విజయవాడ, జనవరి 20: ఎవరెన్ని గంతులు వేసినా ఆందోళనలు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ఎప్పటికీ జరగదు గాక జరగదని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. పాలకపక్ష కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ 2001 సంవత్సరంలోనే ఏకగ్రీవంగా ఓ తీర్మానం ఆమోదించిందని రాష్ట్రాల విభజన శాస్ర్తియబద్ధంగా జరగటానికి రెండో ఎస్సార్సీ అవస్యమని పేర్కొన్నప్పుడు మళ్లీ ఆ తీర్మానం సవరణ జరగకుండా యుద్ధప్రాతిపదికన మరో నిర్ణయం ఎలా తీసుకోగలదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి ధీటుగా సమైక్యాంధ్ర ఉద్యమాన్ని కొనసాగించే రీతిలో భాగంగా లగడపాటి రూపొందించిన సమైక్యాంధ్ర జెండా, కండువాలను ఆదివారం ఆంధ్రరత్న భవన్‌లో సీనియర్ నేత, శాసన మండలి సభ్యుడు ఐలాపురం వెంకయ్యచే ఆవిష్కరింప చేశారు. కండువాపై తెలుగుతల్లి, దివంగత పొట్టి శ్రీరాములు, భూర్గుల రామకృష్ణారావు, ఎన్టీఆర్, వైఎస్, ఇందిరాగాంధీ ఇలా మొత్తం ఆరుగురి ముఖ చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇదే పతాకం, ఇదే కండువాతో తాము ముందుకు సాగబోతున్నామని లగడపాటి చెప్పారు.
సమైక్యాంధ్రలో ఉద్యమం లేదనుకోవటం వారి అవివేకానికి నిదర్శనమని, తాము శాంతికాముకులమని పేర్కొన్నారు. అదే తెలంగాణ కాంగ్రెస్ ఎంపిలు, ఇతర ప్రజాప్రతినిధులు ఎన్ని పోరాటాలు చేసినా ప్రయోజనం శూన్యమని స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ కోసం టిఆర్‌ఎస్ నేత కెసిఆర్ దాదాపు నెల రోజులపాటు ఢిల్లీలో మకాం వేసి కాంగ్రెస్ నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేశారన్నారు. తన పార్టీని విలీనం చేస్తానంటూ కాళ్ళావేళ్లా పడినా ఏ ఒక్కరైనా లొంగారా అని లగడపాటి ప్రశ్నించారు. ప్రత్యేక తెలంగాణ అసాధ్యమని గుర్తించిన చంద్రశేఖర్ అజ్ఞాతంలోకి వెళితే చంద్రబాబు కేంద్రాన్ని అఖిలపక్ష సమావేశం కోసం ఒత్తిడి చేసి జరిపించారని విమర్శించారు. 90 మంది శాసనసభ్యులు కల్గిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణకు మద్దతు తెలుపడంతో శాసనసభలో మెజార్టీ సభ్యుల మద్దతు లభించిందనే వేర్పాటు వాదుల ప్రచారం వలనే సీమాంధ్రలో మళ్లీ రావణకాష్టం మొదలైందన్నారు. తెలంగాణ యాత్రలో భయపడి చంద్రబాబు ఆ విధంగా స్పందించినా.. ఆంధ్ర ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గుర్తెరిగి తన లేఖను వెనక్కి తెప్పించుకోవాలన్నారు. అందుకే తాను కృష్ణాజిల్లాలో గాంధేయమర్గంలో బాబుకి ఎర్ర తివాచీ పరచి, పూలు అందిస్తూ ఆయనలో కనువిప్పు యాత్ర చేపట్టబోతున్నానన్నారు. తెలుగు జాతి సమైక్యత లక్ష్యంతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని హైజాక్ చేసి అనుభవిస్తున్న బాబులో మార్పు కోసం తాము అడుగడుగున ప్రయత్నిస్తామన్నారు. రానున్న శాసనసభ ఎన్నికల్లో సమైక్యవాదంతో పోటీ చేసే పార్టీలకు కనీసం 275 సీట్లు రాగలవని లగడపాటి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శాసనసభ్యుడు మల్లాది విష్ణు, జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరశెట్టి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కండువా, జెండాలను ఆవిష్కరిస్తున్న లగడపాటి ప్రభృతులు