Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మధ్యాహ్న భోజన పథకానికి ధరా భారం

$
0
0

కడప, జనవరి 16: చక్కటి ఆరోగ్యానికి తప్పనిసరిగా సమతుల్య పౌష్ఠికాహారాన్ని ప్రతి రోజు తీసుకోవాలి. ఇది తరగతి గదిలో సైన్స్ ఉపాధ్యాయుడు బోధించే పాఠం. ఉడికి ఉడకని అన్నం, నీళ్లలాంటి చారు, ఇది ప్రస్తుతం మధ్యాహ్న భోజన పథకంలో అందుతున్న విద్యార్థులకు ఆహారం. జిల్లాలో మధ్యాహ్న భోజన పధకం అధ్వాన్నంగా అమలవుతోంది. మార్కెట్‌లో కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీని ప్రభావం మధ్యాహ్నం భోజన పథకంపై పడుతున్నది. ప్రభుత్వం ప్రతి విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకం కోసం ప్రాథమిక పాఠశాల స్థాయిలో 3-69 పైసాలు, ఉన్నత పాఠశాల స్థాయిలో 4-17 పైసాలు మాత్రమే ఇస్తున్నది. దీంతో ఈ పథకం నీరసించిపోతున్నది. నీళ్లచారు, చప్పిడి మెతుకులతో విద్యార్థులు సరిపెట్టుకుంటున్నారు. జిల్లాలోని 3,784 ప్రాథమిక, ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఈ పథకం అమలవుతోంది. ఇక్కడ విద్యాభ్యాసం చేసే సుమారు 2.50 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్నం భోజనం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రాధమిక స్థాయిలో 120 గ్రామాలు చొప్పున 6,10 తరగతుల విద్యార్థులకు 160 గ్రాముల చొప్పున అన్నంతో పాటు పౌష్ఠిక విలువలతో కూడిన కూరలను పిల్లలకు వండించాలి. అలాగే ప్రతి వారంలో రెండుసార్లు అంటే మంగళ,బుధవారాలలో గుడ్డు వడించాలి. అయితే ఎక్కడ కూడా గుడ్డును పెడుతున్న దాఖాలలు లేవు.ప్రసుత్తం అందిస్తున్న నిధులతో గుడ్డు మాట అటు ఉంచితే రుచికరమైన కూరగాయాలతో కానీ ఆకుకూరలతో కానీ కూర వడించే పరిస్థితి లేదు. మార్కెట్‌లో ధరలు మండుతుండడంతో ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టలేమని వంట ఏజెన్సీలు చెబుతున్నాయి.

పండుగపూట జోరుగా
కోడి పందాలు, పేకాట
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 16: సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందెలు, పేకాట, బెల్టు షాపుల ద్వారా మద్యం అమ్మకాలు చేయరాదనే పోలీసు, ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు ఆదేశించినా రాజకీయ నాయకుల అండదండలతో పలు ప్రాంతాల్లో జూదపుదారులు బేఖాతర్ చేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్ల నుంచి వందలాది మంది కోడి పందెల జూదర్లు, పేకాట జూదర్లను పోలీసులు వివిధ న్యాయ స్థానాల్లో హాజరు పరిచారు. దాదాపు 150 మంది జూదర్లను న్యాయస్థానాల్లో హాజరు పరిచారు. వారి నుంచి సుమారు రూ.3 లక్షల స్వాధీనం చేసుకున్నారు. పందెపు కోడి పుంజులను కూడా 30కి పైబడి న్యాయస్థానాలకు తీసుకెళ్లారు. సంక్రాంతి మూడు రోజులు జిల్లాలో జూదర్లను పోలీసులు అదుపులో తీసుకున్న వివరాల్లోకి వెళ్తే పులివెందుల, కడప పోలీసు సబ్ డివిజన్‌లోనే అధికంగా ఉన్నారు. సంబేపల్లె మండలంలో 26 మంది జూదర్లను అరెస్టు చేసి రూ. రూ.82 వేలు స్వాధీనం చేసుకున్నారు. సుండుపల్లె మండలంలో పోలీసుల దాడులలో ముగ్గరి పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ. 