన్నారు.
త్వరలో చెరకు రైతుల
బకాయిలు విడుదల
కోవూరు, జనవరి 15: త్వరలోనే చెరుకు రైతులకు చెల్లించాల్సిన 11 కోట్ల 50 లక్షల బకాయిలను చెల్లించనున్నట్టు జిల్లా కలెక్టర్ బి శ్రీ్ధర్ తెలిపారు. మంగళవారం కోవూరు చక్కర కర్మాగారాన్ని ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కర ఫ్యాక్టరీకి సంబంధించిన కొన్ని సమస్యలను భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. 3.50 కోట్ల రూపాయలతో ఫ్యాక్టరీ మరమ్మతులు చేయించాలని అయితే క్రషింగ్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు పలు దఫాలు మరమ్మతులకు గురైందని తమ దృష్టికి తీసుకొచ్చారన్నారు. పర్మినెంట్ చీఫ్ ఇంజనీర్‌ను నియమించాలని కోరామన్నారు. ఫ్యాక్టరీలో కొన్ని అవకతవకలు జరిగాయని, ఫ్యాక్టరీ ఎండిపై విచారణ జరిపించాలని కలెక్టర్‌ను వారు కోరారు. ఇప్పటి వరకు 7 వేల టన్నుల చెరుకు క్రషింగ్ జరిగిందన్నారు. ఫ్యాక్టరీలో ఎండిపోయిన చెరుకుకు 20 శాతం డ్యామేజీని ఇవ్వాలని కిసాన్ సంఘ్ నాయకులు కలెక్టర్‌ను కోరారు. వెంకటేశ్వరపురం ఫ్లయిఓవర్ బ్రడ్జి నుండి షుగర్ ఫ్యాక్టరీ వరకు రహదారులు గుంతల మయంగా ఉన్నాయని, చెరుకును ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లలో ఫ్యాక్టరీకి సరఫరా చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొళ్ళారు. ఈసమస్యలను వెంటనే పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన మరిన్ని సమస్యలపై విచారణ జరిపించి రైతులకు న్యాయం చేస్తామన్నారు.
కమలానందభారతి అరెస్టుకు నిరసనగా
సిఎం దిష్టిబొమ్మ దగ్ధం
నెల్లూరుసిటీ, జనవరి 16: కమలానంద భారతిస్వామి అరెస్టుకు నిరసనగా బిజెపి,విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం విఆర్సీ సెంటర్‌లో రాస్తారోకో, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈసందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షుడు పి సురేంద్రరెడ్డి మాట్లాడుతూ కమలానందస్వామి అరెస్టు అక్రమమని, మైనార్టీలను ప్రత్యేకంగా ఎంఐఎంను బుజ్జగించడం కోసమే స్వామిజీని అరెస్టు చేశారని తెలిపారు. జీవితాలను సన్యసించిన సన్యాసులను ఈ రాష్ట్ర ప్రభుత్వం జైలుకు పంపడంక్షమించరాని తప్పిదమన్నారు. కమలానంద స్వామి ఏ మతాన్ని కించపరచకుండా అక్బరుద్దీన్ వ్యాఖ్యలను తప్పుపట్టినందుకు ఒక తీవ్రవాదిని అదపులోకి తీసుకున్నట్లు ఒక స్వామిజీని పండుగ నాడు ఆచరించాల్సిన విధులను చేయనీయకుండా అరెస్టు చేసినందుకు తక్షణమే స్వామిజీని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి మెంటారామమ్మోహన్‌రావు మాట్లాడుతూ హిందూ ధర్మం గురించి అవహేళన చేసి అక్బరుద్దీన్ ప్రసంగాన్ని ఖండించిన స్వామిజీలను అరెస్టు చేయడం అధికార కాంగ్రెస్ కుహనాలౌకిక వాదాన్ని బహిర్గతం చేస్తుందన్నారు. రాజ్యాంగానే్న సవాలు చేసిన ఒవైసీపై చర్యలు తీసుకోకుండా హిందూవుల మనోభావాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న సిఎం తమ విధానాలను మార్చుకోకపోతే ఆ పార్టీని హిందూవులు గంగలోకలుపుతారని హెచ్చరించారు. కమాలనందస్వామిని వెంటనే విడుదల చేయకపోతే హిందూవులు ఉద్యమిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కర్నాటి ఆంజనేయలురెడ్డి, మిడతల రమేష్, ఈశ్వరయ్య, వై రాజేష్, ఆత్మకూరు అంకయ్య, ప్రభాకర్, చిలకపాటి శ్రీనివాసులు, సురేష్ తదితరులు పాల్గొన్నా.రు.
