హైదరాబాద్, ఫిబ్రవరి 8: పోలవరం ప్రాజెక్టు (ఇందిర సాగర్) నిర్మాణ అంచనాలు డిజైన్‌లో చోటుచేసుకున్న మార్పుల వల్లే పెరిగినట్టు నీటిపారుదల శాఖ ఇఎన్‌సిలు స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో పోలవరం ఇఎన్‌సి వేంకటేశ్వర్లు, నీటిపారుదల ఇఎన్‌సి మురళీధర్, ప్రాజెక్టుల పరిపాలన ఇఎన్‌సి నారాయణరెడ్డి మీడియాతో మట్లాడారు.
పోలవరం కొత్త డిజైన్ అంచనాలతో ప్రభుత్వం జీవో జారీ చేసిందని, అయితే వివిధ ప్రచార సాధనాల్లో పోలవరం అంచనాలు భారీగా పెరిగాయని విమర్శలు వచ్చాయన్నారు. ప్రాజెక్టు పరిధిలో వివిధ విభాగాల పనుల కోసం ఎర్త్‌వర్క్, స్పిల్‌వేతో కుడి ఎడమ కాల్వలను ప్రాజెక్టుకు అనుసంధానం చేయడానికి ఇటీవల ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. పెరిగిన అంచనాల వ్యయం 2,655 కోట్లు మాత్రమేనని వెల్లడించారు. కేంద్ర జలవనరుల శాఖ ఆమోదం ప్రకారం పోలవరం ప్రాజెక్టు నుంచి దిగువకు 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీటిని వదలడానికి డిజైన్ చేయడంతో అంచనాల వ్యయం పెరిగిందన్నారు. వాస్తవంగా పోలవరం 150 మీటర్ల ఎత్తులో నీటి లెవల్ ఉంటుందని గుర్తు చేశారు. నీటి విడుదల కోసం డిజైన్ మార్చడంతో పొడవు, వెడల్పు, ప్రాజెక్టు రూపురేఖలే మారినట్టు చెప్పారు. 2004-05లో అంచనా వ్యయం 4717 కోట్లు కాగా, ప్రస్తుత అంచనా వ్యయం 7372 కోట్లుకు పెరిగిందన్నారు. మరో ఐదేళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయడానికి దాదాపు16 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. ప్రాజెక్టు ద్వారా కేవలం ఖరీఫ్ సీజన్‌కు మాత్రమే సాగునీరు విడుదల చేస్తామని, రెండో పంటకు సాగునీరు కేటాయింపులు ఉండవన్నారు. జల విద్యుదుత్పత్తి చేయడానికి జెన్‌కో నిర్మాణాలు చేపడుతుందన్నారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు దక్కించుకున్న విదేశీ ఏజెన్సీలపై సమగ్ర సమాచారం కోసం ఆయా దేశాల్లో అధికారుల బృందం పర్యటిస్తున్నట్టు చెప్పారు. నివేదికలు అందిన తర్వాత అనర్హత ఉంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాలు పూర్తయితే దాదాపు 276 గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇప్పటికే 6 లక్షల 30 వేల ఎకరాలు భూసేకరణ పూర్తి చేశామన్నారు. మరో లక్ష ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందన్నారు. నిర్మాణాల కోసం టెండర్ల ప్రక్రియ ఆలస్యమైతే ప్రతి విభాగానికి 500 కోట్లు పెరుగుతాయన్నారు. జలయజ్ఞంలో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గత అంచనా వ్యయం 1,85,671 కోట్లు కాగా, ప్రస్తుత అంచనాల ప్రకారం 3 లక్షల కోట్ల మేర ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. మరో రెండేళ్లల్లో వివిధ ప్రాజక్టుల పూర్తయితే 30 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో చేపట్టిన నీటి ప్రాజెక్టుల వ్యయాలను కాగ్ పరిశీలించిందన్నారు. నీటి ప్రాజెక్టులపై కాగ్ తప్పుపట్టిన అంశాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, నిధుల ఖర్చులో వ్యత్యాసాలు ఉన్నమాట వాస్తవమేనని స్పష్టం చేశారు.
..................................
మీడియాతో మాట్లాడుతున్న
ఇన్‌ఎన్‌సిలు మురళీధర్, వెంకటేశ్వర్లు, నారాయణ రెడ్డి
పెరిగిన పోలవరం అంచనాలపై ఇన్‌ఎన్‌సిల వివరణ 36 నుంచి 50 లక్షల క్యూసెక్కులు డిస్‌చార్జికి ప్లాన్ పెరిగిన అంచనాలు 2655 వేల కోట్లే... ఇప్పటి వరకు 6.3లక్షల ఎకరాల భూసేకరణ
english title:
d
Date:
Saturday, February 9, 2013