2 వేలు పైబడి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పులివెందుల పట్టణం, పులివెందుల రూరల్ ప్రాంతాల్లో 35 మందిని అదుపులోకి తీసుకొని దాదాపు రూ. లక్షా 60 వేలుస్వాధీనం చేసుకున్నారు. రామాపురం మండలంలో నామ మాత్రంగా ముగ్గరిని అదుపులోకి తీసుకోగా ప్రజలు ప్రతిఘటించగా రాజకీయ జోక్యంతో వారిని వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. రాయచోటి మండలంలో ఏడుగురు పందెపు కోళ్లతో ఆట నిర్వహిస్తుండగా పోలీసుల దాడులలో అందరూ పారిపోగా ఏడుగురిని మాత్రమే అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ.3 వేలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీరబల్లె మండలంలో 9 మంది జూదం ఆడుతుండగా వారిని అదుపులో తీసుకొని వారి నుంచి రూ. 18 వేలు స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట, ఊటుకూరు, భువనగిరి ప్రాంతాల్లో కోడి పందెలు, జూదం ఆడుతుండగా పోలీసుల దాడుల్లో 22 మంది పట్టుబడగా వారి నుంచి రూ. 42 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఓబుళవారిపల్లెలో పేకాట ఆడుతుండగా 14 మందిని పోలీసులు అదుపులో తీసుకొని వారి నుంచి రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు. వీరపునాయునిపల్లె మండలంలో 18 మంది జూదం ఆడుతుండగా వారిని పోలీసులు అదుపులో తీసుకొని రూ. 5 వేల పైబడి స్వాధీనం చేసుకున్నారు. లింగాలమండలంలో 10 మంది జూదం ఆడుతుండగా వారిని అదుపులో తీసుకొని వారి నుంచి రూ. 30 వేల పైబడి స్వాధీనం చేసుకున్నారు. పోరుమామిళ్లలో పేకాట స్థావరాలపై దాడులు చేయగా పోలీసుల సమాచారం తెలుసుకొని అందరూ పారిపోగా ఇరువురు మాత్రమే పోలీసులకు దొరికారు. కడప అర్బన్, రూరల్ పోలీసుల సర్కిళ్లపరిధిలో పోలీసులు దాడులు చేయడంతో 17 మంది జూదర్లు, ఏడుగురు కోడి పందెలు నిర్వహించే వారిని పోలీసులు పట్టుకొని వారి నుంచి రూ. 50 వేలు పైబడి స్వాధీనం చేసుకున్నారు. పేకాట, కోడి పందెల స్థావరాల్లో లక్షలాది రూపాయలు పందెలు కాశామని అయితే పోలీసులు మాత్రం నామ మాత్రంగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటనలు ఇవ్వడంపై సర్వత్రా పోలీసులపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే తరహాలో జిల్లాలో అక్కడక్కడ పందెలు జోరుగా నిర్వహించినా రాజకీయ ఒత్తుళ్లతో పోలీసులు పండుగ రోజు అయినందున వారికి మినహాయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే మద్యం, సారా విచ్చలవిడిగా గ్రామీణ ప్రాంతాల్లో ఎరులై పారింది. ఒక పక్క బెల్టు షాపులు నిర్వాహణ లేనేలేదని చెబుతున్న ఎక్సైజ్ అధికారులు ప్రతి గ్రామంలో పలు అంగళ్లలో మద్యం, సారా యథేచ్చగా అమ్మకాలు జరిగాయి. ఏది ఏమైనా పోలీసు, ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఆదేశాలు ఈ సంక్రాంతి పండుగలో ఏమాత్రం పని చేయడం లేదనేది జగమెరిగిన సత్యం.
