Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఢిల్లీ చేరని సిక్కోలు సంతకాలు

$
0
0

జనం కోర్టులో జగన్ నిర్దోషి అని నిరూపించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆచరించిన సంతకాల సేకరణకు జిల్లా అంతటా విశేష స్పందన లభించింది. ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొని జగన్ అరెస్టుకు నిరసనగా జగన్ కోసం - సంతకం పెట్టింది. అయితే స్వచ్ఛందంగా జగన్ కోసం సంతకం పెడతామంటూ సునామీలా ముంచెత్తిన యువత సంతకాలు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరుపయోగం చేసిందన్న ఆరోపణలు కూడా లేకపోలేదు. లక్షకుపైగా సంతకాల ప్రతులు కొన్ని పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఇంకా చేర్చలేకపోయారు. జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ ద్వారా సుమారు ఆరు లక్షల సంతకాల ప్రతులు పార్టీ అధినాయకత్వానికి చేరితే, 80 వేలు బొడ్డేపల్లి పద్మజ, 68 వేలు కిల్లి రామ్మోహన్‌రావు, 54 వేలు హనుమంతు కిరణ్ అండ్ కో., నేరుగా అందజేసారు. జిల్లా అంతటా ఉద్యమంలా సాగిన సంతకాల కార్యక్రమంలో సీనియర్ నేత కణితి విశ్వనాథం మాత్రమే నిజాయితీగా తానే జగన్ కోసం 20 వేల సంతకాలు సేకరించారు. మిగిలినవన్నీ స్నేహితుల ద్వారా, సంస్థల ద్వారా, వ్యాపార వర్గాల ద్వారా సంతకాలు సేకరించినవే. అలా చేసినప్పటికీ పాలకొండ డివిజన్ ఈ కార్యక్రమంలో వెనుబడింది. శ్రీకాకుళం, టెక్కలి డివిజన్‌లతో పోల్చితే సగానికి కూడా పాలకొండ డివిజన్ చేరుకోలేకపోయింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ బుధవారం దేశరాజధానిలో రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీని కలిసి 1,56,64,000 సంతకాలను సిడీల రూపంలో ఆయనకు అందజేస్తే అందులో శ్రీకాకుళం జిల్లా సంతకాలు సుమారు ఆరు లక్షల వరకూ ఉన్నాయి. జగన్ అక్రమ అరెస్టుకు నిరసనగా జగన్ కోసం జనం సంతకం చేస్తే జిల్లా అంతటా తొమ్మిదిన్నర లక్షలకుపైగా సంతకాల చిట్టాలు సిద్ధమయ్యాయి. అందులో సుమారు ఆరు లక్షల వరకూ పార్టీ జిల్లా కన్వీనర్ ధర్మాన పద్మప్రియ ద్వారా హైకమాండ్‌కు ఈ నెల 7, 8, 9 తేదీల్లో చేరాయి. మరో రెండు లక్షల సంతకాలు కొంతమంది వైకాపా నేతలు హైదరాబాద్ వెళ్లి అధినాయకత్వానికి అందజేసిన విషయం తెలిసింది. కాని - జగన్ కోసం జనం సంతకాలు పెట్టిన ప్రతులు మరో లక్షా ఏబై వేల వరకూ సిక్కోల్‌లోనే ఉండిపోయాయి. దీనికి కారణం కేవలం గ్రూపుల మధ్య తగాదాలే!? రాజకీయ పార్టీల్లో ఎన్ని గ్రూపులు కట్టుకున్నా ఎన్నికల సమయంలో బలం చూపించే ఓట్లు లెక్కింపునకు కళ్లుకు కాగడాలు పెట్టుకుని చూసే నేతలు సంతకాలు విషయానికి వచ్చేసరికి అవి బలంగా భావించకపోవడంతో లక్షా ఏభై వేల సంతకాలు ఇంకా శ్రీకాకుళం సరిహద్దులు దాటనివ్వలేకపోయారు. దీనికి డివిజన్‌ల వారీగా గ్రూపులు గోలే ప్రధాన కారణం. ముఖ్యంగా కన్వీనర్‌కు అందించాల్సిన సంతకాల ప్రతులు నేరుగా అందిస్తామని కొందరు, సంతకాల కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తే వారే అధినాయకత్వానికి అందిస్తే గుర్తింపు ఉంటోందన్న భావనతో మరికొందరు, అసలు కన్వీనర్‌తో విభేదించి ఎవరి దారిన వారు జగన్ కోసం - జనం సంతకం కార్యక్రమాన్ని నిర్వహించి పార్టీ ప్రధాన కార్యాలయానికి అందించేలా చర్యలు తీసుకునేవారు ఇంకొందరు. ఇలా..మార్గాలు వేర్వేనా సిక్కోల్ సంతకాలు చేరాల్సిన గమ్యం ఒకటేనన్న ఆలోచన ఉన్నప్పటికీ, నేతల మధ్య పెరుగుతున్న అగాథం వారి వ్యక్తిగత ఆత్మాభిమానం వైపు మళ్లించింది. అందుకే - లక్షా 50 వేల మంది జనం సంతకాలు పెట్టేల్లో గప్‌చుప్‌గా ఉండిపోయాయి.

