చిల్లర వర్తకంలోకి విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలు చొరబడి పోవడం వల్ల చిట్టి వ్యాపారులు అంతరించిపోకుండా నిరోధించడానికై చేపట్టిన చర్యలేమిటో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వివరించవలసింది! సర్వోన్నత న్యాయస్థానం వారు ఈ చర్యలను గురించి వివరించాలని మంగళవారం నిర్దేశించారు కనుక కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు! చిల్లర వ్యాపారంలోని ‘విదేశీయ ప్రత్యక్ష నిధులు’-ఎఫ్‌డిఐ- తరలి రావడంవల్ల జరిగే ‘లాభాల’ గురించి మాత్రమే ప్రభుత్వం ఇంతకాలం వివరించింది. అంతేకాని లక్షలాది చిల్లర వ్యాపారుల దుకాణాలు క్రమంగా మూతపడిపోకుండా నిరోధించడం ఎలా గో మాత్రం ప్రభుత్వం చెప్పడంలేదు. చిల్లర ‘ఎఫ్‌డిఐ’ని వ్యతిరేకిస్తున్న రాజకీయ పక్షాలు సైతం ఎఫ్‌డిఐని అనుమతించిన తరువాత చిల్లర వ్యాపారుల అస్తిత్వ రక్షణ కోసం ప్రభుత్వం ఏమేమి చేయనున్నదన్న ప్రశ్నను వేయలేదు. వారికి కూడ స్ఫురించలేదు. చిల్లర వ్యాపారంలో ‘ఎఫ్‌డిఐ’ని ప్రవేశపెట్టి తీరుతామన్న ప్రభుత్వం వారి మొండి వైఖరికి, వద్దన్నవారి పట్టుదలకు మధ్య సెప్టెంబర్ 15వ తేదీనుంచి సాగిన సంఘర్షణ ప్రభుత్వ విజయంతో సమసిపోయింది. చిల్లర ‘ఎఫ్‌డిఐ’ని అడ్డుకోగలమన్న విశ్వాసం కారణంగా ప్రత్యర్థులకు చిల్లర వ్యాపారుల మనుగడను రక్షించడానికి వలసిన చర్యల గురించి ధ్యాస ఏర్పడనే లేదు! చిల్లర ‘ఎఫ్‌డిఐ’ని వ్యతిరేకిస్తూ పార్లమెంటులో చర్చకు వచ్చిన ప్రతిపక్షాల వాయిదా తీర్మానంపై చర్చ జరిగింది. వోటింగ్ జరిగింది. తీర్మానం వీగిపోయింది. అందువల్ల చిల్లర ఎఫ్‌డిఐ’కి పార్లమెంటు ఆమో దం లభించినట్టు ప్రభుత్వం నిర్ధారించింది! ఆ తరువాత చిల్లర వ్యాపారుల మనుగడ గురించి ఆలోచించవలసిన అవసరం ఎవ్వరికీ కలగలేదు! అంతేకాదు అధికాధిక చిల్లర వ్యాపారులకే తమ బ్రతుకుతెరువు ఛిన్నాభిన్నమైపోతున్నదన్న ధ్యాస ఏర్పడలేదు. సుప్రీంకోర్టు ప్రశ్నతో ఈ ధ్యాస ఏర్పడింది! చిల్లర వ్యాపారులు విదేశీయ బృహత్ వాణిజ్య సంస్థలతో పోటీని తట్టుకోలేరన్నది సర్వోన్నత న్యాయమూర్తులు ఆర్‌ఎమ్ లోధా, ఎస్‌కె ముఖోపాధ్యాయల ప్రశ్నలలో ధ్వనించిన ఆందోళన! చిల్లర దుకాణాలను తెరిచే విదేశీయ బహుళ వాణిజ్య సంస్థల వారు ధరలను బాగా తగ్గించివేస్తారు! చిల్లర వ్యాపారులను నిర్మూలించే వ్యూహంలో ఇది భాగం. వాణిజ్య ప్రపంచీకరణ విస్తృత దురాక్రమణకు ఇలా తగ్గించడం మాధ్యమం! ఇలా బాగా తగ్గిన ధరలకు చిట్టి వ్యాపారులు వస్తువులను అమ్మలేరు. ఫలితంగా పోటీని తట్టుకోలేని వారు దుకాణాలను మూసివేస్తారు. చిల్లర దుకాణాలన్నీ మూతపడిన తరువాత వీధి వర్తకులు కూరలమ్మే ముసలమ్మలు మూలపడిన తరువాత విదేశీయ వాణిజ్య సంస్థల వారు ధరలను తమ ఇష్టం వచ్చినట్టు పెంచేస్తారు! ప్రపంచీకరణను అమలు జరపడంలో బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు అనుసరిస్తున్న వౌలిక సూత్రం ఇది! మళ్లీ ధరలు పెరిగే సంగతిని మధ్యతరగతి వినియోగదారులు ఆలోచించడం లేదు. చిల్లరకొట్టులో కంటే సూపర్ బజార్లలోను, మెగాబజార్‌లోను ధరలు తక్కువగా ఉన్న వర్తమానానికి వారు బందీలు. వినియోగదారులకు ఆ తరువాత గురయ్యే అధిక ధరల బాధలు ఇప్పుడు అప్రస్తుతం! కానీ చిట్టి వ్యాపారుల కొట్టు కూలిపోవడం తక్షణ పరిణామం. కొనేవారు లేరు మరి...ఈ విపరిణామాన్ని నిరోధించడం ఎలాగో ప్రభుత్వం మూడు వారాలలోగా సుప్రీంకోర్టుకు నివేదించవలసి ఉంది! ఏమి నివేదించగలమన్నది వేచి చూడవలసిన వైపరీత్యం!
అంతర్జాతీయ వాణిజ్య ఆర్థిక సంస్థల మెప్పు పొందాలన్న తహతహ కారణంగా ప్రభుత్వం పకడ్బందీగా ఆలోచించి విధానాన్ని రూపొందించలేదు. సమయం లేదు మరి. గత నవంబర్ నాటి ఎన్నికలకు ముందుగానే భారత్‌లోని చిల్లర వ్యాపారంలోకి తమ వాణిజ్య సంస్థలకు ప్రవేశం కల్పించాలన్న అమెరికా ప్రభుత్వ విధానం అంతకు మందు అనేకసార్లు స్పష్టమైపోయింది. బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ఒత్తడి ఇందుకు కారణం. 2011 నవంబర్‌లోనే తొలిసారిగా మన ప్రభుత్వం బహుళ వస్తు చిల్లర వ్యాపారంలోకి విదేశీయుల పెట్టుబడులను ఆహ్వానించింది. కానీ మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. నిర్ణయాన్ని వాయిదా వేసిందే కాని రద్దు చేయలేదన్న సంగతి గత ఏడాది సెప్టెంబర్ 15వ తేదీన కానీ స్పష్టం కాలేదు. బహుళ జాతీయ వాణిజ్య సంస్థల ఒత్తడికి గురైన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆ పది నెలలపాటు మన ప్రభుత్వంపై ఒత్తడి పెంచాడు. చిల్లర వ్యాపారంలోకి ‘ఎఫ్‌డిఐ’ని అనుమతించకపోవడంవల్ల జరిగిపోతున్న ‘అనర్ధాల’ గురించి ఆయన పలుసార్లు బహిరంగంగానే వాపోయాడు. మన ప్రభుత్వానికి సలహాలనిచ్చాడు. హెచ్చరికలు చేశాడు. అసంతృప్తిని ప్రకటించాడు! మన ప్రభుత్వం తృణమూల్ కాంగ్రెస్ రాజకీయ భాగస్వామ్యాన్ని సైతం పరిత్యజించి విదేశీయ వాణిజ్య భాగస్వామానికి తలుపులు బార్లా తెరువవలసి వచ్చింది. ఈ ‘ఒత్తడి’ కారణంగా మన ప్రభుత్వం శాసకీయమైన రాజ్యాంగపరమైన నిబంధనలను సడలించకుండానే, సవరించకుండానే చిల్లర ‘ఎఫ్‌డిఐ’ని ప్రవేశపెట్టింది! ప్రభు త్వ విధానం రాజ్యాంగ నిబంధనావళికి బద్ధమై ఉండాలన్నది మంగళవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యానం... అంటే రాజ్యాంగపరమైన చట్టాలకు సంబంధించిన నియమాలను పరిగణించకుండానే కేంద్రం హడావుడిగా ఈ చిల్లర ఎఫ్‌డిఐ నిర్ణయాన్ని అమలుచేసిందన్న మాట! ‘‘విధాన జటిలతను ఛేదించడానికి ధైర్యం కావాలి. కొన్ని ప్రమాదాలను ఎదుర్కోవాలి’’ అన్నది ప్రధాని మన్‌మోహన్ సింగ్ చిల్ల ర ‘ఎఫ్‌డిఐ’ గురించి గత సెప్టెంబర్ 15న చేసిన వ్యాఖ్య! రాజ్యాంగ నిబంధనావళిని లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకొనడానికి ‘్ధర్యం’ ‘ప్రమాద ప్రతిఘటనా పాటవం’ కావాలి మరి!
చిల్లర ‘ఎఫ్‌డిఐ’ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టడం ఇది మొదటిసారి కాదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి శాసకీయ నిబద్ధత లేదని గత అక్టోబర్ 15న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఆర్‌ఎమ్ లోధా, అనిల్ అర్‌ధావే వ్యాఖ్యానించి ఉన్నారు. సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య చేసిన తరువాతనే రిజర్వ్ బ్యాంక్ వారు 2000వ సంవత్సరం నాటి ‘విదేశీయ వినిమయ ద్రవ్య నిర్వహణ’ నిబంధనలను సవరించే కార్యక్రమాన్ని చేపట్టారు! ప్రభుత్వం వారి విధానాల రూపకల్పన ప్రక్రియలో తాము జోక్యం కల్పించుకోవడం లేదని అక్టోబర్‌లోను ఇప్పుడు కూడ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్పష్టం చేశారు. కానీ ఈ విధానం రూపొందిన తీరును మాత్రం కోర్టు తప్పుపట్టింది! ‘‘ఇది రాజకీయమైన మాయాజాలమా?’’ అన్న సుప్రీంకోర్టు ప్రశ్న ప్రభుత్వ విధానానికి అభిశంసన వంటిది! రిజర్వ్ బ్యాంక్ సవరించిన నియమావళిని పార్లమెంటుకు నివేదించి అనుమతి పొందాలన్న నిబంధనను కూడ ప్రభుత్వం పాటించలేదని ఇప్పుడు వెల్లడైన అంశం! రాజకీయమైన ప్రతిపక్ష వాయిదా తీర్మానం పార్లమెంటులో వీగిపోయింది కాబట్టి సవరించిన నిబంధనావళికి పార్లమెంటు ఆమోదం లభించేనని ప్రభుత్వం వాదిస్తుండడం మరో విచిత్రం! వీగిపోయిన తీర్మానం కేవలం చిల్లర ఎఫ్‌డిఐకి సంబంధించినది, మొత్తం నిబంధనావళికి సంబంధించినది కాదు! చిల్లర ‘ఎఫ్‌డిఐ’పై న్యాయ సమీక్ష పూర్తి కాకమునుపే ‘వాల్‌మార్ట్’ వంటి విదేశీయ సంస్థలు దేశమంతటా దుకాణాలు తెరిచాయి. ‘ప్రపంచీకరణ ఒత్తడికి ప్రభుత్వం బందీగా మారింది మరి...
చిల్లర
english title:
e
Date:
Thursday, January 24, 2013