నిజామాబాద్, జనవరి 24: సహకార సంఘాల ఎన్నికల్లో తలపడేందుకు అనేకమంది ఆసక్తి చూపుతూ గురువారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కో సొసైటీ పరిధిలో 13 డైరెక్టర్ స్థానాలను భర్తీ చేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, ఒక్కో డైరెక్టర్ స్థానానికి సగటున నాలుగు చొప్పున నామినేషన్లు దాఖలైనట్టు తెలిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు ఆయా సొసైటీల పరిధిలోనే నామినేషన్లను స్వీకరించినందున, మొత్తంగా ఎన్ని నామినేషన్లు దాఖలయ్యాయన్నది పక్కాగా సమాచారం సేకరించేందుకు అధికారులు రాత్రి 10.30 గంటల వరకు కూడా కుస్తీ పడుతూనే ఉన్నారు. జిల్లాలో మొత్తం 142 సహకార సంఘాలు ఉండగా, రెండు విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నారు. తొలివిడతలో 74 సొసైటీలకు ఈ నెల 31వ తేదీన పోలింగ్ నిర్వహించి అదేరోజున డైరెక్టర్లుగా ఎన్నికైన వారి పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఆ మరుసటి రోజు సొసైటీ చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక జరుపుతారు. తొలి విడత సొసైటీలకు ఈ నెల 21వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయగా, గురువారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆయా సొసైటీల పరిధిలో ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరించారు. దాఖలైన నామినేషన్లను శుక్రవారం పరిశీలించిన మీదట, శనివారం సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం పోటాపోటీగా నామినేషన్లు దాఖలైన నేపథ్యంలో, ఎంతమంది బరిలో మిగిలి ఉంటారన్నది శనివారం సాయంత్రం నాటికి తేలనుంది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ సొసైటీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తూ పావులు కదపడంతో ఈసారి పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే సొసైటీలకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయల నజరానా ప్రకటించినప్పటికీ, ఇది ఏమేరకు ఏకగ్రీవాలను ప్రోత్సహిస్తుందన్నది అనుమానంగానే మారింది. ప్రస్తుతం అక్కడక్కడా కొన్ని డైరెక్టర్ స్థానాలకు సింగిల్ నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం అందినప్పటికీ, మొత్తం 13 స్థానాలు కూడా ఏకైక నామినేషన్లు దాఖలైన సొసైటీ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. దీంతో ప్రతి సొసైటీలోనూ ఎన్నిక అనివార్యంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల ఏర్పాట్లను చక్కబెట్టిన జిల్లా యంత్రాంగం నామినేషన్ల దాఖలు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీసు బందోబస్తును నియమించి పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.
ఓటరు నమోదులో యువత భాగస్వామ్యం
కలెక్టర్ క్రిస్టీనా పిలుపు
నిజామాబాద్ టౌన్, జనవరి 24: ఓటు హక్కును ప్రతి ఒక్కరు జన్మహక్కుగా భావించి 18 ఏళ్లు నిండిన యువత ఓటరు నమోదులో భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక ప్రగతిభవన్ సమావేశ మందిరంలో ఈ నెల 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓటర్ల ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పలువురు ఓటర్లచే ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా గుర్తించి ఓటరు నమోదులో భాగస్వాములై ఓటరు కార్డు తప్పనిసరిగా పొందాలని సూచించారు. దేశ పౌరులైన మనం ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగి ఉండి మనదేశ సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల నిర్వహణకు తోడ్పడాలని అన్నారు. మతం, జాతి, కులం, వర్గం, భాషా భేదం తేడా లేకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేయాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ప్రగతిభవన్‌లో జ్యోతి ప్రజల్వన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ, శిశు సంరక్షణ, బాలల హక్కుల పరిరక్షణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కోరారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల అక్రమ రవాణా తదితర సమస్యల పరిష్కారానికి గ్రామ స్థాయిలో బాలల సంరక్షణ సంఘాలు ఏర్పాటు చేస్తామన్నారు. బాలల సంరక్షణకు ఈ సంఘాలు పనిచేస్తాయని, ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుండాలని సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు బాలల సంరక్షణకు 150గ్రామాలకు సంఘాలను ఏర్పాటు చేశామని, మలిదశలో మండల, డివిజన్ స్థాయిలో సంఘాలు ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బాలికలంతా విద్యాహక్కును సద్వినియోగం చేసుకుని విద్యారంగంలో రాణించాలని తెలిపారు. అదేవిధంగా ఆరోగ్యం, పోషణపై దృష్టి సారించి బాలికలు సమాజాభివృద్ధికి, దేశాభివృద్ధికి పాటుపడేలా వారిని తీర్చిదిద్దాలని సంబంధిత శాఖలకు సూచించారు. అనంతరం జిల్లా అదనపు ఎస్పీ పద్మజా మాట్లాడుతూ, బాలకార్మిక విముక్తి కోసం చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బాలలకు సంబంధించి ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి బాలికల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ హర్షవర్ధన్, అదనపు జెసి శ్రీరాంరెడ్డి, డిఆర్‌ఓ జగదీశ్వరాచారీ, ఐసిడిఎస్ పిడి మీరాబెనార్జీ, డిటిడబ్ల్యూఓ పాండు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ప్రశాంత వాతావరణంలో సహకార ఎన్నికలు
రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూ ఆదేశం
నిజామాబాద్ టౌన్, జనవరి 24: జిల్లాలో నిర్వహించనున్న సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టాలని రాష్ట్ర ముఖ్య కార్యదర్శి మిన్నీ మాథ్యూ ఆదేశించారు. గురువారం సహకార ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్‌లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ, సహకార సంఘాలు ఏకగ్రీవంగా ఎన్నికైతే ఆయా సొసైటీలకు ప్రభుత్వం రెండు లక్షల నగదు ప్రోత్సాహకంగా అందిస్తోందన్నారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేయాలని, జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. దీనిపై కలెక్టర్ క్రిస్టీనా మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 142 సొసైటీలకు ఎన్నికలను రెండు దఫాలుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఈ నెల 31న, ఫిబ్రవరి 4న నిర్వహించనున్న ఎన్నికలకు సామాగ్రిని సిద్ధం చేశామని, ఎన్నికల అధికారులకు శిక్షణ ఇచ్చామని స్పష్టం చేశారు. బ్యాలెట్ బాక్స్‌ల భద్రత, రవాణా తదితర వాటికి భద్రతాపరమైన చర్యలు తీసుకున్నామని, జిల్లాలో మొత్తం 1,74,042 మంది ఓటర్లు ఉన్నారని, ఇందుకోసం 260 ఎన్నికల కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని సొసైటీ సభ్యులు, అర్హులైన రైతులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టామని వివరించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్, అదనపు జెసి శ్రీరాంరెడ్డి, సహకార అధికారి శ్రీహరి, డ్వామా పిడి శివలింగయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా సహకార ఎన్నికలు
అధికారులకు కలెక్టర్ క్రిస్టీనా సూచన
బోధన్, జనవరి 24: బోధన్ డివిజన్‌లో సహకార సంఘాల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ క్రిస్టీనా జడ్ చోంగ్తూ సూచించారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ ఈ పంపిణీ కేంద్రం చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. అవసరమైనచోట విద్యుద్దీపాలు అమర్చుకోవాలని అన్నారు. జిల్లాలో ఇతర డివిజన్‌లలో గల సహకార సంఘాలను పరిశీలిస్తే బోధన్ డివిజన్‌లోని సహకార సంఘాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోందన్నారు. అన్ని సంఘాలలో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఇందుకు ఎన్నికల జోనల్ అధికారులు, ఇతర అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. వివాదాస్పద ప్రాంతాలను గుర్తించి అక్కడ భారీ బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. బందోబస్తులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండవద్దన్నారు. ఒక్కో సహకార సంఘానికి ఒక పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసుకుంటే ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అందించేందుకు సులువుగా ఉంటుందన్నారు. దాంతో అధికారులు, సిబ్బంది త్వరిత గతిన తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు వెళ్లగలుగుతారని వివరించారు. రూట్‌లను ముందుగానే ఎంపిక చేసుకుని ఆ రూట్‌లలో కండిషన్‌లో ఉన్న వాహనాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఖర్చుకు అంచనాలను సిద్ధం చేసుకోవాలని, లెక్కింపు కేంద్రాల వద్ద వీడియో కెమెరాలతో చిత్రీకరించాల్సి ఉంటుందన్నారు. బోధన్ డివిజన్ పరిధిలో 30 సహకార సంఘాలు ఉండగా ఇందులో 382 టెరిటోరియల్ సెగ్మెంట్‌లకు మొదటి విడత అనగా ఈ నెల 31న ఎన్నికలు జరుగనున్నాయన్నారు. ఇందుకోసం 382 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, మొత్తం 9 రూట్‌లను గుర్తించామన్నారు. ప్రస్తుతం 28,367 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని జిల్లా కలెక్టర్ చెప్పారు. ఈ ఎన్నికలకు 858 మంది పోలింగ్ సిబ్బంది, 382 మంది ప్రిసైడింగ్ అధికారులు, 460 మంది పోలింగ్ అధికారులు విధులు నిర్వహించనున్నారని తెలిపారు. నామినేషన్ల సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులకు సూచించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారులు విధులు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడా విమర్శలకు తావివ్వవద్దని సూచించారు. అన్ని కేంద్రాలలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఆర్డీవో శివలింగయ్య, డిఎస్పీ గౌస్‌మొహిఉద్దీన్, డిసివో శ్రీహరి, తహశీల్దార్ రాజేశ్వర్, ఎంపిడివో మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.
ఓటు హక్కును సద్వినియోగం చేసుకోండి
ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు
కామారెడ్డి రూరల్, జనవరి 24: ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌డిఓ వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం జాతీయ 3వ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎన్‌సిసి క్యాడెట్లతో భారీ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్‌డిఓ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఓటర్లు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. స్థానిక నిజాంసాగర్ చౌరస్తా వద్ద విద్యార్థుల చేత ఓటరు లిస్టులో ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయంగా పేర్లను నమోదు చేసుకొని ఎన్నికల్లో నీతి, నిజాయితీగా ఓటు వేసే అధికారాన్ని యువత అలవర్చుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో వశిష్ట, ఆర్కె, మంజీర, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల, సాందీపని, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ సుదర్శన్, డిప్యూటీ తహశీల్దార్ దత్తాద్రి, ఆర్‌ఐ రాజశేఖర్, విఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌రావు, విఆర్‌ఓలు గోపాల్‌రెడ్డి, నారాయణరావు, నరేందర్‌రెడ్డి, నర్సింలు, సుధాకర్, ప్రతాప్‌రావు, ఎన్‌సిసి ప్రొగ్రాం ఇన్‌చార్జి డాక్టర్ సుధాకర్, ఎన్‌సిసి కమాండర్ గణేశ్‌కుమార్, కళాశాలల ప్రిన్సిపాల్ జయపాల్‌రెడ్డి, బాల్‌చంద్రం, గురువేందర్, తదితరులు పాల్గొన్నారు.
కరెంట్ కోతకు నిరసనగా రైతుల రాస్తారోకో
బాల్కొండ, జనవరి 24: మండలంలోని ముప్కాల్ గ్రామానికి చెందిన రైతులు కరెంట్ కోతను నిరసిస్తూ గురువారం 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ రంగానికి వేళాపాళా లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని, కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రిళ్లు బోరుమోటార్ల దగ్గరే జాగరణ చేయాల్సి రావడం వల్ల ఆరోగ్యాలు హరించుకుపోతున్నాయని వాపోయారు. కరెంట్ సరఫరాను మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపై బైఠాయించి అరగంట పాటు రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుకిరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. ఉన్నతాధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని తేల్చి చెప్పారు. సమాచారం తెలుసుకున్న ట్రాన్స్‌కో అధికారులు ఫోన్‌లో రైతులను సంప్రదించారు. ఇకపై నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు భూమేశ్వర్, నర్సారెడ్డి, మోహన్, భూమన్న తదితరులు పాల్గొన్నారు.