రాజకీయ లబ్ధికోసమే కుట్ర
ప్రొద్దుటూరు, జనవరి 16: తనను రాజకీయంగా దెబ్బతీయడంతో పాటు తన కుమారుడికి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని తగ్గించి నేరచరిత్ర కలిగిన వ్యక్తిగా చిత్రీకరించేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కుట్ర పన్నుతున్నారని మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఆటుపోట్లు ఎదుర్కొన్నానన్నారు. దౌర్జన్యాలు, అసాంఘిక కార్యకలాపాలను అణచివేసి పట్టణంలో శాంతి వాతావరణాన్ని నెలకొల్పానన్నారు. అలాంటి తనపై, తన కుమారుడిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు దురాలోచనతో బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తన కుమారుడిపై ఇవి సుధాకర్‌రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తనపై దాడి జరిగిందని చెబుతున్న సుధాకర్‌రెడ్డి వెంటనే ఎందుకు కేసు నమోదుచేయించలేదని వరద ప్రశ్నించారు. ఫిర్యాదులో పేర్కొన్న విధంగా తన కుమారుడు కొండారెడ్డి, మిగిలిన వారు కొట్టినట్లు చెబుతున్న ప్రదేశం పోలీస్ స్టేషన్‌కు రెండు పర్గాంగుల దూరంలో ఉందన్నారు. సుధాకర్‌రెడ్డి ఇంటికి వెళ్లేడప్పుడు అదే స్టేషన్ ముందు నుంచి వెళ్లాల్సి ఉంటుందన్నారు. తనపై దాడి జరిగిందంటున్న సుధాకర్‌రెడ్డి అదే రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకోవాల్సి ఉందని, అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉండేదన్నారు. అయితే అలాంటివి ఏవీ చేయకుండా సంఘటన జరిగిన ఐదురోజుల తరువాత ఫిర్యాదు చేయడం వెనుక మతలబు ఏమిటని ప్రశ్నించారు. గత ఏడెనిదిమి సంవత్సరాలుగా నియోజకవర్గంలో వ్యాపార లావాదేవీలు నడుస్తున్నాయని, అందులో భాగంగా రూ. 35 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. ఇప్పటి వరకు రూ. 20 కోట్లు చెల్లించామని , మిగిలిన రూ.15 కోట్లు ఏడాదిన్నర కాలంలో చెల్లిస్తామని వరద స్పష్టం చేశారు. ఆస్తులు అమ్మైనా బాకీలు చెల్లించడానికి తమ కుటుంబం కట్టుబడి ఉందన్నారు. ఇవి సుధాకర్‌రెడ్డి వద్ద తన కుమారుడు కొండారెడ్డి 2007లో రూ.58 లక్షలు తీసుకున్నాడన్నారు. హైదరాబాద్ కొండాపూర్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సమయంలో డబ్బు ఇచ్చిన సుధాకర్ రెడ్డి ఐదుశాతం వ్యాపారంలో భాగం ఇవ్వమని అడిగాడని, దాని ప్రకారం వాటా ఇచ్చామన్నారు. అయితే నీతి గల తన కుమారుడు వాటా ఇచ్చిన తరువాత అప్పుకు సంబంధించి బాండ్లు తీసుకోలేదన్నారు. ఆ వ్యాపారంలో నష్టం రావడంతో సుధాకర్‌రెడ్డి డబ్బు కోసం కోర్టును ఆశ్రయించారన్నారు. ఈ విషయం అందిరికీ తెలిసిందేనన్నారు. దాన్ని అడ్డుగా పెట్టుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు సుధాకర్‌రెడ్డితో కేసులు బనాయించి అతడిని బలిపశువును చేస్తున్నారని అన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ బచ్చల పుల్లయ్య, గోపిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, షబ్బీర్, గౌస్, ఆసం రఘురామిరెడ్డి, ప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేటి నుండి రాజంపేటలో
జాతీయ సెపక్‌తక్రా పోటీలు
రాజంపేట, జనవరి 16: రాజంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గురువారం నుండి ఆదివారం వరకు అండర్-19 58వ జాతీయ సెపక్‌తక్రా బాలురు, బాలికల పోటీలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోటీల ఏర్పాట్లను రాజంపేట సబ్ కలెక్టర్ డాక్టర్ ప్రీతీమీనా బుధవారం సమీక్షించారు. క్రీడా పోటీల నిర్వహణకు ఏర్పాటు చేసిన 9 ప్రత్యేక కమిటీ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని సూచించారు. ఇప్పటికే 12 రాష్ట్రాల నుండి బాలురు, బాలికల జట్లు వచ్చాయని, వారికి అన్ని వసతులతో కూడిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. క్రీడా పోటీలు నిర్వహిస్తున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని సబ్ కలెక్టర్ సందర్శించారు. అలాగే క్రీడాకారులకు వసతి సౌకర్యాలు కల్పించిన జూనియర్ కళాశాల గదులను పరిశీలించారు. క్రీడాకారులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే సమాచారం అందించేందుకు వీలుగా కంట్రోల్ రూము ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూము సేవలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

నేడు రిమ్స్‌కు ఎంసిఐ బృందం రాక
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 16: 2013-14 రిమ్స్‌లో పిజి కోర్సులకు అనుమతులు ఇచ్చేందుకు ఎంసిఐ బృంధం గురువారం నుంచి తనిఖీల నిమిత్తం ఢిల్లీ నుంచి రిమ్స్‌కు రానున్నారు. గత ఏడాది పిజి అనుమతి రావలసి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో పాటు రిమ్స్ సెమి అటానమస్ బాడి అయినందున అనేక సాంకేతిక సమస్యలతో జాప్యం జరిగింది. జిల్లాకు చెందిన ఆరోగ్య, సంక్షేమ మంత్రి డాక్టర్ డిఎల్. రవీంద్రారెడ్డి చొరవ తీసుకొని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి గులాబీ నబీ ఆజాద్‌తో సంప్రదించి రిమ్స్‌కు పిజి కోర్సులకు అనుమతులకు ఏవైనా రిమ్స్‌లో లోపాలు ఉంటే సడలింపు ఇచ్చి పిజి కోర్సులకు అనుమతులు ఇవ్వాలని కోరగా ఆ మేరకు గులాబి నబీ ఆజాద్ ఎంసిఐకి ఆదేశాలు ఇవ్వడంతో వారు తనిఖీ నిమిత్తం వస్తున్నారు. ఈ నేపథ్యంలో రిమ్స్ అధికారులు అన్ని విభాగాలకు అనుభవం కలిగిన వైద్యులను ఏర్పాటు చేసిన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా స్పెషలిస్టులను ఇక్కడికి రప్పిస్తున్నారు. అలాగే రోగులను కూడా కావలసినంత మందిని వివిధ ప్రాంతాల నుంచి రిమ్స్‌కు తరలించి చికిత్సలు జరిపేందుకు సర్వం సిద్ధం చేశారు. వివిధ విభాగాలకు చెందిన ఎంసిఐ బృందం అధికారులు వివిధ శాఖల పరంగా తనిఖీలు జరపనున్నారు. వీరు వారంరోజుల పాటు ఉండి అన్ని విభాగాలను తనిఖీ చేసి లోటుపాట్లను సరిచేసుకునేందుకు రిమ్స్ అధికారులకు తగిన సూచనలు ఇవ్వనున్నారు. దీంతో వచ్చే ఏడాది నుంచి పిజి కోర్సులకు అనుమతి లభిస్తుందని రిమ్స్ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో పర్యాటక రంగం
అభివృద్ధికి కృషి
జమ్మలమడుగు, జనవరి 16: జిల్లాలో పర్యాటక రంగం పరిస్థితులను పరిశీలిస్తున్నట్లు టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీ చందనాఖాన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆమె మైలవరంలో పర్యటించారు. పర్యాటక శాఖ రెస్టారెంట్ భవనం, పురావస్తు ప్రదర్శన శాల, గండికోట భవనాలను పరిశీలించారు. వస్తుప్రదర్శనశాల పరిసరాలపై ఆమె ఒకిం త అసహనం వ్యక్తం చేశారు. అనంతరం చందనాఖాన్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ పరిస్థితులను పరిశీలిస్తున్నామని, అందులో భాగంగా తాళ్లపాక, ఒంటిమిట్ట, గోపవరం, మైలవరం, గండికోట ప్రాంతాల్లో పర్యటించామన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన పనులు, వాటి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేస్తున్నామన్నారు. ఈ నెల 19న పర్యాటక శాఖ, సంబంధిత అనుబంధ శాఖాధికారులతో సమావేశం నిర్వహించి పర్యాటక రంగం అభివృద్దిపై సమగ్రంగా చర్చిస్తామన్నారు. జిల్లాలో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ సెక్రటరీ గండికోటకు బయలుదేరి వెళ్లారు. పర్యటనలో ప్రిన్సిపల్ సెక్రటరీ వెంట పర్యాటక శాఖ ఈడి శ్రీనివాసులు(ఐఎఫ్‌సి), సూపరింటెండెంట్ ఇంజినీరు క్రాంతిబాబు, డిఆర్‌డిఏ పిడి గోపాల్, డిఈలు ఈశ్వరయ్య, వీరనారాయణరెడ్డి, ఎఈ వెంకటేశ్వర్లు, కాంట్రారు రాజశేఖరరెడ్డి వున్నారు.
