హైదరాబాద్, జనవరి 19: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు సమయంలో చిక్కులు సృష్టించవద్దని ఆయన హితవుపలికారు. శనివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఎంఐఎం ఎమ్మెల్యే పాషాఖాద్రీ జగిత్యాలలో గాంధీ విగ్రహం గురించి అనుచితంగా మాట్లాడారని అన్నారు. అసెంబ్లీ భవనం ముందు మహాత్మాగాంధీ విగ్రహం గురించి మాట్లాడుతూ అసెంబ్లీ భవన్ కిస్‌బాప్‌కా బిల్డింగ్ హై...కిన్‌కో లాకే బిఠాయా అంటూ అవమానకరంగా మాట్లాడారని ఇది భరతజాతినే అవమానించినట్టని అన్నారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు దత్తాత్రేయ పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ హిందూ సమాజంపైనా, భారతదేశంపైనా చేసిన వ్యాఖ్యలకు 121, 124ఎ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశారని గుర్తుచేశారు. పాకిస్తాన్ సైనిక దుండగులు భారతీయ జవాన్ల మీద దొంగదాడి చేసి అత్యంత పాశవికంగా హత్యచేశారని, అక్బరుద్దీన్ మీద తీసుకున్న చర్యలకు ప్రతీకారంగానే సంఘటన జరిగిందని అన్నారు. అక్బరుద్దీన్, పాషాఖాద్రీ చేసిన ప్రసంగాలు జాతి వ్యతిరేక చర్యలుగా భావించాలని అన్నారు. దీని వెనుక కుట్రను నేషనల్ ఇనె్వస్టిగేషన్ ఏజన్సీతో దర్యాప్తు జరిపించాలని అన్నారు. తెలంగాణ విషయంలో మంత్రులు దెబ్బకొట్టే విధంగా ప్రకటనలు చేయడం సరికాదని, పార్లమెంటులో బిల్లు పెట్టేవరకూ కాంగ్రెస్‌ను నమ్మలేమని అన్నారు. తెలంగాణ వాదులు అంతా పార్లమెంటులో బిల్లు పెట్టే వరకూ ఉద్యమాన్ని కొనసాగించాలని అన్నారు.
చిత్రం... శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న బిజెపి నాయకుడు దత్తాత్రేయ