కర్నూలు, ఫిబ్రవరి 19: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డిసిసిబి) చైర్‌పర్సన్‌గా చెరుకులపాటి శ్రీదేవి, జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం (డిసిఎంఎస్) చైర్మన్‌గా పిపి.నాగిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో జిల్లాలో గత రెండు వారాలుగా నెలకొన్న సహకార సందడి ముగిసింది. మంగళవారం ఆయా కార్యాలయాల్లో కెడిసిసిబి, కెడిసిఎంఎస్ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి వాటికి అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఎన్నుకోగా వారు ప్రమాణ స్వీకారం చేయడంతో అధికారులు ఎన్నికల ప్రక్రియకు శుభం కార్డు వేశారు. సహకార సంఘాల ఎన్నికల్లో ప్రధానంగా కెడిసిసిబి చైర్మన్ ఎంపికలో అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. చివరకు వెల్దుర్తి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన చెరుకులపాటి శ్రీదేవి పేరును ఖరారు చేసిన అధికార పార్టీ ఆ తరువాత కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా వాటిని కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి చొరవతో పరిష్కారమయ్యాయి. దీంతో ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించినా వైకాపా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. జనరల్ స్థానాలకు వైకాపా తరపున ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో అధికారులు పోలింగ్ నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైకాపా మద్దతుతో పోటీ చేసిన ఏడుగురు అభ్యర్థులు ఓటమిపాలవడంతో కెడిసిసిబి కార్యవర్గంలో మొత్తం 17 మంది కాంగ్రెస్ మద్దతుదారులే ఎన్నికయ్యారు. దాంతో చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిన శ్రీదేవి ఎన్నిక లాంఛనమే అయింది. ఇక చైర్‌పర్సన్ ఎన్నికను అధికారులు మంగళవారం నిర్వహించారు. కార్యవర్గ సమావేశానికి ముందు ఖాళీగా ఉన్న 4 ఎస్సీ, ఎస్టీ స్థానాలకు డైరెక్టర్ల ఎంపికను పూర్తి చేశారు. అనంతరం కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడంతో దీనికి ఎన్నికైన 21 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. అజెండాలో తొలి అంశమైన అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేయాలని అధికారులు కోరడంతో ఆ స్థానానికి శ్రీదేవి ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యక్ష పదవికి సూర్యప్రకాశ్‌రెడ్డితో పాటు మల్లికార్జునరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయడంతో మళ్లీ అధికార పార్టీలో కొంత గందరగోళం ఏర్పడింది. దెంతో వెంటనే నాయకులు మల్లికార్జునరెడ్డితో చర్చించి ఆయన నామినేషన్‌ను ఉప సంహరింపజేశారు. నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉప సంహరణ సమయం ముగిసిన తరువాత అధ్యక్ష పదవికి శ్రీదేవి, ఉపాధ్యక్ష పదవికి సూర్యప్రకాష్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు.
మరో వైపు అధికారులు కెడిసిఎంఎస్ కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించారు. ఈ సమావేశానికి ఎన్నికైన ఆరుగురు సభ్యులు హాజరు కావడంతో అధికారులు ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. అధ్యక్ష స్థానానికి పిపి నాగిరెడ్డి, ఉపాధ్యక్ష స్థానానికి నాగతిరుపాలు మాత్రమే నామినేన్లు దాఖలు చేయడంతో వాటిని పరిశీలించిన అధికారులు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించి ఉప సంహరణకు కొంత సమయం ఇచ్చారు. ఎవరూ నామినేషన్లు ఉప సంహరించుకోకపోవడంతో అధ్యక్షుడిగా పిపి నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నాగతిరుపాలు ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు. అనంతరం వారితో ప్రమాణ స్వీకారం చేయించి సమావేశం వాయిదా వేశారు.
కెడిసిసిబి, కెడిసిఎంఎస్‌లను ఏకగ్రీవంగా దక్కించుకోవడంతో అధికార పార్టీ నేతలు మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఇదే రీతిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పని చేస్తే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంటామన్న ధీమాను వ్యక్తం చేశారు. జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు, ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. ఎన్నికల సమయంలో డోన్‌లో జరిగిన హత్య అందరినీ భయాందోళనకు గురి చేసినా ఆ తరువాత ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సహకార సందడి ముగియడంతో ఇక అధికారుల దృష్టి స్థానిక ఎన్నికలపై పడింది.
* కెడిసిసిబి చైర్‌పర్సన్‌గా శ్రీదేవి.. * కెడిసిఎంఎస్‌కు నాగిరెడ్డి
english title:
coop elections completed
Date:
Wednesday, February 20, 2013