Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ముగిసిన శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు

$
0
0

శ్రీశైలం, జనవరి 16: మకర సంక్రమణ పుణ్యకాలన్ని పురష్కరించుకుని 7రోజుల పాటు శ్రీశైల మహాక్షేత్రంలో జరుగుతున్న సంక్రాంతి సంభరాలు పూర్ణాహుతితో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా శ్రీ వృద్ధమల్లిఖార్జుస్వామి ఆలయ ముఖమండపంలో శ్రీ చంఢీశ్వరస్వామికి ప్రత్యేకపూజాధికాలు జరిపించి లోకకల్యాణం కోసం జపాలు, నిత్యహోమ బలిహరణలను చేసి రుద్రహోమాన్ని, జయాధి హోమాన్ని అర్చకులు నిర్వహించారు. అనంతరం రుద్రహోమ పూర్ణాహుతి, వసంతోత్సవం, అవబృందం, త్రిశూలస్నాన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్రోక్తంగా నారికేళాలు, పలుసుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, బంగారం, వెండి, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలు హోమగుండానికి సమర్పించి రుద్రయాగ కార్యక్రమాన్ని ఆలయ ఎఇఓ రాజశేఖర్, ఇఇ రమేష్, అర్చకులు, వేదపండితుల నడుమ శాస్రోక్తంగా నిర్వహించారు. అనంతరం వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండింతులు వసంతాన్ని అనగా పసుపు, సున్నం కలిపిన మంత్రపూరిత జలాన్ని సమంత్రకంగా భక్తులపై చల్లారు. అనంతరం అవబృదంలో చంఢీశ్వరస్వామికి ఆలయ ప్రాంగణంలోని మల్లిక గుండంలో వైవికశాస్రోక్తంగా స్నానాధిక కార్యక్రమాలు నిర్వహించారు. తదుపరి త్రిశూలస్నానాన్ని స్వామి అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
ధ్వజావరోహణ: బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీశైలమల్లన్న ఆలయం వద్ద బుధవారం సాయంకాలం ఆలయ అర్చకులు ధ్వజవరోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ధ్వజవరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజు బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్థంబంపై సకల దేవతలను ఆహ్వానిస్తు అవిష్కరింపచేసిన ధ్వజపటాన్ని అవరోహణను నిర్వహించారు. బుధవారం పూర్ణాహుతి కార్యక్రమం ఉండడంతో స్వామి అమ్మవార్లకు వాహనోత్సవాన్ని రద్దుచేశారు. గురువారం సాయంత్రం 7-30 గంటలకు అశ్వవాహన సేవలో భ్రమరాంభిక మల్లిఖార్జునస్వామివార్లు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

అసెంబ్లీకి హాజరులో మన ఎమ్మెల్యేలు భేష్
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జనవరి 16: జిల్లాకు చెందిన శాసన సభ్యులు శాసన సభకు హాజరు కావడంలో మంచి శాతానే్న సాధించారు. అయితే ఆయా శాసన సభా నియోజకవర్గ పరిధిలోని సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఒకటి, రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలు పరిష్కారానికి నోచుకోక జనం ఇబ్బందులు పడుతున్నారు. శాసనసభ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేందుకు రూపొందించిన వెబ్‌సైట్‌లో శాసన సభ సభ్యుల హాజరు వివరాలను శాసన సభ అధికారులు ప్రకటించారు. దీని ప్రకారం రాష్ట్రంలో ఇతర సభ్యుల తరహాలో మన సభ్యులు కూడా శాసనసభకు హాజరు కావడంలో ఆసక్తిని కనబర్చారు. అయితే సమావేశాలకు హాజరైన సభ్యులు వేసిన ప్రశ్నలు, పాల్గొన్న