ఉగ్రవాద పోరులో వంతపాడిన 54 దేశాలు * కిడ్నాప్‌లు, వేధింపులు, చిత్రహింసలకు సహకారం * మంటగలిసిన మానవహక్కులు
==============
కనీవినీ ఎరుగని రీతిలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకార చర్యగా అమెరికా ఉగ్రవాద పోరుకు దిగడం... అల్‌ఖైదా మూలాలను పెకలించేందుకు పలు దేశాల్లో దళాలతో పాగా వేయడం... పదేళ్ల అనంతరం పాకిస్తాన్‌లో లాడెన్‌ను అత్యంత రహస్యంగా జరిగిన ఆపరేషన్‌లో అంతమొందించడం ప్రపంచానికి తెలిసిన నిజం. అయితే ఉగ్రవాద పోరులో సమాజానికి తెలియని ఎన్నో రహస్యాలను ఇటీవల న్యూయార్క్‌కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ ఆధారాలతో సహా బయటపెట్టింది. అల్‌ఖైదా మూలాలను వెతికి పట్టుకునే పనిలో అమెరికా నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికా (సిఐఎ) ప్రపంచాన్ని జల్లెడ పట్టింది. ఈ క్రమంలో సిఐఎకు అనేక దేశాలు సలాం చేశాయి. తమ భూభాగాన్నీ, గగనతలాన్నీ స్వేచ్ఛగా వాడుకోనిచ్చాయి. తమ పౌరులను నిర్బంధించేందుకు, విచారణ పేరుతో చిత్రహింసలకు గురిచేసేందుకు అనుమతినిచ్చాయి. మానవ హక్కులకు ఏమాత్రం విలువ లేనట్టుగా సిఐఎ, ఆయా దేశాల ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రపంచంలోని నాలుగోవంతు దేశాలు సిఐఎకు గులాములయ్యాయని ఓపెన్ సొసైటీ జస్టిస్ ఇనిషియేటివ్ (ఓఎస్‌జెఐ) బయటపెట్టింది. ‘గ్లోబలైజింగ్ టార్చర్’ పేరుతో విడుదల చేసిన 213 పేజీల నివేదిక సిఐఎ చర్యల్లోని చీకటి కోణాన్ని ప్రపంచానికి చాటి సంచలనానికి తెరలేపింది.
అల్‌ఖైదా ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా సిఐఎ యావత్ ప్రపంచాన్ని జల్లెడ పట్టింది. అనుమానం వచ్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేదు. విస్తృత స్థాయిలో, అనూహ్య రీతిలో ఆయా దేశాల్లోకి చొరబడింది. ఏ దేశమైనా, ఏ జాతీయుడైనా సరే - నిర్బంధంలోకి తీసుకోవడమో, అవసరమనిపిస్తే కిడ్నాప్ చేయడమో చేసింది. వారినుంచి నిజాల్ని రాబట్టేందుకు చిత్రహింసలకు గురిచేసింది. ఈ క్రమంలో అత్యంత కీలకమైన, ఆసక్తికరమైన విషయమేమిటంటే - సిఐఎకు ఆయా దేశాలు రహస్యంగా మద్దతు పలకడం. ప్రపంచవ్యాప్తంగా నాలుగోవంతు దేశాలు సిఐఎ చర్యలకు అత్యంత రహస్యంగా సహకరించాయి. వాస్తవాలు తెలుసుకునే క్రమంలో, ఉగ్రవాద మూలాలు పెకలించే ఊపులో ఉన్న సిఐఎ - కొంతమంది అమాయకులనూ నిర్బంధించింది. చిత్రహింసలకూ గురిచేసింది. ఆయా దేశాల్లో, ఆయా పాలకుల మద్దతుతో మానవ హక్కులు యధేచ్ఛగా ఉల్లంఘనకు గురయ్యాయి. అయినా ఆయా దేశాలు కిమ్మనకపోవడం తాజాగా వెలుగుచూసిన నిజం.
