తిరుపతి, ఫిబ్రవరి 8: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె పర్యటనపై రాష్ట్రంలోని తమిళులు భగ్గుమన్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనార్థం రాజపక్సె శుక్రవారం సాయంత్రం 5.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయంలో ప్రత్యేక విమానంలో దిగారు. రాజపక్సె పర్యటన వివరాలు తెలుసుకున్న తమిళులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. సుమారు రెండు లక్షల మంది తమిళులను ఊచకోత కోయించి, 20 వేలకు పైగా హిందూ ఆలయాలను కూల్చి బౌద్ధాలయాను నిర్మించిన రాజపక్సెకు తిరుమలను దర్శించుకునే అర్హత లేదంటూ తిరుపతి, తిరుమల, రేణిగుంట తదితర ప్రాంతాల్లో వేల సంఖ్యలో తమిళులు ఆందోళనకు దిగారు. రాజపక్సే పర్యటన ఖరారైనట్టు తెలుసుకుని గత రెండురోజులుగా వివిధ మార్గాల గుండా తమిళ సంఘాలు, ఎండిఎంకె, డిఎండికె కార్యకర్తలమని చెప్పుకుంటున్న వేలాదిమంది తమిళులు ఆయన పర్యటన అడ్డుకోవడానికి రేణిగుంట, తిరుమల, తిరుపతి ప్రాంతాల్లో మోహరించారు. దీంతో చిత్తూరు జిల్లా సరిహద్దు ప్రాంతాలతోపాటు రేణిగుంట, తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. తొలుత తిరుపతిలో రాజపక్సె దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి విఫలయత్నం చేసిన తమిళులు, గతంలో ఎన్నడూ లేనివిధంగా తిరుమలలో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రాజపక్సెను మాత్రం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి అనుమతించకుండా అడ్డుకుంటామని తమిళలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాకుండా గత రెండురోజులుగా టిటిడి ఇఓ, జేఇఓ, పిఆర్‌ఓ కార్యాలయాలకు వందల సంఖ్యలో ఫోన్లు చేసి రాజపక్సెను అడ్డుకుంటామంటూ హెచ్చరికలకు దిగారు. రాజపక్సె పర్యటనను అడ్డుకోవడానికి ఎండిఎంకె పార్టీ కార్యకర్తలు, వైగో అనుచరులు వ్యూహ రచన చేశారని, వేల సంఖ్యలో తిరుమల తిరుపతి ప్రాంతాల్లో మోహరించే అవకాశం ఉందని నిఘా సంస్ధలు చిత్తూరు జిల్లా పోలీసులను ముందుగానే హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్ తిరుపతికి వచ్చే అన్ని మార్గాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. నాకాబందీ చర్యలు చేపట్టారు. తిరుపతి, తిరుపతి రూరల్, రేణిగుంట ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. పొరుగు జిల్లాల నుంచి అదనపు బలగాలను రప్పించి మోహరించారు. తిరుపతి, తిరుమల ప్రాంతాల్లో సుమారు వెయ్యి మందిని, జిల్లావ్యాప్తంగా 1500 మంది తమిళులను అరెస్టు చేసి ఉంటారని అంచనా. ఆందోళనకారులను తప్పుదారి పట్టించేందుకు కూడా జిల్లా పోలీసులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఇందులో భాగంగా రాజపక్సె గయ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రమంలో దిగగానే హెలికాప్టర్‌లో తిరుపతికి వెళ్తారని ప్రచారం చేశారు. ఒక హెలికాప్టర్‌ను కూడా రప్పించి ముందుగానే రేణిగుంట విమానాశ్రయంలో ఉంచారు. తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో హెలిప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో ఆందోళకారులు తిరుపతిలో రాజపక్సెను అడ్డుకోవడానికి సమాయత్తమయ్యారు. పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అరెస్టు చేశారు. అర్బన్ హాట్ వద్ద రాజపక్సె దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నించిన కొంతమంది తమిళులను పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. అయితే హెలికాప్టర్‌లో రాజపక్సె రాలేదని తెలుసుకున్న ఆందోళకారులు ఖంగుతిన్నారు. తరువాత గంట ఆలస్యంగా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రాజపక్సెను రోడ్డుమార్గం గుండానే పోలీసులు ప్రశాంతంగా తిరుమలకు తీసుకొచ్చారు.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె తిరుపతి పర్యటన పోలీసులకు, టిటిడి అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. మరోవైపు రాజపక్సెకు ఎట్టిపరిస్థితుల్లోనూ నల్లజెండాలతో నిరసన వ్యక్తం చేస్తామని తమిళులు శపథం చేస్తున్నారు. కాగా శనివారం ఉదయం సుప్రభాత సేవలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న రాజపక్సెకు మరింత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. కాగా రాజపక్సె పర్యటనకు సంబంధించిన అంశాలపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. భారతదేశ అతిథిగా వచ్చిన పొరుగు దేశమైన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సెకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా చూడాలని రాష్ట్ర పోలీసులకు కేంద్ర హోంశాఖ నుంచి ప్రత్యేక ఆదేశాలు అందినట్టు సమాచారం. ఏదేమైనా రాజపక్సె పర్యటన నిరసనల మధ్య స్వామివారిని దర్శించుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
...............................
శ్రీలంక
అధ్యక్షుడు రాజపక్సె రాకను నిరసిస్తూ తిరుపతి వీధుల్లో తమిళుల నిరసన ప్రదర్శన
శ్రీవారిని దర్శించుకునే అర్హత లేదంటూ ఆందోళన వేలాదిగా నల్లజెండాలతో నిరసనలు తిరుపతి, తిరుమలలో ఉద్రిక్తత దిష్టిబొమ్మ దగ్ధం, తమిళుల అరెస్టు
english title:
ra
Date:
Saturday, February 9, 2013