హైదరాబాద్, జనవరి 19: ఆరో తరగతి విద్యార్ధి ఒకటో తరగతి పాఠ్యపుస్తకాన్ని కూడా చదవలేని స్థితి, సగటున 16.3 శాతం మంది ఆరోతరగతి విద్యార్ధులు మాత్రం ఒకటో తరగతి పుస్తకాలు చదివే స్థితిలో ఉన్నారు. దిగ్భ్రాంతి కలిగించే ఈ వివరాలు ప్రధమ్ సంస్థ విడుదల చేసిన అసర్ (విద్యారంగం వార్షిక స్థితి నివేదిక) -2012 నివేదికలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లపైనే విద్యార్ధులు మోజు చూపుతున్నారని అసర్ సర్వేలో తేలింది. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈ సర్వేను కేంద్ర మానవ వనరుల మంత్రి డాక్టర్ పల్లంరాజు విడుదల చేశారు. ఈ నివేదికలో ప్రభుత్వ స్కూళ్లు మెరుగుపడాల్సింది చాలా ఉందని తేలింది. చాలా స్కూళ్లలో పరిస్థితి చాలా ఘోరంగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. 6 నుండి 14 ఏళ్లలోపు పిల్లల్లో 36.5 శాతం మంది ప్రైవేటు స్కూళ్లలోనే చేరుతున్నారని, మరో 2.6 శాతం మంది పాఠశాలల బయటే ఉంటున్నారని కూడా తేల్చింది.
ఇక 7-16 సంవత్సరాల్లో 34.5 శాతం మంది ప్రైవేటు స్కూళ్లలో ఉండగా, బడి బయట 5.1 శాతం పిల్లలు ఉన్నట్టు తేలింది. 10 ఏళ్లలోపు బాలలు 45.8 శాతం మంది ప్రైవేటు స్కూళ్లలో ఉండగా, 14 ఏళ్లలోపు వారిలో 34.6 శాతం మంది ప్రైవేటు స్కూళ్లలోనే ఉన్నారని తేల్చారు. ఆరేళ్లలోపు పిల్లల్ని తీసుకుంటే అందులో 46.7 శాతం మంది ప్రైవేటు స్కూళ్లలో ఉన్నారని తేల్చింది. అదే 5 ఏళ్లలోపు వారిలో 46.8 శాతం మంది ప్రైవేటు స్కూళ్ల బాట పట్టారని సర్వేలో పేర్కొన్నారు.
ఒకటోతరగతిలో కనీసం 25 శాతం మంది కూడా ఆల్ఫాబిటాలను చదవలేకపోతున్నారని, పదాలను చదవగలిగేవారు 19.5 శాతం మంది మాత్రమే. అదే ఆరో తరగతికి వచ్చేసరికి ఒకటో తరగతి పుస్తకాలను కేవలం 19.4 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నారు. ఒకటో తరగతి నుండి ఏడో తరగతి వరకూ తీసుకుంటే 16.3 శాతం మంది మాత్రమే ఈ పనిచేయగలుగుతున్నారు. రెండో తరగతి పుస్తకాన్ని 45.1 శాతం మంది మాత్రమే చదవగలుగుతున్నారు. మిగిలిన 55 శాతం మంది కనీసం చదివే స్థితిలో లేరు. ఆంగ్లం సబ్జెక్టుకు వస్తే పరిస్థితి మరీ ఘోరం ఆరో తరగతిలో చిన్నచిన్న పదాలను గుర్తించగలిగే వారు 20.9 శాతం మాత్రమే కాగా, ఏడోతరగతి వారు 16.7 శాతం మాత్రమే, ఇక గణితం చూసుకుంటే ఆరోతరగతిలో వంద వరకూ అంకెలు గుర్తించగలిగేవారు 12.7 శాతం కాగా, అంకెలు గుర్తించే ఏడో తరగతి విద్యార్ధులు 11.5 శాతం మాత్రమే, 8వ తరగతి వారు 9.0 శాతం మాత్రమే, సగటున అంకెలు చదవగలిగేవారు 27 శాతం మాత్రమే, 2009లో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న వారిలో 22.9 శాతం మంది ట్యూషన్లకు వెళ్లగా, 2012లో అది 10.5 శాతానికి తగ్గింది. ఆర్టీఇ అమలు, పాఠశాలల్లో ఇతర సదుపాయాలు, పాఠశాలల్లో కార్యక్రమాలు అమలుతీరుపై కూడా ఈ సర్వే అనేక దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించింది.
పతనానికి ప్రభుత్వానిదే బాధ్యత
ప్రాథమిక విద్య పతనానికి ప్రభుత్వానిదే బాధ్యత అని యుటిఎఫ్ అధ్యక్షుడు ఎన్ నారాయణ, ప్రధానకార్యదర్శి ఐ వెంకటేశ్వరరావులు తెలిపారు. పరిస్థితి చక్కదిద్దడానికి తమ సంఘం ఎన్నోమార్లు ఎన్ని సూచనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లపైనే మోజు మెరుగుపడని ప్రభుత్వ స్కూళ్లు ఘోరమైన పరిస్థితులపై ‘అసర్’ నివేదిక
english title:
m
Date:
Sunday, January 20, 2013