చర్చల వివరాలు అందులో పొందుపర్చలేదు. లోక్‌సభ వెబ్‌సైట్‌లో ప్రకటించినట్లు అసెంబ్లీ వెబ్‌సైట్‌లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొన్న చర్చలు, ప్రభుత్వానికి వేసిన ప్రశ్నల వివరాలను వెల్లడించి ఉంటే బాగుండేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ వెబ్‌సైట్‌లో వెల్లడించిన హాజరు వివరాల ప్రకారం శ్రీశైలం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కోడుమూరు శాసన సభ్యుడు పి.మురళీ కృష్ణలు 90 శాతం హాజరుతో ముందున్నారు. శాసనసభ నిబంధనల ప్రకారం మంత్రులహాజరు వివరాలను వెల్లడించరు. ఈ కారణంగా మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్‌లు మంత్రులు కాకముందు హాజరు వివరాలు, మంత్రి పదవి కోల్పోయాక శిల్పా మోహనరెడ్డి హాజరు వివరాలను పొందుపర్చారు. రాష్ట్ర శాసన సభ 2009లో 39 రోజులు సమావేశం కాగా ఏరాసు ప్రతాప రెడ్డి 38 రోజులు, 2010లో 44 రోజులకు గాను 38రోజులు హాజరై 90శాతం హాజరును నమోదు చేసుకున్నారు. మరో మంత్రి టీజీ వెంకటేష్ 2009లో 32, 2010లో 21రోజులు సభకు వెళ్లి 63శాతం హాజరయ్యారు. వీరిద్దరు 2010 డిసెంబరులో మంత్రులుగా నియమితులయ్యారు. ఇక మాజీ మంత్రి శిల్పా మోహన రెడ్డి 2009లో మంత్రిగా నియమితులై 2010లో పదవిని కోల్పోయారు. ఆయన 2011, 2012వ సంవత్సరాల్లో 73రోజుల పాటు సమావేశాలు జరుగగా 39రోజులు సభకు వెళ్లి 53శాతం హాజరును పొందారు. ఇక ఎమ్మెల్యేల విషయంలో మొదటి స్థానంలో కోడుమూరు శాసన సభ్యుడు మురళ్లీకృష్ణ 90శాతం హాజరును సాధించారు. ఆయన 2009లో 37, 2010లో 43, 2011లో 36రోజులకు గాను 24, 2012లో 37రోజులకు గాను 37రోజులు సమావేశాలకు హాజరయ్యారు. ఆ తరువాతి స్థానంలో ఆదోని శాసన సభ్యుడు మీనాక్షి నాయుడు 85 శాతం హాజరు నమోదు చేసుకున్నారు. శాసన సభ 2009 నుంచి 2012 డిసెంబరు వరకు 157 రోజులు సమావేశం కాగా 133రోజులు సభకు వెళ్లారు. పాణ్యం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ శాసన సభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి 76 శాతం హాజరయ్యారు. మొత్తం గత మూడున్నర సంవత్సరాల్లో 157 రోజులకు గాను 119 రోజులు సభకు హాజరయ్యారు. ఆ తరువాత పత్తికొండ శాసన సభ్యుడు కెయి ప్రభాకర్, ఆళ్లగడ్డ శాసన సభ్యురాలు భూమా శోభా నాగిరెడ్డిలు 70 శాతం హాజరును నమోదు చేసుకున్నారు. వీరిద్దరిలో శోభానాగిరెడ్డి రాజీనామా చేసిన కారణంగా కొద్ది రోజులు సభకు దూరంగా ఉన్నారు. అయితే సమావేశాల అనంతరం ఆమె రాజీనామాను స్పీకర్ ఆమోదించారు. కెయి ప్రభాకర్, భూమా శోభా నాగిరెడ్డిలు శాసన సభ జరిగిన 157 రోజులకు గాను 110 రోజులు హాజరై సభా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాసన సభకు మొదటి సారిగా ఎన్నికైన బనగానపల్లె శాసన సభ్యుడు కాటసాని రామిరెడ్డి 108 రోజులు హాజరై 69శాతాన్ని, డోన్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన మరో సీనియర్ శాసన సభ్యుడు కెయి కృష్ణమూర్తి 103 రోజులు హాజరై 66శాతం హాజరును నమోదు చేసుకున్నారు. ఇక నందికొట్కూరు ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి 91 రోజులు సభకు వెళ్లి 57 శాతం, ఆలూరు శాసన సభ్యురాలు నీరజారెడ్డి 85 