ఇవ్వడానికయినా, ఇవ్వకపోవడానికయినా కారణాలు వుంటాయి. ఇవ్వకపోతే గొడవలకూ, ఇస్తే పరిష్కరించవలసిన అనేక సమస్యలకూ బోలెడు తేడా వుంది! ఇన్నాళ్లూ ఇవ్వకుండా ఎలాంటి సమస్యలతో నెట్టుకుంటూ వచ్చారో ఇవ్వకపోతే ఆందోళనలూ, ఉద్యమాలూ వంటి ఆ సమస్యలే మరింత ఉధృతమవుతాయి. ఇస్తే రాజధాని సమస్య, జలవనరుల సమస్య, ఇంకా అనేక పంపకాల సమస్య, కొత్త రాష్ట్రానికి సరికొత్త రాజకీయ సమస్య వంటివన్నీ దృష్టిలో పెట్టుకుని, ఆ సమస్యా పరిష్కారాలు అందరికీ ఆమోదయోగ్యంగా చర్చించి మరీ ఇవ్వాలి! ఇవ్వడానికి వ్యతిరేకం కాకపోయినా, ఇప్పుడు ఎలా ఇవ్వాలి అన్న విషయాల్లో- చిక్కుముడులు తలెత్తే ప్రమాదం వుంది.’’ అన్నాడు శంకరం.
రాంబాబు నవ్వాడు.
‘‘నవ్వుతావేమిటి?’’ సీరియస్‌గా అడిగాడు శంకరం.
‘‘అబ్బే! యథాతథ స్థితి కొనసాగించడానికే అయితే, కమిటీలూ, భేటీలూ, అఖిలపక్షాలూ ఎందుకసలు? మార్పు తీసుకురాదలచినప్పుడే తదనుగుణంగా తలెత్తే సమస్యలకు పరిష్కారం కనుగొనవలసి వుంటుంది. ఇవ్వడం ఇవ్వకపోవడం అన్నది అసలు సమస్యకాదు. ఇవ్వడంవల్లో, ఇవ్వకపోవడంవల్లో జరిగే పరిణామాలు ఎలా ఎదుర్కొంటారన్నదే సమస్య! ‘అంబపలుకు’కోసం అంతా ఎదురుచూస్తున్నారు కదా! ‘‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా’’-అన్నట్లు, సమస్యను పరిష్కరించాలన్న చిత్తశుద్ధీ, నిజాయితీ వుంటే- ఒడిదుడుకులను తట్టుకోవడం కష్టమేమీ కాదు. నవ్వెందుకొస్తోంది అంటే- ఇచ్చేస్తారేమో అనే సంకేతాలతో కొందరూ, ఇవ్వరేమో అనే భయ సందేహాలతో కొందరూ కొత్త ‘తంత్రా’లకు రూపకల్పన చేస్తున్నారు. వీరి తంత్రాలు వీరికుంటే, కేంద్రం ‘తంత్రం’కేంద్రానికుంటుంది! ఏది కుతంత్రమో, ఏది అభివృద్ధి మంత్రమో అసలు జనగణాలకు అర్థంకాని రాజకీయం మాత్రం చెలామణి అవుతోంది.’’ అన్నాడు రాంబాబు.
‘‘ఎవరు అబద్ధాలు చెబుతున్నారో, ఎవరు నిజాలు చెబుతున్నారో-ఆ చెబుతున్నవారి అంతఃకరణలకే అసలు సంగతి తెలుసు! ఒక వాదానికి అనుకూలంగా ఉపపత్తులు పోగేసుకునేవాడు, తన వాదనను సమర్ధించుకునేలానే- విషయాభివ్యక్తి చేస్తాడు తప్ప, అననుకూల విషయాలను పక్కకు పెడతాడు. అది సహజం. వాదించుకునేవాళ్ళ సంగతి సరే! తీర్పు చెప్పేవాడికి అసలు వాస్తవాలు తెలిసి వుండాలిగా! పాక్షిక దృష్టితోకాక, ఇరుపక్షాలకూ సమ్మతం కాగలిగే తీర్పు ఇవ్వగలగాలి. అంటే- ఆ తీర్పు ద్వారా ఒకరికి మేలు జరుగుతోందన్న భావన ఇంకొకరికి కలిగినా, ఇంకొకరికి నష్టం జరగటం లేదని సమాధానపరచగలిగే నేర్పు ఆ తీర్పులో చూపించగలగాలి. నిజానికి వాదించుకునేవారి తంత్రం కన్నా, తీర్పరి తంత్రమే అసలు ప్రధానం’’ అన్నాడు ప్రసాదు.
