దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ అంపశయ్యపై రోజులు లెక్కిస్తున్న నేపథ్యంలో సిరియా భవిష్యత్తు గందరగోళంగా మారింది. ప్రతిపక్ష నేతలంతా ఒకే చోట చేరి, అసద్ మరణ వార్త కోసం ఎదురుచూస్తున్నారన్నది తిరుగులేని సత్యం. అధ్యక్షుడు మంచం పట్టాడు. ప్రభుత్వం ఉన్నా ఏమీ చేయలేని దుస్థితి. పేరుకు 71 మంది సభ్యులతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్నా, అధికారం యావత్తు సైన్యం చేతిలోనే ఉంది. పాలన కుంటుపడింది. నిరుద్యోగం, ఆర్థిక మాంద్య పరిస్థితులు సిరియాను పట్టిపీడిస్తున్నాయి. ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిరసనలు, ధర్నాలు, దాడులతో సిరియా యుద్ధ భూమిని తలపిస్తోంది. ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు నిత్యకృత్యమయ్యాయి. లిబియా సర్వాధికారి వౌమర్ గడాఫీ పతనం తర్వాత అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి అమెరికా, దాని మిత్ర దేశాలు నడుం బిగించాయి. లిబియా జనాభా ఆరు కోట్లు. లిబియా విస్తీర్ణంలో సిరియా పదో వంతు కూడా ఉండదు. కానీ, జనాభా మాత్రం లిబియాకు కనీసం నాలుగు రెట్లు అధికం. చిన్న భూభాగంలో, మితిమీరిన జనాభా ఉండడం వల్ల తలెత్తే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎంత అభివృద్ధి చేసినా, వాటి ఫలాలు కనిపించే అవకాశాలు లేవు. అభివృద్ధి ఒక అడుగు ముందుకేస్తే, సమస్యలు నాలుగు రెట్లు ముందుకు వెళతాయి. ఆకలి, నిరుద్యోగం ప్రజాజీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో, అస్తిత్వం కోసం ఉద్యమ బాట పట్టక తప్పదు. దుర్భర జీవితాన్ని సాగించే బదులు, వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేయడం వల్ల సమస్యలకు ఎంతోకొంత పరిష్కారమైనా లభిస్తుందన్న నిర్ణయానికి సిరియా ప్రజలు ఎప్పుడో వచ్చేశారు. అసద్ అనారోగ్యం వారి సమస్యలను మరింతగా పెంచింది. పాలన సజావుగా సాగకపోవడంతో, ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అసద్ మరణిస్తే, తక్షణమే అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష నాయకులు ఎదురుచూస్తున్నారు. ఈ పరిణామాలు సహజంగానే సిరియాలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నాయి. అసద్ మళ్లీ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వచ్చి పగ్గాలు చేపట్టే అవకాశాలు దాదాపు లేవు. ఈ నేపథ్యంలో సిరియా మళ్లీ గాడిలో పడడానికి దశాబ్దాలు పట్టినా ఆశ్చర్యం లేదు.
దేశాధ్యక్షుడు బషర్ అల్ అసద్ అంపశయ్యపై రోజులు లెక్కిస్తున్న
english title:
syria
Date:
Monday, February 11, 2013