భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడుగా నితిన్ గడ్కరీ రెండవసారి ఎన్నిక కావడానికి రంగం సిద్ధం కావడం ఆశ్చర్యకరం కాదు. అవినీతి అభియోగగ్రస్తుడైన గడ్కరీ పార్టీ అధినాయకత్వం నుండి తప్పించాలని పార్టీ పెద్దలు భావించి ఉండిఉంటే అది మాత్రమే ఆశ్చర్యకరమయి ఉండేది. సమాకాలీన అధికార విపక్ష ప్రముఖులను ఆవహించిన అనియోగాలతో పోల్చినప్పుడు గడ్కరీని వివాదగ్రస్తం చేసిన ‘అవినీతి’ మరుగుజ్జు వంటిది. కనీసం పార్టీ పెద్దల కళ్ళకు గడ్కరీ అవినీతి మరుగుజ్జువలె కనిపిస్తోంది. అందువల్లనే ఈ ఆరోపణల ప్రాతిపదికగా పార్టీలో సంభవిస్తున్న పరిణామ క్రమాన్ని వెనక్కి తిప్పడం మంచిది కాదని పార్టీ పెద్దలు భావించి ఉండవచ్చు. పార్టీ ఏర్పడిన నాటినుంచి పార్టీని నడిపిస్తున్న వరిష్ఠనేత లాల్ కృష్ణ అద్వానీకి వీడ్కోలు చెప్పడం ఈ చారిత్రక పరిణామ క్రమం. గడ్కరీ గత నవంబర్ నెలలో వైదొలగినట్టయితే తాత్కాలిక అధ్యక్షుడిగా లాల్‌కృష్ణ అద్వానీని నియమించాలన్న ప్రచారం కూడ జరిగింది. అద్వానీ ఒకసారి తాత్కాలి అధ్యక్షుడైతే మళ్ళీ మూడేళ్ళు ఆయను దించడం అసంభవమన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు కూడ అదే భయం ఆవహించి ఉన్నందువల్ల మాత్రమే గడ్కరీని యథావిధిగా కొనసాగించడానికి తెరవెనుక పెద్దలు దృఢ నిశ్చయానికి వచ్చి ఉండవచ్చు. గడ్కరీపై వచ్చిన ఆరోపణల భయం కూడ ఇప్పుడు దాదాపు తొలగిపోయినట్టే. అవినీతి గురించి పార్టీలో కార్యకర్తలు మాత్రమే కాదు ప్రజలు సైతం పట్టించుకోని పరిస్థితులు దేశవ్యాప్తంగా నెలకొని ఉన్నయి మరి. ద్వితీయ శ్రేణి టెలికామ్ తరంగాల కేటాయింపుల అవినీతి ప్రహసనాన్ని నడిపించిన మం త్రులు ఏ రాజా, దయానిధి మారన్ వంటి వారు పదవీచ్యుతులు కావడానికి వారు నైతిక బాధ్యతలను వహించడం కాదు, న్యాయస్థానాలు తీవ్రంగా అభిశంసించడం. గడ్కరీని న్యాయస్థానాలు ఇప్పటి వరకూ అలా నిరసించలేదు కనుక ఆయన అవినీతిపరుడు కాదు. అన్ని పార్టీలలోను అవినీతి పరులున్నారని, అవినీతిపరులే అన్ని పార్టీలను నడిపిస్తున్నారని సిద్ధాంతీకరించిన ‘ఆమ్ ఆద్మీ’ పార్టీ నాయకుడు అరవింద కేజరీవాల్ తన వాదాన్ని నిరూపించడానికి ప్రధాన జాతీయ పక్షాలలోని వారి అవినీతిని ఉటంకించాడు. ఈ ఉటంకింపునకు గురైన వారిలో గడ్కరీ, ప్రస్తుత విదేశాంగశాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్, జాతీయతా కాంగ్రెస్ అధ్యక్షుడు శరద్‌పవార్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ అధ్యక్షురాలి అల్లుడు రాబర్ట్ వాద్రా..ఇంకా ఎందరో ఉన్నారు. వీరందరికీ లేని పట్టింపు గడ్కరీకి మాత్రం ఎందుకుండాలన్న వాదం భాజపా వారికి ఊతంగా మారింది. అందువల్ల గడ్కరీ రెండవసారి పార్టీ అధ్యక్షుడు కావడంలో ఆశ్చర్యం ఉండకూడదు. ఎవ్వరూ ఆశ్చర్య చకితిలు కారాదు.