రోజులు సభా కార్యక్రమాల్లో పాల్గొని 54 శాతాన్ని పొందారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగి రెడ్డి 157 రోజుల సమావేశాలకు గాను శాసన సభకు 70 రోజులు హాజరయ్యారు. హాజరులో చివరి స్థానం పొందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి కేవలం 34 శాతం హాజరును నమోదు చేసుకున్నారు. ఆయన 2009 నుంచి 2010 వరకు 157రోజులకు గాను 53రోజులు మాత్రమే శాసన సభకు వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన 2010లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా శాసన సభలో ఓటు వేసి అనర్హత వేటుకు గురయ్యారు. ఈ కారణంగా శాసన సభకు కొంత కాలం దూరం కావాల్సి వచ్చింది. ఉప ఎన్నికల్లో విజయం సాధించి మళ్లీ సభకు హాజరవుతున్నారు. శాసన సభకు వెళ్లి కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్న నేతలు నియోజకవర్గ సమస్యలపై కూడా ప్రధాన దృష్టి సారించి పరిష్కారానికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

బోర్డు తిప్పేసిన వసంత గోల్డ్
ఎమ్మిగనూరు, జనవరి 16: బంగారం పేరుతో ప్రారంభమైన ప్రైవేట్ సంస్థలు ఎమ్మిగనూరులో ఒక్కొక్కటి మూతపడడంతో అందులో డబ్బులు కట్టి మోసపోయిన ఖాతాదారులు లబోదిబోమంటూ రోడ్డున పడుతున్నారు. నిన్న అక్షయగోల్డ్, ఈరోజు వసంతగోల్డ్ సంస్థలు ఎమ్మిగనూరులో బోర్డు తిప్పేశాయి. దీంతో లక్షలాది రూపాయలు కట్టిన బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పట్టణంలోని వివి శివ టాకీస్ వద్ద ఉన్న వసంతగోల్డ్ సంస్థ బుధవారం బోర్డు తిప్పేసింది. గత నాలుగు సంవత్సరాల క్రితం నందికొట్కూరు ప్రధాన కార్యాలయంగా ప్రారంభమైన వసంతగోల్డ్ సంస్థ రాష్టవ్య్రాప్తంగా 27 బ్రాంచీలున్నాయి. కర్నూలు జిల్లాలోనే రూ. 28కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, కౌతాళం, గోనెగండ్ల, ఆస్పరి, పత్తికొండ, కోడుమూరు పట్టణాలతోపాటు మరో 40గ్రామాల్లో డైలీ డిపాజిట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఎమ్మిగనూరు బ్రాంచీ కింద రూ. 28కోట్ల వ్యాపారం చేసి ప్రస్తుతం ఖాతాదారులకు రూ. 4కోట్లు ఇవ్వాల్సి ఉండగా, డబ్బులు చెల్లించకుండా రాత్రికిరాత్రే డైరెక్టర్లు, అందులో పనిచేస్తున్న సిబ్బంది ఉడాయించారు. వసంతగోల్డ్ సంస్థలో రూ. లక్షలాది డిపాజిట్లు చేసిన కస్టమర్లు బుధవారం కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా మాధవరం గ్రామానికి చెందిన ఖాతాదారుడు ఎక్బాల్ మాట్లాడుతూ తాను రూ. 10లక్షలు డిపాజిట్ చేశానని, అలాగే ఎమ్మిగనూరుకు చెందిన బోయ వీరేంద్ర, శివనాయుడు, మంత్రాలయానికి చెందిన భీమేష్‌లు విలేఖరులతో మాట్లాడుతూ తాము డైలీ కలెక్షన్, ఫిక్స్‌డ్ డిపాజిట్లు లక్షలాది రూపాయలు చేశామని, ఇటువంటి పరిస్థితుల్లో సంస్థ బోర్డు తిప్పేయడంతో తాము ఎవరికి సమాధానం చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తాము తెలివిగా మోసపోయాం, తాము కట్టిన డబ్బులను తిరిగి ఇప్పించాలని, లేనిపక్షంలో తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఖాతాదారులు వాపోయారు. ఇప్పటికైనా తమకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

విభజిస్తే విపత్తే..!
ఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జనవరి 16: రాష్ట్రాన్ని విభజించాలని కేంద్రం నిర్ణయిస్తే విపత్తు తప్పదని తెలంగాణాలో కంటే పెద్ద ఎత్తున రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో అలజడి రేగుతుందని ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలతో జిల్లాకు చెందిన మంత్రులు ఏరాసు ప్రతాప రెడ్డి, టీజీ వెంకటేష్‌లు తేల్చి చెప్పారు. వారు మరికొందరు మంత్రులతో కలిసి బుధవారం సాయంత్రం కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ కోర్‌కమిటీ సభ్యులైన వాయలార్ రవి, గులాం నబీ అజాద్‌లతో కలిసి రాష్ట్ర పరిస్థితులపై చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రాష్ట్ర విభజన తప్పదన్న అభిప్రాయం వెలిబుచ్చుతూ ప్రత్యామ్నాయాలు ఏమైనా సూచించాలని కోరినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర మంత్రులు రాష్ట్రాన్ని విడదీయాలని నిర్ణయిస్తే కుంపటి రాజుకొని మంటలు చెలరేగడం ఖాయమని పేర్కొన్నట్లు సమాచారం. తెలంగాణాలో ఉన్న అలజడి కంటే రెండు రెట్లు అధికంగా రాయలసీమ, ఆంధ్రా ప్రాంతంలో అశాంతి ప్రభలే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్య తీవ్రతరమై రాయలసీమ ప్రాంతం ఎడారిగా మారుతుందని చివరకు కర్నూలు ప్రజలకు తాగునీటికి కూడా ఇక్కట్లు తప్పవని ఆవేదన వ్యక్తం చేసినట్లు ఢిల్లీ నుంచి సమాచారం అందుతోంది. ఢిల్లీ పెద్దలు రాయలసీమ ప్రాంత ప్రజాప్రతినిధుల గోడును వినకుండా ఏక పక్షంగా నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు తీవ్రతరంగా ఉంటాయని ఆందోళన చెందినట్లు పేర్కొన్నారు. అంతేగాక తెలంగాణా ప్రకటిస్తే రాష్ట్రంలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవ లేదని కూడా హెచ్చరించినట్లు వెల్లడవుతోంది. రాష్ట్ర విభజన చేయాలనుకుంటే దేశ వ్యాప్తంగా ఉన్న డిమాండ్లను దృష్టిలో పెట్టుకోవాలని అదే సమయంలో గతంలో రాయలసీమలో అంతర్భాగంగా ఉండి ఇపుడు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లో కలిసిన తెలుగు మాట్లాడే వారు నివశిస్తున్న ప్రాంతాల్లో ప్రజల డిమాండ్లను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. కేవలం తెలంగాణా ప్రాంతంలోని నేతల ఒత్తిడితో విభజన నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు తప్పవని మంత్రులు తేల్చి చెప్పినట్లు సమాచారం.

రాజీనామా చేయండి..!
్రఆంధ్రభూమి బ్యూరో
కర్నూలు, జనవరి 16: ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏకపక్షంగా రాష్ట్రాన్ని విడదీయాలని దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోందని తక్షణం రాయలసీమ, కోస్తాంధ్రా ప్రాంతాల్లోని ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన బుధవారం ఈ మేరకు విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణా అంశంలో కేవలం అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న కొద్దిమందితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. గతంలో శ్రీకృష్ణ కమిటీ రాయలసీమ అత్యంత వెనుకబడిన ప్రాంతమని తేల్చిచెప్పిన విషయం గుర్తుచేస్తూ రాయలసీమ అభివృద్ధిపై ఎందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించలేదని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు సూచించిన విషయం ఎందుకు మర్చిపోతున్నారో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. రాయలసీమలో సాగు, తాగు నీటి కష్టాలతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇపుడు రాష్ట్రాన్ని విభజించి రాయలసీమ కష్టాల గురించి పట్టించుకోకపోతే దారుణంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు వెనుకబడిన రాయలసీమ అంశంపై కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించాలని అదే విధంగా కోస్తాంధ్రా ప్రాంతంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తీసుకునే చర్యల గురించి కేంద్రం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం తెలుగువారి మనోభిష్టానికి విరుద్ధంగా కొందరి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తలొగ్గి విభజనకు ప్రయత్నిస్తోందని ప్రజాప్రతినిధులు రాజీనామాలుచేసి నిరసన వ్యక్తం చేయాలని ఆయన కోరారు.