ఓపెన్ సొసైటీ జస్టిస్ ఇనిషియేటివ్ (ఓఎస్‌జెఐ). న్యూయార్క్‌కు చెందిన మానవ హక్కుల సంస్థ. అమెరికాపై ఉగ్రవాద దాడి అనంతరం సిఐఎ చేపట్టిన రహస్య కార్యకలాపాలు, ఏయే దేశాలు రహస్యంగా మద్దతు పలికిందీ, ఈ మొత్తం వ్యవహారంలో మానవ హక్కులు ఎలా మంటగలిసిపోయాయో బట్టబయలు చేసింది. సిఐఎ డైరెక్టర్‌గా జాన్ బ్రెన్నన్‌ను నియమించేందుకు అధ్యక్షుడు ఒబామా మొగ్గుచూపుతున్న సమయంలో ఈ నివేదిక వెలుగుచూడటం విశేషం.
సిఐఎ చర్యలవల్ల చోటుచేసుకున్న మానవ హక్కుల ఉల్లంఘనకు అప్పటి అధ్యక్షుడు జార్జి డబ్ల్యు బుష్ యంత్రాంగంలోని ఉన్నతాధికారులు కూడా బాధ్యులేనని ఓఎస్‌జెఐ నిర్భయంగా బయటపెట్టింది. అంతేకాదు, ఉగ్రవాద అంతం పేరుతో సామాన్యులను నిర్బంధించి చిత్రహింసలపాలు చేసినందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. ఆయా ప్రభుత్వాల పూర్తి సహకారం లేనిదే సిఐఎ అంత లోతుగా చొచ్చుకుపోలేదన్నది ఓఎస్‌జెఐ వాదన. సిఐఎ చర్యలవల్ల తమ తమ దేశాల్లో భారీ స్థాయిలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన నేరం నుంచి ఆయా ప్రభుత్వాలు తప్పించుకోలేవని స్పష్టం చేసింది.
సిఐఎకు అత్యంత రహస్యంగా సహకరించి, గులాములైన దేశాల్లో ముఖ్యంగా పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఈజిప్టు, జోర్డాన్ దేశాలున్నాయని ఓఎస్‌జెఐ బయటపెట్టింది. ఆయా దేశాల్లో ఉన్న రహస్య జైళ్లలో ఏళ్ల తరబడి ‘అనుమానిత’ వ్యక్తులను సిఐఎ నిర్బంధించి తీవ్రంగా చిత్రహింసలకు గురిచేసిందని నివేదికలో పేర్కొంది. ఓఎస్‌జెఐ బయటపెట్టిన జాబితాలో ఉన్న ఐర్లాండ్, ఐస్‌లాండ్, సైప్రస్ వంటి దేశాలు తమ గగనతలాన్ని, ఎయిర్‌పోర్టులను ఎప్పుడుపడితే అప్పుడు వినియోగించేందుకు అనుమతినిచ్చి సిఐఎకు పూర్తిస్థాయి మద్దతు పలికాయి. మరో దేశం కెనడా ‘కోవర్ట్’ మద్దతులో మరో అడుగు ముందుకేసింది. గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతినివ్వడంతోపాటు తమ జాతీయుడ్ని సిరియా తీసుకువెళ్లి విచారించేందుకు ఏమాత్రం అడ్డుచెప్పలేదు. అక్కడ అతడ్ని ఏడాదిపాటు నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేశారని ఓఎస్‌జెఐ బయటపెట్టింది. అనుమానితులను అత్యంత రహస్యంగా విచారించే దేశాల్లో సిరియా ఒకటని తేల్చింది. 15మంది స్వదేశీయులను కాబూల్ తీసుకువెళ్లి విచారించేందుకు అనుమతినిచ్చి ఇరాన్ కూడా సిఐఎ చర్యలకు వంతపాడింది. తాలిబన్ల అంతం పేరుతో అఫ్గాన్‌లో అమెరికా దళాలు అడుగుపెట్టిన అనంతరం జరిగిన ఈ చర్యతో తాము అమెరికా గుప్పిట్లో చిక్కుకుంటున్నామన్న విషయాన్ని ఇరాన్ గ్రహించిందని నివేదికలో పేర్కొన్నారు.
