విశాఖపట్నం, జనవరి 18: మనిషి మనసు, వాక్కు, నడవడిక ఒకే విధంగా ఉండాలి.. మనసులో ఉన్నదాన్ని వాక్కులో చెప్పాలి.. అలా చెప్పిందాన్ని ఆచరించి చూపాలని శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి అన్నారు. దక్షిణ దేశ విజయ యాత్రలో భాగంగా మహాస్వామి నాలుగు రోజులపాటు విశాఖ నగరంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తొలిరోజు శుక్రవారం స్థానిక ఎంపివి కాలనీలో ఉన్న టిటిడి కళ్యాణ మండపంలో ఆయన భక్తపరివారాన్ని ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. మనసు, వాక్కు, నడవడిక ఉన్న వారు మాత్రమే మహనీయులు అవుతారని, అటువంటి వారి వద్ద విశ్వాసం, గౌరవం ఉంటుందని చెప్పారు. శంకర భగవత్పాదుల వారు సకల సద్గుణ సంపత్తి కలిగిన వారని అన్నారు. ఆయన జ్ఞాన సంపదను అందరికీ పంచారని అన్నారు. గురువు జ్ఞాన సంపత్తి కలిగి, తత్వాన్ని తెలుసుకున్నవాడై ఉండాలని అన్నారు. ఆ తత్వం కూడా గురుపరంపర ద్వారా సంక్రమించాలని స్వామి ప్రవచించారు. గురు ముఖంగా ఆర్జించిన విద్యే జ్ఞానంతో కూడుకుని ఉంటుందని చెప్పారు. శిష్యుల సంశయాలను నివృత్తి చేయగలిగి, నిరహంకారిగా ఉన్నవారు మాత్రమే గురువులుగా గుర్తింపు పొందుతారని భారతీతీర్థ స్వామి అన్నారు. శంకరాచార్యుల వారు అవతరించిన 16 సంవత్సరాలకే ఉత్కృష్ట గ్రంథాలను రచించారని అన్నారు.
*శృంగేరీ పీఠాధిపతి భారతీతీర్థ మహాస్వామి
english title:
m
Date:
Saturday, January 19, 2013