ఆదిలాబాద్, జనవరి 24: తెలంగాణపై మోసపూరిత ప్రకటనలతో రెచ్చగొడుతున్న కేంద్ర మంత్రి ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవాదులు, టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ శ్రేణులు భగ్గుమన్నారు. గురువారం ఆజాద్ మోసగింపు ప్రకటనను ఆగ్రహిస్తూ ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్, ఉట్నూరు డివిజన్‌లలో నిరసన కార్యక్రమాలు ఉధృతం అయ్యాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇక చావోరేవో తేల్చుకోవాలని, లేనట్టయితే ఆ పార్టీ నేతల ఇండ్లను ముట్టడించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని నేతలు హెచ్చరించారు. గురువారం ఉస్మానియా జెఎసి ఇచ్చిన విద్యాసంస్థల బంద్ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఎబివిపి, తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆజాద్ దిష్టిబొమ్మలను ఎక్కడికక్కడే దగ్ధం చేస్తూ తమ నిరసన ప్రకటించారు. నెల రోజుల్లోపు తెలంగాణ విషయం తేలుస్తామని చెప్పి మభ్య పెట్టిన కేంధ్ర మంత్రి షిండే బేషరతుగా క్షమాపణ చెప్పి తెలంగాణప్రకటించాలని డిమాండ్ చేస్తూ టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జోగురామన్న, అరవింద్‌రెడ్డి, నల్లాల ఓదేలు, సమ్మయ్య తమ నియోజకవర్గాల్లో ఆందోళనలు ముమ్మరం చేశారు. టిఆర్‌ఎస్ కార్యకర్తలతో కలిసి రహదారులపై దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఆదిలాబాద్‌లో టిఆర్‌ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్‌లో ఆజాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆజాద్‌ను ఇక రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వమని కేంధ్ర మంత్రుల మోసపూరిత వైఖరులతోనే తెలంగాణ బిడ్డలు తమ ప్రాణాలు ఆత్మార్పణ చేసుకుంటున్నారని ఎమ్మెల్యే రామన్న పేర్కొన్నారు. కాగా ఆజాద్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన ఘటనలో నాయకులు లోక భూమారెడ్డి, అడ్డి భోజారెడ్డి, కస్తాల ప్రేమల, కృష్ణ, కారింగుల దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా వుంటే బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కోర్టు విధులను బహిష్కరించి సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రం ప్రకటించక పోతే కాంగ్రెస్ నేతలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనాలని నేతలకు హితవు పలికారు. ఇక కేంద్ర మంత్రి షిండే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ సంస్థలను ఉగ్రవాదులుగా పోల్చడం, మరోవైపు గడువులోగా తెలంగాణ ప్రకటించకుండా వౌనం వహించడంపై బిజెపి ఆధ్వర్యంలో జిల్లా అంతటా నిరసన వెల్లువెత్తాయి. ఆదిలాబాద్‌లో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ చౌక్‌లో షిండే, ఆజాద్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు రావుల రాంనాథ్, ప్రధాన కార్యదర్శి దుర్గం రాజేశ్వర్, పాకాల రాంచందర్, మటోలియా, పండిత్‌రావు, నరేందర్ అగర్వాల్, గందె కృష్ణకుమార్, జనగం సంతోష్, మున్నా తదితరులు పాల్గొన్నారు. నిర్మల్, భైంసా, ఇచ్చోడ, కాగజ్‌నగర్, ఖానాపూర్, ఉట్నూరు, ఆసిఫాబాద్, మంచిర్యాల కేంద్రాల్లోను తెలంగాణవాదులు నిరసనలువ్యక్తం చేస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు.
