సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత అగ్రరాజ్యం హోదాను కోల్పోయిన రష్యాకు పూర్వ వైభవాన్ని సంపాదించి పెడతానంటూ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ చేసిన హామీలు నీరుగారిపోతున్నాయి. అంతర్గత కుమ్ములాటలు పెచ్చరిల్లాయి. అనేకానేక సమస్యలు రష్యాను చుట్టుముట్టి వేధిస్తున్నాయి. ఒకప్పుడు ప్రపంచ దేశాలకు మార్గదర్శకం చేసిన రష్యా ఇప్పుడు కల్లోల కడలిగా మారింది. పుతిన్‌పై ప్రజలు ఉంచిన నమ్మకం క్రమంగా తెరమరుగవుతున్నది. రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేస్తానని ప్రకటించి, ఒకసారి ప్రధానికి, మరోసారి అధ్యక్షుడికి సర్వ హక్కులను కట్టబెట్టి, ఆ హోదాల్లో తానే తిష్టవేసిన పుతిన్‌ను కొంతమంది అగ్ర నేతల ఎదుగుదల భయపెడుతున్నది. ముఖ్యంగా ప్రధాని డిమిత్రీ మెద్వెదెవ్, ఉప ప్రధాని డిమిత్రీ రొగజిన్‌లకు ప్రజల్లో పెరుగుతున్న మద్దతు పుతిన్‌ను ఆందోళనకు గురి చేస్తున్నది. కొడిగడుతున్న ప్రాభవానికి కొత్త ఊపిరి పోయడానికి, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి, రష్యాకు తిరుగులేని నేతగా కొనసాగడానికి అవసరమైన అన్ని మార్గాలను పుతిన్ అనే్వషిస్తునే ఉన్నాడు. రాజకీయంగా అతను నిలదొక్కుకుంటాడా? లేక గొర్బచెవ్, బోరిస్ ఎల్సిన్ వంటి అగ్ర నాయకుల మాదిరిగానే క్రమంగా కనుమరుగై నిష్క్రమిస్తాడా అన్నది రానున్న కాలమే తేల్చాలి. అయితే, పుతిన్ మంత్రాంగమో లేక వైరి వర్గం వ్యూహమో తెలీదుగానీ, ప్రధాని మెద్వెదెవ్ అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ సుమారు గంట నిడివిగల ఒక వీడియో టేప్ యూట్యూబ్‌లో దర్శనమిచ్చింది. ఈ యూట్యూబ్ ఖాతా ఉప ప్రధాని రొగజిన్ పేరుమీద ఉండడం రష్యా యావత్తు చర్చనీయాంశమైంది. మెద్వెదెవ్, రొగజిన్‌లను ఒకే దెబ్బతో ఇరుకున పెట్టడానికి పుతిన్ చేసిన ప్రయత్నంగానే చాలా మంది ఈ టేపును అభివర్ణిస్తున్నారు. తనకు యూట్యూబ్ అక్కౌంట్ లేనేలేదని, ఎవరో ఉద్దేశపూర్వకంగా తనను అప్రతిష్టపాల్జేయడానికి ప్రయత్నిస్తున్నారని రొగజిన్ స్పష్టం చేయడం పుతిన్‌పై అనుమానాలు పెరగడానికి కారణమవుతోంది. మెద్వెదెవ్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో నాటో కూటమితో కుమ్మక్కయ్యాడని, అప్పటి లిబియా తిరుగులేని నేత వౌమర్ గడాఫీపై దాడులకు సహకరించాడని తేల్చి చెప్పడమే ఆ వీడియో టేపు లక్ష్యం. రష్యా మిలటరీ అధికారులకు మెద్వెదెవ్ ఆదేశాలు జారీ చేయడం నుంచి, వారితో చర్చలు జరపడం, నాటో దళాలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించడం వరకూ అనేకానేక అంశాలను అందులో ఉన్నాయి. మెద్వెదెవ్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది వేసవిలోనూ ఇలాంటి టేపు ఒకటి విడుదలైంది.
2008లో జార్జియాపై రష్యా యుద్ధానికి దిగిన సమయంలో మెద్వెదెవ్ చేపట్టిన చర్యలను ఆ టేపులో వివరించారు. ఒక పథకం ప్రకారమే మెద్వెదెవ్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతున్నదని, తాజా టేపు ఉద్దేశం కూడా ఇదేనని విశే్లషకులు అంటున్నారు. మెద్వెదెవ్, రొగొజిన్‌లను ఒకేసారి దెబ్బతీయడానికి తాజా వీడియోను అస్త్రంగా ఉపయోగించారన్న వాదన బలంగా వినిపిస్తున్నది. వీరిపై కుట్ర పూరిత ఆరోపణలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? వారికి ప్రజల్లో ఉన్న మద్దతును దెబ్బతీస్తే ఎవరికి ప్రయోజనం? అనే ప్రశ్నలకు సమాధానాన్ని వెతుక్కుంటే వినిపిస్తున్న ఒకే ఒక పేరు పుతిన్. వ్యూహాత్మకంగా ఇద్దరు మేటి నేతలను అప్రతిష్టపాల్జేసి లాభపడాలని పుతిన్ ప్రయత్నిస్తున్నాడన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాలనపై పట్టుకోల్పోతున్న పుతిన్ తన ప్రతిష్టను పెంచుకోవడానికి చేసిన ప్రయత్నమే టేపు రూపంలో దర్శనమిచ్చిందని చాలా మంది నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలు, విమర్శల్లో నిజానిజాలు ఎలావున్నా, మెద్వెదెవ్, రొగొజిన్‌లకు ఉన్న మంచి పేరును తుడిచిపెడితేనే ప్రజలకు దగ్గరవుతానని పుతిన్ ఆలోచిస్తున్నాడన్న వాదన క్రమంగా బలపడుతున్నది. ఈ వ్యవహారం ఆ ఇద్దరితోపాటు పుతిన్ ప్రతిష్టను కూడా దిగజార్చే ప్రమాదం లేకపోలేదు. పుతిన్ తాను తీసుకున్న గోతిలో తానే పడతాడా లేక తన కంటే మెరుగైన నాయకుడు రష్యాలో లేడన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగిస్తాడా అన్న ప్రశ్నకు ప్రజా నిర్ణయాలే సమాధానం చెప్తాయి. అప్పటి వరకూ టేపు వ్యవహారం చిదంబర రహస్యంగానే మిలిగిపోతుంది.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన తర్వాత అగ్రరాజ్యం హోదాను
english title:
putin
Date:
Monday, February 11, 2013