విశాఖపట్నం, జనవరి 20: ప్రత్యేక తెలంగాణ ఇస్తారన్న సంకేతాలు ఆ ప్రాంత నాయకుల దగ్గర ఏవిధంగా ఉన్నాయో.. రాష్ట్రాన్ని విడగొట్టరన్న సంకేతాలు కూడా మా దగ్గర ఉన్నాయని రాష్ట్ర ఓడరేవులు, వౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. జిల్లా ఉద్యోగ సంఘాల నాయకులు ఆదివారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. ఆ తరువాత వారు మంత్రి గంటా శ్రీనివాసరావును స్థానిక సర్క్యూట్ హౌస్‌లో కలిశారు. తెలంగాణ ఇచ్చేస్తున్నట్టు ఆ ప్రాంత నాయకులు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమైక్యవాదాన్ని ఢిల్లీ పెద్దలకు వివరించేందుకు సీమాంధ్ర నేతలు సోమవారం ఢిల్లీ వెళుతున్నామని మంత్రి చెప్పారు. అక్కడ తెలంగాణకు అనుకూలంగా ఏమైనా సమాచారం ఉంటే, రాజీమానా చేయడానికి వెనుకాడబోమని గంటా మరోసారి స్పష్టం చేశారు.
మెరుపు సమ్మెకు ఉద్యోగులు సిద్ధం
తెలంగాణకు కేంద్రం అనుకూలంగా ఉందని తెలిస్తే, సీమాంధ్రలోని ప్రభుత్వ ఉద్యోగులు మెరుపు సమ్మె చేయడాని సిద్ధంగా ఉన్నారని జిల్లా ఎన్‌జిఓ సంఘం అధ్యక్షుడు ఈశ్వరరావు ప్రకటించారు. కేంద్రం సమైక్యాంధ్రకు అనుకూలంగా ఉందన్న ఉద్దేశంతో తాము ఉద్యమం చేపట్టలేదని, అంతేకాని చేతకాక కాదని ఆయన అన్నారు.
సంతకాల సేకరణ
రాష్ట్ర విభజన జరగరాదంటూ సమైక్యాంధ్ర పొలిటికల్ జెఎసి ఆధ్వర్యంలో కోటి సంతకాలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమం విశాఖలో ఆదివారం ప్రారంభమైంది. పొలిటికల్ జెఎసి రాష్ట్ర అధ్యక్షుడు జెటి రామారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉండగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పురంధ్రీశ్వరి పాల్గొననందుకు నిరసనగా ఉత్తరాంధ్రలోని మహిళా ఎంపిలకు సోమవారం గాజులు, చీరెలు పార్శిల్ ద్వారా పంపించాలని సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి నిర్ణయించింది.
ఉద్యోగ సంఘాల
ఢిల్లీ యాత్ర
శ్రీకాకుళం (టౌన్): సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగసంఘాల ఐక్యవేదిక అధ్వర్యంలో సోమవారం ఢిల్లీ యాత్ర చేపట్టనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌదరి పురుషోత్తం నాయుడు తెలిపారు. స్థానిక ఎన్జీవో హోంలో ఆదివారం జిల్లా ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. పార్టీ రహితంగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ యాత్రకు రాష్ట్రం నుండి ఉద్యోగ సంఘాల నాయకులు 40 మంది బయలుదేరి వెళ్తున్నట్టు తెలిపారు.
మంత్రి గంటాతో విశాఖ ఉద్యోగ సంఘాల నేతల భేటీ