గుట్కా నిషేధం అమలుపై సందేహాలు
ఎచ్చెర్ల, జనవరి 16: రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలాపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ వాటి అమలుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మూడేళ్ల కిందట ఇదే తరహాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని ప్రభుత్వం నిషేధించినా అది ఎక్కడా అమలు కాని విషయం తెలిసిందే. నిషేధ ఉత్తర్వులను పర్యవేక్షించి అమలు చేయాల్సిన అధికారులే ఆదేశాలు పాటించకపోవడం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో గుట్కా, పాన్‌మసాలాలను నిషేధించినా అది ఖచ్చితంగా అమలుకాదని పలువురు చెబుతున్నారు. పొరుగు రాష్టమ్రైన ఒడిశా నుంచి వివిధ పొగాకు ఉత్పత్తులు దండీగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు చేరుకుంటున్నాయి. వ్యాపారులు నిషేధాన్ని షాక్‌గా చూపి వినియోగదారుల నుంచి దండీగా సొమ్ములార్జిస్తున్నారు. పొగాకు ఉత్పత్తులను యువత విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. దీనివల్ల అనేక మంది రోగాలబారిన పడుతున్నా వినియోగంలో ఎటువంటి మార్పు రావడం లేదు. ముఖ్యంగా క్యాన్సర్‌తో అనేక మంది బాధపడుతున్నారు. ఎక్కువ శాతం మంది నోరు, గొంతు, కాలేయం వంటి రోగాలబారిన పడుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు సైతం అడ్డపొగ అలవాటు నుంచి బయటపడకపోవడం వల్ల అనేక వింతరోగాలు వ్యాప్తిచెందుతున్నాయి. డాక్టర్లు హెచ్చరిస్తున్నా వాటిని గ్రామీణ ప్రాంతాల ప్రజలు పెడచెవిన పెడుతున్నారు. సిగరెట్, గుట్కా, పాన్‌పరాక్, ఖైనీ, ఫైవ్‌థౌజండ్, చుట్ట, బీడీతో పాటు ఇతర పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు రోజుకు 15 లక్షల వరకు జరుగుతున్నట్లు వ్యాపార వర్గాలు స్పష్టం (మిగతా 2వ పేజీలో)

చేస్తున్నాయి. నిషేధాన్ని షాక్‌గా చూపించి వ్యాపారులు ఇప్పటికే ఖైనీ, పాన్‌పరాక్, గుట్కాలను రెట్టింపు ధరకు విక్రయిస్తున్నారు. నాలుగు రూపాయల విలువైన గుట్కాను ఎనిమిది రూపాయలు, ఐదు రూపాయల ఖైనీ ప్యాకెట్‌ను పది రూపాయలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. పొగాకు ఉత్పత్తులు వినియోగదారుల్లో చైతన్యం వస్తే తప్ప నిషేధం అమలు సాధ్యం కాదని మేధావివర్గాల సైతం స్పష్టం చేస్తున్నాయి.

