పలమనేరు, ఫిబ్రవరి 19: పలమనేరు పట్టణ సమీపంలోని క్యాటిల్ ఫారం వద్ద వున్న 938ఎకరాల స్థలంలో టిటిడి, వెటర్నరీ సంయుక్తంగా గోసంరక్షణ శాలకు స్థలాన్ని కేటాయించారు. దీనిపై వివాదం రావడంతో శాసన మండలి సభా హక్కుల కమిటీ మంగళవారం పరిశీలించారు. శాసన మండల సభా హక్కుల కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి, కమిటీ సభ్యులు రాజలింగం, ఐ.వెంగయ్య, ఇంద్రసేనారెడ్డి పరిశీలించారు. పలమనేరు పట్టణ సమీపంలోని క్యాటిల్ ఫారంలో 938ఎకరాల స్థలం గోసంరక్షణశాలకు కేటాయించారు. ఇందులో వెటర్నరీ యూనివర్శిటీ కోసం షీఫ్ ప్రాజెక్టు కోసం స్థలాన్ని ఇవ్వాలని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై శాసన మండలిలో చర్చ జరుగుతుండగా అప్పుడు శాసన మండలి చైర్మన్ చక్రపాణి శాసనమండలి సభా హక్కుల కమిటీని ఏర్పాటు చేసి ఆస్థలంపై పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈనేపధ్యంలో మంగళవారం వారు ఈస్థలాన్ని పరిశీలించి ఇరువురి వాదనలు విని ప్రభుత్వానికి నివేదిక అందివ్వనున్నట్లు తెలిపారు. త్వరలోనే టిటిడి ఆధ్వర్యంలో గోసంరక్షణశాల ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది. ఈ వివాదం నాలుగు సంవత్సరాలుగా ఉండడంతో ఇటు టిటిడిలోను, వెటర్నరీ యూరివర్శిటీలో సమన్వయపర్చి సమస్యను పరిష్కరించేందుకు శాసనమండలి సభ్యులు చొరవ చూపుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అన్న కుమారుడిని హత్యచేసిన చిన్నాన్న
పుత్తూరు, ఫిబ్రవరి 19: పుత్తూరు మండలంలోని కెబి ఆర్‌పురం ఎస్‌టి కాలనీలో తన అన్న కుమారుడు చెప్పిన మాట వినలేదనే కోపంతో మునిచంద్ర (14) అనే బాలుడిని చిన్నాన్న శ్రీనివాసులు కత్తితో గొంతు కోసినట్లు ఆరోపణలు రావడంతో మంగళవారం పుత్తూరు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కెబిఆర్ పురం ఎస్‌టి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు మునిచంద్ర ఈనెల 17వతేదీన క్రికెట్ ఆడుతుంటే చిన్నాన్న శ్రీనివాసులు తండ్రి కష్టపడుతుంటే ఇలా తిరిగితే ఎలా అని మందలించాడు. దీంతో మునిచంద్ర బ్యాట్‌తో చిన్నాన్న శ్రీనివాసులును కొట్టడంతో, వెంటనే ననే్న కొడతావా అని కత్తితో మునిచంద్ర గొంతును శ్రీనివాసులు కోశాడు. సంఘటన జరిగిన తరువాత భయపడిన శ్రీనివాసులు గోనె సంచిలో మునిచంద్ర మృతదేహాన్ని తీసుకెళ్లి పక్కన ఉన్న మామిడి తోటలో పూడ్చి పెట్టినట్లు విచారణలో తేలిందని సిఐ చంద్రశేఖర్ తెలిపారు. తన కుమారుడు కనబడకపోవడంతో సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపినట్లు వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో వేసవి యాక్షన్ ప్లాన్ సిద్ధం
* 911 గ్రామాలకు రూ. 9.93కోట్ల నిధులు
* 263 గ్రామాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరా
* 91 శాతం ‘ఆధార్’ పూర్తి
* కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ వెల్లడి
మదనపల్లె, ఫిబ్రవరి 19: రానున్న వేసవి కాలంలో జిల్లాలో నీటి సరఫరాపై సమస్యాత్మక గ్రామాలను గుర్తించి వాటికి ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ తెలిపారు. 911 గ్రామాలను గుర్తించి రూ.9.93కోట్ల నిధులు కేటాయించామన్నారు. 