షిండే వ్యాఖ్యలపై బిజెపి నిరసన దీక్ష
కేంద్ర హోంమంత్రి రాజీనామాకు యెండల డిమాండ్
నిజామాబాద్ టౌన్, జనవరి 24: సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను సంతృప్తిపర్చేందుకే కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై విమర్శలు చేస్తున్నారని అర్బన్ శాసనసభ్యుడు యెండల లక్ష్మినారాయణ ఆరోపించారు. తీవ్రవాద సంస్థలకు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌లకు సంబంధాలున్నాయంటూ ఇటీవల షిండే చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్షను నిర్వహించారు. ఈ దీక్షలో పాల్గొన్న అర్బన్ శాసనసభ్యుడు యెండల లక్ష్నినారాయణ షిండేపై ధ్వజమెత్తారు. దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్, బిజెపిలపై హిందూ ఉగ్రవాదులుగా ముద్రిస్తూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కేంద్ర మంత్రి షిండే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. షిండే చేసిన వ్యాఖ్యలపై లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాద సంస్థ చీఫ్ హర్షం వ్యక్తం చేయడాన్ని బట్టి షిండే వ్యాఖ్యల తీవ్రతను అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ వ్యాఖ్యలు ఉగ్రవాదులకు అనుకూలంగా ఉన్నాయని, దీనిని బిజెపి శ్రేణులే కాకుండా దేశ ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ మోసం మరోసారి బయటపడింది
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయమై అధికార కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి బయటపడిందని అర్బన్ శాసనసభ్యుడు యెండల లక్ష్మినారాయణ అన్నారు. గత 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నెల రోజులలో ప్రకటన వెలువడుతుందని నమ్మించి మాట తప్పిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణిని నిరూపించుకుందని, ఈ ప్రాంతంలో ఆ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. ఆజాద్ తన జాదును మరోసారి తెలంగాణ ప్రజల ఆకాంక్షపై ప్రయోగించారని ఎద్దేవా చేశారు. గతంలో కేంద్ర హోంశాఖమంత్రిగా చిదంబరం చేసిన ప్రకటనను యూటర్న్ ద్వారా పాతాళానికి తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా షిండే ప్రకటనను సైతం తుంగలో తొక్కారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రుల ఒత్తిళ్లకు తలొగ్గి తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గిందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇకనైనా కాంగ్రెస్ అనుసరిస్తున్న మోసపూరిత విధానాన్ని గుర్తించి ప్రజల మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. తమ పదవులకు రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొని తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షుడు పెద్దోళ్ల గంగారెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు లింగం, మహిళామోర్చా అధ్యక్షురాలు శ్రీవాణి, బాల్‌రాజు, బాణాల లక్ష్మారెడ్డి, మచల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంతోనే కాంగ్రెస్‌కు గుణపాఠం
పిడిఎస్‌యు అధ్యక్షుడు సుధాకర్
నిజామాబాద్ టౌన్, జనవరి 24: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ద్వంద్వవైఖరిని ఉద్యమాల ద్వారా ఎండగడతామని పిడిఎస్‌యు నగర అధ్యక్షుడు సుధాకర్ హెచ్చరించారు. పిడిఎస్‌యు నగర కమిటీ ఆధ్వర్యంలో గురువారం ధర్నా చౌక్‌లో విద్యార్థులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. దీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేసి కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సుధాకర్ మాట్లాడుతూ, తెలంగాణ అంశాన్ని ఈ నెల 28లోగా తేలుస్తామని ప్రకటించిన హోంశాఖమంత్రి షిండే దానికి కట్టుబడి గడువులోగా ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రజలు శాంతికాముకులుగా ఉన్నారని, నాన్చుడు ధోరణిని అవలంభిస్తే మరోసారి ఈ ప్రాంత ప్రజల ఉగ్రరూపాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు నాయకులు ప్రగతి, కల్పన, సుజీత్, ప్రశాంత్, శేఖర్, దినేష్, లావణ్య, సంగీత, సంధ్య తదితరులు పాల్గొన్నారు.
