హైదరాబాద్, ఫిబ్రవరి 8: తెలంగాణలో ముగించుకుని సీమాంధ్రలో పాదయాత్ర చేస్తున్న టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు జిల్లాల వారి సమీక్షా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లాలో యాత్ర ముగించుకుని గుంటూరులో అడుగు పెట్టిన బాబు తెలంగాణలోని అన్ని జిల్లాల నాయకులతో సీమాంధ్రలో సమీక్ష నిర్వహించనున్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నిరంతరం సమీక్షలు నిర్వహించే అలవాటున్న చంద్రబాబు పాదయాత్ర వల్ల కొన్ని నెలల నుంచి సమీక్షలకు దూరంగానే ఉన్నారు.
రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశం, పొలిట్ బ్యూరో సమావేశం మినహా నాలుగు నెలల కాలంలో పాదయాత్రలో పెద్దగా సమీక్షలకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు తొలిసారిగా పాదయాత్రలోనే నిత్య సమీక్షలు జరపనున్నారు. ఈనెల 11వ తేదీ నుంచి ప్రతి రోజు సమీక్షలు నిర్వహిస్తారు. జిల్లాల వారిగా ఈ సమీక్షలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు తన పాదయాత్రలో ఎక్కడుంటే అక్కడికే నిర్ణీత తేదీలో ఆహ్వానించిన జిల్లాల నాయకులు హాజరు కావలసి ఉంటుంది. ఈనెల 11న నిజామాబాద్, 12న కరీంనగర్, 13న మెదక్, 14న రంగారెడ్డి, 15న మహబూబ్‌నగర్, 16న నల్లగొండ జిల్లాల నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తేదీల్లో పాదయాత్రలో బాబు ఎక్కడుంటే అక్కడే సమీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు సమీక్ష జరుగుతుంది. జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్‌చార్జ్‌లు, పార్లమెంటు నియోజక వర్గ సమన్వయ కర్తలు, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇతర ముఖ్యనాయకులు ఈ సమీక్షలో పాల్గొంటారు.
జిల్లాలో పార్టీ పరిస్థితి, నియోజక వర్గాల వారిగా సమీక్షిస్తారు. ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనే ఆలోనచలో ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై కూడా ఈ సమావేశాల్లో చంద్రబాబు అభిప్రాయాలను సేకరిస్తారు. తొలి విడత తెలంగాణ జిల్లాల సమీక్ష నిర్వహిస్తారు. ఈనెల 11 నుంచి 16 వరకు సమీక్షా సమావేశాలు జరుగుతాయని టిడిపి కార్యాలయ కార్యదర్శి టిడి జనార్దన్ తెలిపారు.
..
విద్యుత్ చార్జీలు పెంచితే సహించం
ప్రభుత్వానికి టిడిపి హెచ్చరిక
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 8: విద్యుత్ చార్జీలు 2004లో ఏ విధంగా ఉన్నాయో అలానే ఉండాలని, చార్జీలను పెంచితే సహించేది లేదని ప్రభుత్వాన్ని టిడిపి హెచ్చరించింది. టిడిపి ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, మహేందర్‌రెడ్డిలు శుక్రవారం టిడిఎల్‌పి కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు మూడు రేట్లు చార్జీలు పెంచిందని అన్నారు. గతంలో 70 రూపాయల బిల్లుచెల్లించిన వారు ఇప్పుడు 250 రూపాయల వరకు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. మూడు, నాలుగు సంవత్సరాల క్రితం నాటి ప్యూయల్ సర్‌చార్జ్ పేరుతో వినియోగ దారులను నిలుపు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. నాలుగు డిస్కమ్‌లు విద్యుత్ చార్జీలు పెంచాలని కోరుతూ ప్రతిపాదనలు పంపిందని, ప్రభుత్వ అనుమతితోనే ఈ ప్రతిపాదనలు రూపొందించారని ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే 50 శాతం పరిశ్రమలు విద్యుత్ కోత వల్ల మూత పడ్డాయని, వేసవిలో మిగిలిన పరిశ్రమలు మూత పడే ప్రమాదం ఉందని అన్నారు. వినియోగ దారులకు కలిగిన నష్టానికి డిస్కమ్‌ల నుంచి పరిహారం పొందే సౌకర్యం చట్టంలో ఉందని తెలిపారు. అయితే దీని ప్రకారం ఇప్పటి వరకు ఎంత మందికి పరిహారం చెల్లించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతోందని విమర్శించారు. 2004లో విద్యుత్ చార్జీలు ఏ విధంగా ఉన్నాయో అదే రేట్లు ఖరారు చేయాలని డిమాండ్ చేశారు.
11 నుంచి ప్రారంభం
english title:
t
Date:
Saturday, February 9, 2013