సమైక్యంగా ఉండాలంటూ టిడిపి
రాయలసీమ కావాలని సీమ జెఎసి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, జనవరి 16: సమైక్యాంధ్రగా ఉండాలని టిడిపి నేతలు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని రాయలసీమ జెఎసి నేతలు బుధవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేర్వేరు విలేఖరుల సమావేశాల్లో పేర్కొన్నారు. స్థానిక వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో సమైక్యాంధ్ర జెఎసి జిల్లా నేత సిహెచ్. చంద్రశేఖర్‌రెడ్డి, విద్యార్థి జెఎసి అధ్యక్షుడు రవి శంకర్‌రెడ్డి, టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.గోవర్ధన్‌రెడ్డిలు ప్రసంగిస్తూ సమైక్యంగా రాష్ట్రం ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుందని ప్రత్యేక రాష్ట్రం వల్ల వరిగేది ఏమి లేదని వారు స్పష్టం చేశారు. ఈనెల 28 లోపు కేంద్ర ప్రభు త్వం సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ప్రకటిస్తే తాము ఉద్యమిస్తామని అవకాశ వాద రాజకీయ నేతల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తగదని వారు పేర్కొన్నారు. తెలంగాణ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సమైక్యాంధ్రగానే ఉండాలని డిమాండ్ చేస్తుండగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రాంతీయుల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని, ఒక వేళ కేంద్రం తొందరపాటుతో విభజనను తెరపైకి తెస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు గుర్తు చేశారు. వీరితో పాటు ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు జయరాములు, బండి జయశంకర్, పీరయ్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ ప్రెస్‌క్లబ్‌లో రాయలసీమ ప్రత్యేక జెఎసి నేతలు మాజీ ఎమ్మెల్సీ వెంకటశివారెడ్డి, పల్లారాము, అఫ్జల్ రామయ్యలు మా ట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొన్నారు. 2014లో రాహుల్ గాంధీ ని ప్రధాని చేయాలని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని విడ గొడితే రాహుల్ గాంధీ ప్రధానిగా ఎంపికైతారా అని ప్రశ్నించారు. తెలంగాణపై కేంద్రం ప్రకటిస్తే సీమ జిల్లాల ప్రజా ప్రతినిధులు రాజీనామా చేసి తమ వెంట ఉద్యమించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈనెల 21న రాయలసీమ జెఎసి ఢిల్లీకి వెళ్లి కేంద్రానికి తమ వాదనను వినిపిస్తామని వారు పేర్కొన్నారు.
