మావోయిస్టుల మరో అమానవీయ కోణం వెలుగు చూసింది. కార్మిక, కర్షక శ్రేయోరాజ్యం కోసం పరితపిస్తున్నామని చెప్పుకునే వారు కార్మిక, కర్షకుల వారసులనే పొట్టనపెట్టుకుంటున్నారు. తాజాగా ఎన్‌కౌంటర్లో మరణించిన ఓ సిఆర్‌పిఎఫ్ జవాన్ మృతదేహం పొట్ట చీల్చి, పేగులు మాయం చేసి ఆ స్థానంలో మందుగుండును అమర్చిన ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. శవాన్ని సైతం మందుపాతరగా ఉపయోగించుకునే ఎత్తుగడ, ఆలోచన, ఆచరణ చాలా చాలా కిరాతకమైనది. సిద్ధాంత బలంపైనే తాము ఎదుగుతున్నామని, శాస్ర్తియ ఆలోచనా విధానంతోనే సమాజాన్ని సమూలంగా మారుస్తామని, పేద ప్రజల జీవితాలు దేదీప్యమానంగా వెలిగేందుకు కంకణం కట్టుకున్నామని చెబుతూ వస్తున్న మావోయిస్టుల మాటలన్నీ కట్టు కథలేనని శవం కడుపులో బాంబుపెట్టి మరెందరినో పొట్టనపెట్టుకోజూసిన కుట్రవల్ల వెల్లడవుతోంది.
మధ్యభారతంలో, గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు పాగావేసి పనిచేస్తుంటే ఏదో మేరకు ఆదివాసీల జీవితాలు బాగుపడతాయని విశ్వసించిన వారి ఆకాంక్షలన్నీ ఇలా మందు పాతరలతో తునాతునకలయ్యాయి. గోండులు, గుత్తికోయలు...ఇతర ఆదివాసీ జీవితాలు బాగుచేసే వైనం తుపాకీ గొట్టంలో లేదని ఎప్పుడో తేలిపోయినప్పటికీ ఆశావాదులు కొందరు ఏదోమేర మిణుకు మిణుకుమన్న ఆశతో ‘అవునేమో’ అనుకున్నారు. కాని తీరా ఇటీవల ఘటనను పరికిస్తే తుపాకీ గొట్టం ద్వారా జీవితాలు బాగుపడడం అటుంచి కడుపులో పేగులు మాయం చేసే విద్య అబ్బడం వింతగా ఉంది. మరి అలాంటి చర్యలనే మావోయిస్టులు నమ్ముకుని జనాలను హతమార్చి వారి పేగులను ‘మెడలో’ వేసుకుని ఊరేగితే ‘మార్పు’ పొద్దు పొడుస్తుందని కలలు కనడం అవివేకం.
జనంకోసం శ్రమిస్తున్నామని అదేపనిగా పాటలు...ఆటల ద్వారా ప్రకటించుకునేవారు జనామోదం లేని ఇలాంటి రాక్షస పద్ధతులకు ప్రాణం పోస్తే ఎలా? దండకారణ్యంలో కారుణ్యం అనే మాటకు తావులేకుండా ఇప్పటికే కఠినమైన దండులను నిర్మిస్తున్నారు. ఆ దండుల నిర్వాకం ఎలా ఉంటుందో జార్ఖండ్‌లో కనిపించింది. ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే అన్నట్టుగా ఉంది. ఆరంభమే ఇంత బీభత్స రస ప్రధానంగా ఉంటే ముందు ముందు మరెంత రాక్షసానందం పొందే చర్యలకు పాల్పడతారో తెలియదు. దండకారణ్యంలో జరుగుతున్న ‘జనతన పరిపాలన’ను తిలకించేందుకు జనారణ్యం నుంచి ఎందరినో మావోయిస్టులు ఆహ్వానిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తమకు అనుకూలంగా స్పందించి, అక్షరంతో, దృశ్య మాధ్యమంతో ప్రచారం కల్పించే ‘కామ్రేడ్స్’ను వారు ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. అలాంటి రచయితలు, కవులు, కళాకారులు చివరికి జర్నలిస్టులు జరుగుతున్న ఈ వాస్తవాన్ని బయటపెట్టకుండా వారు చెప్పే మాటల ‘ట్రాన్స్’లో పడిపోయి ఆ మాటలనే కలవరిస్తూ, పలవరిస్తూ కాగితంపై పెట్టడం విడ్డూరం.
జనం గుండె చప్పుళ్లను తెలిపే గాయకులు, కవులు తాజా సంఘటనపై పెదవి విప్పరు. సున్నిత హృదయులు, సూర్యోదయాన్ని, అస్తమయాన్ని ఎంతో హృద్యంగా వర్ణించి ప్రజల మనసులను రంజింపచేసే కవులు,గాయకులు, పూల పరిమళాన్ని, లాలిత్యాన్ని, సౌకుమార్యాన్ని, సౌగంధికాన్ని తమదైన ప్రత్యేక పదజాలంతో గుబాళింప చేసేవారు మావోయిస్టుల ఈ దుశ్చర్యపై పెదవి విప్పరు. కలం కదపరు. కల్లోల నీరు తేరుకునేవరకు వారు వౌన ముద్రనుంచి బయటకు రారు. వాస్తవానికి ‘రాజ్యం’ ఎవరి చేతిలో ఉంది?రాజ్యాన్ని ఎవరు పాలిస్తున్నారన్న ప్రాధమిక ప్రశ్నలు వేసుకుని సమాధానాలు చెప్పుకునే తీరిక, ఓపిక వారికి లేదు. ‘రాజ్యం’ ప్రజల చేతిలోనే ఉందన్న మాట మరిచి మావోయిస్టులు తమ పాతబడి, చివికిపోయిన విశే్లషణలతో 75 ఏళ్ల క్రితంనాటి భావజాలంతో, ఇంకా మనల్ని పరాయివాడు పాలిస్తున్నాడన్న భ్రమతో వీరంగం సృష్టిస్తే విద్యావంతులు, మేధావులైనా వాస్తవం తలకు ఎక్కే బోధ చేయాలి కదా?...వారి తుపాకులకు, మందుపాతరలకు భయపడి ఆలోచనలను తొక్కిపెడితే అది పౌర సమాజానికే కీడు.
మావోయిస్టుల
english title:
e
Date:
Friday, January 25, 2013