వృద్ధులకు చీరలు పంపిణీ
కొండాపురం, జనవరి 15: మండలంలోని తూర్పు ఎర్రబల్లి గ్రామంలో సొసైటీ ఫర్ డెవలప్‌మెంట్ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో బుధవారం 25మంది వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆ సంస్థ అధ్యక్షులు టి తిరుపతయ్య మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యక్షులు తడకలూరి శ్రీనివాసులు మాట్లాడుతూ తమ సంస్థ పేద ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని వీటికి ప్రజల సహకారం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.
ఘనంగా సంక్రాంతి, కనుమ
కొడవలూరు, జనవరి 15: సోమ, మంగళవారాల్లో సంక్రాంతి, కనుమ పండుగలను సాంప్రదాయబద్ధంగా భక్తిశ్రద్ధలతో మండల ప్రజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటా ముత్యాల ముగ్గులు అలంకరించారు. అలాగే పిల్లలు గాలిపటాలు, వాలీబాల్, క్రికెట్ ఆటలతో కోలాహలంగా గ్రామాలలో పండుగ జరుపుకున్నారు. కనుమ పండుగ సందర్భంగా గోమాతకు పూజలు చేశారు. ఈసందర్భంగా పశువులకొమ్ములకు రంగులు వేసి అలంకరించి భక్తిశ్రద్ధలతో వాటికి పూజలు చేశారు.
కలిగిరిలో
సంక్రాంతి పండుగలో భాగంగా సోమవారం పెద్దపండుగ కార్యక్రమాన్ని ప్రజలుఘనంగా జరుపుకున్నారు. పెద్దలకు బట్టలను పెట్టుకుని వారిని గుర్తుచేసుకున్నారు. చివరి రోజైన కనుమరోజు కాట్రాయునికి గొబ్బమ్మలతో ఇళ్ళను నిర్మించి కోళ్ళను, పొంగళ్ళను సమర్పించారు. పశువుల పండుగగా పిలుచుకునే కనుమరోజు పశువులను, చెట్లను పూజించారు.
విడవలూరులో
సంక్రాంతి పర్వదినాన్ని మండలంలో ప్రజానీకం ఆనందోత్సహంగా జరుపుకున్నారు. పితృదేవతలకు తర్పణాలు వదిలారు. పెద్దల సమాధుల వద్దకు వెళ్ళి నివాళులర్పించారు. విడవలూరులో గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఆటల పోటీలు మంగళవారంతో ముగిసాయి. తెలుగుదేశంపార్టీ ఆధ్వర్యంలో జరిగిన పోటీలలో గెలుపొందిన విజేతలకు జిల్లా తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు బహుమతి అందచేసారు. అదే విధంగా పొన్నపుడి లక్ష్మిపురంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా ముగ్గులపోటీలు ఆటల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు మండల టిడిపి అధ్యక్షులు బెజవాడ వంశీకృష్ణారెడ్డి, బిసి సెల్ అధ్యక్షులు చిమటా వెంకటేశ్వర్లు బహుమతులు అందజేశారు. నిర్వాహకులు పోలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తుమ్మగుంటలో వేడుకగా మకరజ్యోతి దర్శనం
మండలంలోని తుమ్మ గుంట గ్రామంలో అపరశబరిమలగా వెలిసియున్న అయ్యప్పస్వామి క్షేత్రంలో సోమవారం రాత్రి మకర జ్యోతి దర్శినం వేడుకగా నిర్వహించారు. ఆలయ పైభాగాన కర్పూర జ్యోతిని వెలిగించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని జ్యోతి దర్శనం చేసుకున్నారు. అనంతరం అయ్యప్పస్వామి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రశేఖర గురుస్వామలు మకర సంక్రాంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎర్రంరెడ్డి రాధాకృష్ణారెడ్డి, ఇఓ మల్లిఖార్జునరెడ్డి పాల్గొన్నారు.
కొండాపురంలో
సంక్రాంతి సందర్భంగా సోమవారం మండలంలోని తూర్పు ఎర్రబల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సుమారు 50మంది మహిళలు పాల్గొని ముగ్గులువేశారు. మొదటి స్థానంలో ధనలక్ష్మి రైస్‌కుక్కర్‌ను గెలుపొందింది. 2వస్థానం పొందిన లక్ష్మికి డిన్నర్‌సెట్ బహుమతి, మూడవస్థానం పొందిన సి విజయలక్ష్మికి నాన్‌స్ట్రిక్‌కుక్‌వేర్‌ను బహుమతిగా ఇచ్చారు. 20మందికి కన్షలేషన్ బహుమతులు అందచేసారు. గ్రామానికి చెందిన గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఈపోటీలు జరిగాయి.
