మన ఫాస్ట్ పాసింజర్లు, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు, బుల్లెట్ ట్రయిన్లు, ఎన్ని పేర్లుతో ఈ స్పెషల్ రైళ్ళని పిలుచుకున్నా వీటిల్లో ప్రయాణానికి అదనంగా సర్‌ఛార్జీలు వసూలుచేసి ప్రయాణికుల్ని పిండుతున్నారు. కాని వీటి గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్లు దాటడం జరగదు. ఇంటర్‌సిటీ నాన్‌స్టాప్ ట్రయిన్లు కూడా ప్రతి 3గంటలకి ఏదో స్టేషన్లో, ఏదో వంకను ఆగక మానదు. ఇవే కాకుండా ప్రయాణంలో ఎదురయ్యే కొన్ని ఇబ్బందులు కారణంగా, విశాఖనుంచి హైద్రాబాదుకి 9 లేక 10 గంటలు తప్పడం లేదు. చైనాలో ఈమధ్యే నిర్మించిన హైస్పీడ్ రైలుమార్గంపై రెండున్నర గంటల్లో 693 కిలోమీటర్లు దూరాన్ని పూర్తిచేసి, ఫాస్టెస్ట్ రన్‌గా రికార్డుచేసింది. మనం ఈ వార్తలని చూసి సంతోషించాలే తప్ప స్వయానా అనుభవించగలిగేది ఏనాటికో?
- తాళాబత్తుల సత్యనారాయణమూర్తి, విశాఖపట్నం
జగన్‌కోసం జనం ఎదురుచూపు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనమై కనీసం ప్రతిపక్ష స్థానాన్ని కూడా గెలుచుకోలేని దుస్థితిలో పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టి కాంగ్రెస్‌ను పునరుజ్జీవింపచేసిన మహానేత డా.వై.యస్.రాజశేఖర రెడ్డి. వరుసగా రెండుసార్లు రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చి, కేంద్రంలో రెండుసార్లు యు.పి.ఏ. ప్రభుత్వం ఏర్పడేందుకు అత్యధిక సంఖ్యలో ఎంపీలను రాష్ట్రంనుండి గెలిపించిన ఘనత వై.యస్.ఆర్ దే. రాష్ట్రంలోని ఏ సంక్షేమ అభివృద్ధి పథకం ప్రవేశపెట్టినా ఆ పథకాలకు ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీల పేర్లు పెట్టి దేశ ప్రజల మదిలో ఇందిర, రాజీవ్‌ల పేర్లు నిలిచిపోయే విధంగా వై.యస్.ఆర్. కృషిచేసారు. అటువంటి నాయకుడు మరణానంతరం ఆయన తనయుడు వై.యస్.జగన్ పట్ల వై.యస్ కుటుంబం పట్ల కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు బాధాకరం. స్వంతగా 10 ఓట్లు సంపాదించటం గానీ, ఒక సీటు గెలిపించటం కానీ చేతకాని వృద్ధ నేతల సలహాలు తీసుకొని కాంగ్రెస్ అధిష్టానం జగన్‌ను పార్టీకి దూరం చేసింది. అటువంటి పరిస్థితులలో తన తండ్రి మరణించిన నల్ల కాలువవద్ద రాష్ట్ర ప్రజలకు యిచ్చిన మాట కోసం ఎంపీ పదవిని, కాంగ్రెస్‌ను విడిచిపెట్టి జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు. దీనిని సహించలేక, జగన్ ఎదుగుదులను ఓర్చలేక సి.బి.ఐని పావుగా వాడుకొని జగన్‌పై అక్రమ కేసులు బనాయించి జైలుపాలుచేశారు. ఈ అక్రమ కేసులన్నీ విచారణలో నిలువలేవు. జగన్ నిర్దోషిగా విడుదల అవుతారు.జగన్ విడుదలకోసం రాష్ట్ర ప్రజలు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
- బి.ఆర్.శాలి, కావలి
ఎవరిది అసలు పోలిక?
తాలిబన్లనుర ఆరెస్సెస్‌ను ఒకే గాటన కట్టిన దిగ్విజయ్‌సింగ్ యొక్క ఆలోచనా ధోరణి ఆయన అజ్ఞానాన్ని తెలియజేస్తోంది. ఒకరు వారి మతం ఆధిపత్యంకోసం ఇతర దేశాల్లో రాక్షసంగా ప్రజలను చంపుతూ పనిచేస్తుంటే మరొకరు తమ ధర్మంకోసం పనిచేస్తున్నారు. (పైగా వారి దేశంలో మాత్రమే) మరి ఈ ఇద్దరిని పోల్చి చూడటం ఎంతవరకు సబబు. 65 సంవత్సరాల క్రితం వరకు మనల్ని పాలించిన బ్రిటిషువారు మన దేశ సంపదని దోచుకుని వారి దేశానికి తరలించుకుపోయారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ దేశ ప్రజల దయవలన గెలిచి మంచి పాలన అందించకపోగా వారిని వారి సంపదని దోచుకుని స్విస్ బ్యాంక్‌కి తరలిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్‌వారు ఒకటే కదా. ఇదీ అసలు పోలిక.
- దుర్భా శంకరనారాయణ, విజయవాడ
సరిహద్దు భద్రతను మరింత పెంచాలి
1962లో దురాక్రమణకు పాల్పడిన చైనా మళ్లీ మన దేశంపై దాడికి పకడ్బందీ వ్యూహాలు పన్నుతున్నది. ప్రస్తుతం చైనా మన సరిహద్దులను బలహీనపర్చే ప్రయత్నంలో ఉంది. ఎందుకంటే అది ఇప్పటికే అరుణాచల్‌ప్రదేశ్‌లో హెలిప్యాడ్ నిర్మించింది. నేపాల్‌లో రాజకీయ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుంది. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదులకు ఆయుధాలందిస్తూ శిక్షణనిస్తుంది. మొత్తంగా భారత్‌ను వ్యూహాత్మకంగా ఒంటరిచేసి దెబ్బతీయాలనుకుంటున్నది.చైనా దురాక్రమణ నుండి గుణపాఠం నేర్చుకొని భారతీయులను సమాయత్తపర్చే బృహత్ కార్యక్రమం నిర్వహించబడింది. ఫిన్స్ (్ఫరమ్ ఫర్ ఇంటిగ్రేటెడ్ నేషనల్ సెక్యూరిటీ) తరఫున ‘‘సరిహద్దు కో ప్రణామ్’’ కార్యక్రమంలో పదివేల మంది యువకులు సరిహద్దుల వెంట నడిచి పరిస్థితులను అధ్యయనం చేశారు