ప్రతి కుటుంబానికి 12 గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి
కల్లూరు, జనవరి 16: పేద మద్యతరగతి ప్రజలకు అత్యవసరమైన ఇంధనం గ్యాస్‌లో కోతలు విధించడం దారుణమని ప్రతి కుటుంబానికి 12 సిలిండర్లు అందజేయాలని సిపిఎం కల్లూరు డోన్ కమిటీ కార్యదర్శి సాయిబాబా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా ఫౌరసరఫరాల అధికారి బాబా సాహేబ్ కలిసి పేదలకు అందించే గ్యాస్ సిలిండర్ల విషయంలో కోత లేకుండా చూడాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జోన్ కార్యదర్శి సాయిబాబా మాట్లాడుతూ అయిల్ కంపెనీలతో కేంద్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలతోనే గ్యాస్ సిలిండర్లపై కోత విధించడానికి కుట్రలు పన్నుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వామపక్షాల పార్టీలు ప్రజా సంఘాలు ఉద్యమాలు చేపట్టగా దిగివచ్చిన ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 9 సిలిండర్లు ఇస్తామని ప్రకటించడం జరిగిందని, 12 సిలిండర్లు ఇచ్చేంత వరకు ప్రభుత్వంతో సిపిఎం పోరాడుతుందన్నారు. నగరంలోని గ్యాస్ ఏజెన్సీలు 6 సిలిండర్లు మాత్రమే ఇస్తూ అదనంగా 7వ సిలిండర్‌కు వెయ్యి రూపాయాలను వసూలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఈ విషయంపై స్థానిక సివిల్ సప్లయ్ అధికారులు స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న గ్యాస్ ఎజెన్సీలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేద మద్య తరగతి కుటుంబాలకు 12 సిలిండర్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం ముందుకు రానిపక్షంలో సిపిఎం ఆధ్వర్యంలో ఉద్యమాలు, ఆందోళనలు చేస్తామని ఆయన హెచ్చరించారు. డిఎస్‌వోకు వినతి పత్రం అందించిన వారిలో సిపిఎం కల్లూరు జోన్ నాయకులు సుధాకరప్ప, నాగన్న, విజయ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి పనులు తనిఖీ చేసిన కలెక్టర్
డోన్, జనవరి 16: ఉపాధి పనులను ఎన్నిరోజులు చేపడుతున్నామో పనులు చేసే కూలీలకు కూడా తెలియకపోతే ఎలా? అని కలెక్టర్ సుదర్శన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ఎర్రగుంట్ల గ్రామంలో బుధవారం కలెక్టర్ సుదర్శన రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రామంలో చేపడుతున్న ఉపాధిపనులను పరిశీలించారు. ఏడాదిలో ఎన్నిరోజులు పనులు చేస్తున్నారని, రోజు ఎంత కూలీ పడుతుందని కలెక్టర్ ప్రశ్నించగా కూలీల నుండి స్పందన లేకపోవడంతో కలెక్టర్ సంబందిత అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నో కోట్ల రూపాయలు వ్యయంచేసి పథకాలు చేపడుతుంటే అవి ప్రజల్లోకి తీసుకపోవడంలో మీ నిర్లక్ష్యం బాగా కనపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపీడిఓ అమృతరాజ్ తోపాటు సంబందిత అధికారులపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. నిర్లక్ష్యం వదలాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఐసిడి ఎస్ కేంద్రాన్ని పరిశీలించారు. రికార్డులను పరిశీలించారు. అదే విధంగా వ్యక్తిగత మరుగుదొడ్ల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గర్భవతులు, బాలింతలకు అంగన్‌వాడి కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం గురించి వాకబుచేశారు. ప్రసవాలను ఇంటి వద్దకాక ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే చేసుకోవాలని సూచించారు. పౌష్టికాహారం ప్రక్కదారి పట్టిస్తే మీరు ఇంటిదారి పట్టాల్సి వస్తాదని హెచ్చరించారు. ప్రజా సమస్యలఈ కార్యక్రమంలో జడ్పీ సిఇఓ సూర్యప్రకాష్, జిల్లా వైధ్యాదికారి నరసింహులు, తహశీల్థార్ పుల్లయ్య, ఎపిడి మోహనరావు, పద్మ, ఎపి ఓ రమణ, వ్యవసాయాధికారి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
క్రిష్ణగిరిలో...
క్రిష్ణగిరి: మండల పరిధిలోని అమకతాడు గ్రామంలో బుధవారం కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి అకస్మిక తనిఖీలతో అడలెత్తించారు. ముందస్తు సమాచారం తెలపకుండా కలెక్టర్ గ్రామంలో తనిఖీలు చేపట్టడంతో అధికారులు పరుగుల తీశారు. గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి పనులను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి కూలీలతో మాట్లాడుతూ కూలీ ఎంత పడుతుంది, వేతనాలు సక్రమంగా చెల్లిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. స్థానిక అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలకు పోషకాహరం సక్రమంగా అందిస్తున్నారా, మార్పు కార్యక్రమంలో గర్భిణీ స్ర్తిలకు ఆరోగ్య కార్డులు పంపిణీ చేశారా, టీకాలు, పోష్టిక ఆహారం పంపినీ చేస్తున్నారా తదితర విషయాలు అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా గ్రామంలో పారిశుద్ధ్యం పనులు, తాగునీటి సమస్య తదితర అంశాలపై కలెక్టర్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జెడ్‌పి సిఇవో సూర్యప్రకాష్, డిఎం అండ్ హెచ్‌ఓ నర్సింహులు, ఎపిడి మోహన్‌రావు, ప్రోగ్రామ్ ఆఫీసర్ కస్తూరి విజయభాస్కర్‌రావు తదితరులు వున్నారు.

వికలాంగులను విస్మరించే ప్రభుత్వాలకు పుట్టగతులుండవ్
కల్లూరు, జనవరి 16: రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వ నిరాధారణకు గురై సమస్యలతో సతమతమవుతున్నారని వికలాంగులను విస్మరించే ప్రభుత్వాలకు పుట్టగతులుండవని పత్తికొండ ఎమ్మెల్యే కెఇ ప్రభాకర్ అన్నారు. బుధవారం వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నగరంలో చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగులు తమ న్యాయమైన కోరికల సాధనకోసం దీక్షను చేపట్టి 15 రోజులు గడుస్తున్న ప్రభుత్వంలో చలనం రావడం లేదంటే పరిస్థితి ఏ విధంగా వుందో అర్ధం అవుతుందన్నారు. వికలాంగులపట్ల చిత్తశుద్ది లేని ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పడానికి రాష్టవ్య్రాప్తంగా వికలాంగులు ఐక్యమత్యంతో కలిసి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.వికలాంగులకు సంఘీభావం ప్రకటించిన వారిలో టిడిపి బిటి నాయుడు, విహెచ్‌పిఎస్ నాయకులు దేవెంద్రయ్య,ఇద్దురుస్‌బాష, వన్నూరు బాష, వెంకటేష్, పరుశరాం పాల్గొన్నారు.
దీక్ష శిబిరాన్ని సందర్శించిన మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి
వికలాంగులు తమ సమస్యల సాధన కోసం నగరంలో చేస్తున్న నిరాహర దీక్ష శిబిరాన్ని వైయస్సార్ సిపి నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్‌రెడ్డి సందర్శించి దీక్షకు సంఘీభావం ప్రకటించారు. ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించలేని ప్రభుత్వం కనీసం వికలాంగుల న్యాయమైన పరిష్కరించాలని అన్నారు. ప్రతి వికలాంగునికి ఉచిత గృహం నిర్మించి, ఉచిత విద్యుత్ సరఫరాను అందించాలని, మోటర్ వాహనాలు నడుపుతున్న వికలాంగులకు 100 శాతం పెట్రోల్, డిజిల్‌ను అందించాలని, పెన్షన్‌ను పెంచి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. వికలాంగుల సమస్యలను వైయస్సార్‌సిపి అధ్యక్షులు జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారి సమస్యల పరిష్కారం కోసం వైయస్సార్‌సిపి కృషిచేసి వైయస్సార్ సిపి అధికారంలోకి వస్తే వికలాంగుల పెన్షన్‌ను రూ. 1000 ఇచ్చే విధంగా ప్లీనరీలో చర్చించడం జరుగుతుందని అన్నారు.