బొగ్గు బొరియల కేటాయింపులలో జరిగిన అవినీతి కారణంగా లక్షా ఎనబయి ఆరువేల కోట్ల రూపాయల నష్టం ప్రభుత్వానికి వాటిల్లిందన్నది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ -సిఏజి- వారు గత ఆగస్టులో చేసిన నిర్ధారణ. ఆధునిక భారత చరిత్రలో ఇదే పెద్ద అవినీతి కుంభకోణం. ఈ కుంభకోణం ప్రాతిపదికగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తన పదవికి రాజీనామా చేసి తీరవలసిందేనని కోరుతూ భాజపా వారు గత వర్షాకాల, హేమంత సమావేశాల్లో పార్లమెంటును స్తంభింపజేశారు. ఈ సమావేశ స్తంభన జరుగుతుండిన సమయంలోనే అరవింద కేజరీవాల్ గడ్కరీపై కూడ అవినీతి ఆరోపణాస్త్రాలను ప్రయోగించాడు. అన్ని పార్టీలలోను అవినీతిపరులున్నారన్న నిర్ధారణ గురించి ప్రజలు పట్టించుకోలేదు. కాని ప్రధాన జాతీయ పక్షాలు రెండూ కొనసాగించిన పరస్పర ఆరోపణల వాడి వేడి మాత్రం మొద్దబారిపోయాయి. ఎవరి అవినీతి గురించీ మిగిలిన ఎవ్వరూ పట్టించుకొనక పోవడం ప్రచార మాధ్యమాల ద్వారా ధ్రువపడిన నిజం. అసలు అరవింద కేజరీవాల్ కూడ అవినీతిపై బుసబుసలను, రాజకీయ వేత్తలపై భగభగలను ప్రసరించడం మానుకున్నారు. నీటిపారుదల శాఖలో గతంలో అవినీతి కలాపాలు నిర్వహించిన అభియోగంపై పదవికి రాజీనామా చేసిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మళ్ళీ అదే పదవిని స్వీకరించగలగడం ప్రాధాన్యం కోల్పోతున్న అవినీతికి సరికొత్త ప్రమాణం. గడ్కరీ కూడ అజిత్ పవార్ అవినీతితో పరోక్ష సంబంధం ఉందన్నది, కేజరీవాల్ ప్రచారంలో భాగం. కానీ అసలు నిందితుడే మళ్ళీ పదవిని పొందగలిగినప్పుడు అనుబంధ నిందితులు పదవులను ఎందుకు వదలిపెట్టాలని భాజపా పెద్దలు తర్కించవచ్చు. గడ్కరీ, అజిత్ పవార్ విభిన్నపార్టీలలో ఉండవచ్చు. కాని సమాన న్యాయ సిద్ధాంతం సమానమే! గడ్కరీ అవినీతిని గోరంతను కొండంతగా చిత్రీకరించిన రామ్ జెఠ్మలాని ప్రభృతులు, పార్టీలో అసౌకర్యాన్ని సృష్టించడానికి యత్నించిన యశ్వంత్ సిన్హా వంటి వారు క్రమంగా చల్లబడి పోవడానికి కారణం కూడ అవినీతి సమస్యలు అంతకంతకూ చల్లబడి పోవడం.. చప్పబడిపోవడం!
గడ్కరీకి రెండవసారి పదవిని కట్టబెట్టడానికి ఏర్పడిన అవినీతి అవరోధం నిజానికి రామాయణంలో పిడకలవేట వంటిది. అసలు కథ భాజపాలో ముమ్మరంగా కొనసాగుతున్న కుమ్ములాటకు సంబంధించినది. ఈ అంతర్గత కలహపురాణం 2009లో అద్వితీయ నాయకుడు లాల్‌కృష్ణ అద్వానీ పార్లమెంటరీ నాయకత్వాన్ని వదలుకోవలసినప్పటినుంచి కొనసాగుతోంది. మళ్ళీ ప్రాబల్యాన్ని సంతరించుకొని 2014 నాటి లోక్‌సభ ఎన్నికల నాటికి ప్రధాని అభ్యర్థిత్వాన్ని సాధించుకోవాలన్న పట్టుదలతో అద్వా నీ ఉన్నారన్న ప్రచారం అప్పటినుంచి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అద్వానీ స్వయంగా కాని, ఆయన తరపున మరెవ్వరు కాని ప్రచారంలోని సత్యాసత్యాలపై స్పష్టీకరించిన దాఖలా లేదు. అంతర్గత కలహానికి ఇది మొదటి కారణం. అద్వానీ తరువాత ఆయన వలె ప్రాధాన్యాన్ని పొందడానికి ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య పోటీ మొదలు కావడం ఆధిపత్య సమరానికి రెండవ కారణం. ఈ రెండు అంశాలతోను గడ్కరీకి ప్రత్యక్ష ప్రమేయం లేదు. కానీ అధ్యక్ష స్థానంలో ఉన్న గడ్కరీ పార్టీలోని ఎవరిపైనా అధికారం చెలాయించిన దాఖలా కూడ లేదు. అందువల్ల వర్గరహితుడు, ప్రజల్లో పెద్ద పలుకుబడి లేనివాడు అయిన గడ్కరీని ఎవ్వరూ నిజానికి వ్యతిరేకించడం లేదు. కాని అధిపత్య వర్గాల మధ్య కొనసాగుతున్న పోరులోని చిటపటలు ఆయనపై పడుతున్నాయంతే. గడ్కరీకి రెండవసారి అధ్యక్ష పదవిని అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్న వారి అసలు పైత్యం గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ! నరేంద్రమోడీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలా?వద్దా? అన్నది ప్రధానమైన సమస్య. ముంబయిలో గత జూన్‌లో జరిగిన జాతీయ కార్యకారణి సమావేశం తరువాత జరిగిన బహిరంగ సభను అద్వానీ, లోక్‌సభలో పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్ బహిష్కరించడానికి ప్రేరకం కూడ నరేంద్రమోడీ ప్రాధాన్యం పెరగడం. నిన్న మొన్నటి గుజరాత్ శాసనసభ ఎన్నికలలో మోడీ సాధించిన ఘన విజయం ఆయన పలుకుబడిని మరింత పెంచింది. అందువల్ల మోడీకి ప్రధానమంత్రి అభ్యర్థిత్వం కట్టబెట్టడం ఖాయం. ఈ స్థితిలో అధ్యక్షుడు ఎవరైనప్పటికీ ఆధిపత్య సమీకరణలలో వచ్చే మార్పు ఏమీ ఉండదు. ఈ సంగతి గ్రహించినందువల్లనే అందరూ యథాతధ స్థితిని కొనసాగించడానికి అంగీకరించి ఉంటారు. గడ్కరీకి అనుకూలించిన పరిణామం ఇది. ప్రాబల్యం లేకపోవడమే ఆయన ప్రాధాన్యంలోని రహస్యం.
భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడుగా నితిన్
english title:
g
Date:
Monday, January 21, 2013