తిరుపతి, ఫిబ్రవరి 19: ప్రముఖ సినీ దర్శకుడు, నిర్మాత, నటుడు దాసరి నారాయణ రావు, రాజ్యసభ సభ్యురాలు జయప్రద మంగళవారం వేర్వేరుగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దాసరి మాట్లాడుతూ తన భార్య మరణానంతరం తొలిసారిగా స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు.
అమర్‌సింగ్ ఆరోగ్యం బాగుండాలని స్వామిని ప్రార్థించా: జయప్రద
తన రాజకీయ గురువు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంపి అమర్‌సింగ్ ఆరోగ్యం బాగుండాలని దేవదేవుడిని ప్రార్థించినట్లు రాజ్యసభ సభ్యురాలు జయప్రద వెల్లడించారు.
వైకుంఠనాథుని సేవలో రోహిత్‌శర్మ
అదే విధంగా ప్రముఖ క్రికెటర్ రోహిత్‌శర్మ కూడా మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.
నకిలీ బంగారం విక్రయంచే కేసులో ఇద్దరు అరెస్ట్
పుంగనూరు రూరల్, ఫిబ్రరి 19: బంగారు నాణ్యాలు అని నమ్మబలికి నకిలీ బంగారు నాణ్యాలు విక్రయించిన కేసులో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చినట్లు ఎస్సై అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పుంగనూరు పట్టణంలోని ఎవిరావు వీధికి చెందిన సుబ్రహ్మణ్యం ఆచారి(47), రామసముద్రం మండలం నారేవారిపల్లికు చెందిన లక్ష్మీపతి(42) కలసి గత 20 రోజుల క్రితం నల్గొండ జిల్లా దామరచెర్ల గ్రామానికి చెందిన నాగరాజారావు, అతని స్నేహితుడు క్రిష్ణమూర్తిలకు పొలంలో బంగారు నాణ్యాలు దొరికాయని, కిలో బంగారం రూ. 20 లక్షలకు విక్రమిస్తామని నమ్మబలకడంతో పాటు వారి వద్దనున్న 4 బంగారు నాణ్యాలు ఇచ్చి పంపారు. తరువాత రూ. 20 లక్షలు తీసుకుని వచ్చిన నాగరాజారావు, క్రిష్ణమూర్తి మిగిలిన బంగారు నాణ్యాలు ఇవ్వాలని అడిగితే నకిలీ బంగారు నాణ్యాలు ఇవ్వడంతో వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్దనున్న నకిలీ బంగారు నాణ్యాలు స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు.