బైరెడ్డిపల్లె, ఫిబ్రవరి 19: మండలంలోని కైగల్ అటవీ ప్రాంతంలో మంగళవారం సాయంత్రం తుపాకీ కాల్పులు జరిగాయి. మండలంలోని మొగిలిపొద రేవుల్లో నివశించు యానాది రవికుమార్(35) అటవీ ఫలసాయం సేకరించి ఆ ఫలసాయాలను గిరిజన కార్పొరేషన్‌కు అందచేసి జీవనం సాగించేవాడు. ఈనేపథ్యంలో మంగళవారం రవికుమార్ కైగల్ అటవీ ప్రాంతంలో తేనె సేకరిస్తుండగా హఠాత్తుగా వెనుకవైపు నుంచి నిప్పురవ్వ దూసుకొచ్చి కడుపులోకి వెళ్లి బయటకు వచ్చింది. దీంతో రవికుమార్ అధిక రక్తశ్రావానికి గురయ్యాడు. ఈవివరాలను వెంటనే బాధితుడు తన కుటుంబీకులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కాల్పుల సంఘటనతో భీతిల్లిన బాధితుడు రవికుమార్ గట్టిగా కేకలు వేయడంతో సమీప వ్యవసాయ పొలాల్లో ఉన్న రైతులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని అతనిని పలమనేరు-కుప్పం రహదారికి తీసుకొచ్చి 108వాహనం ద్వారా చికిత్స కోసం వి.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వి.కోటలో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం కుప్పం పిఇఎస్‌కు తరలించారు. బాధితుడిపై కాల్పులు జరగడానికి కారకులైన వారు ఎవరో అటవీ ప్రాంతంలోని వణ్యప్రాణులను వేటాడేందుకు ఎవరైనా నాటుతుపాకితో ప్రయత్నించారా...? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాటుతుపాకితో కాల్పులు జరిగి కడుపులోకి దూసుకెళ్లిన నిప్పురవ్వ బయటకు వచ్చినందున ప్రాణాపాయం లేదని వైద్యులు పేర్కొంటున్నారు. సంఘటన వివరాలు తెలుసుకున్న స్థానిక ఎస్సై మునస్వామి వెళ్లి వివరాలపై ఆరా తీశారు.
హిందూ ధర్మాన్ని కాపాడటానికి అర్చకులు సైనికుల్లా పనిచేయాలి
* శివానంద సరస్వతి స్వామి పిలుపు
తిరుపతి, ఫిబ్రవరి 19: అర్చకులు హిందూ ధర్మాన్ని కాపాడే సైనికుల వలే పనిచేయాలని వారణాసికి చెందిన శివానంద ఆశ్రమ పీఠాధిపతులు శివానంద సరస్వతి స్వామి ఉద్బోధించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ (శే్వత)లో మంగళవారం 15వ దళిత అర్చక శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శివానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ భగవంతుని దశావతారాలు వెలసిన భారతభూమిపై మానవ జన్మను పొందడం ఉత్కృష్టమైందన్నారు. అర్చకులు భగవంతుడికి భక్తుడికి వారధి వంటి వారని, ధర్మ పరిరక్షణకు అర్చక వ్యవస్థ బలంగా ఉంటే ధర్మపరిరక్షణ బలంగా ఉంటుందని తెలిపారు. మన పూర్వీకులు నిరంతర కృషి, సాధనతో మనకు అందించిన సనాతన ధర్మాన్ని అవగాహన కలిగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టిటిడి కార్యనిర్వహణ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అర్చకులు సమాజానికి దశ-దిశ నిర్దేకులు కావాలన్నారు. సమాజ శ్రేయస్సు కొరకు ఎల్లప్పుడు అర్చకులు అర్చన చేసినపుడే ఆ స్వామి ఆర్చకుని యోగ క్షేమాలు