హైదరాబాద్, ఫిబ్రవరి 8: రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని అవకతవకలకు పాల్పడినా విమర్శిస్తాం కానీ అవిశ్వాసం పెట్టం అన్నట్లు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పి శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వంపై టిడిపి అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెట్టాలని ఆయన శుక్రవారం విలేఖరుల సమావేశంలో డిమాండ్ చేశారు. అవిశ్వాసం పెట్టం అని టిడిపి చెబితే తామే అవిశ్వాసం పెడతామన్నారు. నాడు ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చిన చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వాన్ని కాపాడేందుకు బాబు పాదయాత్ర చేపట్టినట్లు ఉందన్నారు. వస్తున్నా..మీ కోసం అనేది ప్రజల కోసం కాదని, కాంగ్రెస్ పార్టీలోకి అన్నట్లు ఉందని దుయ్యబట్టారు. చేనేత కార్మికుల కష్టాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న చంద్రబాబు లోగడ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా తన ప్రసంగాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం సమంజసం కాదని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
......................
ఇచ్చిన హామీల్లో ఏది అమలు
చేయలేదో చెప్పగలరా?
షర్మిలను ప్రశ్నించిన గండ్ర
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 8: కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏది అమలు చేయలేదో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చెప్పాలని అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి డిమాండ్ చేశారు. ఇది చీకటి ప్రభుత్వం అని షర్మిల చేసిన ఆరోపణను గండ్ర శుక్రవారం విలేఖరుల సమావేశంలో ఖండించారు. 2004, 2009 ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో ఏది నేరవేర్చలేదో నిరూపించేందుకు బహిరంగ చర్చకు సిద్ధం కావాలని ఆయన షర్మిలను డిమాండ్ చేశారు. మీ అన్న జగన్ జైలుకు ఎందుకు వెళ్ళారో ప్రజలకు వివరణ ఇచ్చుకోవాలని ఆయన అన్నారు. వస్తున్నా మీ కోసం పేరిట పాదయాత్ర చేపట్టిన చంద్రబాబుకు ముఖ్యమంత్రిని విమర్శించే అర్హత లేదన్నారు. ధర్మాన ప్రసాదరావును ముఖ్యమంత్రి తన పక్కనే కూర్చొబెట్టుకోవడం గురించి వస్తున్న విమర్శల గురించి ప్రశ్నించగా, అవి ఆరోపణలేనని, రుజువు కాలేదు కదా? అని ఆయన ఎదురు ప్రశ్నించారు.
చంద్రబాబుకు, కిరణ్‌కుమార్ రెడ్డికి మధ్య నక్కకు-నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకాన్ని కొనసాగిస్తామని చెప్పిన చంద్రబాబు ఆ తర్వాత 5.25 రూపాయలకు పెంచారని ఆయన విమర్శించారు. కాగా తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనకపోయినా రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని ఒక్క రూపాయికి ఇస్తున్న ఘనత కిరణ్‌కుమార్ రెడ్డికి దక్కిందని ఆయన తెలిపారు. విలేఖరుల సమావేశంలో అసెంబ్లీలో ప్రభుత్వ విప్ అనిల్‌కుమార్, ఎమ్మెల్యే బిక్షమయ్యగౌడ్ కూడా పాల్గొన్నారు.
బాబును ప్రశ్నించిన వైఎస్సార్సీపి
english title:
a
Date:
Saturday, February 9, 2013