విజయవాడ, జనవరి 19: సమైక్యాంధ్ర ఉద్యమానికి తాము సైతం అంటూ తొలిసారిగా ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కార్యాచరణ కమిటీ శంఖారావం పూరించింది. లారీ యజమానుల సంఘం భవనంలో శనివారం రాత్రి నిర్వహించిన సమైక్యాంధ్ర పోరాట సదస్సులో ఉద్యోగ సంఘాల జెఎసి చైర్మన్ విద్యాసాగర్ మాట్లాడుతూ ఇంత కాలం తాము ఎంతో ఓర్పు వహించామని అయితే తెలంగాణ వాదులు తమ సహనాన్ని అలుసుగా తీసుకున్నట్లు కనిపిస్తోందన్నారు. తెలంగాణ కోసం ఆ ప్రాంతంలో 42 రోజుల పాటు సకలజనుల సమ్మె జరిగితే తాము 45 రోజులు నిర్వహించతీరగలమని హెచ్చరించారు. సీమాంధ్రలో 8 లక్షల మంది ప్రభుత్యోగులు వున్నారని, దీనికితోడు హైదరాబాద్‌లో ఉద్యోగులు 40 శాతం సీమాంధ్రులే అన్నారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ ప్రభుత్యోగుల పిలుపు ప్రతి రాజకీయ పార్టీ నేతకు కనువిప్పు కావాలన్నారు. ప్రస్తుతం సిపిఎం నేత రాఘవులు, మజ్లీస్ నేత ఓవైసి మాత్రమే సమైక్యాంధ్రకు మద్దతుగా మాట్లాడుతున్నారని అన్నారు. హైదరాబాద్ ఎవడబ్బ సొమ్మని ప్రశ్నించిన వారికి బదులిస్తూ మా అమ్మ సొత్తన్నారు. శాసనసభ్యుడు జోగి రమేష్ మాట్లాడుతూ తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇవ్వటం వలనే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. దీశం నేతలు నోరు మెదపకపోవటాన్ని ఆయన ప్రశ్నించారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు, యలమంచిలి రవి తదితరులు పాల్గొన్నారు.
తప్పుడు నిర్ణయం తీసుకుంటే విధ్వంసమే: ఎమ్మెల్యే మళ్ళ
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయని, ఈ సెంటిమెంట్‌తో దీనికి ప్రత్యేక రాష్ట్రం ఇస్తారా.. అంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన విశాఖ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ అన్నారు. సమైక్యాంధ్ర ప్రజాపోరాటసమితి ఆధ్వర్యంలో విశాఖ నగరంలో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సెంటిమెంట్‌ను చూపి ప్రత్యేక తెలంగాణాను కోరడం సరి కాదన్నారు. ఏ విధంగానూ వెనుకబాటు తనం లేని తెలంగాణా ప్రాంతాలే సీమాంధ్ర కంటే అన్నివిధాలా అభివృద్ధి చెందాయన్నారు. భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఈ విధమైన పరిస్థితులు నెలకొనడం దురదృష్టకరమన్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే విధ్వంసం సృష్టించాల్సి ఉంటుదన్నారు. అగ్నిగుండంగా మారే పరిస్థితులుంటాయనే సందేశం ప్రభుత్వానికి చేరాలన్నారు.
సమైక్యాంధ్ర బ్యానర్‌పై అభ్యర్థుల పోటీ
సీమాంధ్ర ప్రతినిధులు సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో సమైక్యాంధ్ర బ్యానర్‌పై అభ్యర్థులు నిలుస్తారని సమైక్యాంధ్ర ప్రజా పోరాటసమితి రాష్ట్ర అధ్యక్షులు జిఏ నారాయణరావు అన్నారు. కేంద్రమంత్రులు దగ్గుబాటి పురంధ్రీశ్వరి, కిశోర్‌చంద్రదేవ్, కిల్లి కృపారాణి, రాజ్యసభ సభ్యులు టి సుబ్బరామిరెడ్డి సమైక్యాంధ్రకు మద్ధతుగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు హింసాయుత కార్యక్రమాలను చేపట్టకుండా శాంతియుత,గాంధేయ మార్గంలో ఉద్యమాన్ని నిర్వహించాల్సి ఉందన్నారు.
సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి: మంత్రి శత్రుచర్ల
మెళియాపుట్టి: సమైక్యంగా ఉంటేనే అధికారం సాధ్యమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలంలో శనివారం జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ కొందు స్వార్థరాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని విడగొట్టేందుకు చూస్తున్నారన్నారు. ఈ ప్రయత్నాలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
బ్యాలెట్ ద్వారా అభిప్రాయసేకరణ
రాష్ట్ర విభజన అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్న తరుణంలో సమైక్యాంధ్ర పొలిటికల్ జెఏసి ఆధ్వర్యంలో శనివారం విశాఖలోని గురజాడ విగ్రహం వద్ద హైదరాబాద్ పరిస్థితిపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలి.. దేశానికి రెండవ రాజధాని చేయాలి.. ఉమ్మడి రాజధానిగా ఉండాలి.. తెలంగాణాకు చెందాలి.. అనే నాలుగు అంశాలపై బ్యాలెట్ ద్వారా అభిప్రాయ సేకరణ జరిపారు.
ఏకమవుతున్న
అసంతృప్తి వాదులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, జనవరి 19: తెలుగుదేశం పార్టీలో వివిధ కారణాల వలన అసంతృప్తితో రగిలిపోతున్న నాయకులు విశాఖ వ్యవహారాన్ని ఆసరాగా తీసుకుని బయటకు రానున్నారని తెలుస్తోంది. విశాఖ నగర మాజీ అధ్యక్షుడు పీలా శ్రీనివాసరావు సస్పెన్షన్‌కు నిరసనగా పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు శనివారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం నేటికీ వౌనంగా ఉన్నారు. అధిష్ఠానం స్పందన కోసం వారు ఎదురు చూస్తున్నట్టు తెలిసింది. వీరిలో కొంతమంది, వారి అనుచరులతో ఆదివారం సమావేశమై పార్టీ తీరును వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇది ఇక్కడితో ఆగేట్టు లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా దీని నీడలు పడేట్టు ఉన్నాయి.
నేడు కార్యకర్తలతో అయ్యన్న సమావేశం
నర్సీపట్నం: తెలుగుదేశం పార్టీలో ఎన్నో పదవులు చేపట్టిన సీనియర్ నాయకుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీతో అటోఇటో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నట్టు కనబడుతోంది. అయ్యన్న ఆదివారం సాయంత్రం విశాఖ జిల్లా నర్సీపట్నంలోని తన నివాసంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తెలుగుదేశం పార్టీ అవిర్భావం నుండి ఆ పార్టీలో కొనసాగుతున్న అయ్యన్నపాత్రుడు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ, పార్టీలోనూ పలు కీలక పదవులు చేపట్టారు. 1983లో జరిగిన ఎన్నికల్లో నర్సీపట్నం నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా గెలిచిన ఆయన మొత్తం ఐదు దఫాలు ఎమ్మెల్యేగా ఉన్నారు. మూడు దఫాలు క్యాబినెట్ స్థాయి మంత్రి పదవులను చేపట్టారు. ఒకసారి పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికయ్యారు. ఇలాఉంటే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అయ్యన్నతో స్వయంగా మాట్లాడేందుకు ఫోన్‌ద్వారా ప్రయత్నించగా అందుబాటులోకి రానట్టు చెబుతున్నారు.