సిఐఎ చర్యలకు కొన్ని దేశాలు ఏమాత్రం వంతపాడలేదనే విషయం కూడా ఓఎస్‌జెఐ పరిశోధనలో వెల్లడైంది. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు సిఐఎ చర్యల్లో పాలుపంచుకుంటే, నార్వే పాత్రపై ఎలాంటి ఆధారాలు లభించలేదు. అలాగే మధ్యతూర్పు దేశాల్లో చాలామటుకు సిఐఎకు మద్దతు తెలిపితే, ఇజ్రాయెల్ పాత్ర లేకపోవడం విశేషం. ఓఎస్‌జెఐ బయటపెట్టిన దేశాల జాబితాలో చాలామటుకు యూరోపియన్ దేశాలే ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా జర్మనీ, స్పెయిన్, పోర్చుగల్, ఆస్ట్రియా వంటివి జాబితాలో చోటుచేసుకోగా, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, హంగేరీ దేశాలు సిఐఎ చర్యలకు వంతపాడిన దాఖలాలు కనిపించలేదు. సిఐఎకు జార్జియా తన వంతు మద్దతు పలికితే, రష్యా పాత్ర లేదని తేల్చింది. పోలాండ్, లిథువేనియా, రొమేనియా వంటి దేశాలు తమ భూభాగంలో ఏకంగా రహస్య జైళ్లనే ఏర్పాటుచేశాయి. బ్రిటన్ అయితే సిఐఎ అడుగులకు మడుగులొత్తింది. ఒక వ్యక్తి కుటుంబం మొత్తాన్ని విచారణ జరిపేందుకు పూర్తిగా సహకరించింది. కుటుంబ సభ్యులతో సహా సమీ అల్-సాదీ అనే వ్యక్తిని సిఐఎ లిబియా తీసుకెళ్లి అక్కడ చిత్రహింసలకు గురిచేసింది. ఉగ్రవాద పోరులో చోటుచేసుకున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి అటు అమెరికా, సిఐఎకు సహకరించిన దేశాలు రహస్యాలను తొక్కిపెట్టినా, ఏదో ఒక రూపంలో అవి బయటపడుతూనే ఉన్నాయని ఓఎస్‌జెఐ వెల్లడించింది. రహస్య నిర్బంధానికి గురైన బాధితుల గోడు వినేందుకు అమెరికా కోర్టుల ద్వారాలు మూసివేసినా, ప్రపంచవ్యాప్తంగా వీటికి సంబంధించిన కేసులను ఆయా దేశాల్లోని కోర్టులు విచారణ జరుపుతున్నాయని పేర్కొంది. అమెరికా ఆదేశాలతో సిఐఎ చేపట్టిన రహస్య చర్యలకు చరమగీతం పాడాలని, ఇప్పటికీ కొనసాగుతున్న రహస్య జైళ్లను మూసివేయాలని, తీవ్రస్థాయిలో చోటుచేసుకున్న మానవ హక్కుల ఉల్లంఘనపై క్రిమినల్ విచారణ చేపట్టాలని ఓఎస్‌జెఐ అమెరికాను డిమాండ్ చేసింది. వీటిపై విచారణకు స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రత్యేక కమిషన్‌ను నియమించాలని కూడా డిమాండ్ చేసింది. వేధింపులకు పాల్పడిన ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులను విచారించి బయటపెట్టాలని సూచించింది. అలాగే రహస్య విచారణకు అమెరికాయేతర ప్రభుత్వాలు చరమగీతం పాడాలని పేర్కొంది. అలాగే భవిష్యత్తులో జరగబోయే ఉగ్రవాద నిరోధక చర్యల్లో మానవ హక్కుల ఉల్లంఘనకు గురికాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందని ఓఎస్‌జెఐ పేర్కొంది.
ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ స్థాయలో ఉన్నా ఏ దేశానికైనా ప్రమాదమే. ఉగ్రవాద మూలాలను సమూలంగా పెకలించాల్సిన బాధ్యత ప్రతి దేశంపైనా ఉంది. అమెరికాపై దాడి అనంతరం ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు ప్రతి దేశమూ శపథం చేసిన విషయం విదితమే. అయితే ఉగ్రవాదుల ఏరివేత పేరుతో సామాన్య పౌరులను చిత్రహింసలకు గురిచేసి మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడటమే ‘ఉగ్రవాద పోరు’ మిగిల్చిన విషాదం. (చిత్రం) అమెరికా రహస్య విచారణకు నిదర్శనం - అనేక దేశాల్లో ఏర్పాటుచేసుకున్న వైమానిక స్థావరాలు
ఉగ్రవాద పోరులో వంతపాడిన 54 దేశాలు
english title:
cia
Date:
Monday, February 11, 2013