శిక్షణ మెళకువలతో
ఉపాధి రంగాల్లో రాణించాలి
* జాబ్ మేళాలో కార్మిక శాఖ కార్యదర్శి జెసి శర్మ
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 24: ప్రభుత్వం యువతలో వున్న ప్రతిభను వెలికితీసి వారికి అన్ని రంగాల్లో వృత్తిపరమైన శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని, నిరుద్యోగులు దీన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ ప్రిన్సిపల్ కార్యదర్శి జెసి శర్మ అన్నారు. గురువారం పారిశ్రామిక శిక్షణ సంస్థలో జరిగిన ఉద్యోగ మేళ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్టవ్య్రాప్తంగా 25 వేల మంది యువకులకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం లక్ష్యాలు నిర్థేశించుకొందని, రాజీవ్ యువ కిరణం పథకంలో 9 వేల మందిని ఎంపిక చేయడం జరిగిందన్నారు. కొన్ని ఉద్యోగాలకు ఎంపికై నిరుత్సాహంతో వెనుదిరిగే గామీణ యువకులకు ప్రోత్సహించేందుకు పారిశ్రామిక సంస్థల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్మిక శాఖ కమిషనర్ రామంజనేయులు మాట్లాడుతూ వివిధ కంపెనీలు సాంకేతిక రంగాల్లో శిక్షణ అందజేస్తున్నా, ముందుగా వేతనం తక్కువగా వుంటుందని, పనితీరును బట్టి వేతనం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు సంచాలకులు ధర్మరాజు, జిల్లాకలెక్టర్ అశోక్, డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, ఐటిఐ ప్రిన్సిపాల్స్, వివిధ కంపెనీ పరిశ్రమల మేనేజర్లు, కార్మిక శాఖ అధికారులు పాల్గొన్నారు.
సహకార సొసైటీ ఎన్నికలను సజావుగా నిర్వహించాలి : ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, జనవరి 24: ఈ నెల 31, ఫిబ్రవరి 4న రెండు విడతలుగా జరగనున్న సహకార సంఘాల ఎన్నికలను నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మిన్ని మాథ్యు కోరారు. గురువారం జిల్లా కలెక్టర్లు, జిల్లా కో-ఆపరేటివ్ అధికారులతో రాష్ట్ర రాజధాని నుండి సహకార ఎన్నికల నిర్వహణ తీరు తెన్నులపై వీడియోకాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లడుతూ ఎన్నికల నిర్వహణపై ఏమైనా అభ్యంతరాలు వుంటే తెలియజేయాలన్నారు. తగినంత పోలీసు సిబ్బందిని వినియోగించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లను, జిల్లా పోలీసు అధికారులను ఆదేశించారు. యూనానిమస్‌గా ఎన్నుకోబడిన సొసైటీలకు ప్రోత్సహక బహుమతిగా గతంలో రూ.5 వేలు వుండగా ఇప్పుడు ఏకంగా రూ.2 లక్షలు పెంచబడిందన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ అశోక్ మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, మొదటి విడతలో 38 సొసైటీలకు ఎన్నికలు నిర్వహించబడునని, ఇందుకు గాను 77 పోలింగ్ స్టేషన్ల ద్వారా ఒక వెయ్యి 3 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు.
డైరెక్టర్ పదవులకు నామినేషన్ల స్వీకరణ
జన్నారం, జనవరి 24: మండలంలోని సహకార సంఘం ఎన్నికల నామినేషన్లు గురువారం స్వీకరించినట్లు ప్రత్యేక అధికారులు ఎ అమర్‌నాథ్, చంద్రకాంత్‌లు తెలిపారు. మండలంలోని పొన్కల్ సహకార సంఘంలోని 13 మంది డైరెక్టర్లకు గాను 54 మంది నామినేషన్లు వేసినట్లు, అలాగే చింతగూడ సహకార సంఘంలోని 13 మంది డైరెక్టర్లకు గాను 36 మంది నామినేషన్లు వేశారని అన్నారు. 26 డైరెక్టర్ పదవులకు 90 మంది నామినేషన్లు వేసినట్లు వారు తెలిపారు.
ఒడ్డెరుల సంక్షేమానికి కృషి చేయాలి
జన్నారం, జనవరి 24: రాష్ట్ర ప్రభుత్వం ఒడ్డెర కులస్తుల సమస్యలను పరిష్కరించాలని ఒడ్డెరుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాంబమూర్తి, ప్రధాన కార్యదర్శి పి తిరుపతిలు అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం ముందు ఆయన జెండా ఆవిష్కరించి ఒడ్డెర కులస్తులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ బండరాళ్లను నమ్ముకొని కూలీ పనులు చేసుకొంటున్న తమ కులస్తుల పట్ల ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. విద్యావంతులైన ఒడ్డెర కులస్తులు జీవనోపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఒడ్డెరుల సంఘం నాయకులు రవి, వెంకటేష్, రాజవౌళి, రవీందర్, ఎల్లయ్య, శ్రీనివాస్, కృష్ణ, అధిక సంఖ్యలో ఒడ్డెర కులస్తులు పాల్గొన్నారు.
