హైదరాబాద్, జనవరి 19: ‘వన్‌సైడ్ లవ్వుకు మేము ఒప్పుకోం..’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి (సిజిసి) సభ్యుడు, మాజీ మంత్రి ఎంవి మైసూరారెడ్డి కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. వచ్చే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వంద స్థానాలు కూడా దక్కించుకోలేని హీనమైన స్థితిలో ఉన్న కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయాల్సిన గత్యంతరం తమకు లేదని, ఒంటరిగానే పోటీ చేసే సత్తా ఉందని మైసూరారెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాతో పొత్తు పెట్టుకోవడాన్ని తాను ఖండించలేనని, ఆ విషయం తమ పార్టీ రాష్ట్ర నాయకత్వానికి వదిలి వేస్తామని ఎఐసిసి నాయకుడు, కేంద్ర మంత్రి వాయలార్ రవి చేసిన వ్యాఖ్యలపై మైసూరా పైవిధంగా స్పందించారు. కాంగ్రెస్‌కు వయస్సు మళ్లిందని, వైకాపా యవ్వనంలో ఉందని అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మూడు అంకెలు దాటే అవకాశం లేదని ఆయన తెలిపారు. సుస్థిరత, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, లౌకిక పార్టీలతో కలిసి పోటీ చేసే విషయం ఎన్నికల ముందు ఆలోచిస్తామే తప్ప ఇప్పుడు అటువంటి ఆలోచన చేయలేదని అన్నారు. ఒంటరిగా పోటీ చేసే సత్తా తమకు ఉందని ఆయన తెలిపారు. జగన్ కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే సిఎం అయ్యే వాడని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారని ఆయన చెబుతూ పార్టీలో లేకపోతే జైలులో వేస్తారా? అని ప్రశ్నించారు. సిబిఐని దుర్వినియోగం చేశారని ఆయన విమర్శించారు. ఇప్పుడు సిగ్గు, ఎగ్గు లేకుండా పొత్తుల గురించి మాట్లాడుతున్నారని ఆయన వాయలార్‌పై ధ్వజమెత్తారు. ఏ పార్టీలో పొత్తు ఉండదని, న్యాయస్థానంలో తేల్చుకుంటామని, ప్రజా న్యాయస్థానంలో నిలబెడతామని ఆయన కాంగ్రెస్‌ను హెచ్చరించారు.
రెండు అభిప్రాయాలు..
కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ రెండు అభిప్రాయాలు చెప్పిందని అన్నారు. ఒకరు తెలంగాణ కావాలని, రెండో వ్యక్తి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పారని ఆయన గుర్తు చేశారు. మీ పార్టీ కూడా అటు-ఇటు కాకుండా చెప్పింది కదా? అని ప్రశ్నించగా, కాంగ్రెస్ తరఫున వచ్చిన ఇద్దరు ప్రతినిధులు ఏదైనా పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి వదిలి వేస్తున్నామని అన్నారని, కాబట్టి కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన అభిప్రాయం చెబితే, తమ పార్టీ కూడా స్పష్టంగా చెబుతుందని ఆయన అన్నారు. కాంగ్రెస్-టిడిపి కుమ్మక్కై డ్రామా చేస్తున్నాయని ఆయన విమర్శించారు. విజయమ్మ పెరట్లో అవినీతి మొక్కలు ఉన్నాయని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. బాబు పెరట్లోనే అవినీతి మొక్కలు ఉన్నాయని ఆయన విమర్శించారు.
డీజిల్ ధరలను పెంచడం పట్ల ఆయన తీవ్రంగా విమర్శించారు. వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు ఇలా పెంచుతూ పోతే పేద, మధ్య తరగతి కుటుంబీకులు ఎలా బతుకుతారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ చేతకాని తనానికి ఇది నిదర్శనమని మైసూరారెడ్డి విమర్శించారు. ప్రపంచ బ్యాంకు వత్తిళ్ళకు ప్రనుత్వం లొంగి ధరలు పెంచుతున్నదని ఆయన దుయ్యబట్టారు.
ఒంటరిగా పోటీ చేసే సత్తా మాకు ఉంది వంద సీట్లు రాని హీనస్థితిలో కాంగ్రెస్ వాయలార్ వ్యాఖ్యలపై మైసూరా
english title:
c
Date:
Sunday, January 20, 2013