263 గ్రామాలకు ట్యాంకుల ద్వారా, వ్యవసాయ బోర్లు అనుసంధానం చేసి నీటిని అందిస్తున్నట్లు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఎక్కువ పనులు కల్పించేందుకు చర్యలు చేపట్టామన్నారు. పనుల కోసం 72వేల దరఖాస్తులు అందాయన్నారు. జిల్లాలో 91శాతం ఆధార్‌కార్డులు పంపిణీ చేసినట్లు తెలిపారు. మంగళవారం కలెక్టర్ సాల్మన్ ఆరోగ్యరాజ్ జిల్లాలోని తంబళ్ళపల్లె, మదనపల్లె నియోజకవర్గాలలో పర్యటించారు. ముందుగా తంబళ్ళపల్లె నియోజకవర్గంలోని ఆరు మండలాధికారులతో ములకలచెరువు మండలంలోని ఎంపిడిఓ కార్యాలయంలో సమీక్షించారు. అనంతరం మదనపల్లె పట్టణంలోని సిఎల్‌ఆర్‌సి భవనంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. తంబళ్ళపల్లె నియోజకవర్గంలో బోర్లు వేయడానికి రిగ్‌బండ్లు రావడం లేదన్న ఫిర్యాదుపై వాటిని సీజ్ చేయాలని ఆదేశించామన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో 98బోర్లు, మదనపల్లె క్లస్టర్ పరిధిలో 54బోర్లు మంజూరు చేసినట్లు తెలిపారు. బిఆర్‌జిఎఫ్ నిధులు అన్ని మండలాలకు కేటాయించామన్నారు. ఇప్పటికే 300నుంచి 500అడుగుల వరకు ఉన్న బోర్లును గుర్తించి వాటిలో డీప్నెంగ్ చేయడానికి జిఎ పైపులు కొనుగోలుకు నిధులు అడ్వాన్సుగా ఇస్తామన్నారు. 10 రోజుల క్రితం 53వేల మందికి, వారం రోజుల క్రితం 70వేల మందికి ఉపాధి హామీ పనులు కల్పించినట్లు చెప్పారు. మార్చి మొదటివారం నుంచి ప్రతి మండలంలో 2500మంది కూలీలకు ఉపాధి పనులు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కరవు ప్రాంతంలో వలసల నివారణకు ఉపాధి పనులు కల్పించి 75శాతం పనులకు 100శాతం కూలి ఇస్తున్నామన్నారు. 2011 ఖరీప్ పంటనష్టంపై ఇన్‌ఫుట్ సబ్సిడీ పంపిణీ చేయాడానికి రైతుల పాసుపుస్తకాల ఆధారంగా బ్యాంకులలో డబ్బులు జమచేశామన్నారు. ఇన్‌ఫుట్ సబ్సిడీ అందని రైతులు పాసుపుస్తకం కలిగి బ్యాంకుఖాతా నెంబరును సంబంధిత వ్యవసాయాధికారికి అందజేస్తే ఇన్‌ఫుట్ సబ్సిడీ వారి ఖాతాలో జమచేస్తారన్నారు. నీటి సరఫరా ఉండి తక్కువ భూమిలో సాగుచేస్తున్న రైతులను గుర్తించి వారికి గడ్డి విత్తనాలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో జిల్లా డ్వామా పిడి చంద్రవౌలి, జడ్‌పి సిఇఓ నాగేశ్వర్‌రావు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ ఉన్నారు.
కిరణ్ సారథ్యంలో రాష్ట్రం ముందంజ
* ఎంపి చింతామోహన్ ఉద్ఘాటన
ఏర్పేడు, ఫిబ్రవరి 19: సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్‌సింగ్ సారథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారని తిరుపతి ఎంపి చింతామోహన్ ఉద్ఘాటించారు. మంగళవారం ఏర్పేడు మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో రాజీవ్ యువకిరణాల ద్వారా 15లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ స్ర్తినిధి ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేశారని పేర్కొన్నారు. జీవ నదులు లేని చిత్తూరు జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీలు, ప్రాజెక్టుల ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. వ్యవసాయ రంగం అభివృద్ధికి రైతులకు లక్ష వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారని, డ్వాక్రా మహిళలకు కూడా పావలా వడ్డీ లేకుండా చేస్తారన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, మన్నవరం ప్రాజెక్టు, సోమశిల, స్వర్ణముఖి నది, గాలేరు - నగరి కాల్వల అను సంధానానికి ముఖ్య కేంద్రమైన ఏర్పేడు అతిపెద్ద నగరం కాబోతోందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజల సంక్షేమం కోసం మరిన్ని సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువస్తున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకం ద్వారా పేదలకు ఆర్థిక పరిపుష్టి చేకూర్చే విధంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోనుందని, కూలీలకు పనులు కల్పించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, మాజీ ఎంపిపి వెంకటరెడ్డి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు మోహన్‌రావు, ప్రత్యేకాధికారి సుధాకర్, ఎంపిడిఓ చిన్నరెడ్డెప్ప, తహశీల్దార్ లక్ష్మీనరసయ్య, ఎస్సై విక్రమ్, అన్ని శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.