Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

కాంగ్రెస్‌లో కలహాలు

$
0
0

హైదరాబాద్, ఫిబ్రవరి 8: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) చైర్మన్ పదవులన్నిటిని చేజిక్కించుకునేలా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పావులు కదుపుతుంటే, కొన్ని జిల్లాల్లో పార్టీ గ్రూపుల మధ్య తగాదాలు తలనొప్పిగా మారుతున్నాయి. కాంగ్రెస్‌లోని వర్గాల మధ్య నెలకొన్న విభేదాలతో తమకు దక్కాల్సిన చైర్మన్ పదవుల్ని ప్రత్యర్థులు తన్నుకు పోతారేమోనన్న ఆందోళనతో నాయకత్వం కనిపిస్తుంది.
ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికల వరకు కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలు, గ్రూపులు వౌనంగానే ఉన్నాయి. ఇప్పుడు కీలకమైన డిసిసిబి చైర్మన్ పదవులకు అభ్యర్థుల ఎంపిక వ్యవహారం వచ్చేప్పటికీ ఒక్కో జిల్లాలోని గ్రూపులు తెరపైకి వస్తున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు సాధించిన కడప, తెలుగుదేశం అత్యధిక స్థానాలు గెలుచుకున్న ఖమ్మం డిసిసిబి చైర్మన్ పదవుల్ని సైతం హస్తగతం చేసుకోవాలన్న ఆలోచనతో కాంగ్రెస్ నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది. ప్రతిపక్ష పార్టీలకు ఒక్క డిసిసిబి చైర్మన్ పదవి కూడా దక్కకుండా చూడాలన్న అభిప్రాయంతో నాయకత్వం ఉంది. ఇందుకు స్వతంత్రులను తమవైపు తిప్పుకోవడంతోపాటు, కో-ఆప్షన్ సభ్యుల మద్దతుతో తక్కువపడిన స్థానాలను భర్తీ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఇటీవల స్థానిక సంస్థల నుంచి శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికలో అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఉన్నప్పటికీ పార్టీలోని గ్రూపు తగాదాల వల్ల పరాజయం పాలైంది. అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి జెసి దివాకర్‌రెడ్డి ఒకవర్గంగా ఉంటే, జిల్లాకు చెందిన మంత్రి ఎన్ రఘువీరారెడ్డి, శైలజానాథ్ తదితరులు మరోవర్గంగా ఉంటున్నారు. స్థానిక సంస్థల నుంచి శాసనమండలి స్థానానికి జరిగిన ఎన్నికలో తనకు ప్రాధాన్యం ఇవ్వలేదన్న కారణంతో తన వర్గానికి చెందిన వారితో సొంత పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా జేసి ఓటు వేయించారు. దీంతో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందనుకోగా ఓటమి చెందాల్సి వచ్చింది.
ఇక తాజాగా డిసిసిబి చైర్మన్ ఎన్నికలోనూ ఇదే కథ పునరావృతం అవుతుందా? అన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. డిసిసిబి చైర్మన్ పదవిని తన సోదరుడు జెసి ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వాలని మాజీ మంత్రి దివాకర్‌రెడ్డి పట్టుపడుతున్నారు. ఇదే విషయంపై శుక్రవారం దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి నేత బొత్స సత్యనారాయణను కలుసుకున్నారు. అనంతపురం డిసిసిబి చైర్మన్ పదవిని తన సోదరునికి ఇవ్వాలని వారిని ఆయన కోరారు. ఈ విషయాన్ని దివాకర్‌రెడ్డి స్వయంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అయితే మంత్రి రఘువీరారెడ్డి బృందం మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. జిల్లానేతల అందరి ఏకాభిప్రాయం మేరకే అభ్యర్థి ఎంపిక జరగాలని వారు వాదిస్తున్నారు. డిసిసిబి చైర్మన్ పదవి తన సోదరునికి కాంగ్రెస్ నాయకత్వం ఇవ్వని పక్షంలో తమకు మద్దతు ఇచ్చే పార్టీలు జిల్లాలో చాలా ఉన్నాయని దివాకర్‌రెడ్డి వర్గం అంటోంది.
