......................
జాడలేని కీలక సిఫార్సులు ఇవీ..
* భార్యల ఇష్టానికి విరుద్ధంగా భర్తలు చేసే లైంగిక హింసను- ‘వైవాహిక అత్యాచారాలు’గా పరిగణించాలి.
* దేశ సరిహద్దు రాష్ట్రాల్లో ‘సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టా’న్ని (ఎఎఫ్‌ఎస్‌పిఎ) సవరించాలి. అత్యాచారాలకు, లైంగిక దాడులకు పాల్పడే సైనిక సిబ్బందిపై విచారణకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు.
* లైంగిక నేరాల కేసుల్లో సహకరించని ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం ఐదేళ్ల జైలు శిక్ష విధించాలి. ( జైలు శిక్షను ఏడాదికి పరిమితం చేస్తూ ఈ సిఫార్సును పాక్షికంగా ఆమోదించారు.)
* లైంగిక నేరాలకు సంబంధించి ఆరోపణలున్న నాయకులను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించరాదు.
.........................
ఆసేతు హిమాచలం ఆందోళనలతో అట్టుడికి పోయింది.. ఎవరి ప్రోద్బలం, ప్రమేయం లేకుండానే యువతీ యువకులు పల్లె నుంచి ఢిల్లీ దాకా వీధుల్లోకి వచ్చి దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.. పోలీసులు లాఠీలతో దండెత్తినా వెన్ను చూపలేదు.. దేశంలో మునె్నన్నడూ కనీవినీ ఎరగని రీతిలో కొన్ని వారాల పాటు మహోద్యమం ఉప్పెనలా సాగింది.. ఢిల్లీలో యువతిపై సామూహిక అత్యాచారం ఘటన తర్వాత భారత్‌లో మహిళల భద్రతపై అంతర్జాతీయ స్థాయిలోనూ విస్తృత చర్చ జరిగింది.. మహిళలపై లైంగిక నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు, శిక్షలను మరింత కఠినతరం చేసేందుకు సరికొత్త శాసనాలు చేయాలంటూ మహిళా ఉద్యమ నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు, మేధావులు... ఒక్కరేమిటి దేశం యావత్తూ ఆవేశంతో ఊగిపోయింది.. ఉవ్వెత్తున సాగిన ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం తలవంచక తప్పలేదు. లైంగిక హింస నిరోధానికి, ప్రస్తుత చట్టాలను సమీక్షించి వాటికి తగిన మార్పులు సూచించేందుకు కేంద్రం నియమించిన జస్టిస్ వర్మ కమిటీ పలు సిఫార్సులతో నివేదిక సమర్పించింది. ఈ సిఫార్సులను పరిశీలించాక కేంద్ర మంత్రిమండలి సలహాపై తాజాగా రాష్టప్రతి ‘క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్స్-2013’ (లైంగిక నేరాల నిరోధక ఆర్డినెన్స్)ను ఆమోదించారు. ఇది తక్షణం అమల్లోకి వచ్చింది.
కాగా, దేశ ప్రజల ఆకాంక్షలను ఈ ఆర్డినెన్స్ ప్రతిఫలించడం లేదని మహిళా ఉద్యమ సంస్థలు, కొన్ని విపక్ష రాజకీయ పార్టీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. జస్టిస్ వర్మ కమిటీ చేసిన కొన్ని కీలక సిఫార్సులను పక్కనపెట్టి ‘కోరల్లేని ఆర్డినెన్స్’ను ఆమోదించడం తమను వంచించడమేనని మహిళా సంఘాలు విరుచుకుపడుతున్నాయి. కొద్ది రోజుల్లో పార్లమెంటు సమావేశాలు జరుగనుండగా ఆదరాబాదరగా ఆర్డినెన్స్ జారీ చేయడం అర్థరహితమని కొన్ని విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి, పారదర్శకతకు విరుద్ధంగా ఉందన్న వాదనలు జోరందుకుంటున్నాయి. వర్మ కమిటీ సిఫార్సులను యథాతథంగా అమలు చేసేలా చట్టం రూపొందించేవరకూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మహిళా సంస్థల నేతలు స్పష్టం చేశారు. అత్యాచార కేసుల్లో నిందితులకు మరణశిక్ష విధించాలని వర్మ కమిటీ సిఫార్సు చేయకున్నా దాన్ని ఆర్డినెన్స్‌లో చేర్చడం ఏమిటని మహిళా ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు. అత్యాచార కేసుల్లో నిందితులైన ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు శాఖ, సైనిక బలగాల సిబ్బందిపై కఠిన శిక్షలుండాలన్న వర్మ కమిటీ సిఫార్సును విస్మరించడం పట్ల కూడా నిరసన ధ్వనులు చెలరేగుతున్నాయి. ‘సైనిక బలగాల ప్రత్యేక అధికారాల చట్టా’న్ని సమీక్షించాలన్న కీలక సిఫార్సును ఆర్డినెన్స్‌లో ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందని మహిళా నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. సుమారు నెల రోజుల పాటు నిర్విరామ కసరత్తు చేసి, ప్రజల నుంచి వచ్చిన సుమారు 80 వేల సూచనలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాక వర్మ కమిటీ ఎంతో నిజాయితీగా చేసిన సిఫార్సులను కేంద్రం పూర్తిస్థాయిలో పట్టించుకోక పోవడం సరికాదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్టప్రతి ఆమోదంతో చట్టబద్ధత లభించిన ‘క్రిమినల్ లా (సవరణ) ఆర్డినెన్స్-2013’ ప్రకారం తీవ్రమైన అత్యాచార కేసుల్లో నిందితులకు మరణశిక్ష విధించే అవకాశం ఉంది. అత్యాచారం ఫలితంగా బాధితురాలు మరణించినా, అచేతనావస్థకు చేరినా 20 ఏళ్ల వరకూ జైలు శిక్ష, తీవ్రమైన కేసుల్లో మరణశిక్ష విధిస్తారు. అయితే, మరణశిక్ష వద్దంటూ మహిళా సంఘాలు పెద్ద ఎత్తున సూచనలు చేయడంతో ఈ విషయమై జస్టిస్ వర్మ కమిటీ ఎలాంటి సిఫార్సు చేయలేదు. మరణశిక్షలతో తిరోగమన దిశగా అడుగులు వేసినట్లవుతుందని కమిటీ భావించింది. కమిటీ సిఫార్సు చేయకపోయినా మరణశిక్షలు విధించాలన్న అంశాన్ని ఆర్డినెన్స్‌లో చేర్చడం గమనార్హం.
ఆర్డినెన్స్ ప్రకారం ‘అత్యాచారం’ అనే పదాన్ని ‘లైంగిక దాడి’గా పరిగణించాల్సి ఉంటుంది గనుక మహిళలపై జరిగే అన్ని రకాల లైంగిక నేరాలూ ‘అత్యాచారం’ కిందే వస్తాయి. మహిళల వెంటపడినా, వేధించినా, అనుచితంగా అసభ్యకరంగా ప్రవర్తించినా, వ్యభిచారంలోకి నెట్టినా, దంపతుల ఏకాంత దృశ్యాలను రహస్యంగా చూసినా, చిత్రీకరించినా లైంగిక నేరమే అవుతుంది. బాధితురాలి వాంగ్మూలాన్ని మహిళా పోలీసు అధికారి మాత్రమే నమోదు చేయాలని, 18 ఏళ్ల లోపు మహిళలు నిందితుని సమక్షంలో విచారణకు హాజరు కానక్కర్లేదని, బాధితురాలి వాంగ్మూలాన్ని ఆమె నివాసంలోనే నమోదు చేయాలని వర్మ కమిటీ చేసిన కొన్ని సిఫార్సులను ఆర్డినెన్స్‌లో చేర్చారు. యాసిడ్ దాడిలో ఆత్మరక్షణ కోసం నిందితుడిని హతమార్చిన పక్షంలో బాధితురాలి చర్యను ఆత్మరక్షణ హక్కుగా పరిగణిస్తారు. కాగా, మహిళలపై పురుషులు కూడా లైంగిక దాడి ఆరోపణలు చేసేందుకు ఆర్డినెన్స్‌లో అవకాశం కల్పించడం విడ్డూరంగా ఉందని మహిళా నేతలు విమర్శిస్తున్నారు. యాసిడ్ దాడుల్లో బాధితులు కోలుకునేందుకు నష్టపరిహారం ఇవ్వాలన్న సిఫార్సును పట్టిం చుకోలేదు.
‘ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసేలా ఆదరాబాదరాగా ఆర్డినెన్స్‌ను తేవాల్సిన అవసరం ఏమిటి? కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతుండగా కేంద్ర మంత్రిమండలి ఇంత తొందరగా ఆర్డినెన్స్ తేవడం ఎందుకు? వర్మ కమిటీ సిఫార్సులపై తగిన దృష్టి సారించకుండానే ఎవరిని సంతృప్తపరచడానికి ఈ ప్రయత్నాలు?’-అని అ ఖిల భారత అభ్యుదయ మహిళా సంఘం (ఎఐపిడబ్ల్యుఎ) కార్యదర్శి కవితా కృష్ణన్ ప్రశ్నించారు. నెల రోజుల పాటు కష్టపడి కమిటీ సిఫార్సులు చేయగా, కేవలం కొద్ది గంటల సమయంలోనే వాటిని పరిశీలించి ఆర్డినెన్స్ జారీ చేయడం సమంజసంగా లేదని ఆమె ధ్వజమెత్తారు. ఆర్డినెన్స్ విషయమై తాము ఉద్యమం చేయక తప్పదని కవిత స్పష్టం చేశారు.
‘ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంటులో బిల్లు తేవాలే తప్ప హడావుడిగా చేసే ఆర్డినెన్స్‌తో ప్రయోజనం ఉండదని, ప్రజల మనోభావాలను, ఆకాంక్షలను ప్రభుత్వం తెలుసుకుని తీరాల’ని ప్రముఖ సామాజిక కార్యకర్త ఫరా నఖ్వీ విజ్ఞప్తి చేశారు. ప్రజలు కోరుకుంటున్న అంశాలపై వర్మ కమిటీ చేసిన సిఫార్సులను ఉద్దేశ పూర్వకంగా విస్మరించడం దారుణమని మరికొందరు మహిళా నేతలు ఆరోపిస్తున్నారు.
భార్యలపై భర్తలు చేసే లైంగిక హింస, పోలీసు శాఖతో పాటు సాయుధ దళాల్లో అత్యాచార నిందితులను సాధారణ శిక్షాస్మృతి పరిధిలోకి తేవడం, సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టంపై సమీక్ష వంటి సిఫార్సులను పరిగణనలోకి తీసుకోకపోడం సరికాదని మానవ హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది బృందా గ్రోవర్ విమర్శించారు. ఏ మాత్రం పారదర్శకత లేని రీతిలో యుద్ధ ప్రాతిపదికపై కేంద్ర మంత్రిమండలి ఆర్డినెన్స్‌ను జారీ చేయడం వెనుకు అసలు ఉద్దేశాలేమిటో అర్థం కావడం లేదని ఆమె విస్మయం వ్యక్తం చేశారు.