స్వయంగా చూసుకుంటాడని తెలిపారు. అర్చకునికి ఉన్న సముచిత స్థానం, మన హిందూ సంస్కృతిలో ఉన్న గొప్పతనాన్ని మన దేశాన్ని పాలించిన ఆంగ్లేయులు కూడా కొనియాడారన్నారు. మన విద్యావిధానం మూలం నుండి పటిష్ఠమైనదని, పౌరహిత్యం అంటే కులానికి సంబంధించింది కాదని, ఒక వ్యక్తి సత్ప్రవర్తన, గుణగణాలతో ముడిపడి ఉందని తెలిపారు. అనంతరం టిటిడి ప్రత్యేక శ్రేణి ఉప కార్యనిర్వాహణాధికారి (జనరల్) టిఎపి నారాయణ మాట్లాడుతూ భగతవంతుడి దృష్టిలో అందరూ సమానమేనని, అర్చక శిక్షణను అందరికీ అందించేందుకు టిటిడి కృషి చేస్తోందని తెలిపారు. హిందూ సాంప్రదాయంలో ఉన్న తిలకధారణ, సంధ్యావందనం లాంటి విషయాలను యువతరానికి తెలియజేయాలని కోరారు. అర్చక శిక్షణ పొందిన వారు సత్ప్రవర్తనతో మెలిగి ప్రజలకు మార్గదర్శకులు కావాలని ఆకాంక్షించారు. శే్వత సంచాలకులు కె.వి.రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఐదువేల మందికి అర్చక శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీవారి పాదాల చెంత అర్చక శిక్షణ పొందడం పూర్వ జన్మ సుకృతం అన్నారు. అర్చకత్వం ద్వారా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ ప్రచారం చేయాలని కోరారు. అర్చక శిక్షణ కార్యక్రమం ఈనెల 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు జరుగనుంది. ఈ శిక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా ల నుండి 100 మంది హాజరయ్యారు. వీరికి అర్చన ప్రయోగం, ప్రవర్తన, నియమావళి, మానసిక వికాసం, ఆరోగ్యం, యోగా సూత్రాలు, హిందూ ధర్మ వైజ్ఞానిక సమన్వయం, అర్చకుని సామాజిక కర్తవ్యం తదితర విషయాలను బోధించనున్నారు.
ఎసిబి వలలో విఆర్వో
కుప్పం, ఫిబ్రవరి 19: రైతుకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చేందుకు ఒక విఆర్వో ఆ రైతు నుంచి 12వేల రూపాయలు లంచం తీసుకొంటూ ఎసిబి అదికారులకు చిక్కారు. ఎసిబి డిఎస్పీ కృష్ణార్జున్‌రావు కథనం ప్రకారం జిల్లాలోని శాంతీపురం మండల పరిధిలోని నారతిమ్మినేపల్లె గ్రామానికి చెందిన రత్నప్ప పట్టాదారు పాసుపుస్తకం కోసం విఆర్‌ఓ రాజప్పను ఆశ్రయించారు. దాదాపు మూడు నెలల పాటు రైతును తిప్పించి 15వేల రూపాయలకు బేరం కుదుర్చుకున్నాడు. దీంతో విఆర్‌ఓ వేధింపులను తాళలేక రత్నప్ప ఎసిబి అధికారులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విఆర్వోకి ముందుగా మూడు వేల రూపాయలు ఇచ్చి, మిగిలిన 12 వేల రూపాయలు మంగళవారం ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు సిఐలు రామ్‌కిషోర్, సుధాకర్‌రెడ్డి, చంద్రశేఖర్, ఎస్సై చిదంబరం మంగళవారం శాంతీపురం చేరుకొని కిమెకల్‌తో కూడిన 12వేల రూపాయలను రైతుకు ఇచ్చి పంపారు. ఆ నగదును రైతు విఆర్‌ఓకు ఇస్తుండగా ఎసిబి అధికారులు పట్టుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.