గుంటూరు, ఫిబ్రవరి 8: వ్యవసాయ రంగానికి తొమ్మిదేళ్ల టిడిపి హయాంలో తామేం చేశామో, కాంగ్రెస్ గత తొమ్మిదేళ్లలో ఏంచేసిందో తేల్చడానికి దమ్ముంటే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బహిరంగ చర్చకు రావాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో శుక్రవారం 10.7 కిలోమీటర్ల పాదయాత్ర సాగించారు. పెదకాకాని సెంటర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రజలను మభ్యపెట్టి అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్ 2, 3 గంటలు కూడా ఇవ్వకుండా అన్నదాతలను ముంచుతోందని దుయ్యబట్టారు. రైతుల కష్టాలు తీర్చేందుకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు చేస్తే అమలు చేయకుండా చెత్తబుట్టలో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత చర్యల కారణంగా నిత్యం ఐదారుగురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేతగాని ముఖ్యమంత్రి వల్లే రైతులు కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆరోపించారు. ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రజలకు విద్యుత్ కష్టాలు మొదలయ్యాయంటే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో తమ అనుకూలురైన ప్రయివేట్ విద్యుత్ కంపెనీలకు యూనిట్ 15 రూపాయలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేశారని, ఆ పర్యవసానమే ఇప్పుడు ప్రజలపై సర్‌చార్జి రూపంలో వడ్డిస్తున్నారని తెలిపారు. సర్‌చార్జిల రూపంలో ఇప్పటికే 14 వేల కోట్ల రూపాయల మేర జనం నెత్తిన భారం మోపిన సర్కారు... త్వరలో మరో 18 వేల కోట్లు భారం వేసేందుకు సిద్ధమైందన్నారు. ప్రత్యర్థులపై తప్పుడు కేసులు బనాయించడం తప్ప కిరికిరి సిఎం కిరణ్‌కుమార్‌కు పాలన ఏమీ తెలియదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ దొంగలు -గజదొంగల పార్టీలని బాబు అభివర్ణించారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఒక్క తడి నీరు ఇచ్చినా పుష్కలంగా పంటలు పండేవని, అసమర్థ సర్కారు చర్యల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు. వాన్‌పిక్ కేసులో ఎ5గా ఉన్న ఒక రాష్టమ్రంత్రిని మంత్రివర్గం నుంచి తొలగించకుండా సాక్షాత్తూ ముఖ్యమంత్రే కాపాడుతున్నారని దుయ్యబట్టారు. మంత్రితో సిగ్గు లేకుండా సిఎం కిరణ్ సమీక్షలు నిర్వహిస్తున్నారని, అవినీతిపరులతో సమీక్షలేంటని బాబు నిలదీశారు. అన్నదాతల కళ్లలో ఆనందం చూడటం తప్ప తనకు మరే ఇతర కోరికలు లేవని, రాష్ట్రంలో గాడితప్పిన పాలనను ఆరు నెలల్లో పట్టాలపైకి తెచ్చి మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. పాదయాత్రలో ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ సిద్దా రాఘవరావు, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, పార్థసారధి (అనంతపురం), చిత్తూరు జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాస్, దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
.......................
పాదయాత్రలో చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
..........................
వ్యవ‘సాయం’పై కిరణ్‌కు సవాల్ అవినీతిపరులతో సిఎంకు సమీక్షలా? పాదయాత్రలో చంద్రబాబు
english title:
sagu
Date:
Saturday, February 9, 2013