తాగునీటికి కోసం మహిళల నిరసన
లక్కిరెడ్డిపల్లె, జనవరి 16: మండలంలోని అనంతపురం గ్రామం హరిజనవాడకు చెందిన మహిళలు బుధవారం మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో దాహార్తిని తీర్చండి మహాప్రభో అంటూ నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ గత రెండు వారాలుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. అధికారులు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నప్పటికీ వారు కూడా సక్రమంగా నీరు సరఫరా అందించకపోవడంతో గత రెండు వారాల నుంచి నీటి సమస్య తీవ్రతరమైందన్నారు. పండుగ రోజు కూడా నీరు లేక చాలా ఇబ్బందులు పడ్డామని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ట్యాంకర్ల ద్వారా అరకొరగా తోలుతున్న నీరు కూడా మంచినీరు కాదని, ఉప్పు నీరు తోలుతుండడంతో తాగునీటి కోసం పడరాని పాట్లు పడుతున్నామన్నారు. కిలో మీటరు దూరంలో ఉన్న గంగమ్మ జాతర సమీపంలో ఉన్న బోరు నుంచి నీరు తెచ్చుకుంటున్నామని వాపోయారు. తాగునీటి కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నామని అధికారులు చెబుతున్నారే కాని, మారుమూల పల్లెలైనా మాలాంటి గ్రామాలకు మాత్రం సరఫరా కావడం లేదని వారు అధికారులను నిలదీశారు. ఇక నుంచైనా మా గ్రామానికి తాగునీరు సౌకర్యంకల్పించి నీటి బాధ నుంచి తమను కాపాడాలని కోరారు. అనంతరం తహశీల్దార్‌కు వినతి పత్రం సమర్పించారు. స్పందించిన తహశీల్దార్ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.
నీటి కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తా
ప్రొద్దుటూరు, జనవరి 16: ప్రొద్దుటూరు పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాలుస్తుందని కలెక్టర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి వరకు అనేకమార్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా, నేరుగా వారిని కలిసినా ఎవరూ స్పందించలేదని శాసనసభ్యుడు లింగారెడ్డి పేర్కొన్నారు. నీటి కోసం ఆమరణ దీక్ష చేపడుతామని ఆయన స్పష్టం చేశారు. బుధవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట తాగునీటి ఎద్దడిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జలసాధన కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నాలో పాల్గొన్న లింగారెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా పట్టన ప్రజల తాగునీటి కోసం పోరాడడం చేయడం మంచి పద్దతి అన్నారు. మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నీరు అందించాలని, అనేక మంది అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బ్రహ్మంసాగర్ నుంచి ఆర్టీపీపీకి వెళ్లే పైపులైన్ ద్వారా నీరు అందించాలని ఎపి జెన్‌కో ఎండి విజయానంద్‌ను కలిసి కోరామన్నారు. అదే విధంగా మున్సిపల్‌శాఖ మంత్రిని కలిసి సమస్యను వివరించామన్నారు. యర్రగుంట్ల, ప్రొద్దుటూరు మున్సిపాల్టీ రెండింటికీ కలిపి పాపాగ్ని, కుందూ, పెన్నా కలిసే ఆదినిమ్మాయపల్లె నుండి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేసి నీరందించాలని సూచించామన్నారు. పట్టణంలో నీటి ఎద్దడి పరిష్కారానికి బోర్లు వేస్తున్నా కరెంటు సమస్య తలెత్తుతోందన్నారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుంచి ప్రయత్నిస్తున్నా, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. జలసాధన కమిటీ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి మాట్లాడుతూ 36 రోజులుగా దీక్ష చేపట్టినా పాలకులు, అధికారుల్లో ఎలాంటి చలనం లేదన్నారు. గత రెండేళ్లుగా పత్రికలు, టివి ఛానళ్లలో ప్రొద్దుటూరు పట్టణ తాగునీటి ఎద్దడిపై కథనాలు వస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. 