చిత్తూరు, ఫిబ్రవరి 19: చిత్తూరుజిల్లా సహకార కేంద్రబ్యాంకు అధ్యక్షులుగా రెండో పర్యాయం అమాస రాజశేఖర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్.సుధాకర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల అధికారి వనజ ప్రకటించారు. మరోవైపు ఖాళీగా ఉన్న ఏడు డైరెక్టర్ పోస్టులకు నూతన కార్యవర్గం కో-ఆప్షన్ పద్ధతిన ఎన్నుకొన్నారు. మంగళవారం ఉదయం అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉండగా ఎవరూ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అమాస రాజశేఖర్‌రెడ్డిని అధ్యక్షునిగా, ఉపాధ్యక్షునిగా ఎస్.సుధాకర్ రెడ్డిని ఎన్నుకొన్నారు. శుక్రవారం నామినేషన్ల సందర్భంగా ఎ-క్లాజ్‌లోని మొత్తం 10 డైరెక్టర్ల పదవులకు 12మంది నామినేషన్లు వేయగా, అందులో రెండు తిరస్కరించారు. మిగిలిన 10 డైరెక్టర్లలో ఏడింటిని కాంగ్రెస్, మూడింటిని తెలుగుదేశం కైవసం చేసుకున్నాయి. ఎ-క్లాజ్‌లో బిసి ఒకటి, బి.క్లాజ్‌లో-ఓసి ఒకటి ఏకగ్రీవమైంది. మిగిలిన 9 డైరెక్టర్ పోస్టులకు గాను క్లాజ్ బిలో-ఎస్సీ-1, ఎస్టీ-1 అభ్యర్థులు లేకపోవడంతో నిలిపివేశారు. కేవలం ఏడు డైరెక్టర్ స్థానాలకు మంగళవారం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు అమాస రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కో-ఆప్షన్ పద్ధతిన ఎన్నుకొన్నారు. ఎన్నికైన వారిలో నాగరాజు - కాయంపేట (ఎస్సీ), వి.నారాయణ - పెద్దపంజాణి (ఎస్సీ), యం.అమరావతి - రేణిగుంట (ఎస్సీ), పి.నడిపమ్మ - కాయంపేట (ఎస్టీ), లక్ష్మిపతి - చెర్లోపల్లి (బిసి)లను ఎన్నుకొన్నారు. అయితే క్లాజ్ బి-కింద బిసిల నుండి కె.శ్రీనివాసులు - వెంకటేశ్వరా హ్యాండ్‌లూమ్‌సొసైటీ మదనపల్లె, ఎం.సురేష్‌బాబు - డిసిసి బ్యాంకు ఉద్యోగుల సంఘం నాయకులను కోఆప్షన్ పద్ధతిలో ఎన్నుకొన్నారు.
అమాస రాజశేఖర్‌రెడ్డిని ప్రతిపాదించిన టిడిపి డైరెక్టర్:- డిసిసిబి ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీలకు చెందిన డైరెక్టర్లు దూరంగా ఉండాలని ఆ పార్టీలు ఆదేశించినా అందుకు విరుద్దంగా డిసిసిబి అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరు డైరెక్టర్లు పాల్గొన్నారు. అందులో వడమాలపేట సింగిల్‌విండో అధ్యక్షులు (టిడిపి) కరుణాకర్‌చౌదరి డిసిసిబి అధ్యక్ష పదవికి అమాస రాజశేఖర్‌రెడ్డి పేరును ప్రతిపాదించారు. పలమనేరుకు చెందిన టిడిపి డైరెక్టర్ వేణుగోపాల్‌నాయుడు కూడా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం విశేషం. ఈ ఎన్నికలను ఎన్నికల అధికారి వనజ నిర్వహించారు. ఎన్నికైన వారికి ఉత్తర్వులను అందించారు.
సిడిసిఎంఎస్ ఎన్నికలు 21కి వాయిదా:- చిత్తూరుజిల్లా వ్యవసాయ మార్కెట్‌కమిటీ ఎన్నికలను ఎన్నికల అధికారి మేథావతి ఈనెల 21వ తేదీకి వాయిదా వేసారు. ఇందులో మొత్తం డైరెక్టర్లలో మూడు స్థానాలు టిడిపి, ఒక స్థానం వైఎస్‌ఆర్‌సిపి ఎన్నికల్లో కైవసం చేసుకొన్న విషయం పాఠకులకు విధితమే. అయితే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి డైరెక్టర్లు ఎవరూ హాజరుకాకపోవడంతో ఈ ఎన్నికలను ఈనెల 21వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారిణి మేథావతి ప్రకటించారు.
ప్రింటింగ్‌ప్రెస్ అధ్యక్షులుగా ఎన్.మునీశ్వర్‌రెడ్డి:- చిత్తూరుజిల్లాలో డిసిసిబి అనుబంధంగా నడుస్తున్న జిల్లా కో-ఆపరేటివ్ ప్రింటింగ్ ప్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులను కూడా కాంగ్రెస్ కైవసం చేసుకొంది. ఇందుకు సంబంధించి డైరెక్టర్ పదవులకు జరిగిన ఎన్నికల్లో 7స్థానాలకు గాను కాంగ్రెస్ నాలుగు స్థానాలు కైవసం చేసుకోగా, వైఎస్‌ఆర్‌సిపి-1, టిడిపి-2 డైరెక్టర్ స్థానాలు గెలుచుకొన్నాయి. అత్యధిక స్థానాలు గెలుచుకొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పాకాల సింగిల్ విండో అధ్యక్షులు ఎన్.మునీశ్వర్‌రెడ్డిని అధ్యక్షులుగా, మల్లకుంటకు చెందిన హేమాద్రిరెడ్డిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకొన్నారు. వీరికి నియామక పత్రాలను ఎన్నికల అధికారి చంద్రశేఖర్‌రెడ్డి అందించారు.
రైతులకు సేవ చేస్తా
* డిసిసిబిని లాభాల బాటలో నడిపిస్తా
* చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి వెల్లడి
చిత్తూరు, ఫిబ్రవరి 19: తనపై ఎంతో నమ్మకం పెట్టుకొని రెండో పర్యాయం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్ష పదవిని అందించిన రైతులకు సేవ చేస్తానని డిసిసిబి చైర్మన్ అమాస రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మంగళవారం డిసిసిబి ఆవరణంలో అధ్యక్ష ఎన్నికలు పూర్తయిన అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ రైతు సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. డిసిసిబిని లాభాల బాటలో నడిపించి మరంత అభివృద్ధి చేస్తానన్నారు. రైతులకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి, వారికి ప్రభుత్వం నుండి వచ్చే వివిధ సంక్షేమ పథకాలను సింగిల్‌విండోల ద్వారా అందిస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వమని, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. రైతులకు ఎళ్లవేలలా అందుబాటులో ఉంటానని, వారి సుమస్యలు తన దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. ఆయనతోపాటు ఉపాధ్యక్షులు సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.