‘‘మనది ‘గణతంత్రం’ అన్నారోయ్ అందుకే! ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాభీష్టాలకే విలువ ఎక్కువ. అయితే ప్రజాస్వామ్యంలోని గొప్ప చిక్కు ఎక్కడుందంటే- అసలు ఆ గణంలోని ‘మనోభావన’ స్పష్టంగా అభివ్యక్తం కావడం జరిగిందా, లేదా అని గ్రహించడంలో వుంది. ‘‘ఎక్కువమంది చేతులెత్తినంత మాత్రాన న్యాయం కాజాలదు’’అన్నది గణతంత్రంలోని మెలికే! భయపెట్టో, బలవంతపెట్టో, ప్రలోభాలు చూపో- అధిక సంఖ్య తమ అభిప్రాయానికి అనుగుణంగా వుందనీ, ప్రజ తమవైపేననీ, చూపుకోగల ‘తంత్రాలు’ రాజకీయ పార్టీలకు వెన్నతో పెట్టిన విద్యే! ఓ నాయకుడి సభకు స్వచ్ఛందంగా తరలివచ్చే జనంకన్నా లారీల్లో తరలించే జనమే ఎక్కువన్నది నేడు వాస్తవంలో రూఢి అయిన విషయమే! జనాలను సప్లయ్ చేసే చతురుడు- అదే లారీడు జనాన్నీ తనకు ముట్టవలసినది ముడితే, ఆ నాయకుడి ప్రత్యర్థి సభకూ పంపే ‘వ్యపార కిటుకులు’ అలవరుచుకున్నప్పుడు- నడుస్తున్నది ‘వినిమయ తంత్రమే’ కానీ, జనగణాల మనోభిప్రాయ అభివ్యక్తి కాదన్నది యథార్థం.’’ అన్నాడు రాంబాబు.
‘‘అసలు సమస్య అదే కదా! సమస్యను పరిష్కరించగల సాధన సంపత్తి తమ చేతుల్లోనే వున్నా, ప్రజలు కొన్ని రాజకీయ పార్టీల, నేతల కుతంత్రాలకూ, ప్రలోభాలకూ సరిగ్గా ఆ సంపత్తిని వినియోగంచేసే వేళకి లోనై బలవుతూ వుంటారు! నిజానికి అయిదేళ్లకోసారి గొప్ప మార్పును సృజించుకోగల దక్షత ప్రజలకు మన ‘గణతంత్ర’ వ్యవస్థ ఇచ్చింది. కానీ అంతకుమించి అగణిత కుతంత్రాలకూ, ప్రలోభాల మంత్రాలకు వశమైపోయే ప్రమాదమూ ఈ వ్యవస్థే సమకూర్చింది. ‘ఒక దేశం- రెండు పార్టీలు’అన్న సిద్ధాంతం కాదు మనది. ఇవాళ ప్రాంతీయ పార్టీలు అనేకం బలం పుంజుకున్నాయి. జాతీయ పార్టీ అనుకునేది ఏదయినా, ఈ ప్రాంతీయ పార్టీలను దువ్వి, తన పక్కన చేర్చుకుంటే తప్ప, పాలనాధికారం చేపట్టే అవకాశమే లేదు. దేశంలోని ఏ ప్రాంతపు సమస్యనయినా పట్టించుకుని తీర్చగల దక్షత, సమర్థత, బలం కేంద్రానికీ, కేంద్రంలోని అధికార పార్టీకీ లేదివాళ. తన నిర్ణయాన్ని తనను ప్రభుత్వం నిర్వర్తించడానికి అంగీకరించిన పార్టీలన్నీ అంగీకరిస్తాయా లేదా అన్నది తెలుసుకోవాల్సిన, తేల్చుకోవాల్సిన అగత్యం వుంది. వారిని సంప్రదించకుండా తీసుకునే నిర్ణయాలకు- తనే బాధ్యత వహించి, బలైపోగల పరిస్థితులు వున్నాయి. అధికారం వుంటే తప్ప నిర్ణయాలు సాధ్యంకావు. అరకొర అధికారాలతో తీసుకునే నిర్ణయాలు మొదటికే మోసం కావచ్చు. అందువల్ల ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, ఆచితూచి అడుగేయాల్సిందే! అందునా రానున్న ఎన్నికలనూ, దేశంలో మార్పు తీసుకురాగల చేవ- ప్రజల చేతుల్లో వినిమయమయ్యే వేళనూ దృష్టిలో పెట్టుకుని, తమకు ప్రయోజనకరంగా మలుచుకునే విజ్ఞతను ప్రకటించి, నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది! ‘ప్రత్యేక రాష్ట్రం’ఏర్పాటు అన్నది ఇంత దీర్ఘదర్శన వివేకంతో కూడినదై వుంది. ఇప్పుడు గణతంత్రం- ‘తెలంగాణ తంత్రం’ అన్న అంశం మీద వుంది మరి.’’ అన్నాడు శంకరం లేస్తూ.
సంసారాలు
english title:
e
Date:
Friday, January 25, 2013