తిరుపతి, ఫిబ్రవరి 19: సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం, నిలబెట్టుకోవడం, వ్యాప్తిచేయడంలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనేక ధార్మిక, ఆధ్యాత్మిక, విద్య, వైద్య సేవా కార్యక్రమాలు చేస్తుంది. అందులో భాగంగా భారతీయ సనాతన ధర్మం, మానవీయ విలువలు, నైతిక జీవన విధానం, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసం, యోగ తదితరాలను యువతరం నేర్చుకోవడం కొరకు గత సంవత్సరం మాదిరిగా, రాబోతున్న వేసవి కాంలో ‘శుభప్రదం’ శిక్షణ శిబిరం మే 12 నుండి ప్రారంభమై 18వ తేదీ వరకు వారం రోజుల పాటు జరుగుతుంది. పదవ తరగతి పరీక్ష రాసిన వారు, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థినీ, విద్యార్థులు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణ శిబిరాలు జరుగుతాయి. బాలికలకు విశాఖపట్నం, హైదరాబాదు, తిరుపతిలో ప్రత్యేక శిక్షణ శిబిరాలను టిటిడి ఏర్పాటు చేస్తోంది. శిబిరంలో రోజూ ఉదయం 5గంటల నుండి రాత్రి 7 గంటల వరకు వివిధ కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడే అంశాలను నేర్పడానికి ఐ- ఫోకస్, ఇన్‌సాయి, రామకృష్ణ మిషన్ వంటి అనేక సంస్థలు ఈ శిక్షణ శిబిరంలో పాల్గొంటున్నాయి. ఈ శిక్షణ శిబిరంలో పాల్గొనే విద్యార్థినీ, విద్యార్థులందరికీ భోజన, వసతి సదుపాయాలు, రానుపోను ప్రయాణ ఖర్చులు ఇవ్వబడుతాయి. ప్రశంసా పత్రం కూడా ఇస్తారు. ఈ వేసవి శిక్షణ కార్యక్రమానికి కావలసి దరఖాస్తులు అన్ని జిల్లా కేంద్రాల్లోని టిటిడి కల్యాణ మండపాల్లో మార్చి 1వ తేదీ నుండి లభ్యమవుతాయి. ఈ దరఖాస్తును పొందిన వారు పాస్‌పోర్టు సైజు ఫొటోతాపాటు, పరీక్ష రాసిన హాలుటికెట్ జిరాక్స్ కాపీలతో దరఖాస్తులను మార్చి 31లోపు టిటిడి కల్యాణమండపాల్లో అందజేయాలి. భారతీయ సనాతన ధర్మాన్ని, మానవతా విలువలను, నైతిక జీవన విధానాలు తరుణ వయస్కులకు ఉపయోగపడే అనేక విలువైన విషయాలు అందించబోయే ఈ శిక్షణ శిబిరాల్లో విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొనేలా వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చొరవ తీసుకోని ప్రోత్సహించాలని టిటిడి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
‘మలబార్’లో మాయలేడీలు
* రూ. లక్ష తస్కరణ * పట్టుకుని పోలీసులకు అప్పగింత
తిరుపతి, ఫిబ్రవరి 19: బంగారు నగలు కొనుగోలు చేసినట్లు నటించి వాటిని మాయం చేసుకుని వెళ్లే ముఠాసభ్యులను తిరుపతిలోని మలబార్ గోల్డ్ యాజమాన్యం మంగళవారం పోలీసులకు పట్టించింది. వివరాలిలా వున్నాయి. తిరుపతి టౌన్‌క్లబ్ సర్కిల్లో వున్న మలబార్ గోల్డ్ షోరూమ్‌లో కృష్ణాజిల్లాకు చెందిన రమణమ్మ, ప్రభావతి, రమ్యలు గత మూడు రోజుల క్రితం బంగారు నగలు కొనుగోలు చేసేందుకు వచ్చారు. 10 వేల రూపాయలు విలువ చేసే చెవి కమ్మలు కొనుగోలు చేసి లక్ష రూపాయలు విలువ చేసే బంగారు నగలను తస్కరించారు. మరో మారు మంగళవారం షోరూమ్‌కు వచ్చిన వీరి ముగ్గుర్ని అనుమానం వచ్చిన సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరు ముగ్గురు కృష్ణా జిల్లాకు చెందిన వారని, వీరు నగరంలో వ్యభిచారం నిర్వహిస్తూ ఇలాంటి చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ముగ్గురు మహిళా ముఠా సభ్యులను వెస్టు పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.