హైదరాబాద్, జనవరి 19: ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందన్న నమ్మకం ఉంది కానీ మీలాంటి వాళ్ళతో కొంత భయం ఉంది..’ అని సీమాంధ్ర నాయకులను ఉద్దేశించి తెలంగాణకు చెందిన కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ నెల 28వ తేదీలోగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కేంద్రం ప్రకటన చేయకపోతే మనది ప్రజాస్వామ్య దేశం అనుకోవడానికి సిగ్గుపడతానని ఆయన శనివారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఎంపి వివేక్ కూడా పాల్గొన్నారు. 1956 సంవత్సరానికి ముందు రెండు రాష్ట్రాలు ఉండేవని పొన్నం గుర్తు చేశారు. ఇప్పుడు విభజన బాధ కలిగించినా, అనివార్యమని అన్నారు. ఈ 50 ఏళ్ళ కలయికలో సీమాంధ్ర ప్రజలు తమతో కలవలేదని, సమైక్య భావం కలిగించలేదని ఆయన తెలిపారు. కిరాయిదారుల్లా వచ్చారు, తెలంగాణ వారిపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ వారెవరూ సీమాంధ్రకు వెళ్ళలేదని ఆయన చెప్పారు. కేవలం కొంత మంది పెత్తందార్లు, 32 వేల కోట్ల అప్పు మాఫీ చేయించుకున్న వారు ఇప్పుడు తెలంగాణకు అడ్డుపడుతున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అవుతుందన్న నమ్మకం ఉంది కాబట్టి తెలంగాణ ప్రజలు వౌనంగా ఉంటున్నారని, అది బలహీనతగా భావించరాదని అన్నారు. తెలంగాణ తీసుకునే వాళ్ళు కాబట్టి ఓపికతో ఉండాలని అధిష్ఠానం సూచించిందని ఆయన తెలిపారు. ఓట్లు, సీట్ల గురించి సీమాంధ్ర నాయకులే మాట్లాడుతున్నారని, నివేదికలు సమర్పించారని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందని అంటున్నారని, అలాగైతే జై ఆంధ్ర ఉద్యమం చేసిన కాకాని వెంకటరత్నం ఆత్మ క్షోభించదా? అని ఆయన ప్రశ్నించారు. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ఎందుకు అడగలేదని ఆయన ప్రశ్నించారు. ఆ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని తామూ ప్రధానికి, సిఎంకు సూచిస్తామని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే జోగి రమేష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకున్నారు కాబట్టే సమైక్యవాదం వినిపించడంలో పార్టీ విఫలమైందని విమర్శించారని ఆయన తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకునే వారికి ఆ పార్టీ నాయకత్వం ఈ నెల 25వ తేదీ గడువు విధించింది కాబట్టే ఇలా ఏదో వంకతో వెళుతున్నారని ఆయన చెప్పారు. హైదరాబాద్‌పై ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే నక్సల్స్ సమస్య, మత విద్వేషాలు పెరుగుతాయన్న ప్రచారంలో వాస్తవం లేదని పొన్నం తెలిపారు. ఎంపి జి వివేక్ మాట్లాడుతూ గూర్ఖాల్యాండ్ ప్యాకేజీతో ముడి పెట్టవద్దని అన్నారు. తెలంగాణను వ్యతిరేకిస్తే సీమాంధ్ర ప్రజలకు అన్యాయం చేసిన వారవుతారని తెలిపారు.
సీమాంధ్ర కాంగ్రెస్ నేతలపై పొన్నం విసుర్లు
english title:
n
Date:
Sunday, January 20, 2013