పూర్వ విద్యార్థుల కలయుక
కొండాపురం, జనవరి 15: మండలంలోని సాయిపేట గ్రామంలో సోమవారం పదోతరగతి చదివిన 199091బ్యాచ్ విద్యార్థులు ఒక్కటయ్యారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్జ్రాక్, అప్పటి ప్రధానోపాధ్యాయులు కంకణాల రామమూర్తి, మరో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కొండలరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వారిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థి మక్కెన అంకయ్య చౌదరి విద్యార్థులకు ఆంగ్లనిఘంటువు అందించారు. ఈసందర్భంగా రామమూర్తి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థానాలకు చేరాలన్నారు. పూర్వ విద్యార్థి వెంకటరావు మాట్లాడుతూ వారు పాఠశాల అభివృద్ధి కోసం తమ బ్యాచ్ విద్యార్థులు నిధుల సేకరణ చేసి అభివృద్ధిని చేస్తామన్నారు. ఇందులో భాగంగా త్వరలో పాఠశాలలో సభావేదిక నిర్మాణం ఏర్పాటుచేయనున్నట్లు తెలిపారు.
ఎస్‌ఐకి ఘన సన్మానం
విడవలూరు, జనవరి 15: స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎంఆర్‌పిఎస్ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఆలీసాహెబ్‌ను సోమవారం ఘనంగా సత్కరించారు. మండలంలో ఎస్‌ఐ చేసిన సేవల గురించి ఎంఆర్‌పిఎస్ మండలశాఖ అధ్యక్షులు శ్రీనివాసులు కొనియాడారు. ఈకార్యక్రమంలో వికలాంగుల సంఘం అధ్యక్షులు టివి శేషయ్య, నాయకులు సుబ్రహ్మణ్యం, వెంకయ్యలు పాల్గొన్నారు.
‘టెలిఫోన్ అదాలత్ ద్వారా సమస్యలు పరిష్కరించుకోండి’
గూడూరు, జనవరి 15: భారత్‌సంచార నిగమ్ లిమిటెడ్ వినియోగదారుల సౌలభ్యం కోసం 16న టెలిఫోన్ అదాలత్‌ను నిర్వహిస్తున్నట్లు ఈ అవకాశాన్ని టెలిఫోన్ బకాయిలున్న వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని బిఎస్‌ఎన్‌ఎల్ సబ్‌డివిజనల్ ఇంజనీర్ (గ్రూప్స్) కె సంపత్‌కుమార్ కోరారు. మంగళవారం ఆయన కార్యాలయంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గూడూరు బిఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో బుధవారం ఈ టెలిఫోన్ అదాలత్ నిర్వహిస్తామని, బిల్లులు బకాయిలున్న వారు బకాయిలను వాయిదా పద్దతిలో చెల్లించి తమ టెలిఫోన్ కనెక్షన్‌ను తిరిగి పునరుద్ధరించుకోవాలని కోరారు. కాగా సిజిఎంటి హైదరాబాద్ ఆదేశాల మేరకు జిల్లా మేనేజర్ గోపి ఆధ్వర్యంలో ఈనెల 3వ తేది నుండి 23వ తేదీ వరకు రీకనెక్షన్ మేళా నిర్వహిస్తున్నట్టు, ఈ మేళాలో సులభవాయిదాల్లో తమ బకాయిలను చెల్లించుకుని తక్షణం రీకనెక్షన్ పొందాలని ఆయన వినియోగదారులను కోరారు. బకాయిల మొత్తం మూడువేల రూపాయలుంటే 5 వాయిదాలు, 3 వేలు దాటినట్లయితే 10 వాయిదాలలో తమ బకాయిలను చెల్లించుకునే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు. బిఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు లెట్‌మీప్లీజ్ ద కస్టమర్ అనే దృక్పథంతో బిఎస్‌ఎన్‌ఎల్ సంస్థ అందిస్తున్న ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్‌కు సంబంధించి అద్భుత ఆఫర్లు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జెటివో ఎవి శ్రీనివాసరావు, సీనియర్ సూపర్‌వైజర్లు అరవ పార్వతయ్య, ముస్టాక్ అహ్మద్ పాల్గొన్నారు.