ఆజాద్ వ్యాఖ్యలతో ఆగ్రహ జ్వాలలు
జెఎసి ఆధ్వర్యంలో మంత్రి నివాసం ముట్టడి
ఆందోళనకారుల అరెస్టు * దిష్టిబొమ్మల దగ్ధం
కలెక్టరేట్ ఎదుట బిజెపి ధర్నా * విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఆంధ్రభూమి బ్యూరో
నిజామాబాద్, జనవరి 24: నిర్ణీత గడువులోగా తెలంగాణను తేల్చడం సాధ్యపడదంటూ కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చేసిన ప్రకటన పట్ల తెలంగాణవాదుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ గురువారం జిల్లాలో ఎక్కడికక్కడ ఆందోళనలు చేపట్టి నిరసనలు చాటారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆజాద్ దిష్టిబొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలతో కదం తొక్కారు. జిల్లా కేంద్రంలో జెఎసి ఆధ్వర్యంలో కంఠేశ్వర్ ప్రాంతంలోని మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. జెఎసి జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ, ప్రతినిధులు గైని గంగారాం, వి.ప్రభాకర్ తదితరుల నేతృత్వంలో పెద్ద సంఖ్యలో తెలంగాణవాదులు మంత్రి నివాసం ఎదుట ఆందోళనకు దిగగా, పోలీసులు అడ్డుకున్న సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగి, తెలంగాణ రీసెర్చి స్కాలర్ నాయకుడు శంకర్‌కు గాయాలయ్యాయి. నిరసనకారులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి త్రీటౌన్‌కు తరలించారు. ఇదిలాఉండగా, బిజెపి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించగా, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత యెండల లక్ష్మినారాయణ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఆక్షేపించారు. తక్షణమే తెలంగాణను ప్రకటిస్తూ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. పిడిఎస్‌యు నగర కమిటీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద ధర్నా చేసిన మీదట, గులాంనబీ ఆజాద్ దిష్టిబొమ్మకు నిప్పంటించి దగ్ధం చేశారు. కేంద్ర హోంమంత్రి షిండే ప్రకటించిన విధంగా ఈ నెల 28వ తేదీలోపు తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని పిడిఎస్‌యు నాయకులు ఎం.సుధాకర్, ప్రగతి, కల్పన తదితరులు హెచ్చరించారు. కాగా, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదుట ఆజాద్ దిష్టిబొమ్మకు నిప్పంటించి తగులబెట్టారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల డబ్బు సంచులకు అమ్ముడుపోయిన ఆజాద్, సమైక్యవాదులకు గులాంగా మారాడని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజుగౌడ్ దుయ్యబట్టారు. ఇకపై సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ఆర్థిక మూలాలపై తెలంగాణవాదుల ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు. మరోవైపు న్యాయవాదులు కూడా నిరసనలకు శ్రీకారం చుట్టారు. అడ్వకేట్ జెఎసి ఆధ్వర్యంలో విధులను బహిష్కరించి, జిల్లా కోర్టు కాంప్లెక్స్ ఎదుట కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. తెలంగాణ ప్రకటన విషయంలో కేంద్రం వెనక్కి తగ్గడాన్ని నిరసిస్తూ విద్యార్థి జెఎసి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో విద్యా సంస్థల బంద్ విజయవంతమైంది. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలను తెరిచి ఉంచినప్పటికీ, విద్యార్థి జెఎసి నాయకులు చేరుకుని తరగతులను బహిష్కరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ముఖ్య కూడళ్ల వద్ద గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
టి.కాంగ్రెస్ నేతలు నిజాయితీని నిరూపించుకోవాలి
కాగా, ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం పదవులు, పార్టీకి రాజీనామాలు చేసి వాటిని ఆమోదించుకుని తమ నిజాయితీని నిరూపించుకోవాలని జెఎసి జిల్లా చైర్మన్ గోపాల్‌శర్మ డిమాండ్ చేశారు. మంత్రి ఇంటిని ముట్టడించిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఎఐసిసి పెద్దలు సీమాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గారంటూ తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపిలు, ఇతర నాయకులే పేర్కొంటున్నారని అన్నారు. ఇదే తరహాలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష పట్ల ఇక్కడి ప్రజాప్రతినిధులకు ఏమాత్రం గౌరవం ఉన్నా, వారు కూడా రాజీనామా అస్త్రాన్ని సంధించాలని, తెలంగాణ కావాలా లేక పదవులే ముఖ్యమో తేల్చుకోవాల్సిన సందర్భం ఆసన్నమైందన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఇకపై పోరుబాటను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.