కటక్, ఫిబ్రవరి 6: స్వదేశంలో జరుగుతున్న మహిళల ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో కనీసం సూపర్ సిక్స్‌కు కూడా అర్హత సంపాదించలేకపోయిన భారత జట్టు ఏడు, ఎనిమిది స్థానాల కోసం గురువారం జరిగే పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఢీకొనేందుకు సిద్ధమవుతున్నది. సొంత గడ్డపై, వేలాది మంది అభిమానుల మద్దతు లభించినప్పటికీ, మంగళవారం నాటి కీలక మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడిన భారత్ 138 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనితో వచ్చే ప్రపంచ కప్ పోటీలకు భారత్ నేరుగా అర్హత సంపాదించే అవకాశాన్ని కోల్పోయింది. మళ్లీ క్వాలిఫయింగ్ పోటీల్లో పాల్గొని, వచ్చే వరల్డ్ కప్ పోటీలకు అర్హత సంపాదించాల్సి ఉంటుంది. మొదటి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుచేసిన మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత జట్టు ఆతర్వాత ఒక్కసారిగా నీరసించిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లాండ్‌ను ఢీకొని దారుణంగా ఓడింది. నిలకడలేమితో అల్లాడుతున్న శ్రీలంకను కూడా ఓడించలేక చతికల పడింది. రెండు వరుస పరాజయాలు భారత్ ప్రతిష్టను దెబ్బతీశాయి. గురువారం నాటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడిస్తే, కొంతలో కొంత పరువు నిలబడుతుంది. మిగతా మ్యాచ్‌ల విషయం ఎలావున్నా, పాక్ చేతిలో ఓటమిని చవిచూడరాదన్నది కోట్లాది మంది భారత అభిమానుల ఆశ. ఈ ఆశనైనా మిథాలీ సేన నిలబెడుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది. స్వదేశంలో ఇస్లామిక్ మతవాదుల కట్టుబాట్లను ఛేదించుకొని, ఆత్మవిశ్వాసంతో ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటున్న పాక్ జట్టు పరిస్థితి భారత్ కంటే ఏమంత మెరుగ్గా లేదు. అన్ని విభాగాల్లోనూ సానా మీర్ కెప్టెన్సీలోని పాక్ కంటే భారత్ బలంగా కనిపిస్తున్నది. అయితే, బౌలర్ల వైఫల్యం శ్రీలంక మ్యాచ్‌లో స్పష్టం కావడం భారత కెప్టెన్ మిథాలీని తీవ్రంగా వేధిస్తున్నది. మరోసారి ఇదే పరిస్థితి పునరావృతమైతే, పాక్‌తోనూ సమస్యలు తప్పవన్న ఆందోళన భారత శిబిరాన్ని ఒత్తిడికి గురి చేస్తున్నది. పసలేని భారత బౌలింగ్‌ను అవలీలగా ఎదుర్కొన్న శ్రీలంక మంగళవారం నాటి మ్యాచ్‌లో ఐదు వికెట్లకు 282 పరుగులు చేయగలిగింది. బౌలర్లతో పోటీగా బ్యాట్స్‌విమెన్ కూడా విఫలం కావడంతో, భారత్ 42.2 ఓవర్లలో 144 పరుగులకే కుప్పకూలింది. అయితే, పాకిస్తాన్‌తో పరిస్థితి మరీ ఇంత ఘోరంగా ఉండదని అభిమానుల నమ్మకం.
ఇలావుంటే, మంగళవారం లంకతో మ్యాచ్ ఆడిన భారత జట్టు బుధవారం ఇక్కడికి చేరుకుంది. సాయంత్రం నెట్స్‌కు హాజరుకాలేకపోయిన భారత బృందం ఏకంగా గురువారం మ్యాచ్‌లో ఆడనుంది. పాక్ జట్టు లీగ్ మ్యాచ్‌లు కటక్‌లోనే ఆడడం వల్ల పిచ్‌పై కొంత అవగాహన సంపాదించుకుంది. ఈ కోణం నుంచి చూస్తే, భారత్‌కు పాక్ గట్టిపోటీనిచ్చే అవకాశాలున్నాయి.
నేడు పాక్‌తో మిథాలీ సేన పోరు శమహిళల ప్రపంచ కప్ క్రికెట్
english title:
b
Date:
Thursday, February 7, 2013