ఘనంగా సంక్రాంతి సంబరాలు
గూడూరు, జనవరి 15: సంక్రాంతి సంబరాలను గ్రామీణ ప్రజలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. సోమవారం మకర సంక్రాంతి రోజున తమ పితృదేవతలకు పొంగళ్లను నైవేధ్యంగా సమర్పించి ఉపవాసాలు ఉండి తర్పణాలు వదిలిపెట్టారు. మూడవ రోజైన మంగళవారం పశువుల పండుగను పశువుల యజమానులు నిర్వహించుకున్నారు. వాటి కొమ్ములకు రంగులు పూసి పొంగళ్లను నైవేధ్యంగా సమర్పించారు. అదే విధంగా గ్రామశక్తి ఆలయంలో కూడా పెద్దసంఖ్యలో గ్రామాలలోని మహిళలు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. డివిజన్ పరిధిలోని డక్కిలి మండలం దగ్గవోలు గ్రామంలో గ్రామశక్తి అయిన తాళమ్మకు గ్రామస్థులు పెద్దసంఖ్యలో ఆలయం వద్ద పొంగళ్లు పెట్టి అమ్మవారికి నైవేధ్యం సమర్పించారు. అదేవిధంగా యువత సరదగా కోడిపందేలను నిర్వహించి కోళ్లను అమ్మవారికి బలి ఇచ్చారు.
ఆటల పోటీల విజేతలకు బహుమతులు
ఆత్మకూరు, జనవరి 15: భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) సంక్రాంతి ఆటల పోటీల్లో విజేతలకు మంగళవారం సాయంత్రం స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక అభిరామ్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ శ్రావణ్‌కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతుల్ని అందజేశారు. మ్యూజికల్ చైర్స్ విభాగంలో ప్రథమ బహుమతి నారాయణమ్మ, ద్వితీయ బహుమతి జయమ్మ, చెస్ పోటీల్లో ప్రథమ బహుమతి నరసింహులు, ద్వితీయ బహుమతి ఓంకారం, షటిల్ టోర్నమెంట్‌లో ప్రథమ బహుమతి శివ, రమేష్, ద్వితీయ బహుమతిలో కృష్ణతేజ, రవి, తృతీయ బహుమతికి హరీష్, వరుణ్, వంద మీటర్ల పరుగుపందెంలో ప్రథమ బహుమతి వాసు, లాంగ్‌జంప్‌లో ప్రథమ బహుమతి ప్రభాకర్‌కు అందాయి. ముగ్గుల పోటీల్లో ప్రథమ బహుమతికి నలుగుర్ని ఎంపిక చేశారు. ప్రశాంతి, రామరాజ్యం, రజని, షతుర్ణను ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. హైజంప్‌లో ప్రభాకర్, జావెల్‌త్రోలో ప్రభాకర్‌ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ నాయకులు సిహెచ్ మురళికృష్ణ, సిపిఎం డివిజన్ కార్యదర్శి లక్ష్మీపతి, తదితరులు పాల్గొన్నారు.
‘కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం’
దుత్తలూరు, జనవరి 15: కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వాలతోనే ప్రజలకు అభివృద్ధి ఒనగూరుతుందని మాజీ తెలుగుదేశం ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పేర్కొన్నారు. ఈనెలలో జరగనున్న సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులే విజయం సాధిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన స్థానిక ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ అభివృద్ధి అంటూ జరగాలంటే అది కాంగ్రెస్‌పార్టీకి మాత్రమే సాధ్యమన్నారు. కాంగ్రెస్‌పార్టీ ప్రజల పక్షాన ఉంటుందన్నారు. సామాన్య ప్రజలకు కాంగ్రెస్ హయాంలోనే న్యాయం జరుగుతుందన్నారు. కొన్ని పార్టీలు స్వార్థరాజకీయాల కోసం విమర్శలు చేయడం సరికాదన్నారు. సహకార సంఘాల ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ ఘన విజయం సాధించడం తథ్యమన్నారు. అది జరిగి తీరుతుందన్నారు. కొందరు నాయకులు పనిగట్టుకుని విమర్శలు చేయడం విడ్పూడరంగా ఉందన్నారు. ఆ విమర్శలు ఒట్టి నీటిమూటలేనంటూ ఎద్దేవా చేశారు. ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డికి అన్ని సహకార సంఘాల్లో కాంగ్రెస్ గెలవడం ద్వారా బహుమతిగా ఇవ్వాలంటూ కంభం ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మధుసూదనరెడ్డి, కందుల శ్రీనివాసులురెడ్డి, మాలకొండారెడ్డి పలువురు ప్రముఖులు ఉన్నారు.