వ్యాట్ పన్ను తగ్గించాలి
ఉట్నూరు, జనవరి 24: వస్త్రాలపై ప్రభుత్వం పెంచిన విలువ ఆధారిత పెన్నును తగ్గించాలని గురువారం స్తానిక వస్త్రా వ్యాపారులు తహశీల్ కార్యాలయం ముందు ధర్నా చేసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘం అధ్యక్షుడు శ్యాంసుందర్ మాట్లాడుతూ ప్రభుత్వం వస్త్రాలపై పన్ను పెంచడం వల్ల కొనుగోలుదారులతో పాటు వ్యాపారులకు నష్టం జరుగుతుందని, ఇప్పటికే వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతున్నాయన్నారు. 5 శాతం వ్యాట్‌తో మరిన్ని సమస్యలు వస్తున్నాయన్నారు. ఇకనైనా వస్త్రాలపై వ్యాట్ పన్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు సుధాకర్, నరేష్, రాజ్‌కుమార్, సుదర్శన్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా ఓటర్ల దినోత్సవం
ఉట్నూరు, జనవరి 24: ఓటర్ల దినోత్సవాన్ని గురువారం ఉట్నూరులో ఘనంగా జరుపుకున్నారు. స్తానిక తహశీల్దార్ రాయి సిడాం చిత్రు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. 21 నిండిన వారు ఓటరు లిస్టుల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
అంగన్‌వాడీల అవగాహన ర్యాలీ
కడెం, జనవరి 24: ఈ నెల 25వ తేదీన నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవంను విజయవంతం చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు గురువారం మండలకేంద్రమైన కడెంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు అవగాహన ర్యాలీలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రాథమిక పాఠశాల సమీపంలో గల అంగన్‌వాడీ కేంద్రం ఆవరణ ఎదుట మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలతో ఖానాపూర్ ఐసిడిఎస్ సిడిపిఓ చిన్నపాలమ్మ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్ష పాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడ్తామని, మతం,జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని అంటూ అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.
కొమరం భీం బాటలో పయనించండి
* జిల్లా అధ్యక్షుడు పరుశురాం పిలుపు
ఆదిలాబాద్ (రూరల్), జనవరి 24: జల్, జంగల్, జమీన్ కోసం ఆదివాసుల స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం నిజాం సర్కార్‌తో పోరాటాలు చేసి, గిరిజనులకు పూర్తి హక్కులు కల్పించిన కొమరంభీం బాటలో ప్రతీ ఒక్కరు పయనించాలని గోండ్వానా సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఆత్రం పరుశురాం పిలుపునిచ్చారు. గురువారం ఆదిలాబాద్ మండలంలోని ‘న్యూచించుఘాట్’లో ‘కొమరం భీం’ విగ్రహాన్ని స్థానిక చౌక్‌లో ఏర్పాటుచేసిన అనంతరం ఆత్రం పరుశురాం మాట్లాడారు. గిరిజనులకు అన్ని హక్కులు కల్పించిన కొమరంభీం ఆరాధ్య దైవంగా నిలిచిపోయారని అన్నారు. ప్రత్యేక సేనాను ఏర్పాటుచేసి జోడేఘాట్‌ను స్థావరంగా మల్చుకొని నిజాం ప్రభుత్వంతో గిరిజనుల హక్కుల కోసం ప్రత్యేక పోరు సలిపారని అన్నారు. నిజాం ప్రభువు భీం ధైర్య సాహసాలను ఒకానొక సమయంలో మెచ్చుకొన్నారని ఆత్రం అన్నారు. ప్రతి గిరిజన గ్రామాల్లో కొమరంభీం విగ్రహాలను ఏర్పాటుచేయాలని, ఇందుకు అన్ని గిరిజన సంఘాలు ముందుకు వచ్చి తమ ఆరాధ్యదైవమైన కొమరంభీం విగ్రహాలను ఏర్పాటుచేయాలన్నారు. ఉదయం లేచి ఆ దైవాన్ని చూస్తే సమస్యలన్ని తొలగి మనస్సు శాంతిగా వుంటుందన్నారు. అనంతరం కొమరంభీం చేసిన సేవలను జిల్లా అధ్యక్షుడు ఆత్రం పరుశురాం కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమ్ర రాజు పటేల్, మండల తుడుందెబ్బ అధ్యక్షుడు కుమ్ర జంగు, విద్యార్థి సంఘం గోండ్వానా సంరక్షణ సమితి కార్యాదర్శి మెస్రం పరమేశ్వర్, తుడుందెబ్బ జిల్లా నాయకులు సలాం జంగు పటేల్, సూర్యవంశీ యూత్ అధ్యక్షుడు గడెం చంద్రబాన్, సిరిశంభు యూత్ అధ్యక్షుడు కుమ్ర రాజు, కార్యదర్శి కుమ్ర మోతిరాం, మాధవ్, తదితర నేతలు, అధిక సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు
* 25 మందికి అద్దాల పంపిణీ
ఆదిలాబాద్ (రూరల్), జనవరి 24: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నేరడిగొండలోని ఎంఆర్‌సి కార్యాలయంలో చిన్నారి చూపుకార్యక్రమంలో భాగంగా ఆర్‌విఎం ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఇఓ గంగయ్య, ఆర్‌విఎం అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కంటి వైద్య సిబ్బంది విద్యార్థులకు కంటికి సంబంధించిన అన్ని పరీక్షలు నిర్వహించారు. మొత్తం 35 పాఠశాలల విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు ఎంఆర్‌సికి తరలించగా, దాదాపు 200 మంది వరకు పరీక్షలను సిబ్బంది నిర్వహించారు. 25 మంది విద్యార్థులకు కంటి అద్దాలు అవసరం కావడంతో వారికి అందజేశారు. అలాగే కొంత మందిని చికిత్సల నిమిత్తం రిమ్స్‌కు రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది శ్రీ్ధర్, రవీందర్, భాస్కర్‌రావు, లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్, హెచ్‌ఎంలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
సీమాంధ్ర పార్టీలను తరిమికొడదాం
* ఆజాద్ వ్యాఖ్యల వెనక సీమాంధ్రుల కుట్ర
* 28లోగా తెలంగాణ ప్రకటించకుంటే ఆందోళన తీవ్రతరం
* టిఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీహరిరావు
* విద్యార్థి జఎసి ఆధ్వర్యంలో ఆజాద్ దిష్టిబొమ్మకు శవయాత్ర
నిర్మల్‌టౌన్, జనవరి 24 : సీమాంధ్ర పార్టీలైన తెలుగుదేశం, వై ఎస్సార్‌సీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులను గ్రామాల్లోకి రానీయవద్దని, వస్తే తెలంగాణపై గట్టిగా నిలదీయాలని టీ ఆర్ ఎస్ నియోజకవర్గ ఇంచార్జి కె.శ్రీహరిరావు విద్యార్థులకు సూచించారు. గురువారం నిర్మల్ డిగ్రీ కళాశాల విద్యార్థి జే ఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మకు శవయాత్రను నిర్వహించారు. అంతకుముందు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీహరిరావు మాట్లాడుతూ సీమాంధ్ర పాలకుల ఒత్తిళ్ళకు తలొగ్గే కేంద్రం మరోసారి తెలంగాణపై మోసపూరితమైన ప్రకటన చేసిందన్నారు. వారం అంటే ఏడు రోజులు కాదని, నెల అంటే 30 రోజులు కాదని ఒక కొత్త క్యాలెండర్‌ను ఆవిష్కరించిన గులాంనబీ ఆజాద్ చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేశారు. నాడు ఇందిరాగాంధీని మెదక్ పార్లమెంట్ స్థానానికి అఖండ మెజార్టీతో గెలిపించిన తెలంగాణ ముద్దుబిడ్డల ఆత్మ బలిదానాలు యూపీ ఏ చైర్‌పర్సన్‌గా ఉన్న సోనియాగాంధీకి కనిపించకపోవడం శోచనీయమన్నారు. 1969 ఉద్యమంలో, మొన్నటి ఉద్యమంలో వందలాది మంది బిడ్డలు ప్రాణాలు తీసుకుంటున్నప్పటికీ తెలంగాణ ఏర్పాటుకు ముందుకు రాకపోవడం దారుణమన్నారు. న్యాయమైన ధర్మ పోరాటానికి మద్దతు ఇవ్వకపోగా సీమాంధ్రుల తప్పుడు నివేదికలకు ప్రాధాన్యత ఇస్తున్న యూపీ ఏ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే రోజులు ఎక్కువ దూరంలో లేవన్నారు. అనంతరం ఆజాద్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీ ఆర్ ఎస్ నాయకులు పొడెల్లి గణేష్, మారుగొండ రాము, ఓయూ జే ఏసీ ఉపాధ్యక్షుడు సునీల్‌శెట్టి, విద్యార్థి జే ఏసీ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పోరాడి తెలంగాణను సాధించుకుందాం
కెరమెరి, జనవరి 24:తెలంగాణపై ఈ నెల 28 నిర్ణయం తీసుకుంటామని చెప్పింది...కాంగ్రెస్సే..మళ్లి నిర్ణయం దాటవేసిందని కాంగ్రెస్సేనని ఇక రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుందామని జెఎసి కన్వీనర్ తిరుపతి, టిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ నాయక్‌లు అన్నారు. కేంద్రమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షుకుడు గులాం నబీఆజాద్ వ్యాఖ్యలన్ని నిరసిస్తు గురువారం మండల కేంద్రంలో టిఆర్‌ఎస్, జెఎసి నాయకులు రాస్తారోకో నిర్వహించి ఆజాద్ దిష్టిబొమ్మను దహానం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీమాంద్ర నేతలకు వ్యతిరేకంగా నినాదాల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్ది సంఘం తూర్పు జిల్లా అధ్యక్షుడు బాలాజీ, నాయకులు వెంకటేశ్, నాందేవ్, ఇఫ్తెకర్, జావీద్, రమేశ్ పాల్గొన్నారు.
తెలంగాణకు టిడిపి వ్యతిరేకం కాదు
* రాష్ట్ర కార్యదర్శి బుచ్చిలింగం
కాగజ్‌నగర్, జనవరి 24: తెలుగుదేశం పార్టి తెలంగాణకు వ్యతిరేఖం కాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి.బుచ్చిలింగం అన్నారు. గురువారం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తెలుగుదేశం పార్టి తెలంగాణ కావాలని కోరుతున్నదని, తెలంగాణ కోసం తమ పార్టి స్పష్టంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజలను కాంగ్రేస్ పార్టి మోసగిస్తువస్తున్నదని, 2009లో తెలంగాణ ఇస్తామని పార్టి ప్రకటించి మోసగించిందన్నారు. అదే విదంగా ఈ నెల 28న తెలంగాణను ప్రకటిస్తామని కేంద్ర హోం మంత్రి షిండే ప్రకటించగా, గులాం నబీ ఆజాద్ అడ్డుకున్నారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారంగా పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టవచ్చని, కాంగ్రేస్ పార్టి పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా ప్రజలను మోసగిస్తువస్తున్నదన్నారు. రాబోయె పార్లమెంటు సమావేశాల్లో కాంగ్రేస్ పార్టి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. కెసి ఆర్ అన్ని పార్టిల నాయకులను కలుపుకుని తెలంగాణ కోసం పోరాడాలని, చిత్తశుద్దితో అన్ని పార్టిలను కలుపుకోవాలన్నారు. తెలంగాణ సాధించే వరకు అన్ని పార్టిల నాయకులు ఎన్నికల్లో పోటీ చేయవద్దన్నారు. తెలంగాణ కోసం పాటుపడాలని, ప్రజలను అయోమయంలో పడవేయవద్దన్నారు. ఈ సమావేశంలో జిల్లా నాయకుడు కొప్పుల శంకర్, కమల్ భంగ్, ప్రకాశ్, ఈర్ల లక్ష్మణ్, మండల పార్టి అధ్యక్షులు గణపతి పాల్గొన్నారు.
ఓటు హక్కు ప్రాధాన్యత తెలుసుకోవాలి
* విధిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి
* ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీఓ
నిర్మల్‌టౌన్, జనవరి 24: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని, అలాగే ఓటరు జాబితాలో తమపేర్లను విధిగా నమోదు చేసుకోవాల్సిన అవసరముందని నిర్మల్ ఆర్డీఓ గజ్జన్న పేర్కొన్నారు. ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయ ఆవరణలో గురువారం ఉదయం కార్యాలయ సిబ్బందిచే ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాష్ట్ర ఎన్నికల కమీషన్ సూచనల మేరకు ఓటు హక్కు ప్రాధాన్యతను గుర్తించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ యువతీ యువకులు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలని, తద్వారా కేవలం ఓటు హక్కు మాత్రమే కాకుండా బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఓ కిషన్‌రావు, తహశీల్దార్ జాడి రాజేశ్వర్, డిప్యూటి తహశీల్దార్‌లు భోజన్న, నర్సయ్య, భైంసా మున్సిపల్ కమీష్నర్ శైలజ, ఆర్ ఐ ప్రవీన్, రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం నిర్మల్ ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.