సిపిఎంలో చేరిన టైర్ల యజమానుల యూనియన్
నంద్యాల, జనవరి 16: నంద్యాలలోని 10, 12 టైర్ల యజమానుల యూనియన్ నాయకులు సిపిఎంలో చేరినట్లు బుధవారం ఆపార్టీ డివిజన్ కార్యదర్శి మస్తాన్‌వలి, సద్దాం ఉశేన్, శ్రీనివాసమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత మూడు నెలలుగా యూనియన్ ఏర్పడి వ్యాపారస్థులు బయటి బండ్లకు లోడింగ్ ఇవ్వడం వల్ల ఇబ్బందులుపడుతున్నట్లు తెలిపారు. దీంతో విసుగుచెంది సిపిఎంలో చేరినట్లు తెలిపారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా శ్రీనివాసమూర్తి, గౌరవాధ్యక్షులుగా కోటిరెడ్డి, అధ్యక్షులు బి రాంమోహన్, కార్యదర్శి నిజాముద్దిన్, ఉపాధ్యక్షులు దస్తగిరిరెడ్డి, ట్రెజరర్ ప్రసాద్‌రెడ్డి, శ్రీను, పాపోడు, లక్ష్మీనారాయణ, రాఘవయ్య లను కమిటీ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
వికలాంగుల దీక్షకు మద్దతు
నంద్యాల రూరల్, జనవరి 16: కర్నూలులోని శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం కూడలిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి అధ్వర్యంలో జరిగే రిలే నిరాహారదీక్షలను విజయవంతం చేస్తామని రాయలసీమ వికలాంగుల సేవా సమితి అధ్యక్షులు, న్యాయవాది అన్నమయ్య బాల సుబ్బయ్య తెలిపారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయమైన వికలాంగుల డిమాండ్ కోసం రాష్టవ్య్రాప్తంగా జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. ఈనెల 31వ తేదీ కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పెద్ద ఎత్తున వికలాంగులు తరలివచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో బ్రహ్మానందరెడ్డి, సంజీవరాయుడు, వెంకటేశ్వర్లు, వేణుగోపాల్, చైతన్యకుమార్, గని లక్ష్మీనారాయణ, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.
. 15లక్షలతో శ్మశాన స్థలానికి కృషి
నంద్యాల రూరల్, జనవరి 16: చేయి చేయ్యి కలిపి గ్రామస్థుల ఐక్యమత్యంతో రూ. 15 లక్షలు వసూలు చేసి స్మశాన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. రాష్ట్రంలోనే నిర్మల్ పురష్కార్, ఆదర్శవంతమై నంద్యాల మండలంలోని పాండురంగాపురం గ్రామంలో కొన్ని సంవత్సరాలుగా రోడ్డుప్రక్కన కెసి కాలువపై ఎవరైనా మరణిస్తే ఖననం చేసేవారు. గ్రామంలో స్శశాన స్థలమే కాకుండా పచ్చదనం పరిశుభ్రతకు శ్రమదానంతో గ్రామస్థులు కృషిచేస్తున్నారు. ఐక్యమత్యంతో ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని రాష్ట్రంలోనే అదర్శంగా నిలుస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
బేతంచెర్ల, జనవరి 16: మహాబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల వద్ద మంగళవారం అర్ధ్రరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బేతంచెర్లకు చెందిన ఇద్దరు యువ పారిశ్రామిక వేత్తలు దుర్మరణం చెందారు. సుబ్బారెడ్డి(32), నీలకంఠం (33) తమ మిత్రులతో కలిసి వ్యాపార నిమిత్తం పూణేకు జీపులో వెలుతుండగా అదుపుతప్పి డివైడర్‌కు తగిలి ప్రమాదం చోటుచేసుకుంది. సుబ్బారెడ్డి, నీలకంఠంలు తీవ్రగాయాలకు గురైనారు. చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించగా మృత్యువాత పడ్డారు. వెంకటేశ్వర రెడ్డి, మహేష్, రామక్రిష్ణలు స్వల్పగాయాలతో ప్రమాదం నుండి బయటపడ్డారు. పారిశ్రామిక రంగంలో నాపరాయి వ్యాపారం చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ఇద్దరు యువకులు మృతిచెందడంతో బేతంచెర్ల పట్టణంలోని పలువురు పారిశ్రామిక వేత్తలు విచారం వ్యక్తం చేశారు.
పాలేరువాగులో పడి బాలుడి మృతి
మహానంది, జనవరి 16: మహానంది మండలం నందిపల్లె గ్రామం వద్ద ప్రమాదవశాత్తు పాలేరువాగు గుంతలోపడి వెంకటరామయ్య (14) అనే బాలుడు మృతిచెందాడు, గుంటూరు జిల్లా రావులాపురం నుండి బతుకుదెరుకు చెరకు కొట్టెందుకు వచ్చిన మరియమ్మ ప్రభుదాస్‌ల పెద్ద కుమారుడు వెంకటరామయ్య నీటిని తెచ్చెందుకు వెళ్లి గుంతలోపడి మృతిచెందాడని గ్రామస్థులు తెలిపారు. బాబు మృతితో తల్లిదండ్రుల అర్థనాధాలతో ఆ ప్రాంతం శోకసంద్రంగా మారింది.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
హొళగుంద, జనవరి 16: బళ్ళారి జిల్లా శిరిగేరి పోలీస్‌స్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తిమృతి చెందాడని ఎస్సై లక్ష్మినారాయణ తెలిపారు. బుధవారం శిరిగేరి క్రాస్‌వద్ద రోడ్డుప్రమాదంలో మృతి చెందాడని, చికిత్స నిమిత్తం బళ్ళారి కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించగా మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. శవాన్ని బందువులు గుర్తుపట్టి తీసుకెళ్ళాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు.
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ఆళ్లగడ్డ, జనవరి 16: అహోబిలం అడవుల్లో అక్రమంగా నిల్వవుంచిన ఎర్రచందనం దుంగలను బుధవారం అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై స్ట్రైకింగ్ ఫోర్స్ అధికారి ఉద్దట్ల రాముడు మాట్లాడుతూ స్వ్కాడ్ డిఎఫ్‌ఓ చంద్రశేఖర్ సమాచారం మేరకు నల్లమల అడవిలో గాలింపు చేశామన్నారు. ఆవుగోరి ప్రాంతంలో స్మగ్లర్లు ఎర్రచందనం వృక్షాలను కూల్చి దుంగలుగామార్చి అక్రమ రవాణా కోసం సిద్ధంగా ఉంచారన్నారు. గాలింపులో ఈ దుంగలు అభ్యమయ్యాయని మెత్తం 38 దుంగలున్నాయని. వాటి విలువ దాదాపు రూ. 5 లక్షల వరకు ఉంటుందని ఆయన తెలిపారు. లభ్యమైన దుంగలను అహోబిలం అటవీ కార్యాలయానికి తరలించామన్నారు. ఈ గాలింపులో స్క్వాడ్ పారెస్టర్ ఈశ్వరయ్య, ఎఫ్‌బిఓ మద్దిలేటి, ప్రొటెక్షన్ వాచర్లు వెంకటేశ్వర్లు, మహబూబ్‌బాషా, వలి, గోపి తదతరులు పాల్గొన్నారు.
జీపుబోల్తా...ముగ్గురికి గాయాలు
మహానంది, జనవరి 16: మండలంలోని మహానంది వ్యవసాయ కళాశాల మధ్య ఉన్న పాలేరువాగు వద్ద బుధవారం ప్రమాదవశాత్తు అరటికాయల లోడు జీపు బోల్తాపడిన సంఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మహానంది నుండి గిద్దలూరువైపు వెళ్తున్న జీపు పాలేరువద్దకు రాగానే ఎదురుగా వస్తున్న సైకిల్‌ను తప్పించబోయి బోల్తాపడింది. దీంతో తిమ్మాపురం గ్రామానికి చెందిన మహేశ్వర్‌రెడ్డి, నాగేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే దారిలో కూర్చున్న గాంధీ అనే వ్యక్తి బోలేరో జీపు తగలడంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. మహానంది ఎఎస్‌ఐ తిరుపతయ్య పరిశీలించి కేసు నమోదు చేశారు.
పేకాటరాయుళ్ల అరెస్టు
సంజామల, జనవరి 16: సంజామల మండల పరిధిలోని ముక్కమళ్ళ చెరువుకట్టపై బుధవారం గ్రామానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, అలి అక్బర్, ఉశేన్‌సా అనే ముగ్గురు పేకాట అడుతుండగా దాడిచేసి వారి వద్ద నుండి రూ. 980లు స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ పులిశేఖర్ తెలిపారు.
నిందితుడి అరెస్టు
నంద్యాల రూరల్, జనవరి 16: తేళ్ళపూరు సమీపంలో మహిళా కండక్టర్‌పై దాడిచేసిన కేసులో టంగుటూరు వెంకటరెడ్డిని బుధవారం అరెస్టుచేసి ఆళ్లగడ్డ కోర్టుకు హాజరుపరచగా మేజిస్ట్రేట్ రిమాండ్‌కు అదేశించినట్లు ఎఎస్‌ఐ మద్దిలేటి తెలిపారు.

మకర సంక్రమణ
english title: 
k

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>