160 సంఘాల ప్రతినిధులు ఏకవాక్య తీర్మానం చేసి 60 మంది ప్రముఖులతో కలిసి కలెక్టర్‌కు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు. రాజకీయ నాయకులు, అధికారుల తప్పుడు విధానాల వల్ల ప్రజలు నీటికోసం రోడ్డునపడే పరిస్థితి నెలకొందన్నారు. జనవరి 16న నీటిపై స్పష్టమైన ప్రకటన చేస్తామన్న అధికారులు స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆరునెలలుగా మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా ఉన్న జాయింట్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించిన దాఖలాలు లేవన్నారు. మున్సిపల్ ఇంచార్జి కమిషనర్ రామచంద్రప్రభు మాట్లాడుతూ మైలవరం జలాశయానికి 0.4 టియంసిల నీరు వచ్చి ఆగిపోయాయన్నారు. ఉన్నతాధికారుల సమాచారం మేరకు జనవరి 16న నీరు విడుదల చేస్తామని ప్రకటించామని, బుధవారం జాయింట్ కలెక్టర్‌తో మాట్లాడగా ఆమె నిస్సహాయత వ్యక్తం చేశారన్నారు. కార్యక్రమంలో వైకాపా నియోజకవర్గం ఇన్‌చార్జి రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
ఘనంగా శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతి మహోత్సవాలు
జమ్మలమడుగు, జనవరి 16: మైలవరం మండలం కె.్భకరాపేట గ్రామంలో కొలువైన తమ ఇలవేల్పు శ్రీ చౌడేశ్వరీదేవికి తొగటవీర క్షత్రియులు కన్నుల పండువుగా జ్యోతి మహోత్సవాలు నిర్వహించారు. అమ్మవారికి ఉపవాస దీక్షతో బిందెసేవ నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రతిరూపంగా చెప్పుకునే జ్యోతులను సిద్ధం చేశారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత జ్యోతులను తలపై పెట్టుకుని నాదగాళ్లు గ్రామంలోని వీధుల గుండా మేళతాళాల మధ్య నృత్యం చేస్తూ ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా తెప్పించిన పుష్పాలతో అలంకరించారు. ప్రత్యేక అలంకరణలతో కొలువుదీరిన అమ్మవారు గ్రామంలో ఊరేగుతూ ప్రజలకు దర్శనమిచ్చా రు. బుధవారం ఉదయం అమ్మవారి సన్నిధికి చేరుకున్న జ్యోతులకు ఆగం చెల్లించారు. అనంతరం అమ్మవారికి ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం గొడుగులు కార్యక్రమంతో జ్యోతి మహోత్సవాలు ముగుస్తాయి.
ఆయకట్టుదారులకు నీరు విడుదల
రాయచోటి(టౌన్), జనవరి 16: మండల పరిధిలోని ముడుంపాడు గ్రామ పంచాయతీలోని పింఛా ఆదినారాయణరెడ్డి జలాశయ ప్రాజెక్టు నుంచి బుధవారం తాగునీటిని విడుదల చేసినట్లు ఎఇ రెడ్డెయ్య తెలిపారు. ఈసందర్భంగా పింఛా ప్రాజెక్టు కింద కుడి, ఎడమ కాలువలకుగాను 670 ఎకరాలకు తాగునీటిని విడుదల చేశామని, ఈ నీటిని రబీ సీజన్‌లో సాగు చేసిన వేరుశనగ, వరి రైతులకు అనుగుణంగా నీటిని విడుదల చేశామని ఆయన తెలిపారు. ఈ నీటిని ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు దారు రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పల్లెవెలుగుల్లో తగ్గిన ఆదాయం
పులివెందుల రూరల్, జనవరి 16: రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఆర్టీసీ పరిధిలో తిరుగుతున్న పల్లె వెలుగు సర్వీసుల్లో ఆదాయం అనుకున్నదాని కన్నా పడిపోయిందని రీజనల్ డైరెక్టర్ శశిధర్ తెలిపారు. ఆదాయం పెంచుకునేందుకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. పులివెందుల పట్టణంలోని ఆర్టీసీ గ్యారేజిలో ఆయన బుధవారం ఉదయం రికార్డులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెవెలుగు సర్వీసులకు ఆదాయం వచ్చేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాలో పల్లెవెలుగు సర్వీసులకు ఆదాయం వస్తోందని మిగతా జిల్లాల్లో ఆదాయం తగ్గిందన్నారు. ప్రయాణికులను పల్లె వెలుగు సర్వీసుల్లో ఎక్కించుకుని ఆదాయం వచ్చేలా సిబ్బంది కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఆర్ ఎం సుదేష్‌కుమార్, ప్రభాకర్‌రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

చక్కటి ఆరోగ్యానికి
english title: 
r

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles