బాపు సినిమా ‘మిష్టర్ పెళ్లాం’లో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. కాకపోతే భర్త కొద్దిగా ‘ఎక్కువ’ సమానం అనిపించారు ముళ్లపూడి వారు. అలాగే, సంతానంలో ఇద్దరూ సమానమే అం టున్నా, కొడుకు కొద్దిగా ‘ఎక్కువ’ సమానం. మన ఆస్తికి వారసుడు, తలకొరివి పెట్టి, ఏడాదికోసారి ఆబ్దీకం పెట్టే బాధ్యత మన శాస్త్రాలు కొడుక్కే ఇచ్చాయి కాబట్టి. ప్రభుత్వం ఆడపిల్లకి ఆస్తి హక్కు ఇచ్చినా అది ఆచరణలో అమలు జరుగుతున్న దాఖలాలు లేవు. అయతే- కన్నవాళ్లను ఆడపిల్లలే బాగా చూసుకుంటున్నారని పలు సర్వేలు ఘో షిస్తున్నాయ. జీవిత చరమాంకంలో తండ్రైనా, తల్లయనా అమ్మాయి దగ్గరే! దీనికి మా విమల ఒక ఉదాహరణ.
విమల, నేను నూజివీడు ఎలిమెంటరీ స్కూల్లో కలిసి చదువుకున్నాం. నాన్న బదిలీపై తిరువూరు వచ్చేటప్పుడు నన్ను పట్టుకుని ఏడ్చేసింది. ఆ తరువాత వారానికో కార్డు రాసేది. దాని ఉత్తరాలు నాకో టానిక్కు. ప్రతి మంగళవారం ఎన్నో కబుర్లు మోసుకొచ్చేది ఆమె ఉత్తరం. అందులో సాంబయ్య మాష్టారి క్లాసులు, ‘్భకైలాస్’లో ఎన్టీఆర్ నటనా వె దుష్యం, ఎర్రనీళ్ళు (నూజివీడులో మా చిన్నతనంలో ఒక పంతులుగారు పదిమైళ్ళ దూరం నుంచి వీటిని సీసాలలో తెచ్చి పదిపైసలకు అమ్మేవారు) బిందె రేటు పంతులుగారు పెంచారనీ, పనిమనిషి కొడుకు అమీర్ ముద్దొస్తున్నాడని, దొడ్లో కాసే చిక్కుళ్ళు సందులో అందరికీ పంచిపెడుతున్నానని.. ఇలా ఎన్నో విషయాలు రాసేది. నేను అప్పుడప్పుడు జవాబిచ్చేదాన్ని. అలా మా స్నేహం... భర్త, పిల్లల నుంచి- కొడుకు, కోడలు వచ్చినా సాగిపోతోంది.
విమల భర్త పోయి రెండు నెలలైంది. ఉంటున్న ఇల్లు చిన్న కొడుకు తీసుకుని పెద్దాడికి పాతిక లక్షలకి చెక్కు ఇచ్చాడు. వాడు మాట్లాడకుండా చెక్కు తీసుకున్నాడు. తన అన్నయ్య వెంట పుట్టింటికి వెళ్ళిన విమలను తీసుకురమ్మని ఏ కొడుకూ ఫోన్ చెయ్యకపోవడం... చివరికి విమలే ఒంటరిగా ఢిల్లీలో వున్న పెద్దకొడుకు దగ్గరికి చేరడం.. ‘ముష్టి పాతిక లక్షలిచ్చి ఇల్లు కాజేశాడు.. నిన్ను చూసుకోవలసింది చిన్నోడే’-అని పెద్దాడు అనడంతో చిన్నాడి దగ్గరికి చేరుకోగా, ‘నలభై సంవత్సరాలు ఇక్కడే వున్నావు. ఇక దేశ రాజధానిలో హాయిగా గడపక- అప్పుడే ఎందుకు వచ్చావ’ని చిన్నోడు అడగడంతో ఆమె మనోవేదనకి గురైంది.
పెద్దోడు అన్నమాటలు చెబుదామంటే మళ్ళీ వాళ్ళిద్దరిమధ్య గొడవలు వస్తాయని ఆమెకు భయం. ఈ విషయం నాకు ఫోన్లో చెప్పి బాధపడింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కూతురు స్వాతి దగ్గరకి చేరింది. భర్తపోయిన పనె్నండో రోజున- ‘నాకు ఆస్తి వద్దమ్మా, నువ్వు ఎక్కడైనా సుఖంగా వుండడమే నాకు ముఖ్యం. అన్నయ్యల దగ్గర నీకు ఇబ్బందులు ఎదురైతే నా దగ్గరికి వచ్చేయి. అంతేగానీ కొడుకు దగ్గరే ఉండాలనే ఆలోచనలు చెయ్యకు’ అందట స్వాతి.
‘చిన్నకోడలు నా నగల విషయం ఎత్తింది.. తల్లినగలు ఆడపిల్లలకే అని అన్నాను. మీరెప్పుడూ కూతురు, కోడలు సమానమే అంటారుగా అని కోడలి ఎత్తిపొడుపు మాటలు. కొడుకు, కూతురు నాకు సమానమే.. కానీ, కొడుకులిద్దరికీ ఆస్తి రాశాను. మరి కూతురి విషయం ఏమిటి? అని అడిగేసరికి కోడలు ముఖం మాడ్చుకుంద’ని విమల రాసింది.
‘ఎక్కడున్నా ఏదోఒక మాట మీద నాకు కూతురంటే ఎక్కువ ప్రేమని... అదెలా? ఇష్టమైతే ఆస్తిలో వాటా ఇచ్చేదాన్నిగా.... అనగానే కొడుకులు తప్పుకోవడం.. ఇలా రెండు నెలలు ఇద్దరి దగ్గరా ఇదే విషయం... అందుకే నేను స్వాతి దగ్గరికి వెళ్లిపోతున్నానే.. ఆస్తి ఇవ్వకపోయినా నా నగలైనా దానికిస్తే నాకు కొద్దిగా తృప్తి ఏమంటావు?’ ఇదీ విమల వాదన.
విమల నిర్ణయం సరైనదే అని నేను చెప్పాను. అల్లుడు చాలా మంచివాడు. తన దగ్గర చదువుకున్న స్టూడెంట్‌కిచ్చారు స్వాతిని. అతడికి గురుభక్తి ఎక్కువ. కాబట్టి విమలకి మిగిలిన జీవితం ప్రశాంతంగా సాగుతోంది.
‘పది లక్షలు కూతురికిచ్చివుంటారు’ ఇవీ కోడళ్ళ మాటలు.
తిరుపతి, శ్రీశైలం, సింహాచలం, భద్రాచలం అన్ని దేవాలయాలకీ చెక్కులు పంపుతూ ‘ఈ విషయం నువ్వు ఎవరికీ చెప్పకు...’ అని భర్త అన్నపుడు ఆ విషయాన్ని రహస్యంగా వుంచడం తప్పయింది. ఇప్పుడు నేను పది లక్షలు ఇచ్చి కూతురి దగ్గర వుంటున్నానని నా కొడుకులు బంధువులతో చెప్పుకుని బాధ పడడం మామూలైంది. ‘మేం ఎంత బాగా చూసినా ఆవిడ ప్రాణమంతా కూతురిమీదేన’ని కోడళ్ళు తాము మం చివాళ్లమన్నట్లు మాట్లాడుతున్నారు..’- అని ఫోన్ చేసింది విమల.
తండ్రి వున్నపుడు ఓ విధంగా, అతను మరణించాక మరోలా మారిపోయే కొడుకులకన్నా కూతురే నయం.. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపేసి, ఆమెను పరాయిదానిగా భావించకండి. కొడుకులతో సమానంగా చదివించండి. ప్రేమను కూడా సమంగా పంచండి. ఏమో..? రేపు ఎవరు మనకి ప్రశాంత జీవితం అందిస్తారో? ఇదీ వర్తమానంలో చాలా ఇళ్ళల్లో పరిస్థితి.
బాపు సినిమా ‘మిష్టర్ పెళ్లాం’లో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే.
english title:
a
Date:
Wednesday, February 6, 2013