అనంతపురం జిల్లాలో 116 ప్రాథమిక సహకార సంఘాలకుగాను 114 సంఘాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో కాంగ్రెస్‌కు 50, తెలుగుదేశం పార్టీకి 26, వైఎస్సార్ కాంగ్రెస్‌కు 38 సంఘాలు దక్కాయి. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు కలిసే అవకాశం లేదు కాబట్టి అనంతపురం డిసిసిబి చైర్మన్ పదవి కచ్చితంగా కాంగ్రెస్‌కే లభిస్తుంది. ఒకవేళ డిసిసిబి చైర్మన్ పదవి జెసి ప్రభాకర్‌రెడ్డికి ఇవ్వని పక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకునేందుకు జెసి వర్గం ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కాంగ్రెస్‌కు చెందిన 50మంది ప్రాథమిక సహకార సంఘాల్లో జెసి వర్గానికి చెందిన వారు 15మంది ఉన్నట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితిలో వైఎస్సార్ కాంగ్రెస్, జెసి వర్గం చేతులు కలిపితే కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ తప్పదు.
విశాఖపట్నం జిల్లా డిసిసిబి చైర్మన్ పదవిని యలమంచిలి కాంగ్రెస్ ఎమ్మెల్యే కన్నబాబు కుమారుడు సుకుమార వర్మ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆశిస్తున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉండగా ఒక్కొక్కరు ఒక్కో వర్గానికి మద్దతిస్తున్నట్టు తెలిసింది. కరణం ధర్మశ్రీకి మంత్రి పి బాలరాజు మద్దతిస్తుంటే, సుకుమార వర్మకు మంత్రి గంటా శ్రీనివాసరావు మద్దతిస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విశాఖ జిల్లాలో 83 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా, కాంగ్రెస్‌కు 50, టిడిపికి 17, వైఎస్సార్సీపికి 14 దక్కాయి. కాంగ్రెస్‌లో డిసిసిబి చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో విభేదాలు తలెత్తితే కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు వాటిని తమకు అనుకూలంగా మలచుకోవాలని టిడిపి, వైఎస్సార్సీపిలు భావిస్తున్నాయి. అయితే మంత్రి గంటా శ్రీనివాసరావు రెండువర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేపట్టారు. కోస్తా జిల్లాలో కులాల మధ్య కొట్లాట మామూలే. పశ్చిమ గోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్ పదవికి కాపు వర్గాలకు ఇవ్వాలని జిల్లాకు చెందిన మంత్రి వట్టి వసంతకుమార్ ఇప్పటికే ముఖ్యమంత్రిని కోరారు.
కాగా, కడప జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు లభించినప్పటికీ డిసిసిబి చైర్మన్ పదవి మాత్రం ఆ పార్టీకి దక్కకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో 54 ప్రాథమిక సహకార సంఘాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్‌కు 22, వైఏస్సార్సీపికి 28, టిడిపికి 4 దక్కాయి. కాంగ్రెస్‌కు దక్కిన స్థానాల్లో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఆదినారాయణరెడ్డి జగన్‌కు గట్టి మద్దతుదారుడు అయినప్పటికీ కొన్ని కారణాలవల్ల కాంగ్రెస్ శిబిరంలోనే ఉన్నారు. ఆదినారాయణరెడ్డికి చెందిన ఆరుగురు కూడా తమకే మద్దతిస్తారని వైఎస్సార్సీపి నేతలు చెబుతున్నారు. అయితే టిడిపికి చెందిన నలుగురిని తమవైపు తిప్పుకున్నట్టయితే తమ బలం 26కి పెరుగుతుందని, తమకు వైఎస్సార్సీపికి మధ్య బలంలో తేడా కేవలం రెండు మాత్రమే అవుతుందని, కో-ఆప్షన్ సభ్యుల మద్దతుతో పాటు వైఎస్సార్సీపికి చెందిన కొంతమందిని తమవైపు తిప్పుకున్నట్లయితే డిసిసిబి చైర్మన్ పదవి తమకే దక్కుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
ఇక నల్లగొండ జిల్లాలో పంచాయతీరాజ్ మంత్రి కె జానారెడ్డి వర్గానికి చెందినవారే ముగ్గురు డిసిసిబి చైర్మన్ పదవికోసం పోటీ పడుతున్నారు. జానారెడ్డి నిర్ణయం మేరకే ఇక్కడ అభ్యర్థి ఎంపిక జరుగుతుంది.

జిల్లాల్లో తెరపైకి వస్తున్న గ్రూపు విభేదాలు డిసిసిబి చైర్మన్ అభ్యర్థుల ఎంపిక వ్యవహారం నాయకత్వానికి వైరివర్గాల తలనొప్పి ఒకపక్క విపక్షాలను దెబ్బతీసే వ్యూహం మరోపక్క ఉన్నవాటినే పోగొట్టుకునే ప్రమాదం అంతం లేని ‘అనంత కథ’ జెసి, వ్యతిరేక వర్గం మధ్య ఆధిపత్య పో
english title: 
c

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>