పనిచేయని పంచాయతీ కార్యదర్శులను మార్చేయండి
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, జనవరి 16: విధులు సక్రమంగా నిర్వర్తించని పంచాయతీ కార్యదర్శులను చేర్పులు, మార్పులు చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించకపోతే సకాలంలో పనులు పూర్తికావన్నారు. బుధవారం జడ్‌పి సమావేశ మందిరంలో మండల అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి నెలాఖరునాటికి నిర్ధేశించిన పనులన్నీ పూర్తిచేయాలని సూచించారు. జిల్లాలో ఉపాధి హామీ పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ఇందుకు కొంత సమయం అధికారులు కేటాయించాలన్నారు. పూర్తి అయిన సిసి రోడ్లు, కాలువలకు సంబంధించిన బిల్లులు వెంటనే చెల్లించాలని పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీరును ఆదేశించారు. పల్లెకుపోదాం కార్యక్రమం నుండి మండల ఇంజనీరింగ్ అధికారులకు మినహాయింపు నివ్వాలని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ జిల్లాలో ఇంకా రూ.130 కోట్లకు సంబంధించిన పనులు చేయాల్సి ఉందన్నారు. ఈ ఏడాది ఎంపిడివోలు బాగా శ్రద్ధ చూపాల్సి ఉందన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, సి.సి.రోడ్లు, కాలువలు, గ్రావెల్ రోడ్లు, శ్మశానానికి రోడ్లు ఏర్పాటు వంటి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. పల్లెకుపోదాం కార్యక్రమం మండల ఇంజనీరింగ్ అధికారులను మినహాయించి టెక్నికల్ అసిస్టెంట్‌లతో పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలకు నమ్మకం కలిగేలా త్వరగా పనులు చేయించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ పోలా భాస్కర్, జెడ్‌పి సిఈవో కైలాస్‌గిరీశ్వర్, డుమా పిడి కళ్యాణ చక్రవర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

రిమ్స్‌లో రికార్డు ప్రసవాలు
శ్రీకాకుళం (టౌన్), జనవరి 16: రాజీవ్‌గాంధీ వైద్య విద్యా కళాశాల ఆసుపత్రి(రిమ్స్) లో బుధవారం రికార్డు స్థాయి ప్రసవాలు నమోదయ్యాయి. ఆసుపత్రి ప్రసూతి (మెటర్నిటీ) విభాగంలో 40 మంచాలు మాత్రమే ఉండటంతో ఇంకా వస్తున్న గర్భిణులకు చికిత్స అందించడానికి మంచాలు ఖాళీలేక సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. గర్భిణులను వేచి ఉంచలేక అత్యవసర అవసరాలు ఉన్నవారిని గుర్తించి మిగతా వారిని ఇంటికి పంపించేస్తున్నారు. గతేడాది మొత్తానికి ప్రసూతి విభాగంలో 700 ప్రసవాలు మాత్రమే జరుగగా బుధవారం ఒక్కరోజే 24 ప్రసవాలు జరగడం రిమ్స్ చరిత్రలోనే రికార్డుగా చెప్పుకుంటున్నారు. ఇదే పంథాను కొనసాగించినట్లైతే ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాల లక్ష్యం నెరవేరడంతో పాటు శతశాతం ప్రభుత్వ ఆసుపత్రి ప్రసవాలు జరిగినట్లవుతుందనడంలో సందేహం లేదు. వివరాల్లోకి వెళ్తే.. ప్రసూతి విభాగానికి సంబంధించి 40 మంచాలు ఉండగా మంగళవారానికి ఆసుపత్రిలో ప్రసూతి కేసులు 70 ఉన్నాయి. అత్యవసర కేసులు మినహా మిగిలిన వారిని స్ర్తి వ్యాధుల విభాగం (గైనిక్)లో ఉన్న మంచాలపైకి చేరుస్తున్నారు. బుధవారం 108 ద్వారా ఒకే పర్యాయం 18 మంది ప్రసూతి విభాగానికి విచ్చేయడంతో వైద్య సిబ్బంది వసతి, వైద్య సదుపాయాల కల్పనకు తలలు పట్టుకుంటున్నారు. వచ్చిన వారిని ఫ్రీ ఏంటినేటల్ బయట బల్లలపై కూర్చుండబెట్టి ప్రసవానంతర కేసులను పరీక్షించి వెంటవెంటనే వారికి డిశ్చార్జి ఇచ్చి ఇంటికి పంపించివేస్తున్నారు. సిబ్బందిని ప్రసూతి కేసులు అధికం గూర్చి ఆంధ్రభూమి సంప్రదించగా ఇది ప్రసవ సీజన్ అని, పైగా పండగ కావడంతో ప్రైవేట్ ఆసుపత్రులు మూసి ఉండటం కూడా రిమ్స్ ఆసుపత్రికి గర్భిణిల తాకిడి అధికం కావడం ఇక కారణమని బదులిచ్చారు. ఆసుపత్రి ప్రసవాలు అధికం కావడం హర్షణీయమే అయినా ప్రసూతి విభాగానికి ఇంకొన్ని బెడ్‌లతో పాటు అధిక సిబ్బందిని కేటాయించాల్సి ఉంది.

కమలానంద భారతీ స్వామి
అరెస్టు అన్యాయం
* బిజెపి రాష్ట్ర నేత వేణుగోపాలం
ఎచ్చెర్ల, జనవరి 16: హిందూ ధర్మ ప్రచారకులు కమలానంద భారతీస్వామిజిని అరెస్టు చేయడం అన్యాయమని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పైడి వేణుగోపాలం అన్నారు. మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసనసభ్యునిగా ఉన్న అక్బరుద్దీన్ ఒవైసీ హిందుమతంపైన, హిందుదేవుళ్లను కించపరిచే విధంగా మతవిద్వేషాలను రెచ్చగొట్టే విధంగా చేసిన ప్రసంగాలను ఖండించడమే రామానందస్వామి చేసిన నేరమా అని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ చేసే ప్రసంగాలను పభుత్వం సమర్ధిస్తుందన్న సందేహాలు తొంగిచూస్తున్నాయన్నారు. వందకోట్ల హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా అక్బరుద్దీన్ విమర్శలు చేయడం సి.ఎం. వెనకేసుకు వస్తూ స్వామిజీపై తప్పుడు కేసులు నమోదు చేయించారని ఆరోపించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలు పాల్పడడం వల్లే ఇటువంటి ఘటనలు పునరావృతమై మతసామరస్యం మంటగలుస్తుందన్నారు. దేశంలో సోదరులుగా కలిసిమెలసి జీవిస్తున్న హిందూ, ముస్లింల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టిన అక్బరుద్దీన్‌తో కమలానందస్వామిజీని పోల్చే విధంగా తప్పుడు కేసులు పెట్టడం, అరెస్టు చేయడం కుహానా రాజకీయాలకు తార్కాణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇటువంటి చర్యలు తగునా అని ప్రశ్నించారు. తక్షణమే స్వామిజీపై పెట్టిన కేసులను ఉపసంహరించుకుని బేసరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి పైడి సత్యంమాష్టారు, మండల శాఖ అధ్యక్షులు కంచరాపు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.
బొగ్గు రైలు నుండి మంటలు
అదుపు చేసిన అధికారులు
పలాస, జనవరి 16: తాలసేరు నుండి విజయవాడ వైపు బొగ్గు లోడుతో వెళ్తున్న రైలు నుండి పొగలు రావడంతో రైల్వే అధికారులు అప్రమత్తమై పలాస అగ్నిమాపక సిబ్బంది సహాయంతో మంటలు అదుపు చేశారు. బుధవారం బరంపురం నుండి వస్తున్న బొగ్గురైలు పలాసకు చేరుకుంటుండగా కుమ్మాదేవి స్టేష్టన్ మాస్టార్ రైలు బోగి నెంబర్ 121,505 నుండి పొగలు రావడం గమనించి పలాస రైల్వే స్టేష్టన్ మాస్టార్‌కు సమాచారం అందజేసారు. దీంతో ఆయన కాశీబుగ్గ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో సిబ్బంది బొగ్గు రైలు వచ్చే సమయానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి నష్టం జరుగలేదని స్టేషన్ మాస్టార్ ఎం కె ప్రదాన్ తెలిపారు. పలాస రైల్వే స్టేషన్‌కు ఉదయం 7 గంటలకు చేరుకున్న రైలు ఈ అగ్ని ప్రమాదం వలన 11 గంటలకు బయలుదేరింది. ఈ రైలుబండి అవ్‌టర్ ట్రాక్‌పై నిలిపివేయడంతో రైలు రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఏర్పడలేదు.
రూ.32 కోట్లతో
వంశధార పనులకు ప్రతిపాదనలు
* డి.ఇ. శేఖరరావు
నరసన్నపేట, జనవరి 16: స్థానిక వంశధార డివిజన్ పరిధిలో తాగునీటి కాలువల మరమ్మతులకు ప్రతిపాదనలు పంపించామని డి.ఇ. శేఖరరావు తెలిపారు. బుధవారం వంశధార కార్యాలయంలో ఏర్పాటు చేసిన నీటి సంఘాల సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. డివిజన్‌లో 21 ప్లూయిస్‌లు, కాజ్‌వేలు మరమ్మతులకు గురయ్యాయని, వీటి మరమ్మతులకు గాను 32 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించామన్నారు. డివిజన్ పరిధిలో ఉన్న 12 నీటిసంఘాలకు స్థానికంగా కార్యాలయాలను ఏర్పాటు చేశామన్నారు. నెలాఖరులోగా కలెక్టర్ ద్వారా వీటిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. గతంలో పేరుకుపోయిన బకాయిలను వసూలు చేసేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా నీటిసంఘ అధ్యక్షులు రాడ మోహనరావు, సంఘ అధ్యక్షులు శేఖర్‌బాబు, రోణంకి నర్సింగరావు, పొన్నాన దాలినాయుడు, రాంబాబు, గొండు కేశవరావు, ఎ.ఇ.లు సురేష్, గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.

కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి
దరఖాస్తులు ఆహ్వానం
శ్రీకాకుళం (టౌన్), జనవరి 16: ఇటీవల వెలువడిన పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రకటన అనుసరించి జిల్లాలో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్పీ కె.వి.వి.గోపాలరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్టయిపెండరీ కానిస్టేబుల్ సివిల్, ఏఆర్, ఏపియస్‌పి, ఎస్‌పియఫ్, ఫైర్‌మేన్(పురుషులు), సివిల్, ఏఆర్(స్ర్తిలు) ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 21 నుండి ఫిబ్రవరి 20 వ తేదీ వరకు పనిదినములలో ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక జిల్లాలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులను ఎచ్చెర్లలోని ఏ ఆర్ గ్రౌండ్‌లో స్వీకరించనున్నట్లు తెలిపారు.
కూర్మనాథుని సన్నిధిలో అష్టలక్ష్మీ పీఠాధిపతి
గార, జనవరి 16: మండలంలోని సుప్రసిద్ధమైన శ్రీకూర్మనాథుని పుణ్యక్షేత్రాన్ని కొండకప్పాక అష్టలక్ష్మీ పీఠాధిపతి పరపతి రఘునాధాచార్యులు బుధవారం సందర్శించారు. ఈయనను ఆలయ మర్యాదలుతో స్వాగతించిన అర్చకులు బేడా మండపంలోని గోడలపై ఉన్న ఒడిషా ఆకుపసర్లుతో వేసిన నాటి చారిత్రక చిత్రాల విశిష్టత, చరిత్రను అర్చకులు వివరించారు. కూర్మనాథునికి విశేషపూజలు అనంతరం ఆలయ సన్నిధిలోని లక్ష్మీ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు ఆశీర్వచనాలు పలికి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.

రిమ్స్‌లో ‘రక్త’దాహం

శ్రీకాకుళం (టౌన్), జనవరి 16: జిల్లా కేంద్రంలో రాజీవ్‌గాంధీ వైద్య కళాశాల ఆసుపత్రిలో రక్తం కొరత నెలకొంది. ఒకరి రక్తదానం ఇంకొకరికి ప్రాణదానం అన్న నానుడిని కించపరుస్తూ డబ్బుంటేనే రక్తం, లేదంటే ఏమైనా పర్వాలేదు అన్న చందాన సిబ్బంది వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. స్వయానా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఇటీవల ఒక ప్రకటన చేస్తూ జిల్లాలో రక్తనిల్వలు నిండుకున్నాయి, అందుకు యువత ముందుకు వచ్చి జిల్లా ప్రజల రక్త అవసరాలను తీర్చాలని పిలుపునివ్వడం హర్షణీయమే అయినా, రక్తనిధి కేంద్ర సిబ్బంది చేతివాటం లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నాయి. ఇదిలా ఉంటే పట్టణానికి చెందిన బి.సరోజిని అనే మహిళకు అబార్షను కాగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. చికిత్స అనంతరం ఇంటికి వెళ్లిపోగా మరల కడుపులో నొప్పితో రిమ్స్‌లో చేర్పించారు. రిమ్స్ ఆసుపత్రి వర్గాలు పరీక్షలు నిర్వహించి కడుపులో ఇన్‌ఫెక్షను సోకిందని, ఒకవేల అవసరమైతే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందన్నారు. తొలుత ఆమె రక్తహీనతతో బాధపడుతున్నందున రక్తం రెండు, మూడు యూనిట్లు వరకూ అవసరాన్ని బట్టి ఎక్కించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి రోగి బంధువులు సిద్ధం కావాలని సూచించారు. సంబంధిత బంధువులు రక్తం కోసం ఆసుపత్రి రక్తనిధి కేంద్రాన్ని సంప్రదించి మొదటగా ఒక యూనిట్ రక్తం తీసుకువెళ్లారు. మరల రెండో యూనిట్ కావాలని బుధవారం అడుగగా సొమ్ములు ముట్టజెప్పనిదే ఇచ్చేది లేదంటూ ఖరాకండిగా చెప్పడం విశేషం. దీనికి తెలిసిన వారు వెళ్లి ఇదేంటని అడుగగా నిబంధనలు పేరుచెప్పి ఆశ్చర్యచకితులను చేస్తున్న వైనం విడ్డూరం. పోనీ జిల్లా కేంద్రంలోని రెడ్‌క్రాస్ వద్ద తీసుకుంటామని చెప్పినా దానికి కావాల్సిన దరఖాస్తులు, శాంపిల్స్‌లో జాప్యం. విషయాన్ని రక్తనిధి వైద్యాధికారి దృష్టికి తీసుకువెళ్తామంటే ఆయనా అందుబాటులో లేరు. ఉదయం 9గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు విధులు నిర్వహించాల్సిన వైద్యాధికారి గదికి తాళం వేసి ఉండటంతో నర్సింగ్ సిబ్బంది ఆడినదే ఆట, పాడినదే పాటగా తయారైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా నివాసం ఉండాల్సిన నర్సింగ్ సిబ్బంది కూడా విశాఖపట్నం నుండి రాకపోకలు సాగించడంతో రిమ్స్ ఆసుపత్రి రోగులకు వైద్యసేవలు అందని ద్రాక్షగానే మిగులుతుందని, ఇదెప్పుడు బాగుపడుతుందో అంటూ పలువురు తమలోని బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు రోగులకు ఉత్తమమైన సేవలు అందించే విధంగా సరైన చర్యలు తీసుకుంటే తప్ప ప్రభుత్వ లక్ష్యం నెరవేరదు.
* విచారించి చర్యలు తీసుకుంటాం
ఇన్‌చార్జి సూపరింటెండెంటు అప్పలనాయుడు
రక్తనిధి వైద్యాధికారి విధుల్లో ఉండాలని, నర్శింగ్ సిబ్బందిపై ఫిర్యాదులు అందుతున్నాయని, విచారణ చేయిస్తామని ఇన్‌చార్జి ఆసుపత్రి సూపరింటెండెంట్ బమ్మిడి అప్పలనాయుడు అన్నారు. విచారణ అనంతరం తగు చర్యలు తీసుకుంటామన్నారు.

జిల్లా ఖాజీగా జనాబ్ అబ్దుల్

శ్రీకాకుళం (టౌన్), జనవరి 16: జిల్లా ఖాజీగా స్థానిక ముస్లిం మతగురువు జనాబ్ అబ్దుల్ వహాబ్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈయన ఆధ్వర్యంలో జిల్లాలో జరిగే ముస్లిం వివాహాలు నమోదు జరుగుతుందని జిల్లా ముస్లిం మైనార్టీ సెల్ చైర్మన్ ముస్తాక్ మహమ్మద్ బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఖాజీగా ముస్లిం మతగురువును నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈయనను నియామకానికి సహాయ సహకారం అందజేసిన మంత్రి ధర్మాన ప్రసాదరావును పట్టణానికి చెందిన పలుమసీదు కమిటీల ప్రతినిధులు సన్మానించారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి ధర్మాన చేతుల మీదుగా ఖాజీ నియామక పత్రాన్ని జనాబ్ అబ్దుల్ అందుకున్నారు. కార్యక్రమంలో జిల్లా నూరాని మసీదు అధ్యక్షుడు అబ్దుల్ రహమాన్, మీనా మసీదు అధ్యక్షుడు చోటాభాయ్, చంపా మసీదు అధ్యక్షుడు ఆలీఖాన్, ముస్లిం పెద్దలు సబ్జు, అబ్దుల్ యాసిన్, అన్వర్, నాజిమ్, ఖాన్ పాల్గొన్నారు.

ముగిసిన సంక్రాంతి సందడి
పాతశ్రీకాకుళం, జనవరి 16: సంక్రాంతి పండుగ సందడి బుధవారంతో ముగిసింది. ముక్కనుమ రోజు బుధవారం జిల్లా కేంద్రంలో రోడ్లన్నీ కిటకిటలాడాయి. పట్టణ ప్రజలతో పాటు గ్రామీణులు పట్టణానికి చేరుకుని వినోదంగా గడిపారు. ఆలయాలు, పార్కులను కుటుంబాలతో సందర్శించారు. పాతజ్ఞాపకాలను గుర్తుచేసుకుని సంతోషాలు పంచుకొన్నారు. ప్రేక్షకుల అవసరాలకు అనుగుణంగా థియేటర్ల యజమానులు అదనపు ప్రదర్శనలు వేశారు. కొత్త సినిమాలు రిలీజ్ కావడంతో రద్దీ మరింత పెరిగింది. అగ్రహీరోలు సినిమాలు ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద జనాలతో సందడి అధికమైంది. ఇటీవలి మంత్రి ధర్మాన చేతుల మీదుగా ప్రారంభించబడిన ఎగ్జిబిషన్ వద్ద, ప్రధాన రోడ్ల వద్ద యువకులు ఎక్కువ కనిపించారు. కనుమ, ముక్కనుమను పురస్కరించుకుని చికెన్, మటన్ దుకాణాలు, బార్లు, వైన్ షాపుల వద్ద అధికంగా జనాలు కనిపించారు. ఇదే అదునుగా మాంసం, ఉల్లిపాయలు, నిత్యవసర సరుకుల ధరలు ఒక్కసారిగా పెంచేశారు. ఇక వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు, కొన్నవారి నుండి అత్తవారి ఇళ్లకు చేరాలనుకునే వారితో ఆర్టీసి కాంప్లెక్స్, రామలక్ష్మణ కూడలి, అరసవల్లి జంక్షన్, పాతబస్టాండ్ వద్ద ప్రయాణీకుల హడావిడి కనిపించింది. అయితే తెరిచి ఉన్న వాణిజ్య బ్యాంకులు, పలు కార్యాలయాలు పౌరసంబంధాలు లేక వెలవెలబోయాయి.
జిల్లాలో అధిక ధరకు విద్యుత్ సరఫరా పథకం
శ్రీకాకుళం (టౌన్), జనవరి 16: జిల్లాలోని హెచ్‌టి, ఎల్‌టి విద్యుత్ వినియోగదారులకు అధిక ధర విద్యుత్ సప్లై స్కీమ్ అమలు చేయుటకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు జారీచేసినట్లు ఎపిఇపిడిసియల్ పర్యవేక్షక ఇంజనీర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పై విద్యుత్ వినియోగదారులు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేసుకున్న ఎడల వారికి రిస్ట్రిక్షన్, కంట్రోల్ నిబంధనల ప్రకారం పెరిమిటెడ్ డిమాండ్ లిమిట్, పెరిమిటెడ్ కన్జంప్సన్ లిమిట్‌కు పైబడి విద్యుత్‌ను వినియోగించుకోవచ్చన్నారు. ఈ స్కీంలో విద్యుత్ కావలిసిన వారు జనవరి 21లోపు పర్యవేక్షక ఇంజనీరును కలిసి అగ్రిమెంట్ చేసుకోవాలని సూచించారు.
సమష్టి కృషితో సహకార విజయం
టిడిపి నేత రామ్మోహన్‌నాయుడు
పాతపట్నం, జనవరి 16: సమిష్టికృషితో సహకార ఎన్నికల్లో విజయం సాధించగలమని తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. ఆయన బుధవారం తన తాతగారి గ్రామమైన బంగుతోటకు విచ్చేసిన సందర్భంగా విలేఖరులతో మాట్లాడారు. దేశం పార్టీకి బలమైన క్యాడర్ ఉందని, కేడర్ విజయం చేకూర్చుతుందన్నారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పాదయాత్ర కార్యకర్తల్లో నూతన ఉత్తేజం తెస్తుందన్నారు. రానున్నది దేశం పార్టీ కాలమేనని అభిప్రాయపడ్డారు. ఈయనతోపాటు టిడిపి నాయకులు కొంచాడ వీరభద్రరావు, పైల లచ్చుమయ్య, పైల బాబ్జీ, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

(ఆంధ్రభూమి బ్యూరో - శ